హువావే మెంగ్ వాన్‌ఝూ అరెస్ట్: అమెరికా-చైనా టెక్ వార్‌లో కొత్త 'బందీ'

ఫొటో సోర్స్, EPA
- రచయిత, కరిష్మా వాస్వాని
- హోదా, బీబీసీ ఆసియా బిజినెస్ ప్రతినిధి
హువావే చీఫ్ పైనాన్షియల్ ఆఫీసర్, ఆ సంస్థ వ్యవస్థాపకుడి కుమార్తె మెంగ్ వాన్‌ఝూ అరెస్ట్ గురించి ఎక్కువ చేసి చెప్పడం కష్టమే. చైనా టెక్నాలజీ మకుటంలో హువావే ఒక మణి అయితే, మెంగ్ ఆ సంస్థ యువరాణి.
అమెరికా-చైనా వాణిజ్య యుద్ధాన్ని తేలిక చేసేందుకు, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చేందుకు డిసెంబర్ 1న జీ20 వేదికగా ఇరు దేశాల అధ్యక్షులు ట్రంప్, జిన్ పింగ్ మధ్య చర్చలు జరిగిన అదే రోజు కెనడాలో మెంగ్‌ను అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆమెను అమెరికాకు చేరుస్తున్నారు.
అయితే, మెంగ్‌పై ఆరోపణల గురించి ఇంకా స్పష్టత రాలేదు. ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలను ఉల్లంఘించిందనే ఆరోపణలతో హువావే దర్యాప్తు ఎదుర్కుంటోందని మనకు తెలుసు. ఇది కేవలం ఒక మహిళ అరెస్టు, లేదా ఒక కంపెనీకి సంబంధించిన కేసు కాదు.
చాలా కాలం నుంచీ ఉప్పునిప్పుగా ఉన్న రెండు దేశాల మధ్య ఇది చాలా సున్నితమైన సమయం. ఈ అరెస్ట్ ఇప్పుడు అమెరికా, చైనా మధ్య భౌతిక బంధాలకు తీవ్ర నష్టం కలిగించవచ్చు.
"ఇలాంటి ప్రతికూల సమయంలో ఇది జరిగుండకూడదు. ముందు ముందు జరగబోయే దేనికో ఇది బహుశా ముసుగు వేసే అవకాశం ఉంది" అని సిల్క్ రోడ్ రీసెర్చ్‌కు చెందిన వినేశ్ మోత్వానీ నాకు చెప్పారు. ఇటీవల జీ20 ఒప్పందంపై మార్కెట్ ఇప్పటికే చాలా సందేహంలో ఉంది. ఏదైనా ఒప్పందం చేసుకోవచ్చా అనేదానిపై ఈ అరెస్ట్ మార్కెట్‌ను మరింత అనుమానాల్లో పడేయబోతోంది.

ఫొటో సోర్స్, AFP
సంధి ప్రయత్నాలకు బ్రేక్
వాషింగ్టన్, బీజింగ్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. వాణిజ్యం విషయంలోనే కాదు, బ్యూనస్ ఎయిర్స్‌లో జీ20 సదస్సు తర్వాత రెండు దేశాలూ చర్చల గురించి కనీసం నిర్ణయం తీసుకుంటాయని, 90 రోజుల్లో తమ మధ్య ఉన్న గొడవలన్నిటినీ పక్కనపెడతాయేమోనని అనిపించింది.
ఆ అంశాల్లో టెక్నాలజీ గురించి ఆందోళన కూడా ఉంది. అది ఈ వాణిజ్య యుద్ధంలో మొదటిదిగా ఉంది. చైనా, అమెరికా తమ ఉద్దేశాల గురించి ఎంత ఐక్యంగా ఉన్నాయో తెలీకపోయినా, జరుగుతున్న చర్చలు మాత్రం ప్రపంచ ఆర్థికవ్యవస్థకు సెమీ పాజిటివ్‌గానే కనిపించాయనేది పచ్చి నిజం.

