‘చనిపోతాం.. అనుమతివ్వండి’ అని ఈ వృద్ధులు ఎందుకు విజ్ఞప్తి చేస్తున్నారో తెలుసా?

- రచయిత, జాహ్నవి మూలే
- హోదా, బీబీసీ మరాఠీ
''నేను చనిపోలేనంత మాత్రానే ఎందుకు బతికుండాలి?'' అని ప్రశ్నిస్తున్నారు ముంబై నగరానికి చెందిన నారాయణ్ కృషన్‌జీ లలావాట్. ఈ ప్రశ్న అడుగుతున్నపుడు ఆయన మోముపై లీలగా నవ్వు కనిపించింది.
నారాయణ్, ఐరావతి లలావట్ దంపతులు తాము ఆరోగ్యంగా ఉన్నపుడే చనిపోయేందుకు అనుమతించాలని కోరుతున్నారు. ఇలాంటి స్వచ్ఛంద మరణాన్ని ఇంగ్లిష్‌లో యుథనేసియాగా వ్యవహరిస్తారు.
ముంబయిలోని గిర్గావ్ ప్రాంతంలో 'ఛాల్'లో ఓ చిన్న ఇంట్లో నివసిస్తోందీ జంట.
ఐరావతి స్కూల్ టీచర్‌గా పనిచేశారు. మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో నారాయణ్ పనిచేసేవారు.
వీరికి పిల్లలు లేరు. వయసు మళ్లినా కూడా వీరి ఎవరి మీదా ఆధారపడటంలేదు.
‘‘ఆరోగ్యంగా చనిపోనివ్వండి...‘‘
నారాయణ్ ఉద్యోగ విరమణ చేసి ఏళ్లు గడుస్తున్నా కూడా తన సంస్థ కార్మిక సంఘంలో క్రియాశీల సభ్యుడిగా ఉన్నారు.
ఆయన ఇప్పుడు కూడా తమ ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలోని ముంబయి సెంట్రల్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఆ కార్యాలయానికి రోజూ వెళ్లి వస్తుంటారు.
ఐరావతి పెద్దగా బయటకు వెళ్లరు. కానీ ఇంటి పనులన్నీ స్వయంగా చేసుకుంటారు.
అయితే వారానికోసారి శుక్రవారం రోజు తన స్నేహితులతో కలిసి బయటికి వెళ్లివస్తుంటారు.
''మేము జీవితాంతం మాకు నచ్చినట్లు బతికాం. సంతృప్తిగా జీవించాం. ఇక ఇప్పుడు ఏదైనా జబ్బుపడి బాధపడే కన్నా చనిపోవడమే మంచిది'' అని ఆమె దృఢంగా అంటారు.
''ఎవరైనా ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. అలాంటపుడు మమ్మల్ని గౌరవప్రదంగా చనిపోనివ్వండి'' అంటున్నారామె.
నిజానికి నారాయణ్ యుథనేసియానే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన 1987 నుంచీ అధికారులకు లేఖలు రాస్తున్నారు. తాము చనిపోవడానికి అనుమతివ్వాలని కోరుతున్నారు.

యుథనేసియా మీద వివాదం
భారతదేశంలో 'ప్రయోపవేశం' (ఆహారం స్వీకరించడానికి నిరాకరించడం ద్వారా ప్రాణత్యాగం చేయడం), సంతర, సమాధి (ధ్యానం ద్వారా మరణం పొందడం) వంటి సంప్రదాయ, మతపరమైన ఆచరణలు ఉండేవి. వీటిని విశ్వసించేవారు కొన్నిసార్లు తమ జీవితాలను త్యజించడానికి వీటిని ఆచరించేవారు.
అయితే.. భారతదేశంలో ఎలాంటి యుథనేసియా అయినా చట్టవ్యతిరేకం. నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ వంటి ఓ పిడికెడు దేశాలు మాత్రమే.. క్షుణ్నంగా చర్చించిన తర్వాత కొన్ని రకాల పాసివ్ యుథనేసియాకు అనుమతిస్తాయి.

