కశ్మీర్: స్వయం ప్రతిపత్తి రద్దుపై శ్రీనగర్లో మహిళల నిరసన... ఫరూక్ అబ్దుల్లా సోదరిని, కుమార్తెను అదుపులోకి తీసుకున్న పోలీసులు

కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి రద్దుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన మహిళలు
ఫొటో క్యాప్షన్, కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి రద్దుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన మహిళలు
    • రచయిత, రియాజ్ మస్రూర్
    • హోదా, శ్రీనగర్ నుంచి బీబీసీ ప్రతినిధి

జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి రద్దు చేయడాన్ని, రాష్ట్రాన్ని విభజించి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ శ్రీనగర్లో మహిళలు ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. కశ్మీర్‌లో మానవ హక్కులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వీరిలో మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సోదరి ఖలీదా షా, కుమార్తె సారా అబ్దుల్లా తదితరులు ఉన్నారు.

నిరసనకారుల్లో దాదాపు 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దిల్లీకి చెందిన యాక్టివిస్టు సుశోభా భార్వే, జమ్మూకశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి బషీర్ ఖాన్ భార్య హవా బషీర్ కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఇతర నిరసనకారులతోపాటు పోలీసులు హవా బషీర్‌ను అదుపులోకి తీసుకొన్నారు.

శ్రీనగర్లోని వాణిజ్య కేంద్రమైన లాల్ చౌక్‌లో ప్రెస్ కాలనీకి సమీపాన నిరసనకారులు గుమికూడగానే మహిళా పోలీసుల బృందం రంగంలోకి దిగింది. "మహిళల పట్ల వాళ్లు ఎలా వ్యవహరిస్తున్నారో చూడండి. పైగా, పరిస్థితి సాధారణంగానే ఉందని చెబుతున్నారు. 'సాధారణం' అంటే ఇదేనా" అని ఫరూక్ అబ్దుల్లా సోదరి ఖలీదా షా ప్రశ్నించారు. తర్వాత పోలీసులు ఆమెను వ్యాన్ ఎక్కించారు.

కశ్మీర్

పోలీసుల చర్యపై ఖురాతుల్ అయిన్ అనే యాక్టివిస్టు మండిపడ్డారు. "మేం ఎన్నో బాధలు పడుతున్నాం. పరిస్థితి సాధారణంగా ఉందని, ఇది అభివృద్ధికి ప్రారంభమని ప్రభుత్వం చెబుతోంది" అని ఆమె ఆక్షేపించారు.

"కశ్మీరీ అమ్మాయిలు అమ్మకానికి లేరు", "దేశ ప్రజలకు అబద్ధాలు చెప్పడం ఆపండి" అనే నినాదాలున్న ప్లకార్డులను నిరసనకారులు ఈ ఆందోళనలో ప్రదర్శించారు.

ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మొహబూబా ముఫ్తీలతోపాటు షాజాద్ లోన్, షా ఫైజల్ తదితర రాజకీయ నాయకులు, కార్యకర్తలు 200 మందికి పైగా ఆగస్టు 5 నుంచి జైళ్లలో లేదా ఇళ్లలో నిర్బంధంలో ఉన్నారు.

జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగ అధికరణ 370ని సవరణ ద్వారా ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. పన్నులను విధించడం, చట్టాలను తీసుకురావడం, పౌరసత్వాన్ని నిర్వచించడం, ఇతర అంశాల్లో జమ్మూకశ్మీర్‌కున్న ప్రత్యేక అధికారాలను తొలగించింది.

శ్రీనగర్లో ఆందోళన

ఆర్టికల్ 370 సవరణకు ముందు దాదాపు ఆరు దశాబ్దాలు కశ్మీర్లో భూమి కొనడానికి, ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి, ఎన్నికల్లో పోటీచేయడానికి కశ్మీరీయేతరులకు అవకాశం లేదు.

జమ్మూకశ్మీర్ నుంచి సైనిక బలగాలను ఉపసంహరించాలని, నిర్బంధించినవారిని విడుదల చేయాలని ఆందోళన సందర్భంగా నిరసనకారులు డిమాండ్ చేశారు.

వారు ఆరు అంశాలతో ఒక ప్రకటన విడుదల చేశారు.

ఆర్టికల్ 370 సవరించడం, ఆర్టికల్ 35ఏను రద్దు చేయడం, జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను తొలగించి, దీనిని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం భారత ప్రభుత్వ ఏకపక్ష చర్యలని, వీటిని కశ్మీరీ మహిళలమైన తాము వ్యతిరేకిస్తున్నామని వారు ఈ ప్రకటనలో చెప్పారు.

తమకు భారత ప్రభుత్వం నమ్మకద్రోహం చేసిందని, అవమానించిందని వారు విమర్శించారు. కశ్మర్లో వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా తప్పుడు కథనాలు, తప్పుదోవ పట్టించే కథనాలను జాతీయ మీడియా అందిస్తోందని, దీనిని ఖండిస్తున్నామని చెప్పారు.

ముగ్గురు మాజీ సీఎంలు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ముగ్గురు మాజీ సీఎంలు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ సహా 200 మందికి పైగా రాజకీయ నాయకులు, కార్యకర్తలను జైళ్లలో లేదా ఇళ్లలో నిర్బంధంలో ఉంచారు.

సవరణకు ముందు ఆర్టికల్ 370 స్వరూపం

1947లో భారత్-పాకిస్తాన్ విభజన జరిగినపుడు జమ్ము-కశ్మీర్ రాజు హరిసింగ్ స్వతంత్రంగా ఉండాలని భావించారు. కానీ, తర్వాత ఆయన కొన్ని షరతులతో భారత్‌లో విలీనం అయ్యేందుకు సమ్మతించారు. తర్వాత భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 ఏర్పరిచారు. దీని ప్రకారం జమ్ము-కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పించారు. కానీ, అప్పట్లో ఆ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం ఉండాలని డిమాండ్ చేశారు. 1951లో ఆ రాష్ట్రాన్ని రాజ్యాంగ సభ నుంచి వేరుగా పిలవడానికి అనుమతించారు.

1956 నవంబర్‌లో రాష్ట్ర రాజ్యాంగం ఏర్పాటు పూర్తైంది. 1957 జనవరి 26న రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.

ఆర్టికల్ 370 ప్రకారం రక్షణ, విదేశాంగ విధానం, కమ్యూనికేషన్ అంశాల మినహా వేరే ఏ అంశానికి సంబంధించి చట్టం చేయాలన్నా, అమలు చేయాలన్నా కేంద్రం... రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి.

వీడియో క్యాప్షన్, కశ్మీర్: ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ శ్రీనగర్‌లో మహిళల నిరసన

ఈ ప్రత్యేక హోదా కారణంగా జమ్ము-కశ్మీర్ రాష్ట్రానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 అమలు చేయడం కుదరదు. దానివల్ల రాష్ట్రపతి దగ్గర రాష్ట్ర రాజ్యాంగాన్ని రద్దు చేసే హక్కు ఉండదు.

ఆర్టికల్ 370 కారణంగా జమ్ము-కశ్మీర్‌కు ప్రత్యేక జెండా కూడా ఉంటుంది. దాంతోపాటు జమ్ము-కశ్మీర్ అసెంబ్లీ కాలపరిమితి ఆరేళ్లు ఉంటుంది.

ఆర్టికల్ 370 వల్ల రాష్ట్రపతి జమ్ము-కశ్మీర్‌లో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించడం సాధ్యం కాదు.

ఈ అధికరణను కేంద్ర ప్రభుత్వం ఆగస్టులో పూర్తిస్థాయిలో సవరించింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)