ట్రంప్ అభిశంసన: ప్రతినిధుల సభలో తీర్మానం ఆమోదం, ఇప్పుడేం జరగొచ్చు

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మీద అభిశంసన విచారణను అధికారికంగా కొనసాగించటానికి అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు)లోని ప్రతినిధుల సభ తీర్మానం ఆమోదించింది.
ఈ విచారణ మరింతగా బహిరంగ దశలోకి రావటానికి ఈ తీర్మానం నాంది పలికింది. ఇది.. ట్రంప్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలా వద్దా అనే అంశం మీద జరిగిన ఓటింగ్ కాదు.
అభిశంసన ప్రక్రియకు ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ పట్టు ఉన్న ప్రతినిధుల సభలో మద్దతు లభిస్తుందా లేదా అన్నదానికి ఈ తీర్మానం తొలి పరీక్ష.
ఈ తీర్మానానికి వ్యతిరేకంగా రిపబ్లికన్ సభ్యులతో కలిసి కేవలం ఇద్దరు డెమొక్రటిక్ పార్టీ సభ్యులు మాత్రమే ఓటు వేశారు.
అభిశంసన ప్రక్రియను కొనసాగించాలంటూ చేసిన తీర్మానానికి అనుకూలంగా 232 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 196 ఓట్లు వచ్చాయి.
ఈ తీర్మానాన్ని అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఖండించింది.

ఫొటో సోర్స్, Reuters
పార్లమెంటు విచారణలో ట్రంప్ తరఫు న్యాయవాదులకు.. ఈ ప్రక్రియలో ఉండే హక్కులను కూడా ఈ తీర్మానంలో నిర్ణయించారు.
ట్రంప్ తన రాజకీయ ప్రత్యర్థి అయిన జో బిడెన్ మీద, ఆయన కుమారుడి మీద.. నిరాధార అవినీతి ఆరోపణల మీద దర్యాప్తు చేయలంటూ ఉక్రెయిన్ మీద ఒత్తిడి తేవటానికి ప్రయత్నించారన్నది ఆరోపణ. జో బిడెన్, ఆయన కుమారుడు ఉక్రెయిన్‌కు చెందిన బురిస్మా గ్యాస్ కంపెనీతో కలిసి పనిచేశారు.
తాను ఎలాంటి తప్పూ చేయలేదని ట్రంప్ ఈ ఆరోపణలను తిరస్కరించారు.
డెమొక్రాట్లు తమ విచారణను రహస్యంగా చేస్తున్నారని రిపబ్లికన్లు విమర్శించారు. ఆ విచారణలకు రిపబ్లికన్ పార్టీ ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ విచారణ బహిరంగ దశలోకి రావటానికి ముందుగా.. సాక్ష్యాలను సేకరించటానికి గోప్యంగా విచారణ అవసరమని డెమొక్రాట్లు ఉద్ఘాటించారు. తాము రహస్యంగా ఈ పనిచేస్తున్నామన్న ఆరోపణలను తిరస్కరించారు.

ఫొటో సోర్స్, Getty Images

చరిత్రాత్మక సంఘర్షణ జరగబోతోంది...
విశ్లేషణ: ఆంథోనీ జుర్కర్ - ఉత్తర అమెరికా రిపోర్టర్
ఈ అభిశంసన విచారణ మీద ప్రతినిధుల సభలో ఓటింగ్ నిర్వహించాలని అధికార రిపబ్లికన్ పార్టీ సభ్యులు కొన్ని వారాలుగా డెమొక్రాట్లను డిమాండ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ ఓటింగ్ పూర్తయింది.
అయితే.. అమెరికా రాజధాని వాషింగ్టన్ రాజకీయాల్లో దీనివల్ల వచ్చే మార్పు ఏదీ లేదు.
అభిశంసన ప్రక్రియ అన్యాయమని అంటున్న రిపబ్లికన్లు.. దీనికి అభ్యంతరం చెప్పటం కొనసాగిస్తారు. దీని ఫలితం ముందే నిర్ణయమైందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
డెమొక్రాట్లు ఈ విచారణ విషయంలో ముందుకు సాగుతారు. చివరికి బహిరంగ విచారణలు జరుగుతాయని.. అభిశంసన మీద ఓటింగ్ కూడా జరగవచ్చునని వారు భావిస్తున్నారు.
అలాగని.. గురువారం నాటి తీర్మానం అర్థరహితమని కాదు. 1998 తర్వాత మొట్టమొదటిసారిగా.. ఒక అధ్యక్షుడిని అభిశంసించే దిశగా ప్రతినిధుల సభ ఒక ముఖ్యమైన చర్య చేపట్టింది.
అభిశంసన విషయంలో మున్ముందు ఏం జరగబోతోందనే దాని మీద ప్రజలకు కొంత అవగాహన కల్పిస్తుందీ తీర్మానం. డెమొక్రాట్లు - రిపబ్లికన్ల మధ్య ఇంటెలిజెన్స్ కమిటీ ఎదుట జరుగుతున్న వాగ్వాదం గురించి, కొందరు ఉన్నతస్థాయి సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల్లో ఏముందనేది వారు తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది. కొంత కాలానికి.. ఒక నివేదిక కూడా విడుదలవుతుంది. ఆ నివేదిక.. అభిశంసన నిబంధనలకు ప్రాతిపదికగా మారే అవకాశముంది.
అమెరికా చరిత్రలో ఇది వినూత్న సన్నివేశమేమీ కాదు. కానీ.. అధ్యక్ష పదవి విషయంలో ఒక చరిత్రాత్మక సంఘర్షణకు ఇది దారితీస్తోంది.

