కోరెగాం భీమా : మహారాష్ట్ర బంద్ హింసాత్మకం

కోరెగాం భీమా బోర్డు, సమీపంలో విధ్వంసం దృశ్యం

ఫొటో సోర్స్, Mayuresh Konnur

    • రచయిత, మయూరేశ్ కొన్నూర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మహారాష్ట్రలోని కోరెగాం భీమాలో జనవరి ఒకటో తేదీన దళితులపై జరిగినట్లు చెప్తున్న దాడులకు నిరసనగా బుధవారం చేపట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్‌లోనూ చాలా చోట్ల హింస చెలరేగింది.

భీమా కోరెగాంలో సోమవారం రాళ్లు రువ్వటం, వాహనాల దహనం ఘటనలు జరగగా ఆ హింసలో ఒక యువకుడు చనిపోయాడు. దీనిపై పలు దళిత సంఘాలు, రాజకీయ సంస్థలు బుధవారం బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌లో చాలా చోట్ల హింసాత్మక ఘటనలు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రతి సంవత్సరం తొలి రోజున భీమా కోరెగాంను వేలాది మంది దళితులు, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అభిమానులు సందర్శిస్తారు. 1818 జనవరి 1న నాటి బ్రిటిష్ ’ఈస్ట్ ఇండియా కంపెనీ’కి, పేష్వాల సారథ్యంలోని మరాఠాలకు (మరాఠా రాజ్యానికి ప్రధానమంత్రి) మధ్య ప్రఖ్యాత ‘భీమా కోరెగాం యుద్ధం’ జరిగిన ఈ ప్రదేశాన్ని అణగారిన వర్గమైన దళితులు పవిత్రంగా భావిస్తారు.

ముంబైలో మంగళవారం నిరసనకారుల ఆందోళన

ఫొటో సోర్స్, Getty Images

నాటి యుద్ధంలో మహర్ రెజిమెంట్ సైనికులతో కూడిన బ్రిటిష్ సైన్యం చేతిలో పేష్వాలు ఓడిపోయారు. ఆ కాలంలో సామాజికంగా అంటరానివారుగా పరిగణించే మహార్ జాతీయులు.. తమపై అగ్ర కులమైన పేష్వాల అణచివేత మీద సాధించిన విజయంగా జనవరి 1ని ఉత్సవంగా పాటిస్తున్నారు.

ఇక్కడి స్మారకాన్ని 1927లో డాక్టర్ అంబేడ్కర్ సందర్శించినప్పటి నుంచీ ఈ ఉత్సవం కొనసాగుతోంది. ప్రతి ఏటా ఇక్కడ జరిగే ప్రత్యేక ఉత్సవాలకు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచీ వేలాది మంది హాజరవుతారు. ఈ సంవత్సరం ద్విశతాబ్ది ఉత్సవాలు కావటంతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

సోమవారం నాడు భీమా నది ఒడ్డున ఈ స్మారకోత్సవంలో పాల్గొనడానికి వేలాది మంది చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్మారక ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరంలో హింస చెలరేగింది. రాళ్లు రువ్వటం మొదలైంది. బహిరంగ ప్రదేశంలో నిలిపిన వాహనాలకు నిప్పుకూడా పెట్టారు.

‘‘కొంతసేపు పరిస్థితి అదుపుతప్పింది. ఆ ప్రాంతంలో లక్షలాది మంది ఉన్నారు. పోలీసుల సంఖ్యా బలం సరిపోలేదు. అంతా భయాందోళనలు రేగాయి’’ అని స్థానిక పాత్రికేయుడు ధ్యానేశ్వర్ మెద్గులే పేర్కొన్నారు.

కోరెగాం భీమాలో విధ్వంసం దృశ్యం

ఫొటో సోర్స్, Mayuresh Konnur

‘‘రెండు బృందాలు ముఖాముఖి ఘర్షణ పడ్డాయి. రాళ్లు రువ్వుకోవడం మొదలైంది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావటానికి, గుంపును చెదరగొట్టటానికి మేం లాఠీచార్జ్ చేయటంతో పాటు బాష్పవాయువునూ ప్రయోగించాల్సి వచ్చింది. ఒక వ్యక్తి చనిపోయాడని, 80 వాహనాలు ధ్వంసమయ్యాయని ఇప్పటివరకూ జరిపన దర్యాప్తులో వెల్లడైంది. ఈ హింసకు ఎవరు కారణమనేది గుర్తించటానికి మేం సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నాం. కొంత