చమురు ధరలపై భగ్గుమన్న ఫ్రాన్స్: దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణం హైడ్రోకార్బన్ ట్యాక్స్ .. ఎందుకు?

ఫొటో సోర్స్, AFP
పెరుగుతున్న పెట్రోల్-డీజిల్ ధరలకు వ్యతిరేకంగా ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ భగ్గుమంది. ఏకధాటిగా కొన్ని గంటలపాటు ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు.
పోలీసులు, ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో 17 మంది పోలీసులతోపాటు సుమారు 110 మంది గాయపడ్డారు. ఈ ప్రదర్శనల్లో పాల్గొన్న 260 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆందోళనలకారులను అడ్డుకోడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. స్టన్ గ్రెనేడ్లు, వాటర్ కెనాన్లతో జనాలను చెదరగొట్టారు.

ఫొటో సోర్స్, EPA
వారాంతంలో నిరసనలు
ఫ్రాన్స్‌లో పెట్రోల్-డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ మొదట నవంబర్ 17న దేశవ్యాప్తంగా ప్రదర్శనలు జరిగాయి. ఈ ఆందోళనల్లో సుమారు 3 లక్షల మంది పాల్గొన్నారు.
తర్వాత సోషల్ మీడియాలో అధ్యక్షుడు మేక్రాన్ ఆర్థిక విధానాలపై విమర్శలు పెరిగాయి. వ్యతిరేక ప్రదర్శనలు మరింత ఉద్ధృతం అయ్యాయి
గత రెండు వారాల నుంచి ప్రతి వారాంతం ప్యారిస్‌లో నిరసన ప్రదర్సనలు నిర్వహిస్తున్నారు. మూడో వారాంతం ఈ ఆందోళనలు మరింత తీవ్రం అయ్యాయి.

ఫొటో సోర్స్, AFP GETTY
ఆందోళనల సమయంలో గాయపడ్డ ఒక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. నిరసనకారులు పోలీసుల నుంచి ఒక రైఫిల్ కూడా లాక్కుని వెళ్లడం కలకలం సృష్టిస్తోంది.
యెల్లో వెస్ట్ ర్యాలీల్లో ఫ్రాన్స్ అంతటా దాదాపు 75 వేల మంది పాల్గొన్నారని, ప్యారిస్‌లోనే 1500 మంది ఆందోళనలు చేశారని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి తెలిపారు.
ఆందోళనకారులు ఆరు భవనాలకు నిప్పు పెట్టారని, మరో 190 ప్రాంతాల్లో మంటలు ఆర్పామని చెప్పారు.
నిరసనకారులు శాంతియుత ప్రదర్శనలనే కోరుకుంటున్నామని చెబుతున్నారు. కానీ ఆందోళనలతో ప్యారిస్‌లో దుకాణాలు, మెట్రో స్టేషన్లు మూసివేశారు.

ఫొటో సోర్స్, EUROPEAN PRESS AGENCY
'యెల్లో వెస్ట్ ర్యాలీస్'
ఫ్రాన్స్‌లో కార్లు ఆగిపోయిన సమయంలో రోడ్డుపై ఉన్న డ్రైవర్లు కచ్చితంగా పసుపు జాకెట్లు ధరించాలనే నియమం ఉంది.
దూరం నుంచి స్పష్టంగా కనిపించే ఈ పసుపు జాకెట్ల వల్ల ప్రమాదాలు తగ్గుతాయి. అందుకే అందరూ వీటిని కార్లలో పెట్టుకుంటారు.
ఇప్పుడు వాటినే నిరనసకారులు తమ ఆందోళనల్లో ధరిస్తున్నారు. దాంతో వీటిని 'యెల్లో వెస్ట్ ర్యాలీలు' అని పిలుస్తున్నారు.
ఈ ఆందోళనలన్నీ ప్రధానంగా ప్రధానమంత్రి కార్యాలయంతోపాటు ఇతర ప్రభుత్వ భవనాలున్న షాంజ్ ఎలీజేలో జరుగుతున్నాయి.

ఫొటో సోర్స్, EPA
ప్రజాగ్రహం ఎందుకు?
దేశంలో పెట్రోల్, డీజిలుపై పన్నులు పెంచడంతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ హైడ్రోకార్బన్ ట్యాక్స్ పెంచడమే దీనికి కారణం.
ఫ్రాన్సులో ఎక్కువగా డీజిల్ ఉపయోగిస్తారు. ఇవి గత 12 నెలల్లో దాదాపు 23 శాతం పెరిగాయి. దేశంలో లీటరు డీజిల్ ధర సగటున 120 రూపాయలు (1.51 యూరోలు) ఉంది. 2000 తర్వాత ఇదే గరిష్ఠ ధర.

ఫొటో సోర్స్, AFP GETTY
హైడ్రోకార్బన్ ట్యాక్స్
ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరగడం, తగ్గడం జరుగుతోంది. కానీ ఫ్రాన్స్ ప్రభుత్వం ధరలు తగ్గించడం లేదు. ఎకో ఫ్రెండ్లీ కార్లు, గ్రీన్ ఫ్యూయల్ ప్రచారంలో భాగంగా అధ్యక్షుడు మేక్రాన్ లీటరు డీజిలుకు 7.6 సెంట్లు, లీటరు పెట్రోలుకు 3.9 సెంట్ల హైడ్రోకార్బన్ ట్యాక్స్ వేశారు.
గ్లోబల్ వార్మింగ్‌ను అడ్డుకోడానికే ప్రభుత్వం ఈ పన్నులు వేసిందని ఆయన చెబుతున్నారు.
2019 జనవరి 1 నుంచి వీటి ధరలను మరింత పెంచాలని అధ్యక్షుడు నిర్ణయించారు. డీజిలుపై 6.5 సెంట్లు, పెట్రోలుపై 2.9 సెంట్లు పెంచాలని భావిస్తున్నారు.
ప్యారిస్‌లో శనివారం జరిగిన ఆందోళనలు జీ 20 సదస్సు వరకూ చేరాయి.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ ప్యారిస్‌లో ఆందోళనలను జీ 20 వేదికపై నుంచే ఖండించారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయడం సరికాదన్నారు.
ఇవి కూడా చదవండి:
- పెట్రోల్ ధర ఎందుకు పెరుగుతోంది?
- నిక్ జోనస్‌ను పెళ్లాడిన ప్రియాంక చోప్రా.. నేడు హిందూ సంప్రదాయంలో మరోసారి
- తల్లిపాల ద్వారా హెచ్ఐవీ సోకుతుందా...
- తెలంగాణలో టీడీపీ స్థానం ఏమిటి? గతమేమిటి? భవిష్యత్ ఏమిటి?
- భూప్రళయం: డైనోసార్లు అంతమైన ప్రాంతం ఇదే
- తెలంగాణ ఎన్నికలు 2018: మీ నియోజకవర్గ అభ్యర్థులు ఎవరో తెలుసుకోండి
- అడాల్ఫ్ హిట్లర్ - ఓ యూదు చిన్నారి: ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన స్నేహం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








