కొత్త సంవత్సరం గురించి 2017 ఆర్థిక పరిస్థితి ఏం చెప్తోంది?

ఫొటో సోర్స్, Getty Images
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆర్థిక రంగంలో కఠినమైన సంవత్సరంగా 2017 నిలిచింది. 2018 సంవత్సరం ఎలా ఉండబోతోందో అంచనా వేయడానికి బీబీసీ ప్రతినిధి సమీర్ హష్మీ పాత సంవత్సరంలో కీలక ఆర్థిక పరిణామాలను విశ్లేషిస్తున్నారు.
కేవలం ఏడాది కిందట.. భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన వృద్ధి చోదకశక్తిగా పురోగమించే పథంలో నిలకడగా పయనిస్తున్నట్లు కనిపించింది. 2016లో ప్రపంచంలో అత్యధిక వేగంతో వృద్ధి చెందుతున్న ఆర్థికశక్తిగా భారత్ నిలిచింది. ఆ విషయంలో.. ఆర్థిక మందగమనం చవిచూస్తున్న చైనాను అధిగమించి ప్రధమ స్థానంలో నిలిచింది.
మందకొడిగా ఉన్న ప్రపంచ ఆర్థిక రంగంలో వెలుగు దివ్వె ఇండియా అని కీర్తించారు. కానీ 2017లో కథ మారిపోయింది. భారత పురోగమన వేగం మందగించింది.
2016లో జనవరి నుంచి డిసెంబర్ మధ్య.. అంతకు ముందలి సంవత్సరంతో పోలిస్తే ప్రతి త్రైమాసికంలోనూ భారత్ 7 శాతం పైగా వృద్ధి రేటు నమోదు చేసింది. ఒక త్రైమాసికంలో 7.9 శాతం వృద్ధి రేటును కూడా చేరింది.
కానీ మరుసటి ఏడాది త్రైమాసికంలో - 2017 ఏప్రిల్-జూన్ మధ్య - వృద్ధి రేటు 5.7 శాతానికి పడిపోయింది. ఇది మూడేళ్లలో అతి తక్కువ వృద్ధి రేటు.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన రెండు ప్రధాన నిర్ణయాలు 2017లో తీవ్ర ప్రభావం చూపాయి. వాటిలో మొదటిది.. దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లలో దాదాపు 86 శాతం నోట్లను 2016 నవంబర్‌లో అకస్మాత్తుగా రద్దు చేయటం. దీని ప్రభావం 2017లోనూ కొనసాగింది.
రెండో నిర్ణయం.. స్వాతంత్ర్యం తర్వాత దేశ పన్ను విధానంలో సమూల మార్పులు - ఎన్నో రకాల కేంద్ర, రాష్ట్ర పన్నుల స్థానంలో ఒకే వస్తువులు, సేవల పన్ను (జీఎస్‌టీ)ని 2017 జూన్‌లో ప్రవేశపెట్టటం.
2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా గల భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ప్రభుత్వానికి 2017 ఇబ్బందికర పరిస్థితులను కల్పించటమే కాదు.. కొన్ని ఘనమైన విజయాలనూ అందించింది. ప్రపంచ బ్యాంకు ‘‘సులభ వ్యాపారం’’ సూచికలో భారతదేశం ఏకంగా 30 పాయింట్లు పెంచుకుని మొదటి 100 దేశాల జాబితాలో చేరటం అందులో ఒకటి.
ఇక ప్రపంచ క్రెడిట్ రేటింగ్ సంస్థ మూడీస్.. భారతదేశ క్రెడిట్ రేటింగ్‌ను 2004 తర్వాత మొదటిసారిగా పెంచటం రెండో విజయం.
ప్రపంచంలో మంచి ఫలితాలు సాధిస్తున్న స్టాక్ మార్కెట్లలో భారత స్టాక్ మార్కెట్లు కూడా ఉన్నాయి. ఇవి ఏటా 30 శాతం పైగా పెరుగాయి.
ఇక.. పెరిగిపోతున్న చెడు రుణాలు, నిరర్థక ఆస్తులతో సతమతమవుతున్న భారత ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం 3,200 కోట్ల సహాయ ప్రణాళికను కూడా ప్రకటించింది.
అయినా.. మొత్తం మీద 2017 చాలా కఠిన సంవత్సరమే. 2018 లోనూ మోదీ చాలా సవాళ్లను ఎదుర్కోనున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వృద్ధి రేటును వేగవంతం చేయటం
ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయటం 2018లో కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. వృద్ధి రేటు కోలుకోవటం నెమ్మదిగానే ఉంటుందని చాలా మంది విశ్లేషకులు అంచనా వేస్తున్నప్పటికీ.. 2017 కన్నా కొత్త సంవత్సరం మెరుగుగా ఉంటుందన్న అంశంపై ఏకాభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
‘‘నోట్ల రద్దు, జీఎస్‌టీ ఇచ్చిన కుదుపులు సహజంగానే సర్దుకుంటాయి కాబట్టి (వృద్ధి) కోలుకుంటుంది’’ అని జేపీ మోర్గన్ సంస్థలో చీఫ్ ఏసియా ఎకానమిస్ట్ సాజిద్ చినాయ్ చెప్తున్నారు.
