సినిమావాళ్లు రాజకీయాల్లోకి రాకూడదా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దివ్య ఆర్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
జయా బచ్చన్ ఇప్పుడు ఎలా ఉండుంటారు? కోపంగా ఉన్నారా.. బాధ పడుతున్నారా.. లేక తనపై చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చే ఆలోచనలో ఉన్నారా..?
తనను కాదని జయా బచ్చన్‌కు రాజ్యసభ టికెట్ ఇవ్వడంపై సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత నరేష్ అగర్వాల్ అసహనం వ్యక్తం చేశారు.
రాజకీయాల్లో తన స్థాయికీ, ఓ సినీనటి స్థాయికీ పోలిక లేదని నరేష్ అగర్వాల్ అన్నారు. ‘నన్ను కాదని సినిమాల్లో పాటలకు డాన్స్ చేసే వాళ్లకు టికెట్ ఇస్తారా?’ అంటూ జయాబచ్చన్‌ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.
సమాజ్‌వాదీ పార్టీ తనకు రాజ్యసభ టికెట్ ఇవ్వలేదని అలిగిన నరేష్ అగర్వాల్, ఆ పార్టీ నుంచి వైదొలగి బీజేపీలో చేరారు.
ఆయన చేసిన వ్యాఖ్యలకు జయా బచ్చన్ ఏమనుకున్నారో కానీ బయట చాలా మంది సామాన్యులు మాత్రం బాధపడ్డారు.

ఫొటో సోర్స్, RSTV
‘సమాజంలో పేరున్న, సంస్కారవంతమైన ఓ నటి గురించి బీజేపీకి చెందిన ఓ వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. అందులోనూ మహిళలను రక్షణ, విదేశాంగ మంత్రులుగా నియమించిన పార్టీకి చెందిన నేత ఇలా మాట్లాడి ఉండకూడదు’ అని ‘@ఐఏఎస్_రామ్‌దేవసి’ అనే యూజర్ ట్విటర్‌లో పేర్కొన్నారు.
అసలు సమస్యంతా ఈ రోజుల్లో కూడా సినిమాల్లో నటించడాన్ని, డాన్స్ చేయడాన్ని తప్పుగా భావించడమే. సినిమాల్లో డాన్స్ చేయడం తప్పయితే, అది కేవలం జయా బచ్చన్‌ను కాదు, సినిమాల్లో నటించడమనే వృత్తినే అవమానించినట్టు అవుతుంది.
నరేష్ అగర్వాల్ నేరుగా జయా బచ్చన్ పేరును ప్రస్తావించలేదు. కానీ ఆయన ఆశించిన రాజ్యసభ సీటు జయాబచ్చన్‌కు దక్కింది. దాంతో ఆయన చేసిన వ్యాఖ్యలు జయను ఉద్దేశించనవే అని చెప్పకనే చెబుతున్నాయి.
ఈ విషయంపై విదేశాంగ శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ కూడా స్పందించారు. ‘నరేష్ అగర్వాల్ భాజపాలో చేరారు. ఆయన్ని స్వాగతిస్తున్నాం. కానీ జయా బచ్చన్‌ను ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు సమంజసమైనవి కావు’ అని సుష్మ ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, Twitter
‘ఈ వ్యాఖ్యలు అటు సినిమా పరిశ్రమకీ, ఇటు భారతీయ మహిళలకు కూడా అగౌరవం కల్పించేవే’ అనే సమాజ్‌వాదీ పార్టీ ప్రెసిడెంట్ అఖిలేష్ యాదవ్ అన్నారు.
డాన్స్ చేస్తే తప్పేంటి?
జయ భర్త అమితాబ్ బచ్చన్ కూడా గతంలో పార్లమెంటుకు మంచి ఆధిక్యంతో ఎన్నికయ్యారు. ఆయన కూడా సినిమాల్లో నటించినవారే. కానీ ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎవరూ ఈ మాటలు అనలేదు.
నిజానికి చాలామంది మగవాళ్లు సినిమాల నుంచి రాజకీయాలవైపు వచ్చారు. కానీ వారెవరికీ ఇలాంటి వ్యాఖ్యలు ఎదురుకాలేదు.

ఫొటో సోర్స్, Twitter
నరేష్ అగర్వాల్ కామెంట్లను ‘ఖండిస్తున్నట్లు’ చెప్పి చాలా మంది ఊరుకున్నారు తప్ప, దానిపై వస్తున్న విమర్శలను ఎవరూ పట్టించుకోవట్లేదు.
నరేష్ అగర్వాల్‌తో పాటు భాజపాకు కూడా ఈ విషయంపై సమాధానం ఇవ్వాల్సిన అవసరముంది. నరేష్ వ్యాఖ్యలు అతని వ్యక్తిత్వాన్ని కూడా ప్రతిబింబిస్తున్నాయి.
మనం సినిమాల్నీ, అందులో నటించే మహిళల్నీ ఎలా చూస్తున్నాం? వాళ్ల కోసం ఎలాంటి పాత్రల్ని రూపొందిస్తున్నాం?.. ఈ విషయం పైన కూడా దృష్టిపెడితే ఇలాంటి పరిణామాలు తలెత్తే అవకాశాలు తగ్గుతాయి.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








