‘ఉత్తర కొరియా స్పష్టమైన చర్యలు తీసుకుంటేనే కిమ్‌ను ట్రంప్ కలుస్తారు’

ఫొటో సోర్స్, AFP
ఉత్తర కొరియాను ఏకాకిగా నిలబెట్టేందుకు తాము చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చర్చలు జరిపేందుకు ఉత్తర కొరియా ముందుకు రావడమే అందుకు ఉదాహరణ అని ఆయన వ్యాఖ్యానించారు.
అణు నిరాయుధీకరణ కోసం నిర్దిష్టమైన శాశ్వత చర్యలు చేపట్టే వరకూ ఉత్తర కొరియాపై ఒత్తిడి కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
అప్పటి వరకు ఆ దేశంపై విధించిన ఆంక్షలను సడలించబోమని అన్నారు.
చర్చలకు ముందు అణ్వాయుధాలను విడనాడే దిశగా ఉత్తర కొరియా స్పష్టమైన చర్యలు చేపట్టాల్సిందే అని అమెరికా అధ్యక్ష కార్యాలయం డిమాండ్ చేసింది.

ఫొటో సోర్స్, STR/AFP/ GETTY IMAGES
ఇన్నాళ్లూ అమెరికా, ఉత్తర కొరియాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపించింది. ట్రంప్, కిమ్‌లు పరస్పరం వ్యక్తిగత దూషణలకు దిగారు.
కానీ, దక్షిణ కొరియా మధ్యవర్తిత్వంతో ఇప్పుడు ఆ వాతావరణం చల్లబడుతోంది.
అమెరికాతో చర్చలకు ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ ఆహ్వానం పలికారు. అందుకు డొనాల్డ్ ట్రంప్ కూడా అంగీకరించారు.
ఇంత వరకూ ఏ అమెరికా అధ్యక్షుడూ ఉత్తర కొరియా అధ్యక్షుడితో భేటీ కాలేదు.
మంచి పరిణామం: ట్రంప్
ఉత్తర కొరియాతో చర్చలు జరపడం మంచి పరిణామం అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. చర్చలు ఎక్కడ? ఎప్పుడు? జరపాలన్న విషయాలను నిర్ణయించాల్సి ఉందన్నారు.

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

అంతకు ముందు ఉత్తర కొరియా చర్చలకు ఆహ్వానించడాన్ని 'గొప్ప ముందడుగు'గా అభివర్ణించిన ట్రంప్, అణ్వాయుధాలను పూర్తిగా విడనాడే వరకూ ఆ దేశంపై ఆంక్షలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
గతంలో చర్చల సందర్భంగా క్షిపణి, అణ్వాయుధాల పరీక్షలను ఉత్తర కొరియా నిలుపుదల చేసింది. అయితే తనకు ఓపిక నశించినప్పుడు, తన డిమాండ్లు పరిష్కారం కానప్పుడు మళ్లీ ఆ ఆయుధాలను బయటకు తీసేందుకే అలా చేసిందన్నది విశ్లేషకుల అభిప్రాయం.
ఇప్పుడు కూడా ఏ స్పష్టత లేకుండానే ఉత్తర కొరియాను నమ్మితే, దాని ఉచ్చులో అమెరికా పడిపోయినట్టే అని కొందరు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
శాంతి దూత ఆయనే!
ఈ చర్చల కోసం దక్షిణ కొరియా మధ్యవర్తి పాత్ర పోషిస్తోంది.
"ఇటీవల శీతాకాల ఒలింపిక్స్ సందర్భంగా కొరియన్ల మధ్య స్నేహపూర్వక వాతావారణం ఏర్పడేందుకు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే- ఇన్ ఎంతో కృషి చేశారు.
మహిళల హాకీ జట్టులో ఇరు దేశాల క్రీడాకారులను కలిపారు. దక్షిణ కొరియాలో జరిగిన భయంకర దాడులకు ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొన్న ఉత్తర కొరియా ఆర్మీ అధికారిని కూడా ఆయన కలిశారు.
ఇక ఉత్తర కొరియా, అమెరికా మధ్య చర్చలు ఫలిస్తే అణు యుద్ధం ముప్పు దూరం కావచ్చు. మూన్ జే- ఇన్‌కి నోబెల్ శాంతి బహుమతి అందుకునే అవకాశమూ రావచ్చు!
చర్చలు విఫలమైతే పరిస్థితి మళ్లీ మొదటికి రావచ్చు" అని బీబీసీ సియోల్ ప్రతినిధి లౌరా బికర్ అభిప్రాయపడ్డారు.
ఈ వారం దక్షిణ కొరియా ప్రతినిధులు ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్‌ను కలిశారు. అక్కడ చర్చించిన విషయాలను వాషింగ్టన్ వెళ్లి ట్రంప్‌కి వివరించారు.
అనంతరం దక్షిణ కొరియా జాతీయ భద్రతా సలహాదారు చున్ వైట్‌హౌస్ బయట మీడియాతో మాట్లాడుతూ.. ''ఉత్తర కొరియా అణ్వాయుధ, క్షిపణి పరీక్షలు చేయదని కిమ్ ప్రతిజ్ఞ చేశారు. అణు నిరాయుధీకరణకు కట్టుబడి ఉంటామన్నారు. ట్రంప్‌తో కలిసి కూర్చుని చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కిమ్ తెలిపారు. ఇదే విషయాన్ని నేను ట్రంప్‌కు చెప్పాను'' అని చున్ వెల్లడించారు.

