ప్రెస్ రివ్యూ: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ

ఫొటో సోర్స్, Getty Images
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ
శాసనసభ సమావేశాల్లో అధికార, విపక్షాల పాత్రను తెదేపానే పోషించాలని, నిర్మాణాత్మక ప్రతిపక్షంగానూ వ్యహరించాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
వచ్చే ఎన్నికల్లో 175 శాసనసభ స్థానాల్నీ తెదేపానే గెలవాలని తాను ఎందుకన్నానో నిరూపించేందుకు ఈ సమావేశాల్ని అవకాశంగా తీసుకోవాలన్నారు.
సమావేశాలు జరిగిన 10 రోజులూ మంత్రులంతా విధిగా హాజరవ్వాలన్నారు. సభ్యులంతా ఉదయం 9 నుంచి 2 గంటల వరకు సభలో ఉండాల్సిందేనని తెలిపారు.
గురువారం సాయంత్రం శాసనసభలోని కమిటీ హాల్‌లో తెదేపా శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు.
''శాసనసభలో 10 రోజులు 10 ప్రాధాన్యతాంశాలపై చర్చ జరగాలి. మొదటి రోజు పట్టిసీమపై చర్చిద్దాం. మనలో మనల్ని పొగుడుకోవడం, సభకు రాని ప్రతిపక్ష సభ్యులపై విమర్శలు చేయవద్దు'' అని చంద్రబాబు తెలిపారు.
ప్రభుత్వం నిరంతరం బాధ్యతతో మన కోసమే పనిచేస్తోందన్న భావన, నమ్మకం ప్రజల్లో ఈ సమావేశాల ద్వారా కల్పించాలని చెప్పారని 'ఈనాడు' పేర్కొంది.

ఫొటో సోర్స్, DESHAKALYAN CHOWDHURY
నంద్యాలలో నకిలీ మందుల కలకలం
కర్నూలు జిల్లా నంద్యాలలో బయటపడిన నకిలీ మందుల రాకెట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది.
ఒకటీ రెండు కాదు... ఏకంగా ఎనిమిది రకాలకు చెందిన 60 కోట్ల విలువైన నకిలీ మందులు జనంలోకి వెళ్లిపోయాయి.
ఇప్పటిదాకా గుర్తించింది ఇది! ఇంకా... ఎన్నెన్ని రకాలు, ఎన్ని కోట్ల విలువైన నకిలీ మందులను జనానికి అంటగడుతున్నారో ఎవ్వరికీ తెలియదు.
గుంటూరు జిల్లా నరసరావుపేట కేంద్రంగా ఈ నకిలీ దందా సాగినట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి గుంటూరుతోపాటు కర్నూలు, కడప, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లోని పలు పట్టణాలకు నకిలీలు సరఫరా అయ్యాయి.
ప్రముఖ కంపెనీలకు చెందిన 8 రకాల ఔషధాలను నకిలీలు తయారు చేయించి మార్కెట్‌లోకి వదిలేశారు.
మరీ ముఖ్యంగా జాన్సన్ అండ్ జాన్సన్, టొరంటో కంపెనీల ఉత్పత్తులపై పడ్డారు.
రూ.60.50 కోట్ల విలువైన నకిలీ ఔషధాలు తమ ద్వారా సరఫరా అయినట్లు గుర్తించిన కొందరు హోల్‌సేల్ డీలర్లు, ఆ బ్యాచ్ మందులను వెనక్కి పంపాలని కోరారు.
కానీ... కేవలం 50 లక్షల విలువైనవే వెనక్కి వచ్చాయి. అంటే... ఇంకా 60 కోట్ల విలువైన ఔషధాలు జనం ఇప్పటికే మింగడమో, అమ్మకానికి సిద్ధంగానో ఉన్నాయని 'ఆంధ్రజ్యోతి' ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది.

