వ్యవసాయ బిల్లులపై పంజాబ్, హరియాణాలలో వెల్లువెత్తుతున్న నిరసన... మిగతా రాష్ట్రాలలో ఎందుకు లేదు?

వ్యవసాయ బిల్లులు

ఫొటో సోర్స్, ANI Photo

    • రచయిత, మానసీ దాష్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఈ వారం లోక్‌సభలో వ్యవసాయ రంగానికి సంబంధించి మూడు ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందాయి. వీటిపై పంజాబ్, హరియాణాలో వ్యతిరేకతలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో కూడా అక్కడక్కడా రైతులు దీనిని వ్యతిరేకిస్తున్నారు.

కానీ, గత ఏడాది కిసాన్ మార్చ్ తో చర్చల్లో నిలిచిన మహారాష్ట్ర, మూడేళ్ల క్రితం రైతుల హింసాత్మక ఆందోళనలతో వార్తల్లో నిలిచిన మధ్యప్రదేశ్, మిగతా రాష్ట్రాల్లో ఈ వ్యవసాయ బిల్లులపై ఉన్న వ్యతిరేకత గురించి తక్కువ సమాచారం అందుతోంది.

పంజాబ్, హరియాణా మినహా మిగతా రాష్ట్రాల్లో నిజంగానే ఈ బిల్లులపై అంత వ్యతిరేకత లేదా. అదే నిజమైతే దాని వెనుక కారణం ఏంటి?

ఈ మూడు బిల్లుల గురించి విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఇవి రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని అంటున్నాయి. ప్రభుత్వం మాత్రం ఇవి రైతుల ప్రయోజనం అందించేందుకే తీసుకొచ్చామని చెబుతోంది.

పంజాబ్‌లోని బీజేపీ మిత్రపక్షం అకాలీదళ్ కూడా ఈ బిల్లుకు వ్యతిరేకంగా వెళ్లాలని నిర్ణయించింది. అటు హరియాణాలో సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఈ బిల్లు రైతులకు వ్యతిరేకం కాదని వివరణ ఇచ్చారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

విపక్షాల ఆరోపణ

వ్యవసాయ రంగంలో మండీ వ్యవస్థను తొలగించాలని ప్రభుత్వం భావిస్తోందని, దానివల్ల దేశంలో ఆహార భద్రత అంతం అవుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దాంతోపాటూ ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)ను దూరం చేయాలని చూస్తోందన్నారు.

ఎంఎస్‌పి, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ కొనుగోళ్ల వ్యవస్థ కొనసాగుతుందని విపక్షాల విమర్శల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో భరోసా ఇచ్చారు.

కానీ ఆయన భరోసా రైతులకు సంతృప్తి ఇచ్చినట్లు కనిపించడం లేదు. మోదీ ఇలా చెప్పిన తర్వాత కూడా రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వస్తున్నారు.

వ్యవసాయ బిల్లులు

ఫొటో సోర్స్, Getty Images

రైతుల సమస్యలు, వ్యతిరేకత

కొన్ని ప్రాంతాల్లో నిరసనలు తీవ్రం కావడానికి, అక్కడి రాజకీయాలకు, రైతు సంఘాలకు ఉన్న సంబంధం, ధాన్యం కొనుగోళ్ల ప్రస్తుత వ్యవస్థ కూడా కారణం అని హింద్ కిసాన్ చీఫ్ ఎడిటర్, వ్యవసాయ అంశాల నిపుణుడు హర్వీర్ సింగ్ అన్నారు.

“ఈ రైతు వ్యతిరేకతల చరిత్రను మనం ఒకసారి చూస్తే ఈ నిరసనలకు ఎక్కువగా పంజాబ్, హరియాణా, ఉత్తర ప్రదేశ్ పశ్చిమ ప్రాంతాలు కేంద్రంగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. మహారాష్ట్ర విషయానికి వస్తే అక్కడ చెరకు, ఉల్లి సాగు చేసే పశ్చిమ ప్రాంతంలో ఎక్కువగా నిరసనలు కనిపిస్తాయి. మధ్యప్రదేశ్‌లో రైతు సంఘాలు బలంగా ఎప్పుడూ లేవు. కానీ అక్కడ కూడా బిల్లులకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగినట్లు మీడియాలో కనిపించాయి. మండీ సిబ్బంది ధర్నా చేశారు” అన్నారు.

