రైతులకు మోదీ వరాలు ప్రకటిస్తారా? వ్యవసాయాన్ని పట్టాలెక్కిస్తారా?

ఫొటో సోర్స్, Reuters
మోదీ ప్రభుత్వం మరి కొద్ది గంటల్లో 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇదే చివరి బడ్జెట్ కావడంతో ఇది ప్రజాకర్షక బడ్జెట్‌గా ఉండొచ్చని భావిస్తున్నారు.
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దృష్టి ఓ వైపు వచ్చే సంవత్సరం జరుగనున్న ఎన్నికల మీదా, మరోవైపు ద్రవ్య లోటును పూడ్చుకోవడం పైనా ఉండక తప్పదు.
బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందుగా, ప్రస్తుత ప్రభుత్వం ముందు ఇంకా ఏమేం సవాళ్లున్నాయో చూద్దాం:

ఫొటో సోర్స్, Getty Images
వ్యవసాయం
నోట్ల రద్దు తర్వాత దేశంలో వ్యవసాయం పరిస్థితి దిగజారిందని చెబుతున్నారు. "వ్యవసాయ రంగాన్ని మళ్లీ పట్టాల మీదకు ఎలా ఎక్కించడమన్నది ఈ ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సవాలు" అని ఆర్థికవేత్త అరుణ్ కుమార్ అన్నారు.
కాబట్టి రైతులకు ఊరటనిచ్చే దిశగా ఈ బడ్జెట్‌లో చర్యలుంటాయని అంచనా వేస్తున్నారు. రైతులకు వ్యవసాయం పట్ల భరోసా కలిగేలా చేయడమన్నది ప్రభుత్వం ముందున్న సవాలు.
"గడిచిన కొన్న దశాబ్దాలుగా దేశంలో వ్యవసాయ రంగం బాగా దిగజారుతూ వస్తోంది. 2016 ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం, దేశంలో రైతుల సగటు వార్షిక ఆదాయం 20 వేల రూపాయలు మాత్రమే. రైతుల ఆత్మహత్యలు వ్యవసాయ రంగం దుస్థితికి నిలువెత్తు సాక్ష్యం. ఇప్పుడు రైతులు తమ ఆగ్రహాన్ని కూడా బాహాటంగా ప్రకటిస్తున్నారు. గుజరాత్ ఎన్నికల్లో రైతులు అధికార పార్టీకి ఓట్లు వేయలేదు" అని వ్యవసాయ రంగ నిపుణుడు దేవేంద్ర శర్మ అన్నారు.
బడ్జెట్‌లో ప్రతి సారి రైతుల ప్రస్తావన అయితే ఉంటుంది కానీ మద్దతు మాత్రం లభించదని ఆయన అన్నారు. సాధారణంగా బడ్జెట్‌లలో పెట్టుబడిదారుల పైనే ఎక్కువ దృష్టి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
నిరుద్యోగం
గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరుద్యోగం ఒక పెద్ద సమస్య అని అభివర్ణించారు. ప్రతి ఏటా కొత్త ఉద్యోగాల కల్పన హామీ కూడా ఆయన ఇచ్చి ఉన్నారు.
అయితే ఎన్ని హామీలిచ్చినా దేశంలో నిరుద్యోగం రేటు నిరంతరాయంగా పెరుగుతోంది. దీనిపై మాట్లాడుతూ, "అసంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు తగ్గాయి. దానిని పరిష్కరించడం ప్రభుత్వం ముందున్న మరో పెద్ద సవాలు. ప్రత్యేకించి ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు" అని అరుణ్ కుమార్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
స్టాక్ మార్కెట్లు పెరుగుట విరుగుట కొరకేనా?
స్టాక్ మార్కెట్లలో నెలకొన్న అపరిమిత దూకుడు ధోరణిని నియంత్రించడం కూడా మోదీ ప్రభుత్వం ముందున్న మరో ముఖ్యమైన సవాలని ప్రొఫెసర్ అరుణ్ కుమార్ అన్నారు.
