Beyond Meat : ఐదేళ్లలో లాభాలే ప్రకటించని సంస్థ షేర్లు ఒక్కసారిగా వెయ్యిశాతం పెరగడం దేనికి సంకేతం? మార్కెట్‌లో అసలేం జరుగుతోంది?

వాల్‌స్ట్రీట్, బియాండ్ మీట్ షేర్, స్టాక్ మార్కెట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2025 ఫిబ్రవరిలోబియాండ్ మీట్ తన సిబ్బందిలో 6 శాతం మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది.
    • రచయిత, డేనియల్ కేయే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బియాండ్ మీట్ సంస్థ తయారు చేసే శాకాహార బర్గర్లకు పెద్దగా డిమాండ్ లేదు. కానీ ఆ సంస్థ షేర్లపై ట్రేడర్లకు విపరీతమైన ఆసక్తి పెరిగింది.

నాలుగు రోజుల్లో ఈ షేరు విలువ 1000 శాతం కంటే ఎక్కువగా పెరిగింది. 2019లో మార్కెట్‌లోకి అడుగుపెట్టిన తరువాత షేరు ధర దాదాపు తుడిచి పెట్టుకుపోయిన స్థితిని అనుభవించిన కంపెనీకి తాజా డిమాండ్ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.

వినియోగదారులు ప్రత్యామ్నాయ మాంస ఉత్పత్తులపై అంతగా ఆసక్తికనపరచక పోవడంతో ఈ కంపెనీ విక్రయాలు మందగించి, గత ఐదేళ్లుగా ఒక ఒక్క త్రైమాసిక లాభాన్ని కూడా వెల్లడించలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గత ఐదేళ్లలో లాభాలే కళ్లచూడని కంపెనీ షేర్ల ధరల పెరుగుదల దేనికి సంకేతం? ఇది ఆన్‌లైన్ పెట్టుబడిదారుల ఉత్సాహమా, లేక స్టాక్‌మార్కెట్‌లో షేర్ల విలువ వాటి అసలు స్థాయికి మించి పెరుగుతోందా అనే చర్చను మళ్లీ లేవనెత్తింది.

గత మూడు ట్రేడింగ్ సెషన్ల నుంచి లాభాలు కొనసాగించిన సంస్థ బుధవారం 112 శాతం పెరిగింది. దీంతో షేరు ధర దాదాపుగా 7డాలర్ల మేర పెరిగింది. కానీ ట్రేడింగ్ చివరి దశలో 'బియాండ్ మీట్' షేరు ధర ఒక శాతం తగ్గి 3.60 డాలర్ల వద్ద ముగిసింది.

వాల్‌స్ట్రీట్, బియాండ్ మీట్ షేర్, స్టాక్ మార్కెట్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఆకు కూరలతో చేసిన బర్గర్లను అమ్మే బియాంట్ మీట్ షేర్ ధర అమెరికన్ షేర్ మార్కెట్‌లో అనూహ్యంగా పెరిగింది.

వాల్‌మార్ట్‌తో ఒప్పందం

కిందటివారం ఓ రెడ్టిట్ యూజర్ చేసిన పోస్టు పెట్టుబడిదారుల కొనుగోళ్లకు ఊతమిచ్చింది. దీన్ని గేమ్స్ స్టాప్, ఏఎంసీ వంటి మీమ్ స్టాక్ ర్యాలీలతో పోల్చుతున్నారు.

మీమ్ స్టాక్ అంటే ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యే స్టాక్. ఒక వీడియో లేదా మెసేజ్ వైరల్ అయినట్లే మీమ్ స్టాక్ కూడా వైరల్ అవుతుంది.

రౌండ్ హిల్ ఇన్వెస్ట్‌మెంట్స్ సంస్థ సోమవారం తన మీమ్ స్టాక్ ఈటీఎఫ్‌ల (ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్) జాబితాలో బియాండ్ మీట్ సంస్థను కూడా చేర్చడంతో ఇన్వెస్టర్లు షార్ట్ సెల్లింగ్ చేశారు. కానీ షేర్ ధర పెరగడంతో వారు తమ నష్టాలను భర్తీ చేసుకోవడానికి తిరిగి షేర్లను కొనుగోలు చేయాల్సి వచ్చింది. దీంతో షేర్ల ధరలు మరింత పెరిగాయి.

