దాదాపు అందరి ఫోన్లలో ఒకేసారి 'అలర్ట్' మెసేజ్ ఎందుకొచ్చింది? అసలు విషయమేంటి?

అలర్ట్ మెసేజ్, సివియర్ అలర్ట్, వార్నింగ్

ఫొటో సోర్స్, Getty Images

చదివే సమయం: 3 నిమిషాలు

దేశంలోని చాలా సెల్‌ఫోన్లు ఒకేసారి అలర్ట్ సందేశాలతో మోగడం కలకలం రేపింది.

మొబైల్ ఫోన్ స్క్రీన్‌పై "ఎక్స్‌ట్రీమ్‌లీ సివియర్ అలర్ట్స్" పేరుతో కొద్దిసెకన్ల పాటు కనిపించిన ఈ మెసేజ్ కాస్త భయాందోళన కలిగించింది. అయితే, ఇందులో భయపడాల్సిన అవసరమేమీ లేదు.

ఇలాంటి సందేశం వస్తుందని కేంద్ర ప్రభుత్వం మూడు రోజుల కిందట, ఏప్రిల్ 29నే సమాచారమిచ్చింది. అందులో కేంద్రం ఏం చెప్పిందో తెలుసుకునేముందు, అసలు ఆ మెసేజ్‌లో ఏముందో ఒకసారి చూద్దాం.

దేశవ్యాప్తంగా, మొబైల్ ఫోన్లకు ఏకకాలంలో ఇంగ్లిష్ సహా ప్రాంతీయ భాషల్లో ఒక అలర్ట్ మెసేజ్ వచ్చింది. అందులో ఇలా రాసి ఉంది.

"విపత్తు సమయాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తూ హెచ్చరికల సందేశాలు పంపేందుకు స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన సెల్ బ్రాడ్‌కాస్ట్‌ను ప్రారంభిస్తున్నాం. ప్రజలారా.. అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. ఈ మెసేజ్ వచ్చినప్పుడు మీరు ఏమీ చేయాల్సి అవసరం లేదు. ఇదొక టెస్టింగ్ మెసేజ్ - భారత ప్రభుత్వం" అని పేర్కొంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అలర్ట్ మెసేజ్, సివియర్ అలర్ట్, వార్నింగ్

కేంద్రం ఏం చెప్పింది?

విపత్తు సమయాల్లో ప్రజలకు వేగవంతమైన హెచ్చరిక సందేశాలు పంపడం కోసం రూపొందించిన స్వదేశీ సెల్ బ్రాడ్‌కాస్ట్ వ్యవస్థ ట్రయల్ రన్ జరుగుతోందని ఏప్రిల్ 29న కేంద్ర ప్రకటించింది. ఈ ట్రయల్ సమయంలో మొబైల్ ఫోన్లలో ఇంగ్లిష్, ఇతర ప్రాంతీయ భాషల్లో సందేశాలు వస్తాయి. వీటికి ఎవరూ స్పందించాల్సిన అవసరం లేదని పేర్కొంది.

ఈ సందేశాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న టెస్టింగ్ ప్రక్రియలో భాగమని, ఎవరూ వాటికి స్పందించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

"ప్రకృతి విపత్తులు, ప్రమాదాల సమయంలో ప్రజలకు సకాలంలో సమాచారం అందేలా చూసేందుకు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని టెలీకమ్యూనికేషన్ల విభాగం, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ - ఎన్‌డీఎమ్ఏ) సహకారంతో దేశవ్యాప్తంగా మొబైల్ ఆధారిత విపత్తు కమ్యూనికేషన్ వ్యవస్థ బలోపేతం చేయడంపై పనిచేస్తోంది" అని కేంద్ర ప్రభుత్వం ఆ ప్రకటనలో తెలిపింది.

టెలీకమ్యూనికేషన్ల విభాగానికి చెందిన పరిశోధనా సంస్థ అయిన 'సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలీమాటిక్స్ (సీ డాట్) అభివృద్ధి చేసిన ఇంటిగ్రేటెడ్ అలర్ట్ సిస్టమ్ (ఎస్ఏఎస్‌హెచ్‌ఈ)ను ఎన్‌డీఎమ్ఏ విజయవంతంగా పరీక్షించింది. ఈ వ్యవస్థ దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలన్నింటిలో పనిచేస్తుంది. నిర్దేశిత ప్రాంతంలోని మొబైల్ వినియోగదారులకు విపత్తు, లేదా అత్యవసర పరిస్థితులకు సంబంధించిన సందేశాలను సకాలంలో చేరవేస్తుంది.

"విపత్తు నిర్వహణ యంత్రాంగం దీనిని విస్తృతంగా వినియోగంలోకి తెచ్చింది. దీని ద్వారా ప్రకృతి విపత్తులు, వాతావరణ హెచ్చరికలు, తుపానుల వంటి విపత్కర సమయాల్లో, 19కి పైగా ప్రాంతీయ భాషల్లో 134 బిలియన్లకు పైగా (బిలియన్ అంటే వందకోట్లు) హెచ్చరికలు పంపవచ్చు" అని కేంద్రం ఆ ప్రకటనలో పేర్కొంది.

"సునామీలు, భూకంపాలు, పిడుగులు పడడం వంటి సమయాలతో పాటు గ్యాస్ లీకులు, రసాయన ప్రమాదాల వంటి అత్యవసర పరిస్థితుల్లోనూ హెచ్చరికల సందేశాలను పంపేందుకు ఎస్‌ఎంఎస్‌తో పాటు 'సెల్ బ్రాడ్‌కాస్ట్'ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది" అని అందులో వివరించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)