సంచార్ సాథీ యాప్: అన్ని మొబైల్ ఫోన్లలో దీన్ని ఇన్‌స్టాల్ చేయాలని కేంద్రం ఎందుకు చెబుతోంది, ప్రతిపక్షం అభ్యంతరాలు ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images/Sancharsaathi
మార్చి 2026 నుంచి అమ్మే ప్రతి కొత్త మొబైల్ ఫోన్లలో సంచార్ సాథీ యాప్‌ను డీఫాల్ట్‌గా ఇన్‌స్టాల్ చేయాలని భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం(డీఓటీ) సోమవారం స్మార్ట్‌ఫోన్ తయారీదారులను ఆదేశించింది.
స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఈ యాప్‌ను డీయాక్టివేట్ చేయకుండా లేదా దానిపై ఎటువంటి పరిమితులు విధించకుండా చూడాలని పేర్కొంది.
మొబైల్ పరికరాల్లో ఉపయోగించే ఐఎమ్ఈఐ నంబర్ల ప్రామాణికతను ధృవీకరించడానికి సంచార్ సాథీ యాప్ ఉపయోగిస్తారని కేంద్రం తెలిపింది. అయితే ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసిన పరికరాల ఐఎమ్ఈఐ నంబర్‌ను స్వయంగా తీసుకుంటుందా లేక యూజర్లు దానిని నమోదు చేసుకోవాలా అన్నదానిపై స్పష్టత లేదు.
ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఈ చర్యను తీవ్రంగా విమర్శించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ఈ ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.


ఫొటో సోర్స్, sancharsaathi
‘‘మోసపూరితమైన హ్యాండ్‌సెట్‌లను కొనుగోలు చేయకుండా ప్రజలను రక్షించడానికి, టెలికాం వనరుల దుర్వినియోగాన్ని వాళ్లు అర్థం చేసుకోవడంలో సాయపడేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు డీఓటీ ఒక ప్రకటనలో తెలిపింది.
2023లో తొలిసారి పోర్టల్‌గా ప్రారంభించిన సంచార్ సాథీ యాప్, స్కామ్ కాల్స్‌ను రిపోర్ట్ చేయడానికి, యూజర్లు తమ పేరు మీద రిజిస్టర్ అయిన సిమ్ కార్డులను గుర్తించడంలో సహాయపడటానికి, ఫోన్‌ల దొంగతనం జరిగితే వాటిని బ్లాక్ చేయడానికి ఉపయోగిస్తారు.
ఇది బిజినెస్ స్పామ్‌ను నిరోధించడానికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (టీఆర్ఏఐ) నుంచి వచ్చిన డీఎన్‌డీ యాప్‌ని పోలి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
డీఓటీ తన ఆదేశంలో ఏం చెప్పింది?
- అన్ని కొత్త మొబైల్ ఫోన్లలో సంచార్ సాథీ యాప్ ప్రీ–ఇన్‌స్టాల్ చేయాలి.
- ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న డివైస్‌లలో ఈ యాప్‌ను ఓఎస్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా ఇన్‌స్టాల్ చేస్తారు.
- దొంగతనం జరిగిన ఫోన్‌లను బ్లాక్ చేయడానికి, నిజమైన ఐఎమ్ఈఐ నంబర్‌లను ధృవీకరించడానికి, స్పామ్ కాల్స్‌ను రిపోర్ట్ చేయడానికి ఈ యాప్ ఉపయోగిస్తారు.
- ఈ యాప్ వల్ల ఇప్పటివరకు మిస్సయిన వేలాది మొబైల్ ఫోన్‌లను తిరిగి గుర్తించగలిగామని ప్రభుత్వం చెబుతోంది.
- ఈ చర్యకు ఆపిల్ సంస్థ వ్యతిరేకం కావచ్చు, ఎందుకంటే గతంలో ట్రాయ్ ఇలాంటి ప్రయత్నం చేసినప్పుడు ఆపిల్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
- గతంలో, సైబర్ నేరాలను అరికట్టడానికి సిమ్-బైండింగ్ అవసరమని సమాచార సాంకేతిక విభాగం పేర్కొంది. సిమ్-బైండింగ్ విధానంలో, మెసేజింగ్ యాప్‌లు కేవలం రిజిస్టర్ చేసిన సిమ్ ఉన్న డివైస్‌లలో మాత్రమే పని చేయాలి.
- మా సూచనలను 90 రోజుల్లోపు అమలు చేసి, 120 రోజుల్లోపు రిపోర్ట్ చేయాలి.