ఫొటో సోర్స్, Reuters
వాణిజ్య యుద్ధంలో బందీ
"కానీ ఈ అరెస్టును చైనా ఒక దాడిగా, 'బందీగా తీసుకోవడం'గానే చూస్తుంది" అని ఎలియట్ జాగ్‌మాన్ అన్నారు. ఆయన ఈ చైనా సంస్థను గత రెండు దశాబ్దాలుగా కవర్ చేస్తున్నారు.
"ఒప్పందాలను చేసుకుని, వాటికి తగ్గట్టు నడుచుకోదని, నియమాలు పాటించదని చైనాకు చెడ్డ పేరుంది" అని ఆయన బోస్టన్ నుంచి ఫోన్లో చెప్పారు. "వాణిజ్య యుద్ధంలో చైనా తమ మాట వినేలా చేయడానికి అమెరికాకు ఇది ఒక మార్గం కావచ్చు" అని ఒక థియరీ ఉంది.
అదే నిజమైతే, ఆ ఎత్తును చైనా మీడియా సరిగా పసిగట్టలేకపోయింది.
"హువావేపై దాడికి అమెరికా ఒక మార్గం వెతకాలని ప్రయత్నిస్తోంది" అని గ్లోబల్ టైమ్స్ ఎడిటర్ హు క్సిజిన్ అన్నారు. ఈ పత్రికను చైనా ప్రభుత్వ వాణిగా భావిస్తారు.
"అది హువావేను దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తూనే ఉంది. అందుకే ఆ సంస్థ పరికరాలు వాడవద్దని అమెరికా తన మిత్ర దేశాలపై ఒత్తిడి తెస్తోంది. హువావే పేరును నాశనం చేయాలని చూస్తోంది" అన్నారు.
అమెరికా మిత్ర దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, బ్రిటన్ హువావే సేవలను తిరస్కరించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

ఫొటో సోర్స్, Reuters
చైనా ఆర్మీతో హువావే బంధం
హువావే గూఢచర్యం చేసినట్లు, డేటాను చైనా ప్రభుత్వానికి ఇచ్చినట్లు ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలూ లేవు. నిజానికి నేను హువావే ప్రతినిధులతో ఎప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడినా "అమెరికా, పాశ్చాత్త మీడియా తమ సంస్థను చైనా ప్రభుత్వ సంస్థగా, ఆ దేశం కోసం పనిచేస్తున్నట్లు చిత్రీకరించడం తమను ఎంత అసహనానికి గురిచేస్తోందో" చెప్పారు.
చట్టాన్ని గౌరవించే ఒక అత్యాధునిక అంతర్జాతీయ సంస్థగా హువావేను చూడాలని వారు కోరారు. అమెరికా తమ సంస్థను దోషిలా చూపిస్తోందని, అందులో నిజం లేదని నాతో అన్నారు.
మెంగ్ తండ్రి, హువావ్ వ్యవస్థాపకుడు, రెన్ జెంగ్ఫెయ్ చైనా ఆర్మీలో ఒక మాజీ సైనిక అధికారి. అది నిజమే అని జాంగ్‌మన్ అన్నారు. "ఆ సంస్థకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో సంబంధాలు ఉన్నాయనే విషయం ఆందోళన కలిగించే, అస్పష్టమైన అంశంగా మారిందని" అన్నారు.
అందుకే హువావే లాంటి చైనా కంపెనీలకు దేశాలన్నీ దూరంగా ఉండాలని అమెరికా చెబుతోంది. చైనా చట్టాల ప్రకారం ప్రభుత్వం అడిగితే, ఆ దేశంలోని ప్రైవేటు కంపెనీలు, వ్యక్తులు తమ దగ్గర ఉన్న సమాచారం, డేటా అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది.
ఇలాంటి చట్టాలు ఇప్పుడు హువావేతో వ్యాపారం చేయాలంటే తమకు ఆందోళన కలిగిస్తున్నాయని వివిధ దేశాల ప్రభుత్వాలు చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
అంతర్జాతీయ మార్కెట్లో ఎదురు దెబ్బ
కానీ, ఇది పూర్తిగా అవాస్తవం అని హువావే నాతో అంది. చైనాలోని మరికొన్ని సంస్థలు, వ్యాపారస్థులు కూడా ఈ మాటను కొట్టిపారేశారు.
"చైనా ప్రభుత్వం అలా చేయదు. దేశంలోని సొంత సంస్థలనే చైనా దెబ్బ కొట్టదు. అది తమ సంస్థలను అలా చేస్తే ఆ దేశానికి ప్రయోజనం ఏముంది. ఒక మామూలు, చిన్న ఉద్యోగిని అలాంటి సమాచారం అడిగినా ప్రభుత్వం అభ్యర్థనను తిరస్కరించే అధికారం హువావేకు ఉంటుంది" అని గ్లోబల్ టైమ్స్ ఎడిటర్ హు అన్నరు.
అంతర్జాతీయ మార్కెట్ చేరకుండా చైనాలోని ఎన్నో ప్రపంచ ప్రఖ్యాత సంస్థలను అడ్డుకుంటూ ఉండడంతో ఆ దేశంలో ఉన్న చాలా మంది ఇప్పుడు దీన్ని చైనాను ముందుకు తీసుకెళ్లాల్సిన మరో ప్రయత్నంగా భావిస్తున్నారు.
"అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల బయట హువావే 5జీ ఆకాంక్షలను ఇది మరింత ప్రమాదంలో పడేస్తుంది" అని అమెరికా నుంచి ఫోన్లో మాట్లాడిన నిఘా అధికారి టోనీ నాష్ అన్నారు.
"హువావేపై విచారణ సాగితే.. ఉత్తర అమెరికా, అభివృద్ధి చెందిన మార్కెట్లలో మిగతా తయారీ సంస్థలు ముందుకు దూసుకెళ్తాయి. హువావే, జడ్‌టీఈ రెండూ ఆ పోటీలో వెనకబడిపోతాయి."

