పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయానికి 4 ప్రధాన కారణాలు ఇవే..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రజనీశ్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 7 నిమిషాలు
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) స్థానిక నాయకులు, కార్యకర్తల ఆగడాలు బాగా పెరిగిపోయాయనే ఫిర్యాదులను నేను పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను కవర్ చేస్తున్న సమయంలో ప్రజల నుంచి విన్నాను.
పార్టీ కార్యకర్తల అనుమతి లేకుండా ఏ కొత్త పని చేయడమైనా కష్టమేనని ప్రజలు బాహాటంగానే చెప్పేవారు.
కానీ, పశ్చిమ బెంగాల్‌లోని గ్రామీణ ప్రాంత ప్రజలు, ముస్లింలు, మహిళలు మమతా బెనర్జీ వైపే ఉన్నారని టీఎంసీ మద్దతుదారులు వాదించేవారు.
అందుకే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ మమత ఈ ఎన్నికల్లో గెలుస్తారని భావించారు.
కానీ, ఎన్నికల సరళిని బట్టి చూస్తే, ప్రజలు మార్పు కావాలని ముందే నిర్ణయించుకున్నట్లు అర్థమైంది.

నిజానికి, మార్పుకు కావాల్సిన పునాదిని 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనే బీజేపీ సిద్ధం చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్లో ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది.
మూడు స్థానాల నుంచి ఏకంగా 77 స్థానాలకు చేరుకుంది. ఆ రకంగా చూస్తే, బెంగాల్ రాజకీయాల్లో బీజేపీ ఏమాత్రం బయటి పార్టీ కాదు.
ఉదాహరణకు, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మాటిగారా-నక్సల్బరీ నియోజకవర్గం నుంచి బీజేపీకి చెందిన ఆనందమయ్ బర్మన్ టీఎంసీ అభ్యర్థి రాజన్ సుందాస్పై 70 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇది షెడ్యూల్డ్ కులాలకు కేటాయించిన సీటు.
ఇది నక్సల్బరీ ప్రాంతం, ఇక్కడి నుంచే 1967లో అతివాద వామపక్ష నాయకులు సాయుధ పోరాటాన్ని ప్రారంభించి, అనేక రాష్ట్రాల కార్మికులను, భూమిలేని పేదలను, దళితులను, ఆదివాసీలను, పీడిత వర్గాలను ఆకర్షించారు.
నక్సల్బరీలో అప్పట్లో బీజేపీ సాధించిన విజయాన్ని పశ్చిమ బెంగాల్లో రాబోయే మార్పుకు సంకేతంగా భావించారు. సరిగ్గా ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఆ మార్పు నిజమైంది.
ఆనందమయ్ బర్మన్ ఈసారి గత రికార్డును కూడా మించిపోయి, తన సమీప ప్రత్యర్ధి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి శంకర్ మలాకర్ పై 1,04,265 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

ఫొటో సోర్స్, Getty Images
అధికారపక్షానికి వ్యతిరేక పవనాలు లేదా హిందూ ఓట్ల పోలరైజేషన్
''పోలీసులు మమత అనుచరుల మాటలే వింటారు. కానీ మేం ఫిర్యాదు చేయాల్సిందే వారి మీద. గూండాయిజం ఎంతలా పెరిగిపోయిందంటే, వారి అనుమతి లేకుండా ఏ పని చేయడం సాధ్యం కాదు. మాకు మార్పు కావాలి, ఆ మార్పును ఇప్పుడు కేవలం బీజేపీ మాత్రమే తీసుకురాగలదు. కాంగ్రెస్ లేదా సీపీఎం ఆ స్థితిలో ఉండి ఉంటే, నేను కచ్చితంగా వారి గురించి ఆలోచించేదాన్ని'' అని దమ్ దమ్ ఉత్తర నియోజకవర్గంలోని ఒక మహిళా ఓటరు టీఎంసీ గురించి నాతో అన్నారు.
టీఎంసీ లోక్‌సభ ఎంపీ సౌగత్ రాయ్ బీబీసీతో మాట్లాడుతూ, ''15 ఏళ్ల పాలనలో ప్రభుత్వ వ్యతిరేకత సహజం. అయితే హిందూ ఓటర్లు బీజేపీ వైపు పోలరైజ్ కావడం కూడా ఒక ప్రధాన కారణం. దీనివల్ల మేము నష్టపోవాల్సి వచ్చింది'' అని చెప్పారు.