“మహారాష్ట్రలో రైతుల ఓటు బ్యాంకు పెద్దది. అక్కడ చెరకు రైతులు ఎక్కువగా ఉన్నారు. దీని కొనుగోలులో ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ (ఎఫ్ఆర్‌పీ) ఉంది. పంట ధరను నిర్ణయించడానికి షుగర్‌కేన్ కంట్రోల్ ఆర్డర్ ఇప్పటికీ ఉంది. యూపీలో కూడా చాలా భూములను హార్టీకల్చర్ కోసం ఉపయోగిస్తున్నారు. వాటికి ఎంఆర్‌పీతో ఎలాంటి సంబంధం ఉండదు అన్నారు. అందుకే ఈ బిల్లుల వల్ల ఎక్కడి రైతులపై నేరుగా ప్రభావం పడుతోందో వారు మాత్రమే వాటిని వ్యతిరేకిస్తున్నారు” అంటున్నారు.

వ్యవసాయ బిల్లులు

ఫొటో సోర్స్, Getty Images

ఈ బిల్లు తమకు అనుకూలంగా లేదు కాబట్టే రైతులు దీనిని వ్యతిరేకిస్తున్నారని, కానీ, లాభాలు ఉండడం వల్ల, మార్కెట్ నుంచి దీనిపట్ల వ్యతిరేకత రావడం లేదని వ్యవసాయ నిపుణులు దేవిందర్ శర్మ భావిస్తున్నారు.

దేశంలోని రకరకాల ప్రాంతాల్లో రైతుల సమస్యలు, అంశాలు, వారి రాజకీయాలు వేరు. అందుకే వారు దానిని వ్యతిరేకించే విధానాన్ని కూడా మార్చుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

“ప్రభుత్వం కొనుగోలు చేసే ధాన్యంలో అధిక భాగం అంటే దాదాపు 90 శాతం పంజాబ్, హరియాణా నుంచే ఉంటుంది. ఇక దేశంలోని సగానికి పైగా రైతులకు కనీస మద్దతు ధర ఏంటో కూడా తెలీదు. అలాంటప్పుడు తమ గురించి ఇంత చర్చ ఎందుకు అనేది తెలీడానికి వారికి చాలా సమయం పడుతుంది. వీటి ప్రభావం నేరుగా ఎవరిపై పడుతుందో వారు మొదట వ్యతిరేకిస్తారని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది”.

“ఒక అంచనా ప్రకారం దేశంలో 6 శాతం రైతులకే ఎంఎస్‌పీ లభిస్తోంది. కానీ 94 శాతం రైతులకు మొదటి నుంచీ ఎంఎస్‌పీ దక్కేది కాదు. వారంతా మార్కెట్ మీదే ఆధారపడ్డారు. అలాంటప్పుడు పంజాబ్, హరియాణా రైతులే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు” అంటారు దేవిందర్ శర్మ.

భారత వ్యవసాయ రంగం వరుస సంక్షోభాలతో తల్లడిల్లుతోంది. కానీ, కొంతమంది రైతులు, ఎంఎస్‌పీ లభిస్తున్న 6 శాతం రైతులు ఈ సంక్షోభానికి దూరంగా ఉన్నారు. ఎందుకంటే వారికి ఆదాయం ఫిక్స్ అయిపోయి ఉంటుంది.

అటు, పంజాబ్‌, హరియాణా రాజకీయాలు రైతులతో ముడిపడి ఉంటాయి. అందుకే అక్కడ పార్టీలకు రైతులకు అనుకూలంగా మాట్లాడడం తప్పనిసరి అయిపోయిందని హర్వీర్ సింగ్ అంటున్నారు.

“దీనిని అర్థం చేసుకోవాలంటే ఎక్కడ ఏది సాగు చేస్తారు, ఎక్కడ నుంచి ప్రభుత్వం ఎక్కువ ధాన్యం కొనుగోలు చేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. అలాంటప్పుడు ఎక్కువ రాష్ట్రాల రైతులను ఈ సమస్యలు నేరుగా ప్రభావితం చేయవు. కానీ ఈ బిల్లుల వల్ల ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలపై కూడా చాలా ప్రభావం పడుతుంది. ముందు ముందు చాలా రాష్ట్రాల్లో నిరసనలు తీవ్రం అవుతాయని నాకు అనిపిస్తోంది” అన్నారు.

వ్యవసాయ బిల్లులు

ఫొటో సోర్స్, Getty Images

కనీస మద్దతు ధర-రైతులు

ఎన్ఎస్ఎస్ఓ 2012-13 రిపోర్ట్ ప్రకారం దేశంలో 10 శాతం కంటే తక్కువ మంది రైతులు తమ ఉత్పత్తులను ఎంఎస్‌పీకి అమ్ముతున్నారు.