ఫొటో సోర్స్, Getty Images
తప్పనిసరి చేయడంపై విమర్శలు
ఈ టెలికమ్యూనికేషన్ శాఖ మార్గదర్శకాలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ఈ చర్య రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ మాట్లాడుతూ, గోప్యత హక్కు రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కని, ఈ మార్గదర్శకాలు దానిని ఉల్లంఘిస్తున్నాయని అన్నారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం స్వేచ్ఛగా జీవించడం అనే ప్రాథమిక హక్కులో గోప్యత హక్కు అంతర్భాగమని ఆయన అన్నారు.
"మొబైల్‌లో ముందే ఇన్‌స్టాల్ చేసిన ప్రభుత్వ యాప్‌ను తొలగించలేం. ఇది వాస్తవానికి ప్రతి భారతీయ పౌరుడిని పర్యవేక్షించడానికి ఒక సాధనం. ఇది ప్రతి పౌరుడి కార్యకలాపాలు, నిర్ణయాలపై నిఘా ఉంచుతుంది" అని వేణుగోపాల్ ఎక్స్ పోస్ట్‌లో రాశారు.
"మేలుకో భారత్! సంచార్ సాథీ యాప్‌ను తప్పనిసరి చేయాలనే ప్రభుత్వం నిర్ణయం మన గోప్యత, స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడి. ప్రతి కొత్త ఫోన్‌లో దీన్ని బలవంతంగా ప్రీ-ఇన్‌స్టాల్ చేసి, డిలీట్ చేయడానికి వీలు లేకుండా 'భద్రత' ముసుగులో ప్రభుత్వం మన కాల్స్, మెసేజెస్, లొకేషన్‌ను గమనించగలదు. ఇది అత్యంత చెత్త నిఘా. ప్రభుత్వం మనల్ని నేరగాళ్లలా ట్రాక్ చేయగలదు. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి" అని రాజకీయ విశ్లేషకుడు తెహసీన్ పూనావాలా రాశారు.
రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది సంచార్ సాథీ తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకిస్తూ, "సంచార్ సాథీ మొబైల్ యాప్‌ను శాశ్వత మొబైల్ ఫీచర్‌గా చేర్చాలని మొబైల్ ఫోన్ తయారీదారులను ఆదేశించాలనే భారత ప్రభుత్వ నిర్ణయం" బిగ్ బాస్"లాంటి నిఘాకు మరొక ఉదాహరణ" అని రాశారు.
"ఇటువంటి సందేహాస్పద మార్గాల ద్వారా ప్రజల వ్యక్తిగత ఫోన్లలోకి చొరబడటానికి చేసే ప్రయత్నాలను ప్రతిఘటించాలి. ఐటీ మంత్రిత్వ శాఖ బలమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు బదులుగా నిఘా వ్యవస్థను నిర్మించాలనుకుంటే, ప్రజల నుంచి వచ్చే తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి" అని ప్రియాంక చతుర్వేది పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సిమ్ బైండింగ్ ఆదేశం
‘‘మానిప్యులేట్ చేసిన ఐఎమ్ఈఐలు ఒకే నంబర్ రెండు వేర్వేరు పరికరాల్లో పనిచేసే అవకాశం కల్పిస్తాయి. అటువంటి ఐఎమ్ఈఐలపై చర్యలు తీసుకోవడం కష్టమైన పని’’ అని డీఓటీ తెలిపింది.
"భారతదేశంలో సెకండ్ హ్యాండ్ మొబైల్ పరికరాలకు పెద్ద మార్కెట్ ఉంది. కొన్ని సందర్భాల్లో, దొంగిలించిన లేదా బ్లాక్‌లిస్ట్ చేసిన పరికరాలను తిరిగి అమ్ముతున్నట్లు గుర్తించాం. ఇది కొనుగోలుదారుడుని నేరాలలో భాగస్వామిగా చేసే ప్రమాదం ఉంది. ఆర్థిక నష్టాన్ని కూడా కలిగిస్తుంది. బ్లాక్ చేసిన లేదా బ్లాక్‌లిస్ట్ చేసిన ఐఎమ్ఈఐలను సంచార్ సాథీ యాప్ ద్వారా తనిఖీ చేయవచ్చు’’ అని డీఓటీ తెలిపింది.