కలకత్తా యూనివర్సిటీ రాజకీయ శాస్త్ర ప్రొఫెసర్ హిమాద్రి ఛటర్జీ అభిప్రాయం ప్రకారం, బెంగాల్లో బీజేపీ విజయాన్ని కేవలం హిందూ ఓట్ల పోలరైజ్ అయినట్లుగా చూసేవారికి బెంగాల్ రాజకీయాల మీద సరైన అవగాహన లేనట్లే.
''బీజేపీ విజయాన్ని హిందూ ఓట్ల పోలరైజేషన్గా కాకుండా, టీఎంసీ వ్యతిరేక ఓట్లన్నీ ఏకం కావడంగా చూడాలి. ఈ టీఎంసీ వ్యతిరేక ఓట్లను కాంగ్రెస్ తనవైపు తిప్పుకోగలిగేది, కానీ అది రాజకీయంగా నిష్క్రియంగా ఉండిపోయింది. బీజేపీకి ఈ విజయం అకస్మాత్తుగా రాలేదు. 2014 నుంచి బీజేపీ తన ఓటు షేరును పెంచుకుంటూనే ఉంది. 2016 నుంచి 2026 అసెంబ్లీ ఎన్నికల వరకు చూస్తే, బీజేపీ ఓటు షేరుతో పాటు సీట్లు కూడా పెరిగాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి తక్కువ సీట్లు వచ్చినప్పటికీ, ఓటు షేరు మాత్రం తగ్గలేదు'' అని ప్రొఫెసర్ ఛటర్జీ అన్నారు.
''పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. మమతను ఢీకొట్టే పార్టీగా ప్రజలకు బీజేపీ కనిపించింది. జనం మమతను ఓడించాలనుకున్నారు, అందుకే బీజేపీకి ఓటు వేశారు. మతపరమైన పోలరైజ్ గురించి మాట్లాడుతున్న వారి కోసం నేను కొన్ని వాస్తవాలు చెప్పాలనుకుంటున్నాను. బెంగాల్లో 1950 తర్వాత ఎలాంటి అల్లర్లు జరగలేదు'' అన్నారు ఛటర్జీ.
''కచ్చితంగా ఇందులో ఇక్కడి రాజకీయ పార్టీల పాత్ర కూడా ఉంది. బెంగాల్ విభజన జరిగిన రాష్ట్రం అయినప్పటికీ, ఇక్కడ ఎప్పుడూ హిందూ వర్సెస్ ముస్లిం రాజకీయాలు లేవు. బెంగాల్ ప్రజలకు బీజేపీ తెలియదు అనుకోవడం కూడా పొరపాటే. అలాంటప్పుడు బెంగాల్లో బీజేపీకి ఓటు వేసిన వారందరూ మతతత్వవాదులు అయిపోయారని చెప్పడం హాస్యాస్పదం'' అని ఛటర్జీ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, ANI
''అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు మేము ఊహించిన విధంగా లేవు. మమతపై ప్రభుత్వ వ్యతిరేకత కచ్చితంగా ఉంది, కానీ ఈ విజయం కేవలం దానివల్లే రాలేదు. మమత పార్టీకి చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు.’’ అని సీనియర్ జర్నలిస్ట్ ప్రసూన్ ఆచార్య అభిప్రాయపడ్డారు.
అలాగే బీజేపీకి ఈసారి హిందూ ఓట్ల పోలరైజ్ కావడం కూడా కలిసివచ్చిందని ప్రసూన్ ఆచార్య అన్నారు.
‘‘రాబోయే రోజుల్లో బెంగాల్లో ప్రతిపక్షం చాలా బలహీనపడుతుందని, టీఎంసీ ముక్కలయ్యే అవకాశం ఉందని నాకు అనిపిస్తోంది. టీఎంసీ కౌన్సిలర్లు, స్థానిక నాయకులు తమ ప్రయోజనాల కోసం బీజేపీలో చేరుతారు. చాలామంది ఎమ్మెల్యేలు, నాయకులు దర్యాప్తు సంస్థల భయంతో బీజేపీ గూటికి చేరుకుంటారు'' అని ఆచార్య విశ్లేషించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎస్ఐఆర్ పాత్ర
పశ్చిమ బెంగాల్‌లోని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) డేటాను థింక్ ట్యాంక్ సబర్ ఇన్స్టిట్యూట్ లోతుగా విశ్లేషించింది.
