వనజీవి రామయ్య: ఒకప్పుడు ఆయన్ను పిచ్చోడన్నారు.. ఇప్పుడు తెలంగాణ స్కూళ్లలో ఆయన జీవితంపై పాఠాలు చెబుతున్నారు
తెలంగాణకు చెందిన దరిపల్లి రామయ్య.. కోటి మొక్కలు నాటడంతో వనజీవి రామయ్యగా మారిపోయారు.
వృక్షాల ప్రాధాన్యం తెలిపే బోర్డులను తాను అలంకరించుకొని నిత్యం పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతూ ఉంటారు.
50 ఏళ్లుగా అలుపెరగకుండా విత్తనాలు చల్లుతూ మొక్కలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.
''ఎక్కడైనా రోడ్డు వెంట కానీ రైతు పొలంలో కానీ ఒక చెట్టుంటే దీన్ని నరకాలి అని ఆలోచించే వాళ్లేగానీ.. చెట్లు నాటాలనే జనం లేరు. చెట్లను కొడితే వర్షాలురావు, పవనాలు కరువైతాయి అనేది గమనించలేక పోతున్నారు. అందుకనే ప్రజల వద్దకు ఈ కార్యక్రమం తీసుకుపోవాలని మొదలుపెట్టినా'' అని ఆయన చెప్తారు.
వేసవిలో విత్తనాలు సేకరించి తొలకరి రాగానే వాటిని ఆయా ప్రాంతాల్లో చల్లేందుకు సిద్ధమవుతారు.
రోడ్డుకు ఇరుపక్కలనే కాకుండా ఏదైనా ఖాళీ స్థలం కనిపించినా, గుట్టలపైనా ఈ వనజీవి విత్తనాలు చల్లి పర్యావరణ సమతుల్యతకు దోహదపడుతూ ఉంటారు.
వనజీవి సేవను గుర్తించి ఎన్నో అవార్డులు వరించాయి. 'యూనివర్సల్ గ్లోబల్ పీస్' గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.
ఆయన సామాజిక సేవను గుర్తించి 2017లో పద్మశ్రీతో భారత ప్రభుత్వం గౌరవించింది.
''పద్మశ్రీ పురస్కారం ఇవ్వటం ద్వారా.. నేను మొక్కలు నాటుతుంటే నవ్వినవాళ్లకి నాణ్యమైన సందేశం అందించింది మన భారత ప్రభత్వం. వాళ్ళు నవ్వకుండా నమస్తే పెడుతున్నారు. 'ఈయన ఇందిరాగాంధీనా, రాజీవ్‌గాంధీనా ఊరు ఊరు తిరిగి మొక్కలు నాటుతున్నాడు' అని నవ్విండ్రు. 'రోడ్లెమ్మటి ఏస్తే ఈయనకు ఏమొస్తది అసలు బుర్ర పనిచేస్తలేదు' అని అన్నారు'' అని తను ఎదుర్కొన్న పరిస్థితులను వివరించారు రామయ్య.
ఆయన దాదాపు 120 రకాల మొక్కల చరిత్రను తేలిగ్గా చెప్పగలరు.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆరో తరగతిలో వనజీవి గురించి పాఠ్యాంశంలో చేర్చింది.
రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్.. నా గురించి పిల్లలకి పాఠ్యంశంగా పెట్టటం సంతోషంగా ఉందని స్పందించారాయన.
కెన్యాకి చెందిన వంగాయి మాతాయిని స్ఫూర్తిగా తీసుకుని మూడు కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నారు.
''అందరూ ఎన్నో తరగతులు చదివితే ఇప్పుడు నేను 70వ తరగతి చదువుతున్నా.. ప్రతి సంవత్సరం ఒక తరగతే నాకు, జీవితమే ఒక పాఠశాల'' అని చెప్తారు.
రిపోర్టర్: రాజేష్ పెదమళ్ల
షూట్: సతీశ్
ప్రొడ్యూసర్ అండ్ ఎడిట్: సంగీతం ప్రభాకర్
ఇవి కూడా చదవండి:
- చెన్నై వాటర్‌మ్యాన్: ఆయన నల్లా తీసుకోరు... నీళ్ళు కొనుక్కోరు
- ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ముగ్గురూ చీఫ్ సెక్రటరీలు అయ్యారు
- డాక్టర్ మయిల్‌స్వామి అన్నాదురై: పశువుల కొట్టం నుంచి అంతరిక్ష పరిశోధనల దాకా...
- 'నా పాపను బయోవేస్ట్ అన్నారు. ఆ మాటకు నా గుండె పగిలింది‘
- వీనస్ విలియమ్స్‌ను ఓడించిన ఈ 15 ఏళ్ల అమ్మాయి ఎవరు...
- సెరెనా విలియమ్స్‌ను ఓడించి తొలి వింబుల్డన్ టైటిల్ గెల్చుకున్న సిమోనా హాలెప్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
