అభిప్రాయం: మైనారిటీల ముసుగులో మహిళలను ఇంకా ఎంతకాలం అణచివేస్తారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జకియా సోమన్
- హోదా, బీబీసీ కోసం
గత కొన్నేళ్లుగా ముస్లిం మహిళలు ట్రిపుల్ తలాక్‌కి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారు. ఈ చరిత్రాత్మక ఉద్యమం ప్రభావం భారత ప్రజాస్వామ్యంతోపాటూ ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజాలపైనా ఉంది.
ముస్లిం మహిళలు ప్రజాస్వామ్యబద్ధంగా చేసిన ఉద్యమంతో సుప్రీంకోర్టు, పార్లమెంటు, ప్రభుత్వం, రాజకీయ పార్టీలు కొన్ని చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. ఫలితంగానే ట్రిపుల్ తలాక్ వ్యతిరేక ముస్లిం విమెన్ (ప్రొటెక్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ మ్యారేజ్) బిల్లు, 2017 తీసుకొచ్చారు.
ఈ చట్టం గురించి తెలుసుకునేముందు దీని నేపథ్యం ఒకసారి చూద్దాం.
మహిళలకు న్యాయం, సమానత్వం విషయంలో అది హిందూ, ముస్లిం, క్రైస్తవ మహిళలైనా సరే, దేశంలో ఎప్పుడూ రాజకీయాలు చేస్తూనే వచ్చారు. గతంలో సతీసహగమనం, వితంతు వివాహాల గురించి రాజకీయాలు జరిగితే, శబరిమల, ఇతర ఆలయాల్లో మహిళల ప్రవేశం గురించి ఇప్పటికీ వివాదం నడుస్తూనే ఉంది.
కానీ పితృస్వామ్య రాజకీయాలకు అత్యంత ఎక్కువగా ముస్లిం మహిళలే బలయ్యారంటే అది అతిశయోక్తి కాదు. సంప్రదాయ మత సమూహాల సామాజిక, రాజకీయ ఆధిపత్యానికి గురైన ముస్లిం మహిళలు గొంతు ఎప్పుడూ నొక్కేస్తూనే ఉన్నారు.
అంతే కాదు ముస్లిం మహిళలు తమ మత గ్రంథం ఖురాన్, భారతీయ రాజ్యాంగంలో ఇచ్చిన హక్కులను కూడా కోల్పోయారు.

ఫొటో సోర్స్, EPA
ఇస్లాంలో మధ్యవర్తులకు చోటు లేదు
పురుషాధిక్యత ఉన్న ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డ్ లాంటివి ముస్లిం చట్టాల సవరణను వ్యతిరేకిస్తూనే వచ్చాయి. దాంతో పవిత్ర ఖురాన్ గ్రంథంలో లేకపోయినప్పటికీ, ట్రిపుల్ తలాక్ దేశంలో చెల్లుబాటు అవుతూ వచ్చింది.
న్యాయం కోసం మహిళలు కోర్టు తలుపు తడితే, పర్సనల్ లాబోర్డు మా మతంలో జోక్యం చేసుకునే హక్కు కోర్టుకు, ప్రభుత్వానికి లేదని చెబుతుంది. ఇక్కడ మతంలో అన్నిటికంటే ఎక్కువ జోక్యం చేసుకుంది ట్రిపుల్ తలాక్ అనేది వాస్తవం.
ట్రిపుల్ తలాక్, హలాలా లాంటి అమానవీయ, ఇస్లాం వ్యతిరేక చట్టాలు చేసినప్పుడు పర్సనల్ లా బోర్డ్ మౌనంగా ఉంటుంది. ముస్లిం మహిళలకు న్యాయం చేయాలనుకున్నప్పుడు మాత్రం వారికి మతం గుర్తుకు వస్తుంది.
ఇక అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న ఇంకొకటి ఉంది. అసలు పర్సనల్ లా బోర్డ్‌కు మతం గురించి మాట్లాడే అధికారం ఎవరిచ్చారు. ఇస్లాంలో అల్లాకు, మనిషికి మధ్య నేరుగా బంధం ఉంటుంది. ఇక్కడ మధ్యవర్తులకు ఎలాంటి చోటు లేదు.
ముస్లిం మహిళలు ఈ దేశ పౌరులు కూడా. ఖురాన్ హక్కులతోపాటూ భారత పౌరులుగా వారికి రాజ్యాంగ హక్కులూ లభిస్తాయి.
కానీ దేశంలో ముస్లిం చట్టం లేకపోవడంతో ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా లాంటి దారుణమైన చట్టాలు నడుస్తున్నాయి.
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా మహిళలకు ట్రిపుల్ తలాక్ ఇస్తున్నారు. అంతే కాదు. ట్రిపుల్ తలాక్ చెప్పి రాత్రికిరాత్రే ఇంటి నుంచి గెంటేసిన ఘటనలు కూడా ఎన్నో జరిగాయి.
అంటే ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధం అని చెప్పిన సుప్రీంకోర్టు తీర్పు ముస్లిం మహిళల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపించడం లేదు. అలా ఇంటి నుంచి గెంటేసిన మహిళల ఫిర్యాదులు ఎక్కడా నమోదు కావు.
ఎందుకంటే ఆ కేసులు ఏ చట్టం ప్రకారం నమోదు చేయాలి అని పోలీసులు అడుగుతారు. అందుకే ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా దేశంలో వెంటనే ఒక చట్టం అవసరం అనేది సుస్పష్టం.