సబర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ సాబిర్ అహ్మద్ మాట్లాడుతూ, ఈ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఎస్ఐఆర్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు.
''ఈ ఎన్నికలలో సుమారు 31 లక్షల మంది ఓటు వేయలేదు. అనేక స్థానాల్లో గెలుపోటముల మధ్య తేడా చాలా తక్కువగా ఉండబోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ విజయంలో ఎస్ఐఆర్ కూడా కీలక పాత్ర పోషించింది'' అని చెప్పారు.
''ఈసారి బెంగాల్ ఎన్నికల్లో మతపరమైన పోలరైజేషన్ కూడా జరిగింది. పట్టణ ప్రాంతాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. అల్పసంఖ్యాక వర్గాల వారు మెజారిటీ వర్గంగా మారిపోతారనే భయాన్ని ప్రజల మనసుల్లో నింపారు" అని అహ్మద్ ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రాభవం కోల్పోయిన వామపక్ష కూటమి, కాంగ్రెస్
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పోటీ కేవలం రెండుపార్టీల మధ్యే - అంటే టీఎంసీ, బీజేపీ మధ్యే ఉందని స్పష్టంగా కనిపించింది.
క్షేత్రస్థాయిలో కాంగ్రెస్, సీపీఎం ఎక్కడా కనిపించలేదు. టీఎంసీని కాంగ్రెస్, సీపీఎం ఓడించలేవనేది ప్రజల్లో ఉన్న అభిప్రాయం. అటువంటి పరిస్థితుల్లో టీఎంసీ వ్యతిరేక ఓట్లన్నీ బీజేపీవైపు మళ్లాయి.
కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందంటే, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు శుభాంకర్ సర్కార్ శ్రీరాంపూర్ నియోజకవర్గంలో నాలుగో స్థానంలో ఉన్నారు.
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పశ్చిమ బెంగాల్లో ఒక్క ర్యాలీ కూడా నిర్వహించలేదు.
ఈ ఫలితాలు తమకు ఆశ్చర్యం కలిగించడం లేదని నక్సల్బరీ ఉద్యమ పితామహుడు చారు మజుందార్ కుమారుడు, సీపీఐ (ఎంఎల్) పొలిట్‌బ్యూరో సభ్యుడు అభిజిత్ మజుందార్ వ్యాఖ్యానించారు. అయితే బీజేపీకి ఇంతటి భారీ విజయం దక్కుతుందని ఊహించలేదని అన్నారు.
''మమతా బెనర్జీ ప్రభుత్వంపై సామాన్య ప్రజల్లో అసంతృప్తి ఉందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆ అసంతృప్తిని తమ వైపు తిప్పుకోవడంలో వామపక్ష పార్టీలు విఫలమయ్యాయి'' అన్నారు మజుందార్.
ఈసారి కాంగ్రెస్, వామపక్ష పార్టీలు విడివిడిగా ఎన్నికల్లో పోటీ చేశాయి. దీనివల్ల ఏకం కావాల్సిన టీఎంసీ వ్యతిరేక ఓట్లు బీజేపీ వైపు మళ్లాయి.
శ్రీరాంపూర్ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ ర్యాలీ సమయంలో నేను స్వయంగా గమనించిన విషయం ఏమిటంటే, మమతపై రాహుల్ విమర్శలు చేసినప్పుడు ప్రజలు చప్పట్లతో స్వాగతించారు. కానీ ప్రధానమంత్రి మోదీని విమర్శించినప్పుడు మాత్రం జనాల నుంచి స్పందన చాలా చప్పగా ఉంది. అంటే, అధికార వ్యతిరేక పవనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని దీని అర్థం.

ఫొటో సోర్స్, Getty Images
ముస్లిం ఓట్లు చీలిపోయాయా?
