రామ్‌దేవ్ బాబా: ‘‘నోరు మూసుకో.. ఎక్కువ మాట్లాడకు, అది నీకు మంచిది కాదు’’ – పెట్రోలు ధరలపై ప్రశ్నలకు సమాధానం

రామ్‌దేవ్

ఫొటో సోర్స్, ANI

పెట్రోల్ ధరల పెరుగుదలపై ఓ జర్నలిస్టు ప్రశ్నించడంతో యోగా గురు రామ్‌దేవ్ బాబా సహనం కోల్పోయారు. ఆ జర్నలిస్టును ఆయన బెదిరిస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.

హరియాణాలోని కర్నాల్‌లో ఓ కార్యక్రమంలో ద్రవ్యోల్బణంపై రామ్‌దేవ్ మాట్లాడారు. దీంతో ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలపై ఓ జర్నలిస్టు వివరణ కోరారు.

యూపీఏ రెండో దఫా అధికారం చేపట్టినప్పుడు ధరల పెరుగుదలపై రామ్‌దేవ్ మాట్లాడారు. దేశంలో పెట్రోలు ధర రూ.40గా ఉండాలని, గ్యాస్ సిలెండర్ రూ.300కే సరఫరా చేయాలని అప్పట్లో ఆయన డిమాండ్ చేశారు.

ఈ విషయంపై జర్నలిస్టు వివరణ కోరగా రామ్‌దేవ్ అగ్రహం వ్యక్తంచేశారు.

రామ్‌దేవ్

ఫొటో సోర్స్, ANI

రామ్‌దేవ్ ఏం చెప్పారు?

కర్నాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ధరల పెరుగుదలపై మాట్లాడుతూ ప్రజలు మరింత కష్టపడాల్సిన అవసరముందని ఆయన సూచించారు.

‘‘చమురు ధరలను తగ్గిస్తే తమ పన్ను ఆదాయం తగ్గిపోతుందని ప్రభుత్వం చెబుతోంది. పన్ను ఆదాయం తగ్గిపోతే, దేశాన్ని నడిపించడం కూడా కష్టం అవుతోంది. సైన్యానికి ఆయుధాలు, రోడ్లు, నౌకాశ్రయాల నిర్మాణం ఇలా అన్నీ కష్టం అవుతాయి’’అని రామ్‌దేవ్ అన్నారు.

‘‘ధరలు తగ్గాలంటే, మనం మరింత కష్టపడాలి. ఒక సన్యాసిని అయ్యుండి నేను కూడా ఉదయం 4 గంటలకు నిద్రలేస్తాను. రాత్రి 10 గంటల తర్వాతే పడుకుంటాను. దేశంలోని ప్రజలంతా అలానే కష్టపడాలి’’అని ఆయన అన్నారు.

దీంతో గతంలో ఆయన పెట్రోల్ ధర రూ.40కు తగ్గించాలని వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ఓ జర్నలిస్టు గుర్తుచేశారు.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్: యుద్ధం మొదలై నెల రోజులు దాటినా వెనక్కి తగ్గేదే లేదంటున్న సైన్యం

ఆ ప్రశ్న వినడంతో రామ్‌దేవ్ సహనం కోల్పోయారు. మొదట ఆయన సమాధానం చెప్పడానికి నిరాకరించారు. అయితే, ఆ జర్నలిస్టు ఆ ప్రశ్నను మళ్లీ మళ్లీ అడిగారు. దీంతో రామ్‌దేవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

‘‘అవును అన్నాను. అయితే, ఇప్పుడు ఏం చేస్తారు? ఇలాంటి ప్రశ్నలు అడగొద్దు. మీరేమైనా నాకు కాంట్రాక్టరా? మీరు అడిగిన ప్రశ్నలన్నింటికీ నేను సమాధానాలు చెప్పాలా?’’అని రామ్‌దేవ్ అన్నారు. కాస్త పద్ధతిగా నడుచుకోవాలని ఆ జర్నలిస్టుకు సూచించారు.

ఆ తర్వాత మళ్లీ ఆ జర్నలిస్టు అదే ప్రశ్న అడిగారు. దీంతో ఆ జర్నలిస్టు వైపు వేలు చూపిస్తూ.. ‘‘అవును. ఆ వ్యాఖ్యలు నేనే చేశాను. ఇప్పుడు ఏం చేస్తావు? నోరు మూసుకో. ఇంకోసారి మళ్లీ ఆ ప్రశ్న అడిగితే, నీకు అంత మంచిదికాదు. మళ్లీ మళ్లీ అలానే మాట్లాడకు. మంచి కుటుంబం నుంచి వచ్చినట్లు ఉన్నావు’’అని రామ్‌దేవ్ అన్నారు.

రామ్‌దేవ్ హెచ్చరించినట్లుగా కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ట్యాగ్ చేస్తూ హన్స్‌రాజ్ మెహతా అనే ట్విటర్ యూజర్ స్పందిస్తూ.. ‘‘2014 ఎన్నికలకు ముందు బీజేపీకి మద్దతుగా రామ్‌దేవ్ విస్తృతంగా ప్రచారం చేశారు. అప్పుడే ఈ వ్యాఖ్యలు చేశారు’’అని వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

మరోవైపు కొందరు రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి ఉత్పత్తులను నిషేధించాలని, అసలు వీటిని ఉపయోగించకూడదని డిమాండ్ చేశారు.

వీడియో క్యాప్షన్, శ్రీశైలం: స్థానికులకు, కన్నడిగులకు మధ్య ఎందుకీ ఘర్షణ?

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)