మార్కెట్‌లో తమ కంపెనీ షేరు ర్యాలీ కొనసాగుతున్న సమయంలోనే తమ ఉత్పత్తులను పంపిణీ చేసేందుకు వాల్‌మార్ట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బియాండ్ మీట్ మంగళవారం ప్రకటించింది.

ఈ ప్రకటన అప్పటికే జోరు మీదున్న సంస్థ షేర్ల కొనుగోళ్లను పరుగులు పెట్టించింది.

"ఈ సంస్థ చాలా కాలం క్రితమే దివాలా తీస్తుందని అనుకున్నారు" అని మార్కెట్ వ్యూహకర్త మార్క్ హెకెట్ చెప్పారు.

"వాల్‌మార్ట్‌తో ఒప్పందం వల్ల ఏర్పడిన సానుకూల పరిస్థితులతో ఈ సంస్థ ఉత్పత్తులకు గిరాకీ పెరిగితే బియాండ్ మీట్ పుంజుకుంటుంది. ఈ ఆలోచనే ఇన్వెస్టర్లను ఈ సంస్థ షేర్ల వైపు నడిపించింది" అని ఆయన చెప్పారు.

వాల్‌స్ట్రీట్, బియాండ్ మీట్ షేర్, స్టాక్ మార్కెట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికన్ స్టాక్ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితుల వల్లే మీమ్ స్టాక్‌లు విజృంభిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

మార్కెట్‌లో భయాలు

అయితే వాల్‌మార్ట్‌తో ఒప్పందం అన్ని సమస్యల్ని పరిష్కరించదని ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని హాకెట్ సూచించారు.

"మీరు మార్కెట్ సూత్రాల ఆధారంగా కాకుండా భావోద్వేగాలు, అంచనాల మీద ట్రేడింగ్ చేస్తున్నారు" అని హెకెట్ అన్నారు.

బియాండ్ మీట్ షేర్ దూసుకుపోతున్నా.. ఆ సంస్థ పరిస్థితి ఇప్పటికీ గొప్పగా లేదు. ప్రస్తుతం ఈ సంస్థ షేరు ధర 2019లో దాని ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 230 డాలర్ల కంటే తక్కువగానే ఉంది.

స్టాక్ మార్కెట్‌లో కరెక్షన్ జరగవచ్చనే ఆందోళనలు వ్యాప్తి చెందుతున్న సమయంలో బియాండ్ మీట్ లాంటి మీమ్ షేర్ విజృంభణ కొనసాగుతోంది.

ఆర్టిఫిషియల్ ఇండస్ట్రీ అనే బుడగ పేలిపోవచ్చని స్టాక్ మార్కెట్‌లో భయాలు ఉన్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు పెడుతున్న పెట్టుబడులతో ఆర్థిక వ్యవస్థ ఎలా మలుపు తిరుగుతుందో విశ్లేషిస్తున్న సమయంలో ఈ భయాలు మరింత పెరిగాయి.

జేపీ మోర్గాన్ ఛేజ్ సంస్థ అధిపతి జేమీ డిమన్ ఇలాంటి ఆందోళనలను వ్యక్తం చేశారు.

రాబోయే ఆరునెలల నుంచి రెండేళ్లలో మార్కెట్‌లో పెద్ద కుదుపు వస్తుందని తాను "ఇతరుల కంటే ఎక్కువ ఆందోళన చెందుతున్నట్లు" ఆయన చెప్పారు.

మీమ్ స్టాక్స్‌తో మార్కెట్ కుదుపులకు లోను కావచ్చని ది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ కూడా భావిస్తోంది. పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఇన్వెస్టర్లను హెచ్చరించింది.

షార్ట్ సెల్లింగ్, సోషల్ మీడియా ఆధారంగా జరిగే ట్రేడింగ్‌పై కఠిన నియమాలు పెట్టాలని కొంతమంది కోరుతున్నారు.

అయితే అలాంటి ప్రతిపాదనలను అమలవుతాయనే ఆశలు చాలా తక్కువగా ఉన్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)