ఏడాదికి రూ.81 లక్షలు సంపాదించినా 'పేదోళ్లే'

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ర్యాన్ నన్, జే షామ్‌బాగ్
- హోదా, ద హామిల్టన్ ప్రాజెక్ట్, బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్
నెలకు ఆరు అంకెల జీతం. ఏడాదికి రూ.81 లక్షల సంపాదన. అయినా వాళ్లు అల్పాదాయ వర్గం కిందే లెక్క. ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. ప్రభుత్వ లెక్కలే ఈ విషయం చెబుతున్నాయి.
ఏడాదికి 81 లక్షల రూపాయల సంపాదన. నెలకి 6 లక్షల 75వేల రూపాయల జీతం.
ఇది చిన్న మొత్తమేమీ కాదు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇలాంటి వాళ్లను సంపన్నులుగానే భావిస్తారు.
కానీ అమెరికా, ప్రత్యేకంగా శాన్‌ఫ్రాన్సిస్కో లెక్క మాత్రం వేరు.
అమెరికా ప్రభుత్వ లెక్కల ప్రకారం దాదాపు 81 లక్షల రూపాయల ఆదాయాన్నీ శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో 'తక్కువ ఆదాయం'గానే పరిగణిస్తారు.
ఇది ఎలా సాధ్యం? అని చాలా మంది ఆశ్చర్యపోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
‘తక్కువ ఆదాయం’ రేఖకు దిగువన..
శాన్‌ఫ్రాన్సిస్కోలో వచ్చే ఆదాయాన్ని, నివాస వసతిపై చేస్తున్న ఖర్చును బట్టి వాళ్లు ' అల్పాదాయ' విభాగం కిందికే వస్తారని అమెరికా గృహ, పట్టణ మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించింది.
శాన్‌ఫ్రాన్సిస్కో, దానికి దగ్గరలో ఉన్న శాన్ మాటియో, మారిన్ కౌంటీలలో నలుగురు సభ్యుల కుటుంబానికి ఏడాదికి 81 లక్షల రూపాయల ఆదాయాన్ని 'తక్కువ ఆదాయం'గా పరిగణిస్తారు. అలాగే, ఏడాదికి 50 లక్షల ఆదాయం వచ్చే వారిని 'అతి తక్కువ ఆదాయం' వర్గంగా పరిగణిస్తున్నారు.
అమెరికాలో నలుగురు కుటుంబ సభ్యులున్న కుటుంబాలలో సుమారు మూడింట రెండో వంతు ఈ 'తక్కువ ఆదాయం' వర్గంలో ఉన్నాయి. అంటే 81 లక్షలకన్నా తక్కువ ఆదాయంతో జీవిస్తున్నాయి.
అమెరికా మొత్తాన్ని తీసుకుంటే, నలుగురు సభ్యులున్న కుటుంబం సగటు ఆదాయం సుమారు రూ.62.6 లక్షలు. అదే కుటుంబ సభ్యులతో లెక్క లేకుండా తీసుకుంటే రూ.40.6 లక్షలు.
మొత్తం 32.6 కోట్ల మంది ఉన్న అమెరికాలో సుమారు 4 కోట్ల మంది ఈ 'తక్కువ ఆదాయం' రేఖకు దిగువన జీవిస్తున్నారు.
దేశవ్యాప్తంగా నలుగురు కుటుంబసభ్యుల కుటుంబానికి ఈ రేఖను రూ.17.25 లక్షలుగా నిర్ణయించారు.
ఉద్యోగాల విషయానికి వస్తే, దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే కొన్ని పెద్ద నగరాలలో ఆదాయం చాలా ఎక్కువగా ఉంది.
అలాంటి నగరాలలో శాన్‌ఫ్రాన్సిస్కో మరీ ప్రత్యేకమైనది. ఐటీ, ఇతర హైటెక్ పరిశ్రమలకు ఇది హబ్‌గా మారిపోయింది. దేశంలో అత్యధిక వేతనాన్ని ఆర్జించే ఉద్యోగస్తులు ఇక్కడ ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
డాక్టర్ల సగటు వార్షికాదాయం రూ.133 లక్షలు
2008-2016 మధ్యకాలంలో శాన్‌ఫ్రాన్సిస్కో మెట్రో ప్రాంతంలో పని చేస్తున్న 25-64 ఏళ్ల మధ్య వయసు ఉద్యోగుల వేతనాలు ఇతర ప్రాంతాలవారి కన్నా 26 శాతం వేగంగా పెరిగాయి. 2016 నాటికి వారి వార్షికాదాయం రూ.43.3 లక్షలకు చేరింది.
శాన్‌ఫ్రాన్సిస్కోలో అత్యధిక వేతనాలు అందుకుంటున్న వారిలో డాక్టర్లు మొదటి స్థానంలో ఉన్నారు. ఇక్కడ వారు సగటున ఏడాదికి రూ.133 లక్షలు ఆర్జిస్తున్నారు.
ఇక అతి తక్కువ వేతనాలను ఆర్జిస్తున్నది వ్యవసాయ కార్మికులు. వారు రూ.9.52 లక్షలు సంపాదిస్తున్నారు.
అయితే అమెరికాలోని కొన్ని నగరాలలో మాత్రం వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయి.
డెట్రాయిట్‌లో ఒక డాక్టర్ సగటు ఆదాయం రూ.99 లక్షలు. అయితే అక్కడ చైల్డ్ కేర్ వర్కర్ల వార్షిక వేతనం రూ.10 లక్షలు మాత్రమే.

ఫొటో సోర్స్, Getty Images
అయితే జీవన వ్యయం, మరీ ప్రత్యేకించి నివాస వసతిపై పెట్టే ఖర్చును ప్రభుత్వం 'తక్కువ ఆదాయం'కు ప్రాతిపదికగా తీసుకుంటుంది.
నిజానికి శాన్‌ఫ్రాన్సిస్కో ప్రాంతంలో జీవన వ్యయం అమెరికా జాతీయ సగటుతో పోలిస్తే 25 శాతం ఎక్కువ.
అయితే ఇక్కడ ఆదాయం జాతీయ సగటుతో పోలిస్తే 45 శాతం ఎక్కువగా ఉన్నందువల్ల, శాన్‌ఫ్రాన్సిస్కో ప్రజల మిగులుబాటు ఎక్కువగా ఉంటోంది.
అయితే నివాస వసతిపై వాళ్లు చేస్తున్న ఖర్చును గమనిస్తే మాత్రం ఆ అంతరం తగ్గుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
శాన్‌ఫ్రాన్సిస్కోలో ఆరంకెల జీతాన్ని కూడా 'తక్కువ ఆదాయం' వర్గంలో చేర్చడానికి ఈ నివాస వసతిపై చేస్తున్న ఖర్చులే కారణం.
ఉదాహరణకు శాన్‌ఫ్రాన్సిస్కోలో 2 బెడ్ రూంల ఇంటి అద్దె సుమారు రూ.2 లక్షలు. 2008 నాటితో పోలిస్తే ఇది రెట్టింపు. ఓహియోలోని సిన్సినాటిలో ఇది కేవలం రూ.58 వేలే.
ఒక ప్రాంతంలో నివసిస్తూ, ఒకే పరిణామంలో ఉండే కుటుంబం సగటు ఆదాయంలో, 80 శాతం కన్నా తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలను అమెరికా ప్రభుత్వం 'తక్కువ ఆదాయం' విభాగంలోకి చేరుస్తుంది.
అయితే అద్దెలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఆ సంఖ్య మరింత ఎక్కువగానూ ఉండొచ్చు. అందుకే శాన్‌ఫ్రాన్సిస్కోలో యేటా రూ.81 లక్షల ఆదాయం వచ్చినా దానిని 'తక్కువ ఆదాయం'గానే పరిగణిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)