"మన స్టాక్ మార్కెట్లలో చాలా పెరుగుదల నమోదైంది. దీనికి ఒక కారణం పోర్ట్‌ఫోలియో రీఅడ్జస్ట్‌మెంట్. గత మూడు, నాలుగేళ్లుగా రియల్ ఎస్టేట్ రంగం బాగా దిగజారుతూ వచ్చింది. దాంతో ఓ వైపు ఆర్థికంగా పొదుపు జరుగుతుండగా మరోవైపు వడ్డీ రేట్లు బాగా పడిపోయాయి. కాబట్టి ఎక్కువలో ఎక్కువ మంది స్టాక్ మార్కెట్లలో డబ్బు మదుపు చేస్తున్నారు. ఈ కారణం వల్లనే స్టాక్ మార్కెట్లలో అపరిమిత దూకుడు నమోదైంది. కానీ లాభాలు మాత్రం అంతగా ఏమీ లేవు" అని ఆయన అన్నారు.
మున్ముందు ఏదో ఒక రోజున ఈ స్టాక్ మార్కెట్లు ధడేల్మని కుప్పగూలిపోయినా ఆశ్చర్యం లేదని ఆయన అంచనా. దీంతో దేశంలో వ్యాపార వర్గాలు భారీ నష్టాన్ని చవి చూడాల్సి రావొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
పెట్టుబడుల్లో తగ్గుదల
దేశంలో పెట్టుబడి మదుపులు తగ్గిపోయాయి. ఇది కూడా ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న ఒక ముఖ్యమైన సవాలే. దీనిపై ప్రొఫెసర్ అరుణ్ కుమార్ ఇలా అన్నారు - "మన ఆర్థికవ్యవస్థలో ఇన్వెస్ట్‌మెంట్ చాలా తక్కువగా జరిగింది. 2007-08లో జీడీపీలో 38 శాతంగా ఉన్న ఇన్వెస్ట్‌మెంట్ ఇప్పుడు దాదాపు 27 శాతానికి తగ్గిపోయింది."
"అందుకే దీర్ఘకాలంలో జరిగే అభివృద్ధి తగ్గిపోయింది. కాబట్టి ఆర్థికవ్యవస్థలో పెట్టుబడుల్ని ఎలా పెంచాలో ప్రభుత్వం ఆలోచించాల్సి ఉంది."

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలో కార్పొరేట్ పన్ను తగ్గింపు
అరుణ్ కుమార్ అభిప్రాయం ప్రకారం, అమెరికా తన కార్పొరేట్ పన్నును 35 శాతం నుంచి 21 శాతానికి తగ్గించడం కూడా ప్రస్తుత బడ్జెట్ సందర్భంలో ప్రభుత్వానికి ఒక సవాలు వంటిదే.
"అమెరికాలో కార్పొరేట్ పన్ను తగ్గిపోవడంతో పెట్టుబడి దేశంలోంచి బయటికి తరలిపోయే ప్రమాదం ఉంది. గత రెండేళ్లలో ఎఫ్‌డీఐల రూపంలో వచ్చిన పెట్టుబడులపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది. దీని ప్రతికూల ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడే అవకాశం ఉంది" అని ఆయనంటారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ సవాళ్లను ఎదుర్కొనేదెలా?
సాధారణంగా బడ్జెట్‌లో చాలా పథకాలు ప్రకటిస్తుంటారు కానీ అవన్నీ తప్పనిసరిగా అమలవుతాయని ఏమీ లేదని ప్రొ. అరుణ్ కుమార్ అంటారు.