సుప్రీంకోర్టు తాజా తీర్పు
2018 మార్చి 9వ తేదీన యుథనేసియాపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్ర ఆధ్వర్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు నిచ్చింది.
మానవులకు గౌరవంగా చనిపోయే హక్కు ఉందని తెలిపింది. నిర్ణీత నిబంధనలకు, మార్గదర్శకాలకు లోబడి పాక్షిక యుథనేసియాకు అనుమతిస్తున్నట్లు తెలిపింది.

యుథనేసియా ఎన్ని రకాలు?
యాక్టివ్ యుథనేసియాకు, పాసివ్ యుథనేసియాకు మధ్య తేడాను న్యాయవాది అమిత్ కార్ఖానీస్ చెప్పారు.
''ఒక వ్యక్తికి ఔషధాలు కానీ, ప్రాణాంతక ఇంజక్షన్ కానీ ఇవ్వడం వంటి చర్యల ద్వారా అతడు చనిపోవడానికి అనుమతిస్తే దానిని యాక్టివ్ యుథనేసియా అంటారు. అదే తీవ్రంగా జబ్బుపడి ఉన్న ఒక రోగి దయనీయ పరిస్థితికి అంతం పలకడానికి.. ఆ రోగికి అందిస్తున్న ఏదైనా వైద్య చికిత్సను నిలిపివేయడం, లేదా కృత్రిమ శ్వాస అందించడం వంటి యంత్రాల మద్దతును తొలగించడం ద్వారా మరణానికి అనుమతిస్తే దానిని పాసివ్ యుథనేసియా అంటారు'' అని ఆయన వివరించారు.
''అరుణా షాన్‌బాగ్ తరఫున 2011లో పింకీ విరానీ దరఖాస్తు చేసినపుడు సుప్రీంకోర్టు ఈ రెండు రూపాల మీదా చర్చించింది. ఏ వ్యక్తికైనా తన జీవితాన్ని త్యజించే హక్కు లేదని స్పష్టంచేసింది'' అని కూడా ఆయన వివరించారు.

సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు
ముంబయిలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేసిన అరుణా షాన్‌బాగ్ మీద 1973లో ఒక వార్డు అటెండెంట్ లైంగిక దాడి చేశాడు. అప్పటి నుంచీ 42 ఏళ్ల పాటు ఆమెను నిశ్చేతనంగా ఆస్పత్రిలోనే ఉంచారు.
అరుణ గురించి ఒక పుస్తకం రాసిన జర్నలిస్టు పింకీ విరానీ.. అరుణకు అమర్చిన ఆహారాన్నందించే ట్యూబులను తొలగించడం ద్వారా ఆమెను చనిపోయేందుకు అనుమతించాలని 2011లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
సుప్రీంకోర్టు వైద్య సాక్ష్యాలను పరిశీలించి.. పింకీ వినతిని తిరస్కరించింది. అరుణ న్యుమోనియాకు గురై 2015 మే 18న చనిపోయారు.

