టర్కీ ఎన్నికలు: ఎర్డొగన్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైతే ఏమవుతుంది?

ఫొటో సోర్స్, Getty Images
టర్కీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. దేశాధ్యక్షుడు రెకెప్ తయ్యిప్ ఎర్డొగన్‌కు మరో ఐదేళ్ల పాటు అధికారం దక్కుతుందా లేదా అని తేల్చే కీలక ఎన్నికలివి.
పార్లమెంటుతో పాటు, అధ్యక్ష స్థానానికి కలిపి ఒకేసారి ఈ ఎన్నికలు జరిగాయి. ఆ దేశ కాలమాన ప్రకారం ఉదయం 8 గంటలకే ఓటింగ్ ప్రారంభమైంది.
ఒకవేళ మళ్లీ ఎర్డొగన్ ఈ ఎన్నికల్లో గెలిస్తే ఆయన మరింత శక్తివంతుడు అవుతారని, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తారని విమర్శకులు అంటున్నారు.

ఫొటో సోర్స్, AFP/Getty Images
అయితే, మధ్యేవాద వామపక్ష అభ్యర్థి, రిపబ్లికన్ పార్టీ (సీహెచ్‌పీ) నేత ముహ్రేమ్ ఇన్స్ నుంచి ఆయన గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.
జులై 2016లో సైనిక చర్య విఫలమైన తర్వాత నుంచి టర్కీలో అత్యయికస్థితి విధించారు.
నిజానికి నవంబర్ 2019లో ఈ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ, ఎర్డొగన్ ఈ ఎన్నికలను ముందుకు తీసుకొచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
‘టర్కీ చరిత్రలో శక్తివంతుడు ఎవరో తేల్చే ఎన్నికలు ఇవి‘
‘‘నవీన టర్కీ చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి తలెత్తలేదు. ఎర్డొగన్ కూడా ఇంత గట్టి పోటీని ఎప్పుడూ ఎదుర్కోలేదు’’ అని టర్కీ బీబీసీ ప్రతినిధి మార్క్ లొవెస్ విశ్లేషించారు.
ఒకవేళ ఈ ఎన్నికల్లో ఎర్డొగన్ గెలిస్తే టర్కీ పితామహాడు అటాటర్క్ కంటే ఆయన శక్తివంతుడైన టర్కీ నేతగా చరిత్రలో నిలిచిపోతారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరీ ఎర్డొగన్? మళ్లీ గెలిస్తే ఏమవుతుంది?
తాను అధికారంలో ఉన్న గత 15 ఏళ్ల కాలంలో ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఎర్డొగన్ గెలుపొందారు. అయితే, ఈ కాలంలోనే టర్కీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. విపక్షాల ప్రచారం కూడా చాలా గట్టిగా ఉంది.
నవీన టర్కీ చరిత్రలో మరే నాయకుడూ చేయనంతగా దేశాన్ని తీర్చిదిద్దారు ఇస్లామిక్ మూలాలున్న ఏకే పార్టీ బలపరుస్తున్న ఎర్డొగన్.
రెండుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన ఆయన 2014లో తొలిసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. వాస్తవానికి అధ్యక్ష పదవి అనేది అలంకారప్రాయమైనదే. కానీ, గతేడాది ఏప్రిల్‌లో టర్కీ ఓటర్లు నూతన రాజ్యాంగానికి మద్దతు పలికారు. దీని ప్రకారం అధ్యక్షుడికి మరిన్ని అధికారాలు సంక్రమించాయి.
అవి..
- మంత్రులు, ఉపాధ్యక్షులు సహా అత్యున్నత అధికారులను నేరుగా నియమించే అధికారం
- దేశ న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకునే అధికారం
- దేశంలో అత్యయికస్థితి విధించే అధికారం
వీటన్నింటికీ మించి.. ప్రధానమంత్రి పదవిని రద్దు చేయటం.
కొత్త ప్రధానికి మితిమీరిన అధికారాలు లభించాయని, ఫ్రాన్స్, అమెరికా అధ్యక్షుల తరహాలో అధ్యక్ష అధికారాలను పర్యవేక్షించేందుకు కానీ, సరిదిద్దేందుకు కానీ ఎలాంటి ఏర్పాట్లూ లేవని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుత ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ఆరుగురు పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరికి 50 శాతానికి పైగా ఓట్లు లభిస్తే వారే అధ్యక్ష పదవిని చేపడతారు. ఒకవేళ ఎవరికీ రాకపోతే రెండో దఫా ఎన్నిక జూలై 8వ తేదీన జరుగుతుంది.

ఫొటో సోర్స్, AFP
పార్లమెంటుతో కలిపి జమిలి ఎన్నికలు
ఆదివారం అధ్యక్ష ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. రెండింటినీ కలిపి ఒకేసారి నిర్వహిస్తున్నారు. 600 సీట్లున్న పార్లమెంటులో కూడా అధికారం చేపట్టాలని ఏకే పార్టీ భావిస్తోంది. అయితే, ప్రతిపక్షాలన్నీ కలసి ఏర్పాటు చేసిన కూటమి గట్టి పోటీ ఇస్తోంది.
ఒకవేళ ఎర్డొగన్ పార్టీ కనుక పార్లమెంటులో తమ మెజార్టీని కాపాడుకోగలిగితే ఆయన మరింత బలపడతారు. తన రాజకీయాధికారాన్ని కూడా బలోపేతం చేసుకోగలుగుతారు. పార్లమెంటులో బలహీనపడితే ఆయన ప్రతిష్ట తగ్గే అవకాశాలున్నాయి.
రెండు ఎన్నికల్లోనూ ఆయన ఓటమి చవిచూస్తే టర్కీ రాజకీయ ముఖచిత్రం నాటకీయంగా మారిపోతుంది.
ఒకవేళ అధ్యక్ష ఎన్నికల్లో ఒక ఫలితం, పార్లమెంటు ఎన్నికల్లో మరో ఫలితం వచ్చాయంటే రాబోయే కొన్నేళ్ల పాటు టర్కీలో రాజకీయ అస్థిరతకు దారితీస్తుంది.
5.90 కోట్ల మంది టర్కీ ఓటర్లలో 30 లక్షల మంది విదేశాల్లోనే నివశిస్తున్నారు. వీరంతా ఇప్పటికే తమ ఓట్లు వేసేశారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