"బడ్జెట్ ప్రవేశపెట్టినపుడు అందులో జీడీపీలో 10 నుంచి 11 శాతం ఖర్చు చేస్తారు. అది దాదాపు 18 నుంచి 20 లక్షల కోట్లు ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ప్రతి రంగానికీ ఎంతో కొంత ఇవ్వడానికి తప్పక ప్రయత్నిస్తుంది. పైగా వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగాల్సి ఉంది కూడా. కాబట్టి ఈ బడ్జెట్ ద్వారా రాజకీయ లబ్ధిని పొందాలని ప్రభుత్వం తప్పక ప్రయత్నిస్తుంది. కానీ ప్రస్తుతం పన్నుల సమస్య ఉంది కాబట్టి ప్రభుత్వం కావాలనుకున్నా ఎక్కువ ఖర్చు చేయలేదు" అని ఆయన చెప్పారు.
"అట్లాగే ద్రవ్య లోటు పెరిగిపోవడాన్ని కూడా ప్రభుత్వం అసలే కోరుకోదు. ఎందుకంటే దాని వల్ల మూడీస్ రేటింగ్ ప్రభావితమవుతుంది. ఈ నేపథ్యంలో, పథకాలనైతే ప్రకటించవచ్చు కానీ బడ్జెట్‌లో అంత డబ్బు ఉండదు కాబట్టి వాటితో ఎంత ప్రయోజనం జరుగుతుందనేది చెప్పలేం."

ఫొటో సోర్స్, Getty Images
మరోవైపు, రైతుల పరిస్థితులు మెరుగు పడాలంటే ప్రభుత్వం మూడు చర్యలు చేపట్టాల్సి ఉంటుందని దేవేంద్ర శర్మ అంటున్నారు. "రైతుల ఆదాయం పెంచడం కోసం ఉన్న 'కమిషన్ ఫర్ ఎగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్' - ఇది రైతులకు కనీస మద్దతు ధరలను నిర్ణయిస్తుంది - పేరు, బాధ్యతలు మారాలి. దాని పేరును 'కమిషన్ ఫర్ ఫార్మర్ ఇన్‌కమ్ అండ్ వెల్ఫేర్'గా మార్చాలి. ప్రతి రైతు కుటుంబానికి నెలకు 18 వేల రూపాయల ఆదాయం సమకూరేలా ఇది బాధ్యత తీసుకోవాలి."
"తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినట్టుగా రైతులకు 8 వేల రూపాయలు నేరుగా అందించే పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలి.''
"మన దగ్గర మార్కెటింగ్ అతి పెద్ద సమస్యగా ఉంది. దేశంలో 42 వేల మార్కెట్ల అవసరం ఉంది. కానీ ఏపీఎంసీ (ఎగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ)కి చెందిన మార్కెట్లు 7,200 మాత్రమే ఉన్నాయి. ఈ బడ్జెట్‌లో మార్కెట్ల సంఖ్యను 20 వేలకు పెంచాలి. అప్పుడే రైతులు తాము పండించిన ధాన్యాన్ని మెరుగ్గా అమ్ముకోగలుగుతారు."
(బీబీసీ ప్రతినిధి సందీప్ సోనీతో జరిగిన సంభాషణల ఆధారంగా)
ఇవి కూడా చదవండి:
- #BudgetWithBBC: బడ్జెట్‌కు ముందు మీకోసం కొన్ని కథనాలు
- జీఎస్టీలో మార్పుల మతలబు?
- బడ్జెట్ సమావేశాలు సాఫీగా సాగేనా?
- ఆర్థిక సర్వే 2017-18: పది ముఖ్యాంశాలు
- రూపాయి నోటుకు వందేళ్లు
- రూపాయికి ఏమేం కొనొచ్చో చూడండి
- పెద్ద నోట్ల రద్దు: ఆర్థిక రంగాన్ని దెబ్బతీసిన మోదీ జూదం
- 'ఆర్థిక వ్యవస్థలో వెలుగు కంటికి కనిపించదా?'
- ఈ ఏడాది మోదీ ఏం చేయబోతున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