రైతుల నుంచి ప్రభుత్వం అధికంగా కొనుగోలు చేసే ధాన్యంలో గోధుమలు, బియ్యం ఉన్నాయి. ధాన్యం కొనుగోలు గణాంకాల ప్రకారం చూస్తే రాష్ట్రం మొత్తం ఉత్పత్తి, కొనుగోళ్ల విషయంలో పంజాబ్, హరియాణా పరిస్థితి మిగతా రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉంది.

ఆహార ప్రజాపంపిణీ విభాగం రిపోర్ట్ ప్రకారం గత కొన్నేళ్లుగా పంజాబ్, హరియాణా నుంచి మొత్తం ధాన్యం ఉత్పత్తిలో 80 శాతాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది.

కానీ మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి అలా లేదు. వీటి ఉత్పత్తిలో చిన్న భాగాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. దాంతో రైతులు అక్కడ మొదటి నుంచీ మార్కెట్ మీద ఆధారపడుతున్నారు.

వ్యవసాయ బిల్లులు

ఫొటో సోర్స్, Getty Images

బిహార్, మార్కెట్ సమస్య

వ్యవసాయ రంగంలో సవరణలు తీసుకురావడానికి 2006లో ఏపీఎంసీ యాక్ట్(అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ) ని రద్దు చేసిన తొలి రాష్ట్రం బిహార్. అక్కడ ఆ తర్వాత ప్రైవేటు సెక్టార్‌కు దారులు వేసింది.

కానీ, అలా రాష్ట్రానికి నిజంగానే లాభం జరిగింది అని చెప్పలేం. స్టేట్ ఆఫ్ ఇండియాస్ లైవ్లీహుడ్ 2013 గణాంకాల ప్రకారం దీనివల్ల అక్కడ వ్యవసాయ ఉత్పత్తి విక్రయించే వ్యవస్థ చాలా దారుణంగా ప్రభావితమైంది. చిన్న రైతులు మార్కెట్ మీద ఆధారపడడం పెరిగింది.

ఐడియాస్ ఫర్ ఇండియాలో ప్రచురితమైన ఒక రిపోర్ట్ ప్రకారం 2001-02 నుంచి 2016-17 వరకూ బిహార్ వ్యవసాయాభివృద్ధి రేటు దేశ సగటు వ్యవసాయాభివృద్ధి రేటు కంటే తక్కువగా ఉంది.

ఈ రిపోర్ట్ ప్రకారం ఏపీఎంసీ తొలగించిన తర్వాత ఇక్కడ వరి, గోధుమలు, మొక్కజొన్న ధరల్లో వృద్ధి నమోదైంది. కానీ రైతుల ఆదాయంలో అనిశ్చితి కూడా అదేవిధంగా పెరిగింది. ధరల్లో కూడా అనిశ్చితి కొనసాగింది. దాంతో ఎంత భూమిలో ఎంత సాగు చేస్తే తమకు నష్టం రాకుండా ఉంటుందనేది రైతులకు అర్థం కాలేదు. అందుకే బహుశా అక్కడ వ్యవసాయాభివృద్ధి రేటు తక్కువ నమోదైందని రిపోర్టులో చెప్పారు.

దేశంలోని 94 శాతం మంది రైతులు ఎంఎస్‌పీపై కాకుండా మార్కెట్ మీద ఆధారపడినప్పుడు, మార్కెట్ ద్వారా రైతులకు లాభాలు వచ్చుంటే, గత 70 ఏళ్లలో రైతుల పరిస్థితి మెరుగుపడి ఉండేది. కానీ, అలా జరగడం లేదు. మార్కెట్ల వల్ల రైతుల సమస్యలను తీర్చలేమనే విషయాన్ని ఇది సూచిస్తుంది.

ఈ మూడు బిల్లులతో ప్రభుత్వం ఇప్పుడు ఎంఎస్‌పీ వల్ల మెరుగైన స్థితిలో ఉన్న పంజాబ్ రైతులను నిరంతరం మార్కెట్ నుంచి సవాళ్లు ఎదుర్కుంటున్న బిహార్‌ రైతుల స్థాయికి తీసుకొస్తుంది.

ప్రభుత్వం బిల్లు చేయడానికి ముందు రైతుల అభిప్రాయం తీసుకోలేదు. వారిని మార్కెట్ భరోసాకు వదిలేసింది.