జీఎస్‌టీ అమలును సరిదిద్దటానికి ప్రభుత్వం గత కొన్ని నెలల్లో పలు మార్పులు ప్రకటించింది. పన్ను టారిఫ్ అధికంగా ఉందన్న విమర్శలు రావటంతో 178 వస్తువులు, సేవల జీఎస్‌టీ రేట్లను కూడా సర్కారు సవరించింది.
‘‘జీఎస్‌టీ రావటం వల్ల 2017 సంవత్సరం సంధి కాలంగా ఉండింది. రాబోయే కొన్నేళ్ల పాటు మరింత సుస్థిర వృద్ధికి ఈ పునాదులు అవసరం’’ అని భారత రేటింగ్స్ సంస్థ కేర్ రేటింగ్స్‌లో చీఫ్ ఎకానమిస్ట్ మదన్ సబ్నవీస్ పేర్కొన్నారు.
రాబోయే ఆర్థిక సంవత్సరం (2018 ఏప్రిల్ - 2017 మార్చి)లో భారత ఆర్థిక రంగం 7.4 శాతం రేటుతో వృద్ధి చెందుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్) అంచనా వేస్తోంది. ఆ వృద్ధి రేటు 7.7 శాతంగా ఉంటుందని ఇదే ఐఎంఎఫ్ గతంలో ముందు పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
ఉపాధి రహిత వృద్ధి
కొత్త సంవత్సరంలో ఆర్థిక వృద్ధి అంచనాలు ఉజ్వలంగా కనిపిస్తున్నప్పటికీ.. ఉద్యోగాలు సృష్టించటమనేది ప్రభుత్వానికి ఎదురయ్యే అతి పెద్ద అవరోధంగా ఉంటుంది.
జనాభా రీత్యా ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశమైన భారతదేశం.. తన యువ కార్మిక శక్తిని ఇముడ్చుకోవాలంటే ఏటా 1.20 కోట్ల ఉద్యోగాలు సృష్టించాల్సి ఉంటుంది.
అయితే.. 2016 నవంబర్‌లో చేసిన నోట్ల రద్దు దెబ్బకు కుదేలైన చిన్న వ్యాపారాలపై జీఎస్‌టీ అమలుతో మరోసారి గట్టి దెబ్బతిన్నాయి. వాటిలో చాలా వ్యాపారాలు మూతపడ్డాయి. ఫలితంగా లక్షలాది మంది.. ప్రత్యేకించి అసంఘటిత రంగంలోని వారు ఉద్యోగాలు కోల్పోయారు.
దేశంలో వ్యవసాయం, నిర్మాణ రంగం, చిన్న పరిశ్రమలు అతిపెద్ద ఉద్యోగ రంగాలు. ఎందుకంటే కార్మిక శక్తి ఎక్కువ అవసరమైన రంగాలవి. కానీ ఈ మూడు రంగాలూ ఇటీవలి సంవత్సరాల్లో ఉద్యోగాలు సృష్టించలేకపోతున్నాయి.

ఫొటో సోర్స్, Reuters
మోదీ ఆర్థిక ప్రగతి ట్రాక్ రికార్డులో ఉద్యోగ కల్పన అనేది ప్రస్ఫుటమైన లోపంగా ఉంటుంది.
ఇది ఆర్థికవ్యవస్థకు దీర్ఘకాలిక సమస్య అని చాలా మంది నిపుణులు అంగీకరిస్తున్నప్పటికీ.. 2019లో జరగబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కొత్త సంవత్సరం 2018లో కొన్ని చర్యలు చేపడుతుందని వారు అంచనా వేస్తున్నారు.
‘‘చిన్న వ్యాపారాలు, వ్యవసాయం, నిర్మాణం వంటి రంగాలకు ప్రభుత్వం కొంత ప్రోత్సాహాన్ని అందిస్తుందని.. తద్వారా కొంత ఉపాధి కల్పన జరుగుతుందని మా అంచనా’’ అని చినాయ్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పెరుగుతున్న చమురు ధరలు, ద్రవ్యోల్బణం
ముడి చమురు ధరలు పెరుగుతుండటం, ప్రైవేటు పెట్టుబడులు తక్కువ స్థాయిల్లో ఉండటం ఇతర ప్రధాన సవాళ్లని ముంబైకి చెందిన బ్రోకరేజ్ సంస్థ ఏంజెల్ బ్రోకింగ్స్ వైస్ ప్రెసిడెంట్ మయూరేష్ జోషి అభిప్రాయపడ్డారు.
