డ్రోన్లు ఎగరేయాలంటే ఈ రూల్స్ పాటించాల్సిందే.. మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

ఫొటో సోర్స్, Getty Images
దేశంలో డ్రోన్ల వినియోగంపై ఇంతవరకు ఉన్న అస్పష్టతకు కేంద్రం తెరదించింది. వీటి వినియోగానికి సంబంధించి పౌర విమానయాన శాఖ పరిధిలోని 'డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి.
తాజా మార్గదర్శకాలలో.. ఫొటోగ్రఫీ, వ్యవసాయ కార్యకలాపాల పర్యవేక్షణ, విపత్తు సహాయ పనుల్లో వీటిని ఉపయోగించొచ్చు కానీ ఆహార పదార్థాల చేరవేత, ఈకామర్స్ సైట్లు వస్తువుల చేరవేతకు ఉపయోగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
పగటిపూట మాత్రమే డ్రోన్లు(రిమోట్‌లీ పైలటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్-ఆర్‌పీఏఎస్) ఉపయోగించాలి. 400 మీటర్ల ఎత్తుకు మించి ఎగరనివ్వకూడదు.
విమానాశ్రయాలు, అంతర్జాతీయ సరిహద్దు పరిసరాల్లో.. తీర ప్రాంతాలలో, రాష్ట్ర సచివాలయ ప్రాంగణాలలో డ్రోన్ల వినియోగాన్ని నిషేధించారు.
ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో వివాహ వేడుకల్లో ఫొటోగ్రఫీ అవసరాలకు డ్రోన్లను వినియోగిస్తున్న నేపథ్యంలో అలాంటి వినియోగంపై ఆంక్షలు లేవని కేంద్రం చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
నానో డ్రోన్లు, జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ, కేంద్ర నిఘా సంస్థలు ఉపయోగించే డ్రోన్లకు తప్ప మిగిలిన వాటన్నింటికీ ప్రత్యేక గుర్తింపు నంబర్ (యూఐఎన్) కేటాయిస్తారు. నానో కేటగిరీ డ్రోన్లకు దీన్నుంచి మినహాయింపు ఉంది.
బరువు ఆధారంగా డ్రోన్లను పలు విభాగాల్లో చేర్చారు.
నానో కేటగిరీ: 250 గ్రాముల లోపు బరువున్నవి
మైక్రో కేటగిరీ: 250 గ్రాముల నుంచి 2 కిలోల వరకు
చిన్నతరహా: 2 నుంచి 25 కిలోల బరువున్న డ్రోన్‌లు.
మధ్యతరహా: 25 నుంచి 150 కిలోల డ్రోన్.
భారీ: 150కిలోల కన్నా ఎక్కువ బరువున్నవి.
డ్రోన్ 250 గ్రాముల కన్నా ఎక్కువ బరువుంటే.. అంటే, మైక్రో నుంచి ఆపై కేటగిరీల డ్రోన్లకు డీజీసీఏ నుంచి అనుమతులు, యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్, అన్‌మ్యాన్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటర్ పర్మిట్ వంటివి తప్పనిసరి. నానో కేటగిరీ డ్రోన్లకు ఇది వర్తించదు.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరుపడితే వారు ఎగరేయడం కుదరదు
డ్రోన్లు ఆపరేట్ చేసే విషయంలోనూ పలు నిబంధనలు ప్రకటించారు.
ఇండోర్‌లో, 50 అడుగుల కంటే తక్కువ ఎత్తులో వాటిని ఎగరినిచ్చేందుకు అనుమతులు అవసరం లేదు.
ఏ అవసరం కోసం డ్రోన్లను వినియోగిస్తున్నామో చెబుతూ స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తే సరిపోతోంది. 18 ఏళ్ల లోపువారు వీటిని ఆపరేట్ చేయరాదు.

ఫొటో సోర్స్, Getty Images
నిషేధాలు
* సూర్యాస్తమయం తరువాత డ్రోన్లను ఆపరేట్ చేయకూడదు.
* ముంబయి, దిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్‌పోర్టులకు 5 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లను వినియోగించరాదు.
* ఇతర విమానాశ్రయాలు (పౌర, ప్రైవేట్, రక్షణ విమానాశ్రయాలన్నీ) ప్రాంతంలో 3 కిలోమీటర్ల వరకు నో ఫ్లై జోన్.
* అంతర్జాతీయ సరిహద్దుల్లో.. నియంత్రణ రేఖ, వాస్తవాధీన రేఖ వద్ద డ్రోన్ల వాడకం పూర్తిగా నిషేధం.
* యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ పరిధిలో 25 కిలోమీటర్ల వరకు నో ఫ్లై జోన్.