ఫొటో సోర్స్, Ed Jones/Getty
వేదిక ఎక్కడ?
డొనాల్డ్ ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్‌ల మధ్య చర్చలు ఎక్కడ జరుగుతాయన్న విషయం ఇంకా వెల్లడించలేదు.
కొరియా దేశాల సరిహద్దులో సైన్యాన్ని ఉపసంహరించిన ప్రాంతంలో(డీమిలిటరైజ్డ్ జోన్) లేదా చైనా రాజధాని బీజింగ్‌లో జరిగే అవకాశం ఉంది.
ఎజెండా ఏమిటి?
అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ అణ్వాయుధాల పరీక్షలు చేపడుతోందంటూ ఉత్తర కొరియాపై కొన్ని దశాబ్దాలుగా ఆరోపణలు ఉన్నాయి.
ఉత్తర కొరియా ఆరు సార్లు అణు పరీక్షలు నిర్వహించింది. అలాగే ఆ దేశ ఆయుధ సంపత్తిలో అమెరికాను చేరుకోగల ఖండాంతర క్షిపణులు కూడా ఉన్నాయి.
ఇప్పటికీ అణ్వాయుధాలను పూర్తిగా విడనాడుతామని మాత్రం ఉత్తర కొరియా ఎప్పుడూ చెప్పలేదు.
మరోవైపు, ఉ. కొరియాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ విషయాలన్నింటినీ అమెరికా లేవనెత్తే అవకాశం ఉంది.
ఇక ఉత్తర కొరియాకు కావాల్సింది, తనపై విధించిన ఆంక్షలను సడలించడం, ఎత్తివేయడమే.
ఒకవేళ అమెరికాతో చర్చలు సఫలమైతే కొరియా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు ముగింపు పడే అవకాశం ఉంటుంది.

ఫొటో సోర్స్, Reuters
ప్రపంచ దేశాల స్పందన
తాజా పరిణామాలను ఐక్యరాజ్య సమితి స్వాగతించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఫోన్‌లో మాట్లాడారు. పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఇరు వర్గాలూ చొరవ చూపాలని ఆయన కోరారు.
ఏళ్ల తరబడి కొనసాగుతున్న ప్రతిష్ఠంభనకు ముగింపు పలకాలని రష్యా, జర్మనీ, యూరప్, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థలు ఆకాంక్షించాయి.
ఉత్తర కొరియా అణ్వాయుధాలను విడనాడే వరకూ ఒత్తిడి కొనసాగించాలని జపాన్, బ్రిటన్ తదితర దేశాలు భావిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- అసలు న్యూక్లియర్ బటన్ ట్రంప్ వద్దే ఉంటుందా?
- ఆంక్షలకు లొంగేది లేదు: ఉత్తర కొరియా
- ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రొఫైల్
- ఉత్తర కొరియాకు మిత్రదేశాలు ఎన్ని?
- క్రీడల్లో భారత్ కంటే ఉత్తర కొరియానే ముందు!!
- ఉత్తర కొరియా క్రీడా చరిత్ర: ఒకసారి బాంబులు.. మరోసారి రాయబారాలు
- ఉత్తర కొరియాకు ఇంటర్నెట్ సేవలు ఎక్కడి నుంచి అందుతున్నాయి?
- ‘విదేశాలకు వెళ్లాలంటే వీసా చాలు.. ఉత్తర కొరియా వెళ్లాలంటే ధైర్యం కూడా కావాలి’
- దక్షిణ కొరియాలో తనిఖీలు చేస్తున్న కిమ్ జోంగ్ ‘మాజీ ప్రియురాలు’
- ఉత్తర కొరియాలో ఎక్కువగా తినే స్నాక్స్ ఇవే!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









