బ్రెస్ట్ కేన్సర్: ఒక్క డోస్ రేడియో థెరపీ పూర్తి కోర్సుతో సమానం

breast cancer

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రాచెల్ స్కారార్
    • హోదా, హెల్త్ రిపోర్టర్

రొమ్ము కేన్సర్ చికిత్సలో కచ్చితమైన లక్ష్యంతో జరిపే ఒక్క డోస్ రేడయో థెరపీ కూడా పూర్తి కోర్సుతో సమానంగా పనిచేస్తుందని సుదీర్ఘ కాలంగా జరుపుతున్న ఓ అధ్యయనం వెల్లడించింది.

ఈ షార్ట్ టెర్మ్ చికిత్స తీసుకున్నవారు అనంతరం అయిదేళ్ల కాలంలో ఇతర కేన్సర్లు, హృద్రోగాలతో మరణించే అవకాశాలూ తక్కువేనని ఈ అధ్యయనం తేల్చింది.

అయితే, ఈ అధ్యయనంలో అనుసరించిన పద్ధతిపై కేన్సర్ నిపుణులు పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.

ఈ అధ్యయనంలో పాల్గొన్నవారిలో అయిదో వంతు మంది ఒక్క డోస్ కంటే ఎక్కువ రేడియోథెరపీ తీసుకున్నారు.

ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ జయంత్ వైద్య దీనిపై మాట్లాడుతూ.. మహిళలకు అదనపు రేడియోథెరపీ అవసరమని తాను అనుకున్నానని.. అయితే, 80 శాతం మంది మహిళలు షార్ట్ టెర్మ్ రేడియో థెరపీతో కూడా పెద్దగా దుష్ప్రభావాలేమీ లేకుండానే మంచి ఫలితాలు పొందుతున్నారని చెప్పారు.

రొమ్ములో కేన్సర్ కణితిని తొలగించిన వెంటనే టార్గెటెడ్ ఇంట్రా ఆపరేటివ్ రేడియో థెరపీ(TARGIT-IORT) ఇస్తారు. ఇది టార్గెటెడ్ సింగిల్ డోస్ థెరపీ.

టార్గెటెడ్ థెరపీ అంటే రొమ్ము లోపల కేన్సర్ కణితి ఉన్న ప్రదేశంలోకి చిన్న పరికరాన్ని పంపించి అందించే రేడియో థెరపీ. యూనివర్శిటీ కాలేజ్ లండన్ (యూసీఎల్) వైద్యులు ఈ విధానాన్ని అభివృద్ధి చేశారు.

రొమ్ములో కేన్సర్ కణితిని తొలగించే శస్త్రచికిత్స సమయంలోనే రోగులు ఈ టార్గెట్ రేడియో థెరపీ కూడా పొందొచ్చు.

రేడియేషన్ థెరపీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రేడియేషన్ థెరపీ

మామూలుగా అయితే 15 నుంచి 30 సార్లు రేడియో థెరపీ కోసం రావాల్సి ఉంటుంది. కానీ, ఈ టార్గెటెడ్ సింగిల్ డోస్ థెరపీ తీసుకున్నవారు మళ్లీ ఆసుపత్రికి రావాల్సిన అవసరం ఉండదు.

ప్రస్తుతం ఈ చికిత్సా విధానం ఎన్‌హెచ్‌ఎస్‌లో కొన్ని క్లినిక్‌లలో అందుబాటులో ఉంది.

కరోనా మహమ్మారి కారణంగా సాధారణ రేడియో థెరపీ చికిత్సల సంఖ్యను కూడా ఎన్‌హెచ్ఎస్ తగ్గించింది. సాధారణంగా 15 నుంచి 30 సార్లు చికిత్స కోసం ఆసుపత్రికి రావాల్సి ఉండగా దాన్ని 5కి తగ్గించారు.

TARGIT-A ప్రయోగాలను 2000 నుంచి 2012

సంవత్సరం మధ్య 10 దేశాలలో 2,298 మంది మహిళలపై చేశారు. వారిలో కొందరికి శస్త్రచికిత్స సమయంలో టార్గెట్ రేడియో థెరపీ ఇవ్వగా మరికొందరికి సాధారణ రేడియో థెరపీ ఇచ్చారు.

