చైనా అధినేత షీ జిన్‌పింగ్‌ను విమర్శిస్తూ వ్యాసం రాసినందుకు 18 ఏళ్ళ జైలు శిక్ష - BBC Newsreel

రెన్ జికియాంగ్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, రెన్ జికియాంగ్

చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్‌ను బహిరంగంగా విమర్శించిన మాజీ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త రెన్ జికియాంగ్‌కు అవినీతి కేసులో 18 ఏళ్ల జైలు శిక్ష విధించారు.

రెన్ జికియాంగ్ "అవినీతి, లంచం, ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి" పాల్పడ్డారంటూ బీజింగ్‌లోని కోర్టు తీర్పునిచ్చినట్లుగా చైనా అధికార మీడియా గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.

జైలు శిక్షతో పాటుగా 4.2 మిలియన్ యువాన్లు (సుమారు 4.5 కోట్ల రూపాయలు) జరిమానా కూడా విధించారు.

రెన్ జికియాంగ్ ఈ ఏడాది మార్చిలో చైనా అధ్యక్షుడిని విమర్శిస్తూ ఒక వ్యాసం రాసారు. ఆ తరువాతనుంచీ రెన్ అదృశ్యమైనట్టు వార్తలు వచ్చాయి.

అయితే, ఆ వ్యాసంలో నేరుగా షీ జిన్ పింగ్ పేరు ప్రస్తావించనప్పటికీ, అది ఆయన గురించే రాసినట్టుగా కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తోంది.

రెన్ 1.25 మిలియన్ యువాన్లు (సుమారు 1.3 కోట్ల రూపాయలు) లంచం తీసుకున్నారని, 50 మిలియన్ యువాన్ల (సుమారు 54 కోట్ల రూపాయలు) ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసారని బీజింగ్ కోర్టు తెలిపింది.

రెన్ స్వచ్ఛందంగా నేరాలను అంకీగరించారని, కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా పిటీషన్ వెయ్యబోరని సమాచారం.

రెన్, ప్రభుత్వానికి చెందిన 'హువా యువాన్ ప్రోపర్టీ కంపనీ' మాజీ చైర్మన్, పెద్ద వ్యాపారవేత్త మాత్రమే కాదు. ఒక ప్రభుత్వ అధికారి కుమారుడు కూడా. ఆయనకు సీనియర్ పార్టీ నాయకులతో దగ్గర సంబంధాలున్నాయని, ఈ నేపథ్యంలో పార్టీపై ఆయన చేసిన విమర్శలను తీవ్రమైనవిగా పరిగణించారని పలువురు భావిస్తున్నారు.

భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న వారందరిపై అవినీతి ఆరోపణలు చేస్తూ చైనా ప్రభుత్వం వారి నోళ్లు మూయించేస్తోందని పౌర హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.

రెన్ ఆ వ్యాసంలో ఏం రాసారు?

రెన్, తన విమర్శనాత్మక వ్యాసంలో కరోనావైరస్ వ్యాప్తిపట్ల బీజింగ్ వ్యవహరించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసారు.

అంతకుమునుపే చైనా అధ్యక్షుడు టీవీలో ఒక ప్రసంగం ఇచ్చారు. రెన్ తన వ్యాసంలో షీ జిన్ పింగ్ పేరు నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ ఆ ప్రసంగం గురించి చెబుతున్నట్లుగా "నేను జాగ్రత్తగా, శ్రద్ధగా ప్రసంగాన్ని విన్నాను. అక్కడొక చక్రవర్తి మాట్లాడుతున్నట్టు లేదు. ఒక హాస్యగాడు బట్టలన్నీ విప్పేసి, నేనే చక్రవర్తిని అన్నట్టుగా ఉంది" అని రాసారు.

ఈ వ్యాసం ప్రచురించిన అతి కొద్ది రోజుల్లోనే రెన్ "తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడ్డారని", త్వరలోనే విచారణ జరపనున్నారని ప్రకటించారు. తరువాత, రెన్‌ను కమ్యూనిస్ట్ పార్టీనుంచీ తొలగించినట్లుగా చైనా ప్రభుత్వం ప్రకటించింది.

