తెలంగాణ ప్రభుత్వంలో ఈసారైనా మహిళలకు మంత్రి పదవి వస్తుందా?.. ఇంతకీ గెలిచిన మహిళా ఎమ్మెల్యేలు ఎవరు?

ఫొటో సోర్స్, ajmera.rekhashyamnaik/facebook
తెలంగాణలోని మొత్తం ఓటర్లలో మహిళా ఓటర్లు 48 శాతం.. శాసన సభలో వారి ప్రాతినిధ్యం మాత్రం కేవలం 5 శాతం. ఈసారి ఆరుగురు మహిళలు మాత్రమే అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
టీఆర్ఎస్ నుంచి పద్మాదేవేందర్ రెడ్డి, గొంగిడి సునీత, రేఖా నాయక్ గెలుపొందగా, కాంగ్రెస్ నుంచి సబితా ఇంద్రారెడ్డి, సీతక్క, హరిప్రియా నాయక్ విజయం సాధించారు. మిగిలిన పార్టీల నుంచి ఒక్క మహిళ కూడా అసెంబ్లీకి ఎన్నికవలేదు.

ఫొటో సోర్స్, GongidiSunithaTRS/facebook
ఇచ్చిందే తక్కువ..
ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 119 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగానే బరిలోకి దిగింది. పార్టీ నుంచి నలుగురు మహిళలకు టికెట్లు కేటాయించింది.
ప్రజాకూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ 100 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఇందులో 11 సీట్లు మహిళలకు ఇచ్చింది. టీడీపీ తనకు కేటాయించిన 13 స్థానాల్లో ఒక స్థానాన్ని మహిళకు కేటాయించింది.
బీజేపీ 14 మంది మహిళలకు టికెట్ ఇచ్చింది. సీపీఎం నేతృత్వంలోని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ 10 స్థానాల్లో మహిళా అభ్యర్థులను పోటీలో పెట్టింది. టీజేఎస్, సీపీఐలు ఒక్కో స్థానాన్ని మహిళలకు కేటాయించాయి. ఏఐఎం నుంచి ఒక్క మహిళా అభ్యర్థి కూడా పోటీ చేయలేదు.

ఫొటో సోర్స్, padmadevenderreddytrs/facebook
ఎవరెక్కడ గెలిచారంటే..
టీఆర్ఎస్ నుంచి నలుగురు మహిళా అభ్యర్థులు బరిలో దిగగా ముగ్గురు గెలిచారు. కాంగ్రెస్ నుంచి 11 మంది పోటీ చేయగా ముగ్గురు విజయం సాధించారు. టీఆర్ఎస్ నుంచి గెలిచిన ముగ్గురూ సిట్టింగ్ ఎమ్మెల్యేలే.
ఉప సభాపతి పద్మాదేవేందర్ రెడ్డి మెదక్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉపేందర్‌రెడ్డిపై 47,783 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ఖానాపూర్ నుంచి టీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగిన అజ్మీరా రేఖానాయక్ ప్రజాకూటమి అభ్యర్థి రమేష్ రాథోడ్‌పై గెలుపొందారు. ఆమెకు వరసగా ఇది రెండో విజయం.
ఆలేరు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన గొంగిడి సునీత రెండోసారి విజయం సాధించారు. ప్రజాకూటమి నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో దిగిన భిక్షమయ్య గౌడ్‌పై ఆమె గెలుపొందారు.
ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన కోవా లక్ష్మి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కుపై విజయం సాధించారు. వీరిద్దరి మధ్య హోరాహోరి పోరు జరిగింది. ఆత్రం సక్కు స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు.

ఫొటో సోర్స్, facebook
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిపై ఆమె విజయం సాధించారు.
టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజాకూటమి అభ్యర్థిగా ములుగు నుంచి పోటీ చేసిన సీతక్క టీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి చందూలాల్‌పై విజయం సాధించారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన బానోత్ హరిప్రియా నాయక్ ఎస్టీ నియోజకవర్గం ఇల్లెందుల నుంచి బరిలోకి దిగి కోరం కనకయ్యపై గెలుపొందారు.
ఆమె అసెంబ్లీకి పోటీ చేయడం ఇదే తొలిసారి. చివరి క్షణంలో ప్రజాకూటమి అభ్యర్థిగా ఆమె పేరు ఖరారైంది.
ఈసారైనా మహిళకు మంత్రి పదవి దక్కేనా?
తెలంగాణ రాష్ట్రంలో మొదటి ప్రభుత్వంలో మహిళలకు మంత్రి పదవి లభించలేదు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి బాధ్యతలను కూడా మగవాళ్లే నిర్వహిస్తారా? అంటూ అప్పట్లో ఈ అంశంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎంపీ కవిత సైతం ఈ అంశంపై స్పందించారు. మంత్రి పదవులు ఇవ్వటం, ఇవ్వక పోవటం ముఖ్యమంత్రి అధికార పరిధికి సంబంధించిన అంశమని, మహిళా మంత్రి ఉంటే బాగుండేదని ఆమె అన్నారు.
గురువారం ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఒకే ఒక్క మంత్రి.. మహమూద్ అలీ ప్రమాణం చేశారు. మిగతా మంత్రుల ప్రమాణ స్వీకారం తరువాత ఉంటుందని కేసీఆర్ బుధవారం విలేకరుల సమావేశంలో చెప్పారు.
ఇవి కూడా చదవండి
- తెలంగాణ ఎన్నికలు: టీఆర్ఎస్లో మహిళల స్థానమేంటి? క్యాబినెట్లో ఒక్కరూ ఎందుకు లేరు?
- తెలంగాణ ఎన్నికలు: 'మాకు రెండు రాష్ట్రాలు.. రెండు ఓటరు కార్డులు'
- తెలంగాణ ఎన్నికలు : హైదరాబాద్‌లో వీరి ఓట్లు ఎవరికి?
- తెలంగాణ ఎన్నికలు: టీఆర్ఎస్కే ఓటు వేస్తామని మసీదులో ప్రతిజ్ఞలు
- తెలంగాణ ముందస్తు ఎన్నికలు: విలీన మండలాల ఓటర్లు ఎటు?
- తెలంగాణ ఎన్నికలు: ప్రపంచ ఓటర్ల వేలిపై తెలంగాణ సిరా చుక్క
- తెలంగాణ ఎన్నికలు: 'మేం ఎన్నికలను బహిష్కరిస్తున్నాం'
- అండమాన్‌లో క్రైస్తవ మత ప్రచారకుడి హత్య: ‘సువార్త బోధించేందుకే అక్కడికి వెళ్లాడు’
- హార్లిక్స్: విటమిన్ D కి మూలం శాకాహార పదార్థాలా, మాంసాహార పదార్థాలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