ఫొటో సోర్స్, NOAH SEELAM/Getty Images
ఇటు నిజాం రాజు, అటు కాటన్ దొర.. ఇద్దరిలో ఎవరు గొప్ప?
తెలంగాణ ఉద్యమ సమయంలో నిజాం వారసుల విన్నపం మేరకు తాను నిజాం సమాధిని దర్శించానని, దీనిపై అప్పట్లో తనను చాలా విమర్శించారని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.
''నిజాం సమాధిని ఎందుకు సందర్శించారంటూ ఓ ఆంధ్రా విలేకరి నన్ను అడిగారు. అప్పుడు నేను 'మీరు కాటన్ దొర ఉత్సవాలు ఎందుకు చేస్తర'ని అడిగిన. దాంతో ఆ విలేకరి 'కాటన్ మాకు ఆనకట్ట కట్టించాడు. సాగుకు అవకాశం కల్పించాడు'అని చెప్పిండు."
"మరి 200 ఏళ్లపాటు దేశాన్ని దోచుకున్న బ్రిటిష్ ప్రభుత్వంలోని మిలటరీ ఇంజినీర్ కాటన్‌ను పూజిస్తే... నిజామాబాద్‌లో నిజాంసాగర్ ప్రాజెక్టు కట్టి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన నిజాంను కీర్తించడం తప్పా?"
"కాటన్ మనోడు కాదు. కానీ ఉజ్వల తెలంగాణ చరిత్రలో నిజాం పాలన భాగం. ఆయన మనవాడు."
"నిజాం బొక్కల దవాఖాన (ప్రస్తుత నిమ్స్)ను నిర్మించిండు. దానికి స్థలమిచ్చి, సొంత డబ్బులతో నిర్మించిండు."
"చైనాతో యుద్ధం తర్వాత మన దేశం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే తనకు చెందిన ఆరు టన్నుల బంగారాన్ని నాటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రికి ఇచ్చిండు. తిరిగి చెల్లిస్తానని శాస్త్రి అన్నా ఒప్పుకోలేదు. ఇది వాస్తవం."
"నిజాం పాలన గొప్పతనం జనంలోకి పోయేలా చరిత్రను తిరగరాస్తం'' అని ముఖ్యమంత్రి పేర్కొన్నారంటూ 'సాక్షి' ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది.

ఫొటో సోర్స్, Getty Images
గుజరాత్ సీఎం విజయ్ రూపానీ సంస్థకు రూ. 15 లక్షల జరిమానా
వ్యాపార నిబంధనలను ఉల్లంఘించినందుకు విజయ్ రూపాణీ కుటుంబానికి చెందిన సంస్థ సహా 22 సంస్థలకు రూ. 6.9 కోట్ల జరిమానా విధిస్తున్నట్టు మార్కెట్ పెట్టుబడుల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) తెలిపింది.
రూపాణీకి చెందిన హిందూ యునైటెడ్ ఫ్యామిలీ (హెచ్‌యూఎఫ్) సహా మొత్తం 22 సంస్థలకు ఈ ఏడాది అక్టోబర్ 27న జరిమానా విధిస్తూ సెబీ ఆదేశాలు జారీ చేసింది.
సరంగ్ కెమికల్స్ అనే కంపెనీలో ఈ సంస్థల మధ్య (అంతర్గత) షేర్ల లావాదేవీల్లో విలువల్ని కృత్రిమంగా సృష్టించినట్టు సెబీ తన దర్యాప్తులో తేల్చింది.
రూపాణీ కుటుంబానికి చెందిన సంస్థపై రూ.15 లక్షలు, మరో ముగ్గురిపై రూ.70 లక్షల చొప్పున జరిమానా విధించింది.
బ్రోకర్లుగా వ్యవహరించిన 21వ, 22వ నిందితులకు రూ. 8 లక్షల చొప్పున జరిమానా విధించింది.
వీరందరికీ ఉమ్మడిగా 2016, మే 6న మోసపూరిత వాణిజ్య కార్యకలాపాల నిరోధక (పీఎఫ్‌యూటీపీ) చట్టం కింద షోకాజ్ నోటీసులను సెబీ జారీ చేసింది.
అదే ఏడాది ఆగస్టు 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపాణీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం గమనార్హం.
2011 జనవరి 3 నుంచి జూన్ 8 వరకు సరంగ్ కెమికల్స్‌కు సంబంధించి జరిగిన షేర్ల లావాదేవీలపై సెబీ దర్యాప్తు జరిపింది.
నోటీసులు అందుకున్న నిందితుల జాబితాలో రూపానీకి చెందిన హెచ్‌యూఎఫ్ 18వ స్థానంలో ఉన్నది. షోకాజ్ నోటీసుకు ఆ సంస్థ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని సెబీ తెలిపిందని 'నవతెలంగాణ' ఓ వార్త ప్రచురించింది.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








