తండ్రికి అంత్యక్రియలు చేసిన నలుగురు అక్కచెల్లెళ్లు.. వెలివేసిన గ్రామస్థులు

- రచయిత, కమలేష్
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘మేం కష్టాల్లో ఉన్నప్పుడు మమ్మల్నీ, మా నాన్ననూ ఎవరూ చూసుకోలేదు. అన్ని బాధ్యతలనూ మేమే మోశాం. అలాంటప్పుడు నాన్న పోయాక ఆయన పాడెను మోస్తే, చితికి నిప్పంటిస్తే తప్పేంటి?’ అని ప్రశ్నిస్తున్నారు మీనా.
ఇటీవల తమ తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించినందుకు మీనా కుటుంబాన్ని బంధువులూ, గ్రామస్థులూ వెలివేశారు.
రాజస్థాన్‌లోని బుండీ గ్రామం మీనా స్వస్థలం. ప్రస్తుతం ఆమె పెళ్లి చేసుకొని కోటా అనే గ్రామంలో ఉంటున్నారు. మూడు నెలల క్రితం మీనా తండ్రి దుర్గా శంకర్ చనిపోయారు.
తండ్రికి అంతిమసంస్కారాలు తామే నిర్వహించాలని, చితికి తమ చేతులతోనే నిప్పు పెట్టాలని మీనాతో పాటు ఆమె ముగ్గురు అక్కచెల్లెళ్లూ నిర్ణయించుకున్నారు. దాంతో, ఆ కష్ట సమయంలోనూ బంధువులు, గ్రామస్థులు వాళ్లను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయారు.

ఆ సంఘటన గురించి మీనా మాట్లాడుతూ... ‘‘2012 వరకూ నాన్న కష్టంతోనే ఇల్లు నడిచేది. కానీ ఆ ఏడాది నాన్నకు పక్షవాతం రావడంతో మంచాన పడ్డారు. అప్పట్నుంచీ కుటుంబ పరిస్థితి దిగజారుతూ వచ్చింది. అమ్మతో పాటు మా అక్కచెల్లెళ్లు నలుగురం చిన్నచిన్న పనులు చేస్తూ ఇంటి ఖర్చులకు డబ్బు సంపాదించేవాళ్లం.
ఆ సమయంలో బంధువులెవరూ మాకు ఎలాంటి సాయం చేయలేదు. మా పెళ్లిళ్ల కోసం మేం ఎన్ని ఇబ్బందులు పడ్డామో మాకే తెలుసు. తరువాత అత్తింటివాళ్లే మాకు అండగా నిలబడ్డారు.
‘మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ మనకు సాయం చేయలేదు. అన్ని బాధ్యతలూ మీరే మోశారు. కాబట్టి నేను చనిపోయాక కూడా మీరే నాకు తలకొరివి పెట్టాలి’ అని నాన్న ఓసారి మాతో అన్నారు. ఆయన కోరిక తీర్చాలని మేం ఆ క్షణమే నిర్ణయించుకున్నాం’’ అని వివరించారమె.
కానీ తండ్రికి అంత్యక్రియలు నిర్వహించినందుకు మీనా కుటుంబం మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది. ఆమె కుటుంబాన్ని బంధువులూ, గ్రామస్థులూ వెలివేశారు. ఆ రోజు నుంచీ అందరూ వాళ్లతో మాట్లాడటం మానేశారు.

‘‘ఆ రోజు నాన్న కోసం పాడెను సిద్ధం చేయగానే, దాన్ని ఎత్తడానికి మేం లేచి నిలబడ్డాం. అందరూ కంగారుపడి మమ్మల్ని వెనక్కులాగారు. మేం అంత్యక్రియలు నిర్వహించాలనేది నాన్న ఆఖరి కోరికని చెప్పినా వారు ఒప్పుకోలేదు.
‘అమ్మాయిలు ఈ పని చేయడమేంటి? మేమంతా చచ్చిపోయామనుకున్నారా?’ అంటూ చిన్నాన్న, పెదనాన్నలు మండిపడ్డారు. పాడెను మోయకుండానే కోపంతో వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు’’ అని చెప్పారు మీనా.
కానీ అక్కడితో అది ఆగలేదు. వాళ్లు చేస్తున్న పని చూసి గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. అంతకుముందెప్పుడూ వాళ్లు అలాంటి దృశ్యాన్ని చూడలేదు. విషయం పంచాయతీ దాకా వెళ్లింది. దాంతో ఆ కుటుంబాన్ని పంచాయతీ పెద్దలు గ్రామం నుంచి వెలివేశారు.
‘గ్రామంలో ఎవరైనా చనిపోతే అంతిమ సంస్కారాలు నిర్వహించినవారు గ్రామంలోని కమ్యూనిటీ హాల్‌కు వచ్చి, అక్కడ స్నానం చేయడం ఆనవాయితీ. కానీ మేం అక్కడికి వెళ్లే సరికి ఆ భవనానికి తాళం వేసి ఉంది. దాంతో మాకు విషయం అర్థమైంది’ అన్నారు మీనా.