వ్యవసాయ బిల్లులు

ఫొటో సోర్స్, Getty Images

ఈ మూడు బిల్లుల విస్తృత ప్రభావం ఉంటుందా...

ఎంఎస్‌పీ, ధాన్యం కొనుగోళ్ల ప్రస్తుత వ్యవస్థలో ఎలాంటి మార్పులూ చేయబోమని ప్రభుత్వం చెబుతోందని ముంబయి, ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవెలప్‌మెంట్ రీసెర్చ్ వ్యవసాయ ఆర్థికవేత్త సుధా నారాయణన్ చెప్పారు.

ప్రభుత్వం ఈ బిల్లులో ఏం చేబుతోంది అని రైతులు ఆందోళన చెందడం లేదు, బిల్లులో ఏం చెప్పలేదో దాని గురించి ఆందోళనలో ఉన్నారు అని ఆమె తెలిపారు.

శాంతా కుమార్ కమిటీ రిపోర్టును ఉద్దేశించి మాట్లాడిన ఆమె “ఈ బిల్లు ఉనికిలోకి వస్తే ఏపీఎంసీని రద్దు చేస్తారని, ఆ తర్వాత ప్రభుత్వం ఈ రిపోర్ట్ గురించి చెబుతూ ధాన్యం కొనుగోళ్ల మొత్తం ప్రక్రియనే అంతం చేస్తుందని రైతుల్లో భయం ఉన్నట్లు నాకు అనిపిస్తోంది” అన్నారు.

వీటిలో ఏ బిల్లులోనూ అలా స్పష్టంగా ఏదీ రాయలేదు. ఈ బిల్లు వ్యవసాయ రంగంలో చేయబోతున్న పెద్ద సవరణల దిశగా ఒక అడుగు. అది ప్రభుత్వ విజన్‌లో ఒక భాగం అన్నారు సుధా నారాయణన్.

“శాంతా కుమార్ రిపోర్ట్ ప్రకారం ప్రభుత్వం ధాన్యపు కొనుగోళ్ల వ్యవస్థను అంతం చేయాలి. బహిరంగ ప్రజా పంపిణీ వ్యవస్థకు బదులు నగదు బదిలీపై దృష్టి పెట్టాలి. ఈ బిల్లుకు సంబంధించి లార్జర్ నరేటివ్ అదే. ఆ ప్రక్రియ ప్రారంభించడానికి ఈ బిల్లును ఒక ఎక్సర్‌సైజ్‌లా చూస్తున్నారు. ఇది ఆందోళనకరమైన విషయం” అన్నారు.

“దీని ద్వారా ఏపీఎంసీని రద్దు చేస్తారని, ధాన్యం ధరను నిర్ణయించే ఒక మొత్తం వ్యవస్థ లేకపోవడం అనే ఒక పెద్ద ప్రభావం రైతులపై పడుతుందని నాకంత ఆందోళనగా లేదు.. ఎందుకంటే రైతులకు ధరలకు ఎలాంటి బెంచ్‌మార్క్ ఉండదు. అలాంటప్పుడు మార్కెట్లపై వారు ఆధారపడడం మరింత పెరుగుతుంది.”

వ్యవసాయ బిల్లులు

ఫొటో సోర్స్, Getty Images

శాంతా కుమార్ రిపోర్ట్ ప్రకారం ప్రభుత్వం ప్రైవేటు రంగంలో ఉన్న కంపెనీలకు ప్రభుత్వం తరఫున ధాన్యం కొనుగోలు చేయాలని కూడా చెప్పవచ్చు. అందుకే దీనివల్ల పంపిణీ వ్యవస్థపై ఏదైనా ప్రభావం పడుతుందనేది కూడా చెప్పలేం.

2019 జూన్‌లో మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ఎఫ్‌సీఐ గురించి శాంతా కుమార్ సూచనలను అమలు చేయడం ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటి అన్నారు.

ఈ ఏడాది జూన్‌లో మోదీ ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణ్యమ్ ఆర్థిక సర్వేలో బహిరంగ ప్రజా పంపిణీ వ్యవస్థలో కవరేజ్‌ను 70 శాతం నుంచి 20 శాతానిక తగ్గించాలని, ధాన్యం కొనుగోళ్లు తగ్గించి ప్రత్యక్ష నగదు బదిలీ వైపు వెళ్లాలని చెప్పినపుడు కూడా ప్రభుత్వం ఆ దిశగా ముందుకు వెళ్లచ్చు అనే సూచన కనిపించింది..

శాంతాకుమార్ రిపోర్టులో కూడా కాస్త ఇలాగే చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)