ఏదేమైనా.. ఆ కేసు విచారణ సందర్భంగా పాసివ్ యుథనేసియా విషయంలో సుప్రీంకోర్టు చరిత్రామక తీర్పు వెలువరించింది.
తీవ్రంగా జబ్బుపడిన కొందరు రోగులకు.. వారి కుటుంబ సభ్యులు కోరినపుడు, వైద్యులు, కోర్టుల పర్యవేక్షణలో పాసివ్ యుథనేసియాకు అనుమతించవచ్చునని కోర్టు సూచించింది.
ఈ పాసివ్ యుథనేసియా విషయంలో రూపొందించిన ముసాయిదా బిల్లు మీద ప్రజాభిప్రాయం తెలియజేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరింది.
ఈ అంశంపై ఇంకా చాలా చర్చ జరగాల్సిన అవసరముందని కార్ఖానీస్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Prashant Nanaware/BBC
వైద్యులు ఏమంటున్నారు?
యుథనేసియా భావన మీద వైద్యుల్లోనూ భిన్నాభిప్రాయాలున్నాయి.
యుథనేసియా మీద ఏదైనా చట్టం చేయడం, దానిని అమలు చేయడం రెండు వేర్వేరు విషయాలని డాక్టర్ సంజయ్ ఓక్ పేర్కొన్నారు. ముంబయి కేఈఎం హాస్పిటల్ మాజీ డీన్ అయిన డాక్టర్ ఓకా ప్రస్తుతం ప్రిన్స్ అలీఖాన్ హాస్పిటల్ సీఈఓగా ఉన్నారు.
''యుథనేసియాకు చట్టబద్ధత ఉన్న దేశాల్లో సైతం.. దీని మీద గందరగోళం నెలకొనివుంది. ఇంకా సరైన వ్యవస్థలే ఏర్పాటు కాని భారత్ వంటి దేశంలో ఇది అస్తవ్యస్త పరిస్థితికి దారితీయగలదు'' అని ఆయన అభిప్రాయపడ్డారు.
న్యాయవాది కార్ఖానీస్ ఈ అభిప్రాయంతో ఏకీభవించారు. ''అభివృద్ధి చెందిన దేశాలు కూడా యుథనేసియాకు చట్టబద్ధత కల్పించలేదు. ఎందుకంటే ఆ చట్టాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. యుథనేసియాకు చట్టబద్ధత కల్పించడం.. ఆత్మహత్యకు అనుమతినివ్వడం లాంటిది'' అని ఆయన అభివర్ణించారు.
''వైద్యశాస్త్రం రోగి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. అందుకే కొందరు వైద్యులు పాసివ్ యుథనేసియా భావనకు అంగీకరిస్తారు.. కానీ బేషరతుగా కాదు. అటువంటి రోగి మానసికంగా బాగున్నపుడు రాతపూర్వకంగా కోరితే అప్పుడు ఆ దరఖాస్తును పరిశీలించవచ్చు'' అని కార్ఖానీస్ పేర్కొన్నారు.

కోలుకునే అవకాశం లేనపుడే..
అయితే.. పాసివ్ యుథనేసియాకైనా అనుమతి లభించడం సులభం కాదు.
''సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. తీవ్రంగా జబ్బుపడిన రోగి.. వ్యాధి తుది దశలో ఉన్నపుడు, కోలుకునే అవకాశమే లేనపుడు మాత్రమే.. చనిపోయేందుకు అనుమతి పొందగలరు. ఆ నిర్ణయాన్ని హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ తీసుకుంటుంది. ఈ అంశంపై వైద్యుడు, నిపుణుల అభిప్రాయాలను కూడా వారు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది'' అని కార్ఖానీస్ వివరించారు.
''తీవ్రంగా జబ్బుపడిన రోగికి ఎక్కువ సమయం మిగిలి ఉండదు. ఆ రోగి యుథనేసియా కోరినపుడు ఈ సుదీర్ఘ ప్రక్రియ పూర్తవడానికి చాలా సమయం పడుతుంది. అంటే సదరు రోగికి ఈ అనుమతి లభించడం దాదాపు అసాధ్యం'' అని ఆయన అభిప్రాయపడ్డారు.
మార్చి 31 డెడ్‌లైన్
ఇప్పటికే పలుమార్లు పలువురు అధికారులకు తమ మరణానికి అనుమతి కోరుతూ విజ్ఞాపనలు చేసిన నారాయణ్, ఐరావతిలు తాజాగా 2018 మార్చి 31వ తేదీని ‘డెడ్‌లైన్‌గా ప్రకటించారు.
ఆలోపు కనుక తమకు అనుమతి ఇవ్వకుంటే తాము ప్రాణాలు తీసుకుంటామని వాళ్లు తెలిపారు.
గతేడాది డిసెంబర్‌లో రాష్ట్రపతికి కూడా వీళ్లు అనుమతి కోసం విజ్ఞప్తి చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