సుమారు పన్నెండేళ్ల పాటు జరిపిన ఈ అధ్యయనంలో చివరికి శస్త్రచికిత్స సమయంలో అందించే సింగిల్ డోస్ రేడియేషన్ థెరపీ సత్ఫలితాలు ఇచ్చినట్లు తేలింది.

చికిత్స తరువాత అయిదేళ్ల పాటు ఆయా మహిళల ఆరోగ్యాన్ని పర్యవేక్షించిన తరువాతే ఈ సింగిల్ డోస్ టార్గెటెడ్ రేడియో థెరపీ సత్ఫలితాలు ఇచ్చినట్లు గుర్తించినట్లు అధ్యయనకర్తలు వెల్లడించారు.

అంతేకాదు.. ఈ చికిత్స పొందినవారిలో గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు, ఇతర కేన్సర్ల కారణంగా మరణించినవారి సంఖ్య కూడా తక్కువేనని అధ్యయనం తేల్చింది.

ఈ తరహా చికిత్స పొందినవారిలో రేడియేషన్ కారణంగా నొప్పి, రొమ్ము ఆకృతిలో మార్పులు వంటి ఇతర దుష్ప్రభావాలు కూడా లేవని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ తెలిపింది.

మార్సెలీ బెర్న్‌స్టీన్

ఫొటో సోర్స్, jeff gilbert

ఫొటో క్యాప్షన్, మార్సెలీ బెర్న్‌స్టీన్

కేన్సర్ భయం లేకుండా..

ఎనిమిదేళ్ల కిందట రచయిత్రి మార్సెలీ బెర్న్‌స్టీన్ ఈ చికిత్స తీసుకున్నారు. అప్పటి నుంచి ఆమె ఎలాంటి అనారోగ్య సమస్య లేకుండా జీవితం గడుపుతున్నారు.

''నాకు కేన్సర్ ఉందని గుర్తించిన రెండు నెలల్లోనే కేన్సర్ నుంచి పూర్తిగా బయటపడ్డాను'' అన్నారామె.

కణితి ఉన్న ప్రాంతంలోనే చికిత్స చేసి మిగతా దేహానికి ఇబ్బందుల్లేకుండా చేయడం మంచి విధానమని ఆమె అభిప్రాయపడ్డారు.

ఆందోళనలు.. అభ్యంతరాలు

అయితే, ఈ అధ్యయనకర్తలు తమ పరిశోధనలో ఉపయోగించిన కొన్ని నిర్వచనాలపై ఇనిస్టిట్యూట్ ఆఫ్ కేన్సర్ రీసెర్చ్‌కు చెందిన జానీ హావిలాండ్ అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు.

''TARGIT-A ప్రయోగాలు జరుగుతున్నప్పటి నుంచి సంప్రదాయ రేడియేషన్ థెరపీలోనూ గణనీయమైన మార్పులొచ్చాయి. చికిత్స షెడ్యూల్స్ తగ్గడం, రొమ్ములో కొద్ది ప్రాంతానికే చికిత్స అందివ్వడం వంటి మార్పులొచ్చాయి'' అన్నారు.

యూకే కేన్సర్ రీసెర్చ్ సంస్థకు చెందిన మార్టిన్ లెడ్విక్ కూడా దీనిపై భిన్నాభిప్రాయం వ్యక్తంచేశారు. 'ఈ అధ్యయనంలో పాల్గొన్నవారిలో లంపెక్టమీ సమయంలోనే రేడియేషన్ థెరపీ తీసుకున్నారు. ఆపరేషన్ చేసేవరకు కూడా వారికి రేడియేషన్ థెరపీ ఎక్కువగా అవసరమో లేదో డాక్టర్లు కూడా చెప్పలేని పరిస్థితి. అంతేకాదు.. వీరిలో 20 శాతం మందికి సింగిల్ డోస్ థెరపీ పనిచేయక అదనంగా మరింత రేడియేషన్ థెరపీ తీసుకున్నారు'' అన్నారు మార్టిన్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)