సిరియాలో టర్కీ సైనిక చర్య, భద్రతామండలి అత్యవసర సమావేశం

ఫొటో సోర్స్, AFP
ఉత్తర సిరియా నుంచి కుర్ద్ మిలిటెంట్లను పారదోలే లక్ష్యంతో టర్కీ సైనిక చర్యను ప్రారంభించింది. అయితే పౌరనష్టం జరగకుండా టర్కీ సంయమనాన్ని పాటించాలని అమెరికా విజ్ఞప్తి చేసింది.
సాధారణ పౌరులకు నష్టం జరగకుండా చూసుకోవాలనీ, ఇస్లామిక్ స్టేట్‌పై దృష్టి పెట్టాలని అమెరికా టర్కీని కోరింది.
కుర్దిస్తాన్ మిలిటెంట్లను అంతం చేస్తామని టర్కీ అధ్యక్షుడు రెచెప్ తైయప్ ఎర్దొగాన్ ప్రకటించారు. ఈ సైనిక చర్య త్వరలోనే ముగుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అల్లా మా తోడుగా..
"కుర్దిస్తాన్ మిలిటెంట్లు అఫ్రీన్ నుంచి ఎప్పటి దాకా తప్పించుకోగలుగుతారో చూస్తాం. మేం వాళ్లను వెంటాడుతాం. వాళ్లకు ఊపిరి సల్పనివ్వం. మేం ఒంటరిగా లేం. అల్లా మాకు తోడుగా ఉంటారు. త్వరలోనే ఈ సైనిక చర్యను పూర్తి చేస్తాం" అని ఎర్డొగాన్ అన్నారు.
కుర్ద్ మిలిటెంట్లను ఏరివేసేందుకు సిరియా సరిహద్దు ప్రాంతమైన అఫ్రీన్‌పై టర్కీ గత శనివారం వైమానిక దాడులు ప్రారంభించింది.
టర్కీ చేపట్టిన ఈ సైనిక చర్యపై సోమవారం నాడు యూఎన్ భద్రతామండలి అత్యవసర సమావేశం జరుగనుంది.

ఫొటో సోర్స్, AFP
భద్రతామండలి అత్యవసర సమావేశం
పరిస్థితిని అంచనా వేసేందుకు భద్రతామండలి అత్యవసర సమావేశం తప్పనిసరి అని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ వేస్ లి డ్రాయన్ అన్నారు.
"ప్రస్తుత సిరియా పరిస్థితులపై ఫ్రాన్స్ తీవ్రంగా ఆందోళన చెందుతోంది. అందుకే మేం భద్రతామండలి అత్యవసర సమావేశం జరగాలని కోరుతున్నాం. పరిస్థితులు బాగా దిగజారాయి. వీలైనంత త్వరగా యుద్ధ విరమణ కోసం ప్రయత్నించాలి" అని ఆయన అన్నారు.
మరోవైపు, టర్కీ 'సైనిక చొరబాటు'ను కుర్దిస్తాన్ మిలిటెంట్ల సైన్యం వైజీపీ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఈ ఎదురుదాడిలో నలుగురు టర్కీ సైనికులు మృతి చెందారు.
అయితే టర్కీ దీనిని ధృవీకరించలేదు. ఆదివారం నాడు జరిగిన వైమానిక దాడుల్లో ఎనిమిది మంది సాధారణ పౌరులు మరణించారని కూడా కుర్ద్ సంస్థ తెలిపింది. అయితే తాము తీవ్రవాదులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశామని టర్కీ అంటోంది.
అమెరికా కుర్ద్ మిలిటెంట్లకు సహకరిస్తూ ఈ ప్రాంతంలో భయ వాతావరణం సృష్టించిందని నాటోలో టర్కీ ప్రతినిధి అహ్మత్ బేరత్ ఆరోపించారు.
"మేం చేస్తున్న చర్య మా దృష్టిలో పూర్తిగా చట్టబద్ధమైంది. అందుకే టర్కీకి మద్దతునివ్వాలని మేం అంతర్జాతీయ సముదాయాన్నీ, నాటో భాగస్వామ్య దేశాలనూ కోరుతున్నాం. ఈ సైనిక చర్యను వ్యతిరేకించే నాటో సభ్య దేశాలు తమ సభ్యత్వం గురించి మరోసారి ఆలోచించుకోవడం మంచిది" అని అహ్మత్ బేరత్ కొంకర్ అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
టర్కీ సైనిక చర్యకు కారణాలేంటి?
సిరియాలో ఇస్లామిక్ స్టేట్‌ను దెబ్బ తీయడం కోసం అమెరికా కుర్ద్ మిలిటెంట్ సంస్థ అయిన వైపీజీకి మద్దతునిస్తోంది. అయితే ఈ కుర్ద్ మిలిటెంట్ గ్రూపులను టర్కీ ఉగ్రవాద సంస్థలుగా ఆరోపిస్తోంది.
నిషేధిత కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ (పీకేకే)తో ఈ గ్రూపులకు సంబంధాలున్నాయని టర్కీ అభిప్రాయం.
ఇస్లామిక్ స్టేట్‌ను నిరోధించేందుకు అమెరికా సిరియన్ డెమోక్రటిక్ ఫోర్స్ (ఎస్‌డీఎఫ్)తో కలిసి సరిహద్దు రక్షణ దళాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం పట్ల కూడా టర్కీ ఆగ్రహం వెలిబుచ్చింది. టర్కీ అధ్యక్షుడు దీనిని 'టెర్రర్ ఆర్మీ' అని అభివర్ణించారు.

ఫొటో సోర్స్, AFP
మరోవైపు, 1980వ దశకం నుంచి టర్కీ తమపై యుద్ధం సాగిస్తూ తమ సాంస్కృతిక గుర్తింపును నాశనం చేసేందుకు ప్రయత్నిస్తోందని కుర్ద్ వేర్పాటువాదులు విమర్శిస్తున్నారు.
టర్కీ, సిరియాలు రెండూ సంయమనంతో వ్యవహరించాలని అమెరికా, ఫ్రాన్స్ తదితర పాశ్యాత్య దేశాలు కోరుతున్నాయి. టర్కీ సైనిక చర్య పట్ల రష్యా కూడా ఆందోళన వ్యక్తం చేసింది.
మరో సిరియా మద్దతుదారు దేశమైన ఇరాన్ కూడా ఈ సైనిక చర్యను త్వరగా ముగించాలని డిమాండ్ చేసింది.
ఇవి కూడా చదవండి:










