ఆదిత్యనాథ్ అతి విశ్వాసమే బీజేపీని ముంచిందా?

ఫొటో సోర్స్, Pti
- రచయిత, శరత్ ప్రధాన్
- హోదా, బీబీసీ కోసం
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీఎం పీఠమెక్కి ఏడాది గడుస్తున్న సమయంలో ఆయనకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
యోగి సొంత నియోజకవర్గం గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. 2014లో ఆయన దాదాపు 3లక్షల ఓట్ల తేడాతో గెలిచిన సీటది.
ఈ ఓటమికి తోడు ఫుల్‌పుర్ లోక్‌సభ స్థానంలో కూడా ఎదురైన ఓటమి బీజేపీని మరింత కుదిపేసింది. యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య సొంత నియోజకవర్గం అది. యోగి, మౌర్యలు లోక్‌సభకు రాజీనామా చేసి విధాన్ పరిషత్‌లో చేరడంతో ఆ రెండు సీట్లకు ఉపఎన్నికలు జరిగాయి.
నిజానికి చివరి నిమిషంలో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన్ పార్టీ (బీఎస్పీ)ల మధ్య కుదిరిన ఒప్పందం బీజేపీని గట్టి దెబ్బకొట్టింది. బీఎస్పీ ఉప ఎన్నికల పోరుకు దూరమవడంతో, కేవలం ఎనిమిది రోజుల వ్యవధిలో ఆ పార్టీకి చెందిన ఓట్లు ఎస్పీ అభ్యర్థికి బదిలీ అయ్యాయి.
యోగి ప్రభుత్వ పనితీరు, ‘అభివృద్ధి’ పేరుతో వాళ్లు గుప్పించిన ప్రకటనలు కూడా బీజేపీకి ప్రతికూలంగా మారాయి. గోరఖ్‌పుర్, ఫుల్‌పుర్‌లో అభివృద్ధినే తమ ప్రధాన ప్రచారాస్త్రంగా బీజేపీ మలచుకుంది. కానీ నిజానికి అక్కడ ఆశించిన స్థాయిలో ఎలాంటి మార్పూ కనిపించలేదు. దాంతో ఓటర్ల మనసు కరగలేదు.

ఫొటో సోర్స్, EPA/STR
వ్యక్తిగతంగా యోగికి ఇది చాలా పెద్ద దెబ్బ. దానికి కారణం ఆయనకు గోరఖ్‌పూర్‌తో, అక్కడి గోరఖ్‌నాథ్ మందిరంతో ఉన్న అనుబంధమే. ఆ దేవుడి దయతోనే తాను ఐదుసార్లు అక్కడి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యానంటారు యోగి. ఆయన గురువు మహంత్ అవైద్యనాథ్ కూడా మూడుసార్లు ఆ సీటును గెలుచుకున్నారు.
ఓటమినే కాదు, ఎస్పీ-బీఎస్పీ కలయికను కూడా యోగి ఊహించలేకపోయారు. అందుకే వాళ్లను ఎదుర్కోవడానికి సరిగ్గా సన్నద్ధం కాలేకపోయారు. నిజానికి ఎస్పీ-బీఎస్పీల మధ్య ఎన్నో విభేదాలున్నాయి. వ్యక్తిగతంగానూ మాయావతికి ఎస్పీ ప్రముఖులు నచ్చరు. కనీసం ములాయం సింగ్ యాదవ్‌తో కరచాలనానికి కూడా ఆమె ఒప్పుకోరు.
1995లో స్టేట్ గెస్ట్ హౌజ్‌లో తనపై దాడి జరిగిన నాటి నుంచీ మాయావతి ఎస్పీని శత్రువుగా భావిస్తూ వచ్చారు. కానీ మారిన పరిస్థితుల కారణంగా ఎస్పీ ప్రస్తుత అధినేత అఖిలేష్ యాదవ్ బీఎస్పీతో మంతనాలు జరిపించారు. అవి ఫలించి.. రెండు పార్టీలూ ఒక్కటయ్యాయని ప్రకటించినా కూడా బీజేపీ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు.
కానీ చివరికి ఆ కలయికే బీజేపీని ఎదురుదెబ్బ తీసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఫుల్‌పుర్‌లో బీజేపీ గెలుపుపైన మొదట్నుంచీ అనుమానాలున్నప్పటికీ, గోరఖ్‌పూర్‌లో ఓడిపోతుందన్న అంచనా ఇటు అధికార పక్షంతో పాటు అటు ప్రతి పక్షానికి కూడా లేదు.
బీజేపీ కూడా తమ అభ్యర్థులు ఉపేంద్ర దత్ శుక్లా(గోరఖ్‌పూర్), కౌశలేంద్ర నాథ్ పటేల్(ఫుల్‌పుర్) భారీ ఆధిక్యంతో గెలుస్తారని అతి విశ్వాసంతో బీరాలు పలికింది.
2012లో బీజేపీలో చేరిన యూపీ ఉప ముఖ్యమంత్రి మౌర్య, 2014లో మోదీ ప్రభంజనం నడుస్తున్న సమయంలో లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు. అనతి కాలంలోనే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నమ్మకాన్ని చూరగొని యూపీ భాజపా అధ్యక్ష పీఠమెక్కారు.
2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాలకు గానూ బీజేపీ 324సీట్లు గెలుచుకుంటే, ఆ విజయాన్ని మౌర్య తనకే ఆపాదించుకున్నారు. తన వల్లే బీసీ ఓట్లు భారీ స్థాయిలో వచ్చాయని ప్రచారం చేసిన మౌర్య నిజానికి మొదట సీఎం పీఠాన్నే ఆశించారు. కానీ చివరికి ఉప ముఖ్యమంత్రి పీఠంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

2014లో ‘బ్రాండ్ మోదీ’ కారణంగా బీజేపీకి ఓట్లు పడితే, ఈ ఉప ఎన్నికల్లో కులాల ప్రాతిపదికన ఓట్లను సమీకరించడంలో ఎస్పీ-బీఎస్పీ విజయం సాధించాయి. ఈ రెండు పార్టీల కూటమి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో బీజేపీకి గట్టి పోటీ తప్పకపోవచ్చు.
ప్రస్తుతం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ కూటమితో కలవకపోయినా, భవిష్యత్తులో రాహుల్ కూడా వీళ్లతో భాగమయ్యే అవకాశాలు లేకపోలేదు.
యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అతి విశ్వాసంతో పదే పదే ఈ ఉప ఎన్నికలను 2019 ఎన్నికలకు రిహార్సల్స్‌గా అభివర్ణించారు. కానీ ఇప్పుడు కూడా ఆయన దీన్ని రీహార్సల్‌గానే భావిస్తారా?
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