ఫొటో సోర్స్, Getty Images
మిగతా దేశాలు ఎటు వైపు?
అప్పుడు, హువావే అభివృద్ధి చెందిన మార్కెట్లలో మాత్రమే తన స్థానం కోల్పోదు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో కూడా ఆ ప్రభావం పడుతుంది. ఆ పరిశ్రమ వర్గాలు నాకు "హువావే ఉత్పత్తులు వాడడం ఆపేయాలని ఆసియా మిత్రదేశాలపై అమెరికా ఒత్తిడి పెంచుతోంది. తాజాగా వాటిలో సాల్మన్ దీవులు, పపువా న్యూ గినీ కూడా చేరాయి. తర్వాత ఆ జాబితాలో భారత్ చేరుతుందని అనుకుంటున్నారు" అని చెప్పారు..
అంటే దీనర్థం ఏంటి? అంతా ముసుగులో జరుగుతోంది. అమెరికా తాజా వ్యూహం ప్రకారం, ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య బంధం గురించి ఎవరికీ, ఎలాంటి భ్రమలూ ఉండకూడదు. కానీ, పరిస్థితులు మాత్రం మరింత ఘోరంగా మలుపులు తిరుగుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- యెమెన్ యుద్ధం: స్వీడన్లో 'కీలక' శాంతి చర్చలు ప్రారంభం
- ‘‘కొన్ని నెలలు కోమాలో ఉన్నా.. రెండు సార్లు ఉరివేసుకున్నా’’
- గ్లోబల్ వార్మింగ్: ఈ 5 పనులూ చేయండి.. భూ తాపాన్ని మీరే తగ్గించండి
- పెట్రోల్ ధర ఎందుకు పెరుగుతోంది?
- నిక్ జోనస్‌ను పెళ్లాడిన ప్రియాంక చోప్రా.. నేడు హిందూ సంప్రదాయంలో మరోసారి
- తల్లిపాల ద్వారా హెచ్ఐవీ సోకుతుందా...
- తెలంగాణలో టీడీపీ స్థానం ఏమిటి? గతమేమిటి? భవిష్యత్ ఏమిటి?
- భూప్రళయం: డైనోసార్లు అంతమైన ప్రాంతం ఇదే
- తెలంగాణ ఎన్నికలు 2018: మీ నియోజకవర్గ అభ్యర్థులు ఎవరో తెలుసుకోండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








