ఇది ఒళ్లా... విల్లా?

క్రిస్టిన్ వాన్

ఫొటో సోర్స్, Facebook/ChristineVanLoo

క్రిస్టీన్ వాన్ లూ... ప్రపంచ ప్రఖ్యాత ఏరియలిస్ట్. పాల్ మెకార్టినీ, బ్రిట్నీ స్పియర్స్‌ వంటి పాప్ స్టార్స్‌తో కలిసి ప్రదర్శనలిచ్చారు. 19 ఏళ్ల వయసుకే అమెరికా జాతీయ ఆక్రో జిమ్నాస్టిక్స్ క్రీడల్లో ఏడు సార్లు విజేతగా నిలిచారు. టీనేజర్‌గా ఆమె దశాబ్దపు అథ్లెట్‌గా గుర్తింపు పొందారు. ఒలింపిక్ ఉత్తమ మహిళా అథ్లెట్‌గా గౌరవాన్ని దక్కించుకున్నారు. ఇన్ని విజయాల తరువాత 27 ఏళ్ళ వయసులో ఏరియలిస్ట్ కావాలన్న కలను అద్భుతంగా నిజం చేసుకున్న ఈ 48 ఏళ్ళ కళాకారిణి తన విజయగాథను వివరిస్తున్నారిలా.

విస్మయం కలిగించే వాన్ లూ విన్యాసాల కోసం ఈ వీడియో చూడండి.

వీడియో క్యాప్షన్, టీనేజిలోనే ప్రపంచ ప్రఖ్యాత అథ్లెట్, 27 ఏళ్ళకు ఎదురులేని ఏరియలిస్ట్

'ఇరవై ఏడేళ్ళ వయసులో ప్రొఫెషనల్ ఏరియలిస్ట్ కావాలనుకున్నాను. మొదట్లో వయసు ఎక్కువేమోనని సందేహించాను. ఇప్పుడు నాకు 48 ఏళ్లు. ఇప్పటికీ, నాకేదో వయసు అయిపోయిందని అనుకోవడం లేదు' అంటారు వాన్.

ఏరియలిస్ట్‌గా ఆమె పాప్ స్టార్స్ పాల్ మెకార్టీ, రికీ మార్టిన్, ఏరోస్మిత్‌లతో కలిసి ప్రదర్శనలు ఇచ్చారు. బ్రిట్నీ స్పియర్స్ వరల్డ్ టూర్‌కు కొరియోగ్రఫర్‌గా పని చేశారు.

'అథ్లెట్‌గా మొదలై ఏరియలిస్ట్‌గా మారిన నేను, ఆ ప్రయాణంలో ఎదురైన కష్టాలకు అలవాటుపడటం నేర్చుకున్నాను.

మొదటిసారి ఎలాగోలా తాడు మొత్తం ఎకబాకగలిగాను. అప్పటికే, ఒంట్లో సత్తువ అయిపోయింది. కిందకు నెమ్మదిగా దిగలేకు సర్రున జారిపోయాను.

ఆ వేగవంతమైన రాపిడికి నా అరిచేతులు బొబ్బలెక్కాయి. వేళ్లు కోసుకుపోయాయి. దాంతో, ఏరియలిస్ట్ గా నా ప్రయాణం మొదటి అడుగుతోనే ముగిసిపోతుందేమో అనిపించింది. నేను ఓడిపోయాను. ఇంటికి వెళ్లేందుకు సిద్ధపడ్డాను.

క్రిస్టిన్ వాన్

బయటకు వెళ్లేముందు ఒకసారి అద్దంలో నన్ను నేను చూసుకున్నాను. 'అసలు నీకు ఏం కావాలి?' అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను.

నేను ఎగరాలి... అనే సమాధానం నా గుండె లోతుల్లో నుంచి చిన్నగా వినిపించింది. అప్పుడు... ఆ క్షణాన నిర్ణయించుకున్నాను, కష్టాలను తట్టుకోవాలని. బాధలను ఓర్చుకోవాలని.

రెండోసారి తాడు పట్టుకొని ఎక్కడంపైనే పూర్తిగా దృష్టి పెట్టాను. గాయపడిన చేతులతో, కోసుకుపోయిన వేళ్లతో ఎక్కడం అంత సులభం కాదు.

చీరుకుపోయిన చేతులతో 30 అడుగుల తాడును ఎక్కడానికి నరకయాతన పడాలి. గాయాల తిరగబెట్టిన ప్రతిసారీ వాటిని బ్యాండేజీలతో కట్టేశాను. నొప్పిని పట్టించుకోవడం మానేశాను. నా లక్ష్యం మీద మాత్రమే దృష్టి పెట్టాను.

ఆ కష్టానికి ఫలితంగానే నేడు నేనుఈ స్థాయిలో ఉన్నాను' అంటూ తాను ప్రపంచ చాంపియన్‌గా మారిన విధానాన్ని వివరించారు వాన్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)