ఈ తీర్మానం ఏం చెప్తోంది?
మొదటి దశలో.. ప్రతినిధుల సభ ఇంటెలిజెన్స్ కమిటీ రాబోయే వారాల్లో బహిరంగ విచారణ నిర్వహిస్తుంది. గోప్యంగా ఇచ్చిన వాంగ్మూలాలను బహిరంగ పరచే హక్కు ఆ కమిటీకి ఉంటుంది.
రెండో దశలో.. విచారణలో గుర్తించిన అంశాలతో ఒక బహిరంగ నివేదికను ప్రతినిధుల సభ జ్యుడీషియరీ కమిటీకి పంపిస్తారు. అది తన సొంత విచారణ నిర్వహించి.. ''తాను సరైనవని భావించే తీర్మానాలు, అభిశంసన నిబంధనలు, ఇతర సిఫారసులతో'' నివేదిక అందిస్తుంది.
జ్యుడీషియరీ కమిటీ దశలో అధ్యక్షుడు ట్రంప్ తరఫు న్యాయవాదులు పాల్గొనటానికి అవకాశం ఇచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ప్రతిస్పందన ఏమిటి?
ట్రంప్‌ను 'సత్యం ఆధారంగా' అభిశంసించాలా లేదా అన్నది చట్టసభ సభ్యులు నిర్ణయించటానికి ఈ ప్రక్రియలు తోడ్పడతాయని ఎన్నికైన డెమొక్రాట్లలో అత్యంత సీనియర్, ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పేర్కొన్నారు.
''నిజమంటే రిపబ్లికన్లు ఎందుకు భయపడుతున్నారో నాకు తెలియదు'' అని ఆమె వ్యాఖ్యానించారు.
అయితే.. వచ్చే ఏడాది జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో బ్యాలెట్ బాక్స్ దగ్గర ట్రంప్‌ను ఓడించలేమనే భయంతో ఆయనను తొలగించాలని డెమొక్రాట్లు ప్రయత్నిస్తున్నారంటూ ప్రతినిధుల సభలో రిపబ్లికన్ నాయకుడు కెవిన్ మెక్‌కార్తీ విమర్శించారు.
''ఒక నిర్దిష్ట ప్రక్రియకు అనంగీకార ఉల్లంఘనలను సభ నిబంధనలలోకి చేర్చటం మినహా.. స్పీకర్ పెలోసీ, డెమొక్రాట్లు చేసిందేమీ లేదు'' అని అధ్యక్ష భవనం వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ స్టెఫనీ గ్రీషమ్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Reuters
ఈ అభిశంసన విచారణ నేపథ్యం ఏమిటి?
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా అభిశంసన ప్రక్రియ ప్రారంభిస్తున్నామని ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ గత నెలలో ప్రకటించారు.
ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలోన్స్కీల మధ్య జులై 25న జరిగిన ఒక ఫోన్ కాల్ సంభాషణ.. ఈ విచారణకు కేంద్ర బిందువు.
జో బిడెన్, ఆయన కుమారుడి మీద దర్యాప్తు చేయించాలని ట్రంప్ కోరుతున్నట్లు ఆ సంభాషణ చెప్తోంది. వచ్చే ఏడాది జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున బరిలోకి దిగటానికి పోటీపడుతున్న వారిలో బిడెన్ ముందంజలో ఉన్నారు.
ఆ ఫోన్ కాల్ విషయంలో.. ఒక విజిల్‌బ్లోయర్ ఫిర్యాదు చేశారు. ఆ వ్యక్తి వివరాలను చట్టసభ సభ్యులు బయటపడకుండా కాపాడుతున్నారు.

ఫొటో సోర్స్, EPA
గురువారం సాక్ష్యం సంగతి ఏమిటి?
అమెరికా జాతీయ భద్రతా మండలిలో.. రష్యా, యూరప్‌ల విషయంలో ఉన్నత సలహాదారుగా పనిచేసిన టిమ్ మారిసన్ ప్రతినిధుల సభ ఇంటెలిజెన్స్ కమిటీ ఎదుట సాక్ష్యం చెప్పారు. ఆయన బుధవారం నాడే ఆ పదవి నుంచి వైదొలగారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడితో ట్రంప్ ఫోన్ కాల్ విషయంలో ఉక్రెయిన్‌లో అమెరికా ఉన్నతస్థాయి దౌత్యవేత్త బిల్ టేలర్ గత వారం ఇచ్చిన వాంగ్మూలాన్ని ఆయన బలపరిచారు. బిడెన్ మీద దర్యాప్తు చేపట్టాల్సిందిగా ఉక్రెయిన్ మీద ఒత్తిడి తేవటానికి తన కార్యాలయాన్ని ఉపయోగించుకోవటానికి ట్రంప్ ప్రయత్నించారని టేలర్ వాంగ్మూలం ఇచ్చారు.
అయితే.. ''నేను స్పష్టంగా చెప్పదలచుకున్నాను.. చట్టవ్యతిరేకమైనది ఏదీ చర్చించలేదని నేను భావిస్తున్నా'' అని టిమ్ పేర్కొన్నారు.
ఇదిలావుంటే.. అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్‌ను నవంబర్ 7వ తేదీన వాంగ్మూలం ఇవ్వటానికి రావాలని విచారణ కమిటీ ఆహ్వానించింది.
అయితే.. తన క్లయింటు స్వచ్ఛందంగా హాజరవటానికి సిద్ధంగా లేరని బోల్టన్ తరఫు న్యాయవాది చెప్పారు. ఆయనను తప్పకుండా హాజరవాల్సిందిగా ఇప్పటివరకూ సమన్లు ఏవీ జారీచేయలేదు.
ఉక్రెయిన్ మీద అధ్యక్ష భవనం రాజీకీయ ఒత్తిడి తెచ్చిందన్న ఆరోపణలను ''ఒక డ్రగ్ డీల్'' (మాదకద్రవ్యాల ఒప్పందం) అని బోల్టన్ కోపంగా వ్యాఖ్యానించినట్లు అమెరికా మీడియాలో కథనాలు వచ్చాయి.
ఇవి కూడా చదవండి
- చైనాలోని గాజు వంతెనలను ఎందుకు మూసేస్తున్నారు
- ఇందిరాగాంధీ హత్య: అంగరక్షకులే ఆమెను ఎలా చంపారు?
- ఐఎస్ చీఫ్ బగ్దాదీ అండర్‌వేర్‌ను ఆ గూఢచారి ఎందుకు దొంగిలించారు?
- వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఈ అస్థిపంజరం కోసం నాజీలు, సోవియట్లు ఎందుకు పోరాడారు?
- స్టాకర్వేర్: భార్యలు, భాగస్వాములపై నిఘా కోసం పెరుగుతున్న స్పైవేర్ వినియోగం.. రెండో స్థానంలో భారత్
- తొలి రాత్రే అనుమానం... మహిళలను మానసికంగా చంపేస్తున్న ‘రక్త పరీక్షలు’
- RCEP అంటే ఏమిటి? మోదీ ఈ ఆర్థిక బృందంలో చేరితే భారత్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
- వాట్సాప్ మెసేజ్‌ల మీద నిఘా పెట్టాలని భారతదేశం ఎందుకు భావిస్తోంది?
- ఎరిత్రియా: ఇక్కడ సిమ్ కార్డులు బంగారంతో సమానం.. ఏటీఎంల గురించి వారికి తెలియదు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