షీ జిన్ పింగ్ పాలన మావో కాలాన్ని తలపిస్తోందని, నేను చెప్పిందే వేదం అనే తరహాలో సాగుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఆయన పాలనా విధానానికి తిరుగులేదనీ, పేదరిక నిర్మూలన లక్ష్యాలు, రోడ్డు నిర్మాణాలవంటివి అత్యద్భుతమైనవని కొనియాడుతూ విమర్శలకు తావు లేకుండా చేస్తున్నారు.

రెన్ జికియాంగ్ విషయంలో, తన సొంత పార్టీ సభ్యులనుంచే విమర్శలు రావడం పార్టీలోని సీనియర్ అధికారులకు తలవంపులుగా మారింది. పార్టీ విశ్వాసాలను దెబ్బ తీసే ఏ అంశాన్నైనా వెంటనే తొలగించాలనేది అక్కడి పద్ధతి.

ఇలాంటి విషయాలను కోర్టు ద్వారా పరిష్కరించడం సులువు. ఎందుకంటే కోర్టుకు కమ్యూనిస్ట్ పార్టీకి దగ్గర సంబంధాలుంటాయి.

కోర్టుతో పోరాడి ఫలితం ఉండదని రెన్ భావించి ఉంటారు. అందుకే లొంగిపోతున్నట్టు తెలిపి ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అయితే, రెన్‌పై దాడి ఇది మొదటిసారి కాదు. 2016లో దేశాధ్యక్షుడిని విమర్శించినందుకుగానూ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ వియబోలోని రెన్ సొంత బ్లాగును చైనా ప్రభుత్వం మూసివేసింది. పన్నుల ద్వారా వసూలు చేస్తున్న ప్రజా ధనాన్ని ప్రజలకు ఉపయోగించాలిగానీ కమ్యూనిస్ట్ పార్టీకి కాదు అని రెన్ తన వియబో బ్లాగులో రాసారు.

రెన్‌ 'కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకి' అంటూ అప్పట్లో చైనా అధికార మీడియా విమర్శించింది.

సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చిన 270 తిమింగలాలు.. 90 మృతి

కొట్టుకొచ్చిన తిమింగలాలు

ఫొటో సోర్స్, Tasmania government

ఆస్ట్రేలియాలోని టాస్మానియా తీరానికి 270కి పైగా తిమింగలాలు కొట్టుకొచ్చాయి. వాటిలో 90 చనిపోయీయని, ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చని తీర ప్రాంత సహాయ సిబ్బంది చెబుతున్నారు.

సోమవారం టాస్మానియా దీవి పశ్చిమ తీరంలో పైలట్ తిమింగలాలు భారీ సంఖ్యలో చిక్కుకుపోయాయి. వీటిలో ప్రాణాలతో మిగిలిన తిమింగలాలను కాపాడేందుకు మెరైన్ బయాలజిస్టులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఆపరేషన్ పూర్తి కావడానికి రోజులు పట్టే అవకాశం ఉంది.

ఇన్ని తిమింగలాలు తీరంవైపు ఎందుకు వచ్చాయనేది తెలీడం లేదు. ఈ ప్రాంతంలో తిమింగలాలు అప్పుడప్పుడూ తీరం వైపు రావడం మామూలే. కానీ ఇన్ని ఒకేసారి ఇలా రావడం గత పదేళ్లలో ఎన్నడూ లేదు. టాస్మానియాలో ఇంతకు ముందు 2009లో దాదాపు 200 తిమింగలాలు ఒకే చోటికి కొట్టుకొచ్చాయి.

సోమవారం సాయంత్రం దీవికి మారుమూల నౌకలు పరిమితంగా వచ్చే మక్వారీ హెడ్స్ తీరంలో మూడు తిమింగలాల బృందాలు ఉండడాన్ని టాస్మానియా మెరైన్ కన్జర్వేషన్ ప్రోగ్రాం సహాయ సిబ్బంది గుర్తించారు.బోట్ ర్యాంపు సమీపంలో ఇసుక పట్టీ దగ్గరకు దాదాపు 200 తిమింగలాలు కొట్టుకొచ్చాయి. దానికి కొన్ని వందల మీటర్ల దూరంలో 30 తిమింగలాలు చనిపోయి కనిపించాయి. సముద్ర తీరం వెబడి కాస్త దిగువన మరో 30 తిమింగలాలను గుర్తించారు.

ఎలా కాపాడారు

సుశిక్షితులైన దాదాపు 40 మంది సహాయ సిబ్బంది మంగళవారం ఉదయం కొన్ని తిమింగలాలను మళ్లీ నీళ్లలోకి వెళ్లేలా చేయగలిగారు. వాటిని ఇసుక పట్టీ నుంచి లోతైన జలాల్లోకి నెట్టడానికి కొన్ని పరికరాలు ఉపయోగించారు."సాధారణంగా మేం బీచ్‌లో ఎత్తుగా, పొడిగా ఉన్న చోట ఇలాంటివి చేస్తుంటాం. కానీ ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ ఇవి నీళ్లలో కొంతవరకు తేలుతున్నా సముద్రం లోనికి వెళ్లలేకపోతున్నాయి. అయితే, పూర్తిగా ఇసుకలోకి రాకుండా కొంతవరకు నీళ్లలో ఉండడంతో వాటిని మళ్లీ నీళ్లలోకి పంపడానికి ఎక్కువ సమయం పట్టలేదు" అని బయాలజిస్ట్ డాక్టర్ క్రిస్ కార్లియాన్ చెప్పారు.

సన్ రైజర్స్

ఫొటో సోర్స్, Bcci/ipl

సత్తా చూపిన చాహల్.. రాయల్ ఛాలెంజర్స్ చేతిలో సన్ రైజర్స్ ఓటమి

ఐపీఎల్‌‌లో విరాట్‌ కోహ్లీ నాయకత్వంలోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు బోణీ చేసింది. యుజ్వేంద్ర చాహల్‌, నవదీప్ సైనిలు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో సన్‌రైజర్స్‌ జట్టును పది పరుగుల తేడాతో ఓడించగలిగింది.

విరాట్‌ జట్టు 164 పరుగుల లక్ష్యాన్ని ఇవ్వగా, 19.4 ఓవర్లకు 153 పరుగులు మాత్రమే చేసి సన్‌‌రైజర్స్‌ జట్టు కుప్ప కూలింది.

రాయల్‌ ఛాలెంజర్స్‌లో చాహల్‌ మూడు, శివం దుబే, సైని రెండేసి వికెట్లు తీశారు.

16వ ఓవర్‌ రెండో బంతి వరకు హైదరాబాద్‌ జట్టు బలంగా ఉంది. అప్పటికి రెండు వికెట్లు మాత్రమే నష్టపోయి 121 పరుగులు చేసి, విజయంవైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించింది. కానీ 32 పరుగులకు ఎనిమిది వికెట్లు కోల్పోయి అనూహ్యంగా ఓటమి పాలైంది.

విరాట్ కోహ్లీ బ్యాటింగ్ మెరుపులు చూద్దామనుకున్న వారికి నిరాశే మిగిలింది

ఫొటో సోర్స్, BCCI/IPL

ఫొటో క్యాప్షన్, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ మెరుపులు చూద్దామనుకున్న వారికి నిరాశే మిగిలింది

బాల్‌తో చాహల్‌ మ్యాజిక్‌

సన్‌రైజర్స్‌ జట్టుకు మంచి ఓపెనింగ్‌ లభించలేదు. కెప్టెన్‌ డేవిడ్ వార్నర్‌ 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ అయ్యాడు. అయితే తర్వాత వచ్చిన జాన్‌ బెయిర్‌స్టో మనీశ్‌ పాండేతో కలిసి రెండో వికెట్‌కు 71 పరుగులు జోడించాడు. మనీశ్‌ పాండే 33 బంతుల్లో 34 పరుగులు చేసి, యుజ్వేంద్ర చాహల్‌ బంతికి అవుటయ్యాడు.

బెంగళూరు టీమ్‌ నుంచి మూడుసార్లు లైఫ్‌ లభించడంతో బెయిర్‌స్టో దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. 37 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేశాడు. అయితే అతని దూకుడుకు చాహల్‌ బ్రేక్‌ వేశాడు. బెయిర్‌స్టో 43 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్సర్ల సహాయంతో 61 పరుగులు చేశాడు.

