బడ్జెట్ నిరాశాజనకం.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎంపీల అసంతృప్తి

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వ చిహ్నాలు

ఫొటో సోర్స్, Govt of AP/Telangana

కేంద్ర బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు సుజనా చౌదరి అన్నారు.

ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన చివరి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదేనని, వచ్చే ఏడాది ప్రవేశపెట్టబోయేది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని ఆయన గుర్తు చేశారు.

ప్రజలంతా కూడా ఈ బడ్జెట్ పట్ల నిరాశ వ్యక్తం చేస్తున్నారని, తమ ఎంపీలందరిదీ కూడా ఇదే అభిప్రాయం అన్నారు.

ఇప్పటి వరకూ రాష్ట్రంలో పెట్టిన కేంద్రీయ విద్యా సంస్థల నిర్మాణంలో పురోగతి చూపించకపోవటం కూడా నిరాశాజనకంగా ఉందన్నారు. పోలవరం గురించి బడ్జెట్‌లో ప్రస్తావించి ఉండాల్సిందన్నారు.

కర్నాటక, మహారాష్ట్రల వంటి పలు రాష్ట్రాల్లో రైల్వేలకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారని, ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, విజయవాడల్లో మెట్రోలు ఏర్పాటు చేస్తామన్న కేంద్రం ఆ రెండింటి గురించి కూడా బడ్జెట్‌లో ప్రస్తావించలేదన్నారు. రైల్వేలకు సంబంధించి చాలా చిన్నచిన్న పనులు మాత్రమే కనిపించాయన్నారు.

మిత్రపక్షంలో ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి సాధ్యాసాధ్యాలను చూసుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. బడ్జెట్‌లో పేర్కొనకపోయినా నిధులు ఇవ్వొచ్చునని సుజనా చౌదరి చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌కు రైల్వేజోన్‌ డిమాండ్‌ను తాము వదులుకోబోమని, ఎప్పటికైనా దాన్ని సాధించితీరుతామన్నారు.

  • బెంగళూరు మెట్రో, ముంబై మెట్రోలను ప్రస్తావించి, ఆంధ్రప్రదేశ్ మెట్రోల గురించి ఆర్థిక మంత్రి ప్రసంగంలో ప్రస్తావించకపోవటం ఇబ్బంది అని యనమల రామకృష్ణుడు అన్నారు. రాష్ట్రంలో ఎంఎస్ ఎంఈలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని, దీన్ని స్వాగతిస్తున్నామన్నారు. పెద్ద పరిశ్రమల కంటే మధ్యతరహా పరిశ్రమల్లోనే ఎక్కువ ఉపాధి కల్పన జరుగుతుందన్నారు.
  • ఆంధ్రప్రదేశ్‌కు మూడు నామాలు పెట్టిన బడ్జెట్ ఇదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. విశాఖపట్నంలో రైల్వేజోన్‌ వచ్చేకంటే ముందు తాడిపత్రికి విమానాశ్రయాల జోన్ వస్తుందని వ్యంగ్యంగా అన్నారు.
  • రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, దాన్ని సరిదిద్దకపోతే త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. నాలుగేళ్ల నుంచి ఏదైనా చేస్తారని ఎదురు చూశామని చెప్పారు. బెంగళూరు, అహ్మదాబాద్‌లపై చూపుతున్న ప్రేమ ఏపీపై చూపలేదన్నారు. ఈ అంశంపై శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, ఎంపీలతో భేటీ అవుతారని తెలిపారు.

కేటాయింపులతో సంబంధం లేదు - బీజేపీ

బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ.. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న ఐదు సంస్థలు మాత్రమే ఏపీకి రావాల్సి ఉన్నాయని, అవి కేంద్రీయ, గిరిజన విశ్వవిద్యాలయాలు, దుగరాజపట్నం పోర్టు, కడప ఉక్కు కర్మాగారం, విశాఖ పట్నం రైల్వేజోన్ అని తెలిపారు.

వీటిలో మొదటి రెండూ కేటాయించారని, మిగతా మూడింటినీ కూడా ఇస్తారన్నారు. రైల్వే జోన్ ఇచ్చే అంశం బడ్జెట్‌లో ప్రకటించేది కాదన్నారు. రైల్వే జోన్ సాధ్యాసాధ్యాలపై నియమించిన కమిటీ సానుకూలంగా నివేదిక ఇవ్వలేదని, అయినప్పటికీ కేంద్రం ఇవ్వబోమని చెప్పలేదన్నారు. జోన్ ఏర్పాటుపై రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు.

బడ్జెట్ విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి నష్టం లేదన్నారు. కేటాయింపులతో సంబంధం లేకుండా.. ప్రభుత్వ చిత్తశుద్ధి విషయంలో తనకెలాంటి అనుమానం లేదన్నారు.

ఏపీకి అన్యాయం - వైఎస్సార్‌సీపీ

కేంద్ర బడ్జెట్ పట్ల రాష్ట్ర ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ఏపీ, తెలంగాణ రాష్ట్రాల రైతులకు ఏమాత్రం సరిపోదన్నారు. ఆరోగ్య బీమా మినహా ఈ బడ్జెట్‌లో పేదలకు ఒరిగేది ఏమీ లేదన్నారు.

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని స్పష్టంగా తెలుస్తోందని విజయసాయి రెడ్డి అన్నారు.

స్పష్టత లేదు - టీఆర్ఎస్

టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నాయకుడు జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాల్లో ఉత్పత్తి అయ్యే వ్యవసాయ పంట అంతా కొనుగోలు చేస్తేనే కనీస మద్దతు ధర వల్ల రైతులకు మేలు జరుగుతుందన్నారు.

టీఆర్ఎస్ ఎంపీ కవిత మాట్లాడుతూ.. రైతులు పండించే పంటకు కనీస మద్దతు ధర వర్తింపజేస్తామని చెప్పటం సానుకూలాంశమని, అయితే దీనిపై స్పష్టత లేదన్నారు. రైతుల ఆదాయం ఎలా రెట్టింపు చేస్తారనేది వివరించలేదన్నారు. పేదలకు ఆరోగ్య బీమాపైన కూడా స్పష్టత రావాల్సి ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ నుంచి రూ.40 వేల కోట్లు కోరామని, అయితే ఇచ్చిందేమీ లేదన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)