పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్ : 30 ఏళ్ల పాత రికార్డును పాకిస్తాన్ రిపీట్ చేస్తుందా? ప్రపంచకప్ గెలిచి బాబర్ పాక్ ప్రధాని అవుతాడా?

పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం, ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్

ఫొటో సోర్స్, ICC

    • రచయిత, అతిఫ్ నవాజ్
    • హోదా, క్రికెట్ కామెంటేటర్

‘1992 మే బీ యహీ హువా థా’... అంటే ‘1992లోనూ ఇలాగే జరిగింది.’

కొంత కాలం కిందట ట్విటర్‌లో పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు ట్రెండ్ చేసిన హాష్ ట్యాగ్ అది. కానీ టీ20 మెన్ వరల్డ్ కప్‌ గ్రూప్ దశలో పాకిస్తాన్ జట్టు పరిస్థితి వేరుగా ఉంది.

తొలి మ్యాచ్‌లో భారత్‌తో పోరాడినా గెలవలేదు. ర్యాంకింగ్స్‌లో అడుగున్న ఉన్న నెదర్లాండ్స్ జట్టు మీద ఓడిపోయింది.

దాంతో ‘1992 మే బీ యహీ హువా థా’ అనే మాట కాస్త ఫన్నీగా అనిపించింది.

కానీ 1992 వన్డే వరల్డ్ కప్‌లోనూ ఇలాగే జరిగింది. ఫైనల్‌లో ఇంగ్లండ్‌తో పోటీ పడే ముందు లీగ్ దశలో రెండు మ్యాచ్‌లో వరుసగా ఓడిపోయింది పాకిస్తాన్.

అవును...‘1992లోనూ ఇలాగే జరిగింది.’

1992 వరల్డ్ కప్: పాకిస్తాన్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్, భారత క్రికెటర్ సచిన్ తెందూల్కర్

ఫొటో సోర్స్, Getty Images

పోలికలు

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 మెన్ వరల్డ్ కప్‌కు, 1992 నాటి వన్డే వరల్డ్ కప్‌కు పాకిస్తాన్ విషయంలో చాలా పోలికలు కనిపిస్తున్నాయి.

టీ20 మెన్ వరల్డ్ కప్‌లో తొలి రెండు మ్యాచ్‌లు పాకిస్తాన్ ఓడిపోయింది. ఆ తరువాత మూడు మ్యాచ్‌లు వరుసగా గెలిచింది. నెదర్లాండ్స్ మీద దక్షిణాఫ్రికా ఓడిపోవడంతో గ్రూపు దశలోనే ఇంటికి వెళ్లాల్సిన పాకిస్తాన్ సెమీ ఫైనల్‌కు చేరుకుంది.

ఇప్పుడు ఇంగ్లండ్‌తో ఫైనల్లో పోటీ పడనుంది.

ఇక సెమీ ఫైనల్‌లో న్యూజీలాండ్‌ను ఢీ కొట్టింది పాకిస్తాన్. టాస్ ఓడిపోయినా మ్యాచ్ మాత్రం గెలుచుకుంది.

1992లోనూ సెమీ ఫైనల్లో న్యూజీలాండ్‌ను ఓడించి ఫైనల్‌కు వెళ్లింది పాకిస్తాన్. నాడు కూడా ఫైనల్ ప్రత్యర్థి ఇంగ్లండ్.

నాడు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ) వేదికగా ఇంగ్లండ్‌ను ఓడించి, పాకిస్తాన్ కప్‌ను గెలుచుకుంది.

నేడు కూడా అదే ఎంసీజీ వేదికగా ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య తుది సమరం జరగనుంది.

మళ్లీ అది జరుగుతుందా? కొన్ని గంటల్లో అది తేలి పోతుంది.

ఇంగ్లండ్ క్రికెటర్

ఫొటో సోర్స్, Getty Images

ప్రజల మనసులను కూడా గెలిచింది

ఇప్పటి వరకు పాకిస్తాన్ వన్డేలలో ఒక్కసారి మాత్రమే వరల్డ్ కప్ గెలిచింది. కానీ ఆ కప్‌, సగటు పాకిస్తానీలో క్రికెట్ మీద అమితమైన ప్రేమను పెంచింది.

1992లో ఇమ్రాన్ ఖాన్ బృందం గెలిచింది ఒక క్రిస్టల్ ట్రోఫీని మాత్రమే కాదు పాకిస్తాన్ ప్రజల మనసును కూడా. ఆ వరల్డ్ కప్ తెచ్చిన పాకిస్తాన్ జట్టు కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఆ తరువాత ఆ దేశానికి ప్రధాని అయ్యాడు.

ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తోపాటు ఇంజమామ్-ఉల్-హఖ్ దూకుడుగా ఆడటంతో పాకిస్తాన్ 50 ఓవర్లలో 249 పరుగులు చేసింది. ఆ తరువాత వసీం అక్రమ్, తన ఫాస్ట్ బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ను దెబ్బ మీద దెబ్బ కొట్టాడు.

చివరకు ఇంగ్లండ్ 227 పరుగులకే అన్ని వికెట్లు కోల్పోయింది. ఆ జ్ఞాపకాలను చాలా మంది క్రికెట్ అభిమానులు నేటికీ మరచిపోలేరు. ఆ అభిమానుల్లో నేను ఒకడిని. అప్పుడు నా వయసు ఏడేళ్లు.

పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు

ఫొటో సోర్స్, PA Media

దేశద్రోహం కాదు

బ్రిటన్‌లోనూ పాకిస్తాన్‌లోనూ క్రికెట్‌ అంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది. 1990లో బ్రిటన్‌కు వలస వచ్చిన వారి విధేయతను తెలుసుకునేందుకు ‘క్రికెట్ టెస్ట్’ అనే పదాన్ని తీసుకొచ్చారు కన్జర్వేటివ్ పార్టీకి చెందిన లార్డ్ టెబిట్. అంటే ఇంగ్లండ్ క్రికెట్ జట్టును వలసదారులు సపోర్ట్ చేస్తే వారికి విధేయత ఉన్నట్లు లెక్క.

బ్రిటన్‌లో జరిగే ప్రతి పాకిస్తాన్ మ్యాచులోనూ గ్రీన్ షర్ట్ వేసుకునే అభిమానులు ఎక్కువగా కనిపించే వారు. ఒకోసారి ఇంగ్లండ్ జట్టు అభిమానుల కంటే కూడా వారి సంఖ్య ఎక్కువగా ఉండేది.

అది ‘దేశద్రోహం’ అనేది కాకుండా బ్రిటన్‌లోని భిన్నత్వానికి ప్రతీకగా మిగిలిపోయింది.

పాకిస్తాన్‌కు చెందిన మా తల్లిదండ్రులకు నేను లండన్‌లో జన్మించాను. బీబీసీ టెస్ట్ మ్యాచ్ స్పెషల్ కామెంటేటర్‌గా ఇంగ్లండ్ క్రికెట్ జట్టుతో నా జీవితంలో ఎంతో కాలం గడిపాను. ఆ జట్టు అంటే నాకు చాలా ఇష్టం.

వారి ఆట తీరు మాత్రమే కాదు మా దేశానికి వారు ప్రతినిధులుగా వ్యవహరిస్తున్న తీరు కూడా నన్ను ఆకట్టుకుంటుంది. ఆ విషయంలో వారిని నేను ఆరాధిస్తాను కూడా.

కానీ నా ఫేవరెంట్ టీం అయితే ఇంగ్లండ్ కాదు. అది పాకిస్తాన్. నేటికీ నా మనసు ఏడేళ్ల వద్ద ఆగిపోయింది. ‘మెన్ ఇన్ గ్రీన్’ను హీరోలుగా చూస్తూ ఉంటుంది.

1992లో పాకిస్తాన్ జట్టు గురించి నాకు తెలియదు. వారు ఏం సాధించారో కూడా పూర్తిగా అర్థం చేసుకునే వయసు కాదు. దేశాలు అనే కాన్సెప్ట్ కూడా తెలియదు. కానీ నేను ఆ జట్టును ఇష్టపడ్డాను. ఆ రోజు సాయంత్రం ప్రపంచకప్‌ను సగర్వంగా ఎత్తి పట్టుకున్న పాకిస్తాన్ జట్టు ప్రేమలో చాలా మంది పాకిస్తానీలు పడిపోయారు.

1992 చరిత్రను మళ్లీ లిఖించేందుకు తుది సమరానికి పాకిస్తాన్ నేడు చేరుకుంది. 30 ఏళ్ల కిందట తమతో పోటీ పడిన ఇంగ్లండ్‌తో నేడు వారు మరొకసారి కప్‌ కోసం కుస్తీ పట్టనున్నారు.

ఇంగ్లండ్ క్రికెట్ జట్టు అంటే చాలా మంది పాకిస్తానీలు ఇష్టపడతారు. పాకిస్తాన్ సంతతి బ్రిటిష్ ప్రజల గురించి మాత్రమే నేను చెప్పడం లేదు. పాకిస్తాన్‌కు వెళ్లి అక్కడ ఆడిన ఇంగ్లండ్ జట్టు అంటే చాలా మంది పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు ప్రేమగా చూస్తారు.

ఇంగ్లండ్ జట్టు గెలవాలని వారు కోరుకుంటారు. వారికి మంచి జరగాలని ఆశిస్తారు. కానీ ఒక్క జట్టు మీద మాత్రం వారు గెలవకూడదని ప్రార్థిస్తారు. అదే పాకిస్తాన్.

చివరకు ‘1992 మే బీ యహీ హు థా’ అంటూ ఆనందిస్తుంటారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

బాబర్ ఆజం ప్రధాని అవుతాడా?

మరి టీ20 వరల్డ్ కప్‌-2022ను పాకిస్తాన్ గెలిస్తే ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం రానున్న రోజుల్లో పాకిస్తాన్ ప్రధాని అవుతాడా?

1992కు 2022కు మధ్య పోలికలు చూస్తున్న వారు ఈ ప్రశ్న సంధిస్తున్నారు.

ఎందుకంటే 1992లో వరల్డ్ కప్ గెలిచిన పాకిస్తాన్ జట్టు కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్, 2018లో ఆ దేశ ప్రధాని అయ్యారు. అంటే 26 ఏళ్ల తరువాత ఆ దేశ ప్రధాని పీఠం ఎక్కాడు ఇమ్రాన్ ఖాన్.

ఇప్పుడు కూడా పాకిస్తాన్ గెలిస్తే బాబర్ ఆజం కూడా 26 ఏళ్ల తరువాత ఆ దేశ ప్రధాని అవుతాడని సరదాగా అన్నారు భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్.

‘ఈ వరల్డ్ కప్ పాకిస్తాన్ గెలిస్తే... 2048లో బాబర్ ఆజం పాకిస్తాన్ ప్రధాని అవుతాడు’ అని స్టార్ స్పోర్ట్స్ కార్యక్రమంలో గావస్కర్ సరదాగా అన్నారు.

వీడియో క్యాప్షన్, బస్తర్ అడవుల్లో తీర్థగఢ్ జలపాత సోయగాల్ని ఎప్పుడైనా చూశారా?

ఇవి కూడా చదవండి: