మరో మూడు నెలల్లో భారత్‌కు చమురు కష్టాలు తప్పవా?

- రచయిత, శిశిర్ సిన్హా
- హోదా, సీనియర్ బిజినెస్ జర్నలిస్ట్
ఇరాన్‌పై అమెరికా విధించిన తొలి దశ ఆంక్షలు నేటి నుంచే అమలవుతున్నాయి. ఇరాక్, సౌదీ అరేబియాల తరువాత భారత్‌కు చమురు ఎగుమతి చేసే అతిపెద్ద దేశం ఇరానే.
జులైలో ప్రభుత్వ చమురు సంస్థలు ఇరాన్ నుంచి భారీ పరిమాణాల్లో చమురును కొన్నట్లు గతవారం వార్తలొచ్చాయి. కానీ నవంబర్ 4న ఇరాన్‌పై రెండో దశ ఆంక్షలు మొదలైతే భారత్‌కు ఆ దేశం నుంచి చమురు కొనే అవకాశం ఉండదు.
దాంతో భారత్‌లో చమరు కొరత ఏర్పడుతుందేమోననే భయం నెలకొంది.
ఇప్పటికే ఆ పరిస్థితులను అధిగమించేందుకు భారత్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇరాన్‌తో ‘రూపీ-రియాల్’ ఒప్పందాన్ని భారత్ కుదుర్చుకుంది. ఫలితంగా ఇరాన్ ఉత్పత్తులను భారత కరెన్సీలోనే కొనే అవకాశం ఉంది.
ఇరాన్‌తో వస్తు వినిమయ పద్ధతి అమల్లో ఉంది. దాని ప్రకారం చమురు తీసుకొని దాని బదులు ఇతర ఉత్పత్తులను అందించొచ్చు.
కానీ ఈ పద్ధతులేవీ నవంబర్ తరవాత పనిచేయవు. ఆ నెలలోనే అమెరికా రెండో దశ ఆంక్షలను అమలు చేయనుంది. అప్పుడు పరిస్థితి మరింత కఠినంగా మారుతుంది.
ఆగస్టు 6 నుంచి మొదలయ్యే తొలి దశ ఆంక్షల్లో భాగంగా ఇరాన్ కరెన్సీ అయిన రియాల్‌తో అమెరికా డాలర్‌ను మార్చుకునే వీలుండదు. నవంబర్ 4న మొదలయ్యే రెండో దశ ఆంక్షలు నేరుగా ఇరాన్ చమురు ఉత్పత్తుల ఎగుమతిపైనే దెబ్బ కొడతాయి.

ఇప్పటికే దేశంలోని చాలా ప్రైవేట్ సంస్థలు ఇరాన్ నుంచి చమురు దిగుమతులను తగ్గించేశాయి. ప్రభుత్వ సంస్థలు కూడా పాత ఒప్పందాలను వీలైనంత త్వరగా ముగించే ప్రయత్నం చేస్తున్నాయి. దాని ఫలితంగానే జూన్-జులై మధ్య ఇరాన్ నుంచి భారీ స్థాయిలో చమురు దేశంలోకి దిగుమతి అయింది.
ప్రస్తుతానికి పరిస్థితి బానే ఉన్నా, నవంబర్ తరువాత ఇరాన్ నుంచి చమురును తరలించే ట్యాంకర్లను అమెరికా ఆపేస్తుంది. దాంతో అప్పట్నుంచి భారత్‌కు చమురు దిగుమతి చేసుకునే అవకాశం ఉండదు.
అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన ‘రీ ఎష్యురెన్స్ పాలసీ’ని కూడా నవంబర్ తరవాత అమెరికా సంస్థలు నిలిపివేస్తాయి. ఫలితంగా భారత ప్రధాన చమురు మార్గాల్లో ఒకటి మూతబడిపోతుంది.
ఈ పరిస్థితుల్లో వెనెజ్వెలావైపు భారత్ చూడొచ్చు. కానీ ఆ దేశంపైన కూడా ఆంక్షలు అమలయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. దాంతో చమురు సరఫరాపైన తీవ్ర ప్రభావం పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
కొరత నుంచి తప్పించుకోవడం ఎలా?
ఇరాన్ నుంచి చమురును దిగుమతి చేసుకునే వెసులుబాటును అమెరికా భారత్‌కు కల్పిస్తే చమురు కొరతను అధిగమించొచ్చు. కానీ ప్రస్తుతానికి ఆ విషయంలో అమెరికా వైఖరి మెత్తబడే అవకాశం ఉన్నట్లు కనిపించట్లేదు. కాబట్టి భారత్ ఈ విషయంలో ఆశావహంగా ఉండటానికి లేదు.
ప్రస్తుతానికి భారత్-ఇరాన్‌ల మధ్య సంబంధాలు మెరుగ్గానే ఉన్నాయి. కానీ ఆంక్షలు అమలైతే ఇరాన్ నుంచి సరఫరా నిలిచిపోతుంది. దాంతో సంబంధాలు మెరుగ్గానే ఉన్నా వ్యాపారం ఎలా జరుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
మరోపక్క అంతర్జాతీయ వాణిజ్యమంతా అమెరికా డాలర్లలోనే కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ఆ కరెన్సీనే ఎక్కువ ఆమోదనీయం. కానీ భారత్ మాత్రం ఇరాన్‌తో ‘రియాల్-రూపీ’ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వస్తు వినిమయ వ్యవస్థకూ రెండు దేశాలూ అంగీకరించాయి. ఒకవేళ డాలర్లలో వ్యాపారం సాగించే వెసులుబాటు ఉన్నా భారత్ దానికి సిద్దంగానే ఉంటుంది. కానీ ఆంక్షల ఫలితంగా సరఫరానే నిలిచిపోతే మొత్తంగా భారత్-ఇరాన్ వాణిజ్యానికి తెరపడొచ్చేమోననే అభిప్రాయం అంతటా నెలకొంది. ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలన్నదే ప్రస్తుతం భారత్ ముందున్న సవాల్.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