ఫొటో సోర్స్, AFP
చట్టాన్ని అందరూ గౌరవించాలి
కేంద్ర ప్రభుత్వం బుధవారం( సెప్టంబర్ 19న) ముస్లిం విమెన్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్) బిల్, 2017 ఆర్డినెన్స్ తీసుకొస్తున్నట్టు ప్రకటించింది.
ఈ చట్టం అన్ని పార్టీల భాగస్వామ్యంతో జరిగుంటే బాగుండేది. ఈ బిల్లు ఉభయసభల్లో పాస్ అయ్యుంటే బాగుండేది. అది మన ప్రజాస్వామ్యంలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచేది.
కోర్టు తీర్పులో కూడా చీఫ్ జస్టిస్ కెహర్ 'దీనిని చట్టం చేసే పని పార్లమెంటుది, కోర్టు తీర్పును ముందుకు తీసుకెళ్లడం మంచిది' అని వ్యాఖ్యానించారు.
ముస్లిం విమెన్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్) బిల్, 2017 డ్రాఫ్టుకు కేంద్రం కొన్ని అవసరమైన మెరుగులు కూడా దిద్దింది. దీని ప్రకారం ఒక మహిళకు ట్రిపుల్ తలాక్ చెబితే భార్య, లేదా ఆమె కుటుంబ సభ్యులు భర్తపై కేసు పెట్టవచ్చు.
భార్యాభర్తల మధ్య సయోధ్య కుదిరితే కేసు వాపసు తీసుకునే నియమం కూడా ఉంది. అంతే కాదు, మహిళకు పరిహారం కూడా లభిస్తుంది. మేజిస్ట్రేట్‌కు సబబు అనిపిస్తే భర్తను బెయిలుపై విడుదల చేసే నియమం కూడా ఉంది.
ఈ కేసులో సయోధ్య కుదరకపోతే భర్తకు జరిమానా, మూడేళ్ల వరకూ జైలు శిక్ష పడవచ్చు.

ఫొటో సోర్స్, SAM PANTHAKY/AFP/GETTY IMAGES
మహిళల హక్కులు ఎంతకాలం కాలరాస్తారు?
కానీ, ఈ చట్టం రాకముందు నుంచే దీనికి వ్యతిరేకంగా సంప్రదాయ శక్తులు ప్రచారాలు మొదలు పెట్టాయి. ఈ చ్టటం ద్వారా ముస్లింలను జైలుకు పంపే కుట్ర జరుగుతోందని ఆరోపించాయి.
కానీ జైలుకెళ్లాలంటే అంత భయం ఉన్నప్పుడు ఆ నేరం చేయకుండా ఉండడమే మంచిది. తలాక్ ఇవ్వాలనుకుంటే అల్లా చెప్పిన పద్ధతిలో తలాక్ చెప్పాలి. అప్పుడు భార్యకు పూర్తి న్యాయం లభిస్తుంది.
కానీ ముస్లిం పురుషుల్లో ఇప్పటికీ మార్పు రాకుంటే వారికి కూడా హిందూ చట్టంలో బహుభార్యత్వానికి, కట్నం తీసుకునేవారికి ఏం జరుగుతుందో అదే జరుగుతుంది.
మొదటి భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకంటే హిందూ పురుషులకు ఏడేళ్ల జైలు శిక్ష పడుతుంది.
చట్టాన్ని దేశంలో అందరూ గౌరవించాలి. మైనారిటీల ముసుగులో ముస్లిం మహిళల హక్కులను ఇలా ఎప్పటివరకూ కాలరాస్తారు?
ఇప్పుడు ముస్లిం మహిళల్లో చైతన్యం వచ్చింది. వారు గళమెత్తి తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. ఈ చట్టం కుటుంబ వ్యవహారాల్లో బాధితులైన ముస్లిం మహిళలకు న్యాయం అందేలా చేస్తుంది.
ఇవి కూడా చదవండి:
- తండ్రికి అంత్యక్రియలు చేసిన నలుగురు అక్కచెల్లెళ్లు.. వెలివేసిన గ్రామస్థులు
- ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ ఎవరు?
- అసాధారణ చిత్రకళతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న యువతి
- మరి ‘రాఫెల్’తో సైన్యం స్థైర్యం దెబ్బతినదా: రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌కు సిద్ధూ ప్రశ్న
- నమాజ్‌కు షరతులు విధిస్తున్నారంటూ ముస్లింల ఆరోపణ... హరియాణా గ్రామంలో ఉద్రిక్తత
- జెట్ ఎయిర్వేస్: విమానంలో కేబిన్ ప్రెషర్ మరచిన పైలట్లు.. ప్రయాణికుల అస్వస్థత
- ప్రసవం తర్వాత మహిళల కుంగుబాటు లక్షణాలేంటి? ఎలా బయటపడాలి?
- మూడు బ్యాంకుల విలీనంతో సామాన్యుడికి లాభమేంటి?
- BBC EXCLUSIVE: బంగ్లాదేశ్ మొదటి హిందూ చీఫ్ జస్టిస్ దేశ బహిష్కరణ
- సహారా ఎడారి వెంట ప్రహరీ కట్టండి.. స్పెయిన్‌కు డోనల్డ్ ట్రంప్ సలహా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