పెరుగుతున్న చమురు ధరలు ప్రభుత్వ ఆదాయంపై ప్రభావం చూపుతుందని ఆయన చెప్తున్నారు. అలాగే.. రిజర్వ్ బ్యాంక్ లక్ష్యమైన 4 శాతం పరిధిలోనే గత ఏడాది స్థిరంగా ఉన్న ద్రవ్యోల్బణం పెరగటానికి కూడా అధిక చమురు ధరలు దారితీస్తాయని పేర్కొన్నారు.
దేశంలో అంతర్గత డిమాండ్‌ను తీర్చటం కోసం భారత్ 70 శాతం పైగా చమురును దిగుమతి చేసుకుంటోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందు రెండు మార్గాలున్నాయి - చమురు ఉత్పత్తుల రిటైల్ ధరలను పెంచటం.. లేదా పెరిగిన ధరలను స్వయంగా భరించటం.
‘‘ఎన్నికలు ఇక కేవలం ఏడాది దూరంలో ఉండగా.. పెరిగే ముడి చమురు ధరలను పూర్తిగా వినియోగదారులపైకి మళ్లించటానికి ప్రభుత్వం సుముఖంగా ఉండకపోవచ్చు. అలా చేస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది’’ అని సబ్నవీస్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
వ్యవసాయ సంక్షోభం
2017లో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రైతుల నిరసనలు పెరిగాయి. గత కొన్నేళ్లుగా అస్థిర ప్రగతి కారణంగా సాగు ఆదాయాలు పడిపోతూ వ్యవసాయ రంగం సతమతమవుతోంది.
దేశ జనాభాలో సగం మందికి పైగా ఆదాయం కోసం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. లక్షలాది మంది రైతులు తమ రుణాలను తిరిగి చెల్లించలేకపోవటంతో సంక్షోభం తలెత్తింది.
ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాలు రైతులకు రుణ మాఫీ పథకాలు ప్రకటించాయి. కానీ వాటి అమలుకు సంబంధించి పలు సమస్యలు ఉన్నాయి.
‘‘మోదీ ప్రభుత్వం నిజంగా చేయగలిగిది పెద్దగా ఏం లేదు. ఎందుకంటే వ్యవసాయం రాష్ట్ర అంశం. దానిని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలే పరిష్కరించాల్సి ఉంటుంది. కానీ ఈ అంశం (కేంద్ర) ప్రభుత్వానికి సమస్య సృష్టిస్తుందనేది వాస్తవం’’ అంటారు సబ్నవీస్.
2018లో ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. వాటిలో నాలుగు రాష్ట్రాల్లో గ్రామీణ జనాభా భారీగా ఉంటుంది.
ఆ ఎనిమిది రాష్ట్రాల్లో మూడు చోట్ల భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించకపోతే.. ఎన్నికల్లో అధికార పార్టీ అవకాశాలను దెబ్బతీయగలదని నిపుణులు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
2018లో సంస్కరణలు ఉండవా?
అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కీలక ఆర్థిక సంస్కరణలు అమలు చేశారన్న పేరు మోదీకి లభించింది.
అయితే 2017లో ఆర్థిక వృద్ధి రేటు పడిపోవటం, 2019లో పార్లమెంటు ఎన్నికలు రానున్న నేపథ్యంలో.. కొత్త సంవత్సరంలో పెద్ద సంస్కరణల అమలు విషయంలో మోదీ ఆచితూచి వ్యవహరిస్తారని పరిశీలకులు భావిస్తున్నారు.
‘‘ప్రభుత్వం గత 40 నెలల కాలంలో తీసుకువచ్చిన సంస్కరణలన్నిటినీ బలోపేతం చేయాల్సిన అవసరముంటుంది. అవి సక్రమంగా అమలయ్యేలా చూడాల్సిన అవసరముంటుంది. మరిన్ని సంస్కకరణల అవసరం లేదు’’ అని జోషి విశ్లేషించారు.
గ్రామీణ భారతం లక్ష్యంగా సామాజిక సంక్షేమ పథకాలపై ప్రభుత్వం వ్యయం పెంచుతుందని నిపుణుల అభిప్రాయం.
మోదీకి 2018 నిర్ణయాత్మక సంవత్సరమవుతుంది. ఆర్థిక వ్యవస్థను ఆయన ప్రభుత్వం నిర్వహించే తీరు 2019లో మోదీ ఎన్నికల ఫలితాలపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