ఖాతా కూడా తెరవని విజయ్‌శంకర్‌ను తరువాతి బంతితో చాహల్ అవుట్‌ చేశాడు. నాలుగు ఓవర్లలో చాహల్ 18 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

శివం దుబే 17వ ఓవర్లో ప్రియంగార్గ్‌(12)ను పెవిలియన్‌కు పంపాడు.. అదే ఓవర్‌లో అభిషేక్‌ శర్మ(1) రనౌట్ అయ్యాడు.

గాయపడిన సీన్‌ మార్ష్ ఖాతా తెరవలేక పోయాడు. చివరికి సందీప్‌శర్మ వికెట్ తీసి డేల్ స్టెయిన్ హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను ముగించాడు

తన ఐపీఎల్ కెరీర్ తొలి మ్యాచ్‌లోనే అర్ధసెంచరీ చేసి ఆకట్టుకున్న దేవదత్ పడిక్కల్

ఫొటో సోర్స్, BCCI/IPL

ఫొటో క్యాప్షన్, తన ఐపీఎల్ కెరీర్ తొలి మ్యాచ్‌లోనే అర్ధసెంచరీ చేసి ఆకట్టుకున్న దేవదత్ పడిక్కల్

విజృంభించిన దేవదత్

అంతకు ముందు బెంగళూరు జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 163 పరుగులు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్‌లో దేవదత్‌ హీరోగా నిలిచాడు. ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న దేవదత్ ఆత్మవిశ్వాసంతో ఆడి 42 బంతుల్లో 56 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు ఉన్నాయి.

ఇన్నింగ్స్‌ మొదలు పెట్టినప్పటి నుంచి దేవదత్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. భువనేశ్వర్‌, సందీప్‌శర్మ.. ఇలా ఎవరినీ వదిలి పెట్టలేదు. సందీప్‌ శర్మ తొలి ఓవర్‌లోనే దేవదత్‌ రెండు ఫోర్లు కొట్టాడు.

రెండు లైఫ్‌లు పొందిన దేవదత్‌ 56 పరుగులు చేసి కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీతోపాటు జట్టు పటిష్టమైన స్కోరుకు పునాది వేశాడు.

విరాట్ కోహ్లీ బ్యాటింగ్ మెరుపులు చూద్దామనుకున్న వారికి నిరాశే మిగిలింది

ఫొటో సోర్స్, Ipl

నిరాశపరిచిన విరాట్‌

సుమారు ఏడు నెలల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన ఆర్‌సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మంచి ఇన్నింగ్స్ ఆడలేక పోయాడు. 14 పరుగులు మాత్రమే చేయగలిగిన విరాట్‌, నటరాజన్ బంతిని బౌండరీ దాటించే ప్రయత్నంలో రషీద్‌ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు.

ఏబీ డివిలియర్స్‌ జాగ్రత్తగా జట్టును మళ్లీ ముందుకు నడిపించాడు. 30 బంతులు ఆడిన డివిలియర్స్‌ 51 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్‌ అయ్యాడు.

భువీ

ఫొటో సోర్స్, Ipl

పొదుపుగా భువనేశ్వర్ బౌలింగ్‌

20వ ఓవర్ మూడో బంతికి డివిలియర్స్ అవుటయ్యాడు. మిగిలిన మూడు బంతులకు భువనేశ్వర్‌ కుమార్ కేవలం ఒక పరుగు మాత్రమే ఇచ్చాడు. దీంతో తొలి పది ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 86 పరుగులు చేసిన బెంగళూరు, తరువాతి 10 ఓవర్లలో 77 పరుగులు మాత్రమే జోడించగలిగింది.

హైదరాబాద్‌ జట్టులో బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్ పొదుపుగా బౌలింగ్‌ చేసి నాలుగు ఓవర్లలో కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చాడు. విజయ్‌ శంకర్‌, టి నటరాజన్, అభిషేక్‌ శర్మలు ఒక్కో వికెట్ తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)