ఐసిస్ కొత్త ఆడియోతో అల్ బగ్ధాదీపై మళ్లీ అనుమానాలు

ఫొటో సోర్స్, AFP
ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ తాజాగా విడుదల చేసిన ఓ ఆడియో టేప్ సంచలనంగా మారింది. ఆ రికార్డింగ్‌లో మాట్లాడుతున్నది ఐసిస్ అధ్యక్షుడు అబు బకర్ అల్- బగ్దాదీనే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల జపాన్, అమెరికాలకు ఉత్తర కొరియా చేసిన హెచ్చరికలు, ఉద్రిక్త పరిస్థితులను ప్రస్తావించినట్లు ఆ రికార్డులో ఉంది. దాంతోపాటు ఇటీవల ఇరాకీ దళాలు స్వాధీనం చేసుకున్న మోసుల్ నగరాన్ని మళ్లీ చేజిక్కించుకునేందుకు ఐసిస్ అనుసరించబోయే కార్యాచరణ గురించి మాట్లాడారు.
2014 జులైలో చివరి సారిగా ఇరాక్‌లోని మోసుల్ నగరంలో ఉన్న ఓ మసీదులో బగ్దాదీ ప్రార్ధన చేస్తూ కనిపించాడు. అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు. దాంతో అతను బతికే ఉన్నాడా, లేదా? అంటూ ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. అతని తలపై అమెరికా ప్రభుత్వం దాదాపు రూ. 163 కోట్ల (25 మిలియన్ డాలర్లు) రివార్డు కూడా ప్రకటించింది.
ఇరాక్- సిరియా సరిహద్దులోని ఐసిస్ ప్రాంతంలో బగ్దాదీ ఉండొచ్చన్న అనుమానాలూ ఉన్నాయి.
వాస్తవమేంటో తేలుస్తాం: అమెరికా
తాజాగా బయటకొచ్చిన వీడియో గురించి అమెరికా భద్రతా దళం ప్రతినిధిని అడగ్గా.. ‘‘అతను మరణించాడని చెప్పేందుకు మా దగ్గర ఆధారాలు లేవు. ఇప్పటికీ అతడు బతికే ఉన్నాడని భావిస్తున్నాం’’ అని అన్నారు.
‘‘ఆడియో టేప్ గురించి తెలిసింది. అందులో మాట్లాడింది అల్-బగ్దాదీనేనా? కాదా అన్న విషయం తెలుసుకునేందుకు పరీక్షిస్తున్నాం. ప్రస్తుతానికి ఆ ఆడియోలో వాస్తవికత గురించి ఏమీ చెప్పలేం’’ అని బీబీసికి చెప్పారు.
ఈ ఏడాది మే 28న తమ బలగాలు జరిపిన వైమానిక దాడిలో బగ్దాదీ హతమయ్యాడని రష్యా ప్రకటిచింది. తర్వాత ఇరాన్ కూడా అతను మరణించాడని తెలిపింది. అమెరికా మాత్రం ఆ విషయాన్ని ధృవీకరించలేదు.
46 నిమిషాల తాజా ఆడియోను ఐసిస్‌తో సంబంధమున్న ఓ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశారు. అందులో ఎక్కువగా మతపరమైన ప్రస్తావనలున్నాయి. సిరియాలోని రక్కా, హమా, లిబియాలోని సిర్టే నగరాల్లో అంతర్‌యుద్ధం గురించి మాట్లాడారు. సిరియా విషయంలో రష్యా బ్రోకర్‌గా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
మా ఇతర కథనాలు:
- ఐఎస్ తీవ్రవాదుల తదుపరి లక్ష్యం ఏంటి?
- జిహాద్: దేశాన్ని డైలమాలో పడేసిన చిన్నారి
- 26/11 ముంబయి దాడులు: ఆ రోజు రాత్రి ఓ సైన్యమే యుద్ధానికి దిగినట్టు అనిపించింది
- హఫీజ్ సయీద్ విడుదలపై అమెరికా ఆందోళన
- ఐన్‌స్టీన్ ‘థియరీ ఆఫ్ హ్యాపీనెస్’
- ఇరాన్-ఇరాక్: 2017లో అతి పెద్ద భూకంపం ఇదే
- ఉత్తర కొరియాపై ప్రయాణ నిషేధాజ్ఞలు జారీ చేసిన అమెరికా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)