''బీజేపీకి అనుకూలంగా హిందూ ఓట్ల పోలరైజేషన్ వల్ల టీఎంసీ అధికారాన్ని కోల్పోలేదు. ముస్లిం ఓట్లు ఘోరంగా చీలిపోవడమే దీనికి కారణం. ఉదాహరణకు, తెహట్టా నియోజకవర్గ మొదటి రౌండ్ ఫలితాలను చూడండి. బీజేపీకి కేవలం 3 శాతం ఓట్లు ఉంటే, వామపక్షాలకు 34 శాతం ఓట్లు వచ్చాయి. ఇది సుమారు 90 శాతం ముస్లిం జనాభా ఉన్న ప్రాంతం. అందుకే అంతిమంగా బీజేపీ ఈ సీటును గెలుచుకోబోతోంది'' అని ఫలితాలకు ముందు ఎన్నికల విశ్లేషకులు పార్థా దాస్ 'ఎక్స్'లో రాశారు. ఆయన చెప్పినట్లుగానే ఈ నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్ధి సుబ్రతా కబిరాజ్ విజయం సాధించారు.
అభిజిత్ మజుందార్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
''హిందూ ఓట్లు పోలరైజ్ అయ్యాయి. కానీ ముస్లిం ఓట్లు చీలాయి. ముస్లిం ఓట్లు చీలిపోవడానికి ప్రధాన కారణం తృణమూల్ కాంగ్రెస్ వారి ఓట్లను కేవలం వాడుకోవడమే. గత రెండు ఎన్నికలుగా మమత బీజేపీని బూచిగా చూపి భయపెడుతూ ముస్లింల ఓట్లను పొందుతున్నారు. కానీ ఈసారి ముస్లింలు స్వతంత్రంగా ఓటు వేశారు. ఐఎస్ఎఫ్, హుమాయూన్ కబీర్ పార్టీలకు సీట్లు రావడం ముస్లిం ఓట్లు చీలిపోయాయని నిరూపిస్తోంది'' అని ఆయన విశ్లేషించారు.
అయితే, జాదవ్‌పూర్ యూనివర్సిటీ రాజకీయ శాస్త్ర ప్రొఫెసర్ అబ్దుల్ మతీన్ ముస్లిం ఓట్ల విభజన జరిగిందన్న వాదనతో ఏకీభవించడం లేదు.
''ఇది ముస్లింలను విలన్లుగా చిత్రీకరించడమే అవుతుంది. ముస్లింలు ఐఎస్ఎఫ్ నుంచి బలమైన అభ్యర్థికి ఓటు వేశారు. కొన్నిచోట్ల హుమాయూన్ కబీర్ పార్టీకి వేశారు. ఓవైసీ పార్టీకి వెయ్యి ఓట్లు కూడా రాలేదు. అటువంటప్పుడు ముస్లింల ఓటు చీలిపోయిందని మనం చెప్పలేం'' అని ప్రొఫెసర్ మతీన్ అన్నారు.
''బెంగాల్లో హిందూత్వ రాజకీయాలను ఓడించడానికి మమత కూడా హిందూత్వ బాటనే ఎంచుకున్నారు. ఆమె వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు జరగనివ్వలేదు. కేవలం బీజేపీ భయంతో ముస్లింలు జీవితాంతం మమతకే ఓటు వేయలేరు. ఒకవేళ 70 శాతం హిందూ ఓట్లు ఒకే పార్టీకి వెళ్తే, ఇక మిగిలేది ఏముంటుంది? అయినప్పటికీ, బీజేపీకి పడిన హిందూ ఓట్లన్నీ మతతత్వ ఓట్లని నేను చెప్పలేను. అందులో మెజారిటీ భాగం ఉండవచ్చు కానీ, మిగతాది మమత దుష్పరిపాలనకు వ్యతిరేకంగా పడిన ఓటు కూడా" అని ప్రొఫెసర్ మతీన్ చెప్పారు.
బీజేపీ 2016లో కేవలం 3 సీట్లు గెలుచుకోగా, 2021లో 77 సీట్లు సాధించింది.
2016 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటు షేర్ సుమారు 10 శాతంగా ఉండేది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 40 శాతం మార్కును దాటింది.
2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 38.1 శాతం ఓట్లు వచ్చాయి. ఈసారి ఓటు షేర్ 45 శాతం దాటినట్లు ఎన్నికల కమిషన్ గణాంకాలు చెబుతున్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