* సముద్ర తీరంలో, సైనిక స్థావరాల సమీపంలో, దిల్లీలోని విజయ్ చౌక్ పరిసరాల్లో, రాష్ట్ర రాజధానుల్లోని సచివాలయాల చుట్టూ, జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను నో డ్రోన్ జోన్లుగా ప్రకటించారు.
ఉల్లంఘిస్తే..
డీజీసీఏ ప్రకటించిన నిబంధనలను ఉల్లంఘిస్తే ఐపీసీతో పాటు వైమానిక చట్టం-1934 ప్రకారం శిక్షార్హులవుతారు.
వీటి వినియోగం కోసం అనుమతులు కోరినప్పుడు తప్పుడు పత్రాలు సమర్పిస్తే లైసెన్సు రద్దు చేసి కేసు నమోదు చేస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
అనుమతి తీసుకోకుంటే పైకెగరదు
డ్రోన్ల రిజిస్ట్రేషన్, ఎగురవేసేందుకు అనుమతులు పొందడానికి సులభ విధానం రూపొందించారు. ఇందుకోసం 'డిజిటల్ స్కై' ప్లాట్‌ఫామ్ ద్వారా అవసరమైన ప్రక్రియ పూర్తిచేస్తారు. డ్రోన్ల రిజిస్ట్రేషన్‌తో పాటు టేకాఫ్‌కు అనుమతులు ఇవ్వాలన్నా, తిరస్కరించాలన్నా అంతా ఈ ప్లాట్‌ఫాం ద్వారానే జరుగుతుంది. డిజిటల్ స్కై ప్లాట్‌ఫాం స్థానిక పోలీస్‌స్టేషన్‌తో అనుసంధానమై ఉంటుంది. డ్రోన్‌ను ఎప్పటికప్పుడు 'డిజిటల్ స్కై' ద్వారా పర్యవేక్షిస్తుంటారు.
డ్రోన్లను ఉపయోగించడానికి ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాతే ఎగురవేయడానికి అనుమతులు అడగాలి. అప్పుడు ఎయిర్‌ట్రాఫిక్‌ను బట్టి అనుమతి ఇవ్వడమో, నిరాకరించడమో చేస్తారు.
ఒకవేళ అనుమతి రాకుంటే డ్రోన్ పైకి ఎగరదు. 'నో పర్మిషన్, నో టేకాఫ్' (ఎన్‌పీఎన్‌టీ) అనే సాంకేతికత డ్రోన్లకు ఎనేబుల్ చేయడం వల్ల అనుమతులు రానప్పుడు డ్రోన్లు పైకెగరవు. డ్రోన్లకు ఇలాంటి సాంకేతికత లేకపోతే నిబంధనలు ఉల్లంఘించినట్లే.
పిజ్జాలు ఎగురుకుంటూ వస్తాయా?
రెస్టారెంట్లు, ఈ కామర్స్ వెబ్‌సైట్లు తమ ఉత్పత్తులను డ్రోన్లను ఉపయోగించి డోర్ డెలివరీ చేయాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. ప్రస్తుతానికి ప్రభుత్వం ఈ అనుమతులు ఇవ్వలేదు.
ఇప్పటికైతే ఫొటోగ్రఫీ సంబంధిత పనులు, వ్యవసాయ పనుల పర్యవేక్షణకు, విపత్తులు సంభవించినప్పుడు డ్రోన్లను ఉపయోగించేందుకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇస్తోంది.
ఇవి కూడా చదవండి:
- 'రక్షణ బడ్జెట్లో రెండు శాతం శానిటరీ ప్యాడ్లకు ఖర్చు పెట్టాలి'
- దళితులకు గుండు గీయించి, మెడలో ‘ఆవుల దొంగ’ అనే బోర్డు వేసి ఊరేగించారు!
- భారత్‌ను ప్రశంసించిన పాకిస్తానీ యాంకర్
- ఈ తారలు నల్లటి దుస్తుల్లో ఎందుకొచ్చారు?
- ట్రంప్ మానసిక స్థితిపై మళ్లీ చర్చ
- ‘నక్సలైట్ల కుట్ర కేసులు’ ఎన్నిసార్లు రుజువయ్యాయి?
- అమరావతి బాండ్లు: అప్పులు వరమా? శాపమా?
- హైదరాబాద్‌కు 500 ఏళ్లు
- పుణే పోలీసులు అరెస్ట్ చేసిన హక్కుల ఉద్యమకారులు ఎవరు? ఏం చేస్తుంటారు?
- ఐవీఎఫ్: భర్తలు లేకుండానే తల్లులవుతున్న ఒంటరి మహిళలు
- నాగ్‌పూర్ అత్యాచారం: 'పాతికేళ్ల నా సర్వీసులో అంత క్రూరత్వాన్ని ఎప్పుడూ చూడలేదు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








