"ఆంధ్రప్రదేశ్‌లో 175 సీట్లూ మావే" -కేఏ పాల్ : ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, facebook/DrKAPaul
ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాల్లో తన పార్టీ పోటీ చేసి విజయం సాధిస్తుందని, సర్వేలన్నీ తనకే అనుకూలంగా ఉన్నాయని 'ప్రజాశాంతి' పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ అన్నారంటూ 'వెలుగు' పత్రిక తన కథనంలో తెలిపింది.
''దేశంలో ప్రధాని మోడీ, ఏపీలో సీఎం చంద్రబాబు.. ఇద్దరూ ఫెయిల్యూర్ అయ్యారు, చంద్రబాబు రిటైర్ అయ్యే టైం వచ్చిందని, మోడీ మరో మూడు నెలల్లో రిటైర్ అవుతున్నారని పాల్ చెప్పారు. రాయలసీమ ప్రాంతం నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నా ఈ ప్రాంతం ఎటువంటి అభివృద్ధి చేందలేదని అన్నారు. ఏపీలోని 175 స్థానాల్లో పోటీ చేసి, గెలుస్తామని పాల్ ధీమా వ్యక్తం చేశారు. సర్వేలు అన్ని తమకే అనుకూలంగా ఉన్నాయని చెప్పారు.
మరోసారి చంద్రబాబు వస్తే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రానికి తెస్తారన్నారు. అమెరికాలో ట్రంప్‌నే గెలిపించుకున్నానని, ఇండియాలో తన పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని చెప్పారు'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, facebook/chandrababunaidu
'దిల్లీకి రాగానే అమిత్ షా కళ్లు నెత్తికెక్కాయా': చంద్రబాబు
అహంభావంతో ప్రవర్తించేవారికి పతనం తప్పదని, బీజేపీకీ అదే పరిస్థితి వస్తుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారని.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా నాలుగేళ్ల కింద ఎక్కడున్నారు? దిల్లీకి రాగానే ఆయనకు కళ్లు నెత్తికెక్కాయా అని ప్రశ్నించారని 'ఆంధ్రజ్యోతి' పత్రిక కథనం తెలిపింది.
'ఇష్టమొచ్చినట్లు అవాకులు చవాకులు పేలితే ప్రజలు సహించరు. మీరు చేసింది చెప్పుకోండి. కానీ నన్ను విమర్శించే నైతికత, నిబద్ధత మీకు లేవు. రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేసిన కేంద్రం.. అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్న నన్ను విమర్శిస్తోంది. అసలు బీజేపీకి అభివృద్ధి అంటే తెలుసా? 650 అవార్డులు రాష్ట్రానికి మీరే ఇచ్చి.. మళ్లీ మీరే విమర్శలు చేస్తారా? ఇకనైనా కథలు ఆపి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదో చెప్పండి.
2014లో కలుద్దామని నరేంద్ర మోదీయే అడిగారు. కానీ కలవాలని మేం అడుక్కున్నామని షా అంటున్నారు. మేమేం అడగలేదు. విభజనతో అన్యాయం జరిగిందని, న్యాయం చేస్తారనే కలిశాం.
అవినీతి అంటూ మాట్లాడుతున్న బీజేపీ రఫేల్ వ్యవహారంపై ఎందుకు విచారణ చేపట్టడం లేదు? బ్యాంకులను మోసం చేసి విదేశాలు పారిపోయిన వారిపై విచారణ అవసరం లేదా? మా దగ్గర అగ్రిగోల్డ్ మోసం చేస్తే.. ప్రతి పైసా వసూలు చేస్తున్నాం. మేం మళ్లీ ఎన్డీఏతో కలుస్తామన్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఆనాడు రాష్ట్రపతి ఎంపిక విషయంలో వాజ్‌పేయితోనే పోరాడాను.
ఇప్పుడున్నది పాత విలువలున్న బీజేపీ కాదు. కేవలం మోదీ, షా బీజేపీ. రాష్ర్టానికి మేలు చేయండని అడుగుతున్నందుకు మాపై ఎదురుదాడి చేస్తున్నారు. మా ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఐటీ దాడులు చేయిస్తున్నారు. అమిత్‌షా కుమారుడి ఆస్తులు నాలుగేళ్లలో 16 వేల రెట్లు పెరిగితే ఒక్క విచారణా ఉండదు. నిన్న పలాసలో షా సభలో కుర్చీలు వెలవెలబోయాయి. మీరు మాపై ఎంత ఒత్తిడి పెంచితే అంత త్వరగా పతనమవుతారు.
రాష్ట్రానికి రూ.80 వేల కోట్లు రావాలని జయప్రకాశ్ నారాయణ కమిటీ, రూ.75 వేల కోట్లు రావాలని పవన్ కల్యాణ్ కమిటీలు తేల్చాయి. ప్రజలు అడుగుతున్నవే నేనడుగుతున్నాను. రేపు మోదీ, షా రాష్ర్టానికి వస్తే ఇవే ప్రశ్నలు ప్రజల నుంచి వస్తాయి. రహదారులకు నిధులిచ్చామని చెప్పుకోవడం కాదు.. గుజరాత్‌కు, మహారాష్ట్రకు ఎన్ని ఇచ్చారో.. మాకెంత ఇచ్చారో చూడండి. ఈ అంశంపై నేను చర్చకు సిద్ధం' అని చంద్రబాబు మండిపడ్డారంటూ ఆ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, I&PR-AndhraPradesh
అంకెల గారడీ
ఏపీ ప్రభుత్వం శాసనసభకు మంగళవారం సమర్పించిన 2019-20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో అంకెల గారడీ చేసినట్లు స్పష్టమవుతోందని 'సాక్షి' పత్రిక తన కథనంలో విమర్శించింది.
''చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2014-15 నుంచి 2018-19 వరకు ప్రవేశపెట్టిన ప్రతి బడ్జెట్‌లోనూ రంగాలవారీగా భారీగా కేటాయింపులు చేయడం, ఆ తర్వాత నిధులను సమకూర్చలేక చేతులెత్తేయడం రివాజుగా మారింది. ఈసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లోనూ తమ ధోరణిని చంద్రబాబు-యనమల జోడి మార్చుకోలేదు.
గత ఎన్నికలకు ముందు లెక్కకు మించి చేసిన వాగ్దానాలకు గత ఐదు బడ్జెట్‌లలోనూ నిధులు కేటాయించకుండా సీఎం చంద్రబాబు హామీలను తుంగలో తొక్కారు. రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీని కమిటీలు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ తదితర వడపోతల పేరుతో రూ.24 వేల కోట్లకు కుదించారు. అందులోనూ ఇంకా రూ. 8,200 కోట్లు బకాయి ఉంది. దీనికి ఈ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి యనమల నిధులేమీ కేటాయించలేదు.
రుణమాఫీ పేరుతో సీఎం చంద్రబాబు రైతులను నిలువునా మోసగించడంతో వ్యవసాయ రుణాలు గత ఏడాది సెప్టెంబరు నాటికి రూ.1.37 లక్షల కోట్లకు చేరాయి. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు ఎన్నికలకు ముందు 'అన్నదాత సుఖీభవ' పేరుతో కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చారు.
సకాలంలో రుణాలు చెల్లించిన డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం కింద వడ్డీ రాయితీ వర్తింపజేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం 2016 అక్టోబరు నుంచి సున్నా వడ్డీ చెల్లింపులకు నిధులివ్వడం లేదు.
దీంతో డ్వాక్రా సంఘాల నుంచి బ్యాంకులు ఇప్పటివరకు వడ్డీ కింద రూ.2,400 కోట్లను వసూలు చేశాయి. తాజా బడ్జెట్‌లో వడ్డీలేని రుణాలకు రూ.1,100 కోట్లనే కేటాయించారు. అంటే ఈ కేటాయింపులు బకాయిలు చెల్లించడానికి కూడా చాలవన్నది స్పష్టమవుతోంది'' అంటూ ఆ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, facebook/TelanganaCMO
భాషా పండితులకు పదోన్నతి గౌరవం
తెలంగాణలోని భాషా పండితుల దశాబ్ద కాల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించిందని.. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో గ్రేడ్-2 హోదాలో పనిచేస్తున్న భాషా పండితులు ఇక స్కూల్ అసిస్టెంట్లు కానున్నారని, వ్యాయామ ఉపాధ్యాయులు(పీఈటీ) ఫిజికల్ డైరెక్టర్(పీడీ)గా పదోన్నతులు పొందనున్నారని, వారి పదోన్నతుల దస్త్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారని ఈనాడు కథనం వెల్లడించింది.
''దీని వల్ల 8,800 మంది భాషా పండితులు, 2 వేల మంది వ్యాయామ ఉపాధ్యాయుల (మొత్తం 10,800 మంది) హోదా పెరగనుంది. దీనికి సంబంధించి బుధవారం ఉత్తర్వులు వెలువడనున్నాయి.
సీఎంఓ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్, శాసనమండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, పీఆర్‌టీయూ ఎమ్మెల్సీలు పూల రవీందర్, కె.జనార్దన్‌రెడ్డిలు మంగళవారం సీఎం కేసీఆర్‌తో ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి సమక్షంలోనే దస్త్రాన్ని తెప్పించి, ముఖ్యమంత్రి సంతకం చేశారు.వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.
ఉపాధ్యాయుల అంతర్ జిల్లాల బదిలీల ప్రక్రియ వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, వేర్వేరు చోట్ల ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న భార్య,భర్తల బదిలీలు, పరస్పర అంగీకార (మ్యూచువల్)బదిలీలు చేపట్టాలని సీఎంను ఉపాధ్యాయ నేతలు కోరార'ని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- రష్యా మంత్రి బంపర్ ప్రైజ్: సరైన సమాధానం చెబితే 2.5 ఎకరాల భూమి ఫ్రీ
- సోషల్ మీడియా: మీకు లాభమా? నష్టమా?
- #fallingstarschallenge: చైనా యువతీ, యువకులు ఎందుకిలా పడిపోతున్నారంటే..
- హైదరాబాద్‌లో శాకాహారులు ఎంత మంది? మాంసాహారులు ఎంత మంది?
- అరటిపండు తింటే హ్యాంగోవర్ దిగిపోతుందా
- ట్రంప్ ఏం తింటారు? వాటి అర్థం ఏంటి?
- ఇన్‌స్టాగ్రామ్‌తో డబ్బులు సంపాదించడం ఎలా?
- ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చిన్నారుల అమ్మకం
- సౌదీ: ‘నా చేత బలవంతంగా ప్రార్థనలు చేయించేవాళ్లు. రంజాన్‌లో ఉపవాసం ఉంచేవాళ్లు’
- ఇన్‌స్టాగ్రామ్ ఫొటోల్లో భారత రైలు ప్రయాణం
- ఇన్‌స్టాగ్రామ్: నకిలీ కామెంట్లు, నకిలీ లైక్‌లు ఇక కుదరవు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