"ఇన్‌స్టంట్ మెసేజింగ్, కాలింగ్ యాప్‌లలో, వాటికి అనుసంధానమైన సిమ్ తొలగించినా, డీయాక్టివేట్ చేసినా లేదా విదేశాలకు తీసుకెళ్ళినా, అకౌంట్‌లు కొనసాగుతాయి. దీని వల్ల అనామక స్కామ్‌లు, 'డిజిటల్ అరెస్ట్' మోసాలు, భారతీయ నంబర్లను ఉపయోగించి ప్రభుత్వ అధికారుల పేరుతో నకిలీ వ్యక్తులు కాల్ చేయడం సాధ్యమవుతుంది’’ అని సిమ్ బైండింగ్ గురించి డీఓటీ చెప్పింది.
ప్రపంచవ్యాప్తంగా యాప్‌లను ప్రీ-ఇన్‌స్టాల్ చేయాలనే ప్రభుత్వ ఆదేశాలను కొన్ని స్మార్ట్‌ఫోన్ కంపెనీలు గతంలో వ్యతిరేకించాయి. ఉదాహరణకు, స్పామ్-రిపోర్టింగ్ యాప్ ట్రాయ్ ఇన్‌స్టాలేషన్‌ను ఆపిల్ వ్యతిరేకించింది. ఈ యాప్‌కు ఎస్ఎమ్ఎస్, కాల్ లాగ్స్‌కి యాక్సెస్ కూడా ఉండేది.

ఫొటో సోర్స్, Getty Images
సంచార్ సాథీ యాప్ అంటే ఏమిటి?
సంచార్ సాథీ యాప్ ఒక సైబర్ సెక్యూరిటీ టూల్. దీన్నిజనవరి 17, 2025న మొబైల్ యాప్‌గా ప్రవేశపెట్టారు. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది.
ఆగస్టు 2025 నాటికి ఈ యాప్‌ను 50 లక్షలకు పైగా డౌన్‌లోడ్ చేశారని ప్రభుత్వం తెలిపింది.
దీనిద్వారా 37 లక్షలకు పైగా దొంగిలించిన లేదా పోగొట్టుకున్న మొబైల్ హ్యాండ్‌సెట్‌లను విజయవంతంగా బ్లాక్ చేసినట్లు సమాచారం.
అదనంగా, సంచార్ సాథీ యాప్ ద్వారా 22 లక్షల 76 వేలకు పైగా డివైజ్‌లను గుర్తించగలిగారు.
ఇది ప్రభుత్వ టెలికం భద్రతా వ్యవస్థతో నేరుగా అనుసంధానమై ఉంది. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) అనేది దేశంలోని ప్రతి మొబైల్ ఫోన్ ఐఎమ్ఈఐ నంబర్‌ను నమోదుచేసే కేంద్ర డేటాబేస్.
సంచార్ సాథీ యాప్ ఫోన్ భద్రత, గుర్తింపు, రక్షణ, డిజిటల్ మోసాల నుంచి రక్షణ కోసం సులభమైన, ఉపయోగకరమైన టూల్ అని ప్రభుత్వం పేర్కొంది.
ఇది ఫోన్‌ను సురక్షితంగా ఉంచుతుందని, కస్టమర్ గుర్తింపు దుర్వినియోగాన్ని నివారిస్తుందని, అవసరమైనప్పుడు తక్షణ సహాయాన్ని అందిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
వినియోగదారుని రక్షణ కోసం ఫోన్ ఐఎమ్ఈఐ నంబర్, మొబైల్ నంబర్, నెట్‌వర్క్ సంబంధిత సమాచారాన్ని ఈ యాప్ ఉపయోగిస్తుంది.
కస్టమర్లు ఈ యాప్‌ను ఫోన్‌లో ఓపెన్ చేసినప్పుడు, మొదట వారి మొబైల్ నంబర్‌ను అడుగుతుంది. నంబర్‌ను నమోదు చేసిన తర్వాత, ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. అది నమోదు చేస్తే ఫోన్ యాప్‌కు కనెక్ట్ అవుతుంది. ఆ తర్వాత యాప్ ఫోన్ ఐఎమ్ఈఐ నంబర్‌ను గుర్తిస్తుంది.
ఈ యాప్ ఐఎమ్ఈఐని టెలికమ్యూనికేషన్స్ శాఖ సెంట్రల్ సీఈఐఆర్ సిస్టమ్‌తో సరిపోల్చుతుంది. ఫోన్ దొంగిలించారా లేదా బ్లాక్‌లిస్ట్ చేశారా అన్నది తనిఖీ చేస్తుంది.
ఈ యాప్ హిందీతోపాటు 21 ఇతర ప్రాంతీయ భాషలలో అందుబాటులో ఉంది. ఇది దేశవ్యాప్తంగా దాదాపు అన్ని మొబైల్ కంపెనీల కస్టమర్లకు అందుబాటులో ఉంది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