‘అలాంటి సమయంలో ఎవరైనా అండగా నిలుస్తారు. కలవడానికి ఇంటికి వస్తారు. కానీ మమ్మల్ని మాత్రం ఒంటరిగా వదిలేశారు. ఎవరైనా చనిపోతే, ఆ రోజు వాళ్లింట్లో వంట చేయరు. చుట్టుపక్కల వాళ్లే వండిపెడతారు. కానీ మాకు మాత్రం ఎవరూ భోజనం పెట్టలేదు. మేం సంప్రదాయాన్ని ఉల్లంఘిస్తూ, ఇంట్లోనే వంట చేసుకోవాల్సి వచ్చింది.
ఒక పక్క నాన్న చనిపోయాడన్న బాధ, మరో పక్క అయినవాళ్లు వదిలేశారనే ఆవేదన... కానీ మేం ఎలాంటి తప్పూ చేయలేదు. అందుకే, అన్నింటినీ ఎదుర్కోవడానికే సిద్ధపడ్డాం’ అని మీనా వివరించారు.
పంచాయతీ విధించిన ఆంక్షలు ఎంతో కాలం నిలువలేదు. విషయం పోలీసులు, మీడియా దృష్టికి వెళ్లడంతో వాళ్లు వెనక్కు తగ్గక తప్పలేదు.
దేశంలోని చాలా ప్రాంతంలో తల్లిదండ్రులకు తమ కూతుళ్లు అంత్యక్రియలు నిర్వహిస్తున్న ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల చనిపోయిన మాజీ ప్రధాని వాజ్‌పేయీకి కూడా అతడి దత్త పుత్రిక నమిత అంత్యక్రియలు నిర్వహించారు.
అయినా కూడా కూతుళ్లు ఆ క్రతువు నిర్వహిస్తే అంగీకరించే పరిస్థితి ప్రస్తుతం సమాజంలో పూర్తి స్థాయిలో కనిపించడం లేదు.

ఫొటో సోర్స్, DDNEWS
‘మన సంప్రదాయాల్లోనే ద్వంద్వ నీతి కనిపిస్తుంది. పీరియడ్స్ సమయంలో మహిళల్ని దేవాలయాల్లోకి అనుమతించకపోవడం, అంతిమ సంస్కారాల్లో వాళ్లకు భాగం కల్పించకపోవడం అలాంటిదే’ అని సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ పేర్కొన్నారు.
‘బహుశా కొడుకులు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తే, తల్లిదండ్రులతో పాటు వారి ఆస్తిపైనా వాళ్లకు ఎక్కువ హక్కు వస్తుందనే ఉద్దేశంతో ఇలాంటి నియమాలు ఏర్పడి ఉండొచ్చు. కానీ ప్రస్తుతం చట్టం దృష్టిలో అందరూ సమానమే. అమ్మాయిలకు కూడా సమాన హక్కులు వర్తిస్తాయి’ అని ఆయన చెప్పారు.
వేదాలు, ఉపనిషత్తుల్లో కూడా ఇలాంటి భేదభావాలు కనిపించవనీ, మారుతున్న కాలానికి అనుగుణంగా ఇలాంటి సంప్రదాయాలను వదిలిపెట్టాలని ఆయన సూచించారు.
‘సంప్రదాయపరమైన విషయాల్లో మహిళలకు సమ ప్రాధాన్యం ఇవ్వడం లేదంటే, పరోక్షంగా వాళ్ల స్థాయి కూడా తక్కువని చెప్పడమే. తక్కువ కులం వారిపై వివక్ష చూపినట్లే, మహిళలపైనా వివక్ష చూపిస్తున్నట్లు భావించాలి. నాకు సోదరుడు ఉన్నప్పటికీ నేనే మా అమ్మ అంతిమ సంస్కారాలు నిర్వహించా. దాని వల్ల నాకు ఎలాంటి సమస్యా ఎదురవలేదు’ అంటారు కమలా భసీన్ అనే సామాజిక కార్యకర్త.
ఇవి కూడా చదవండి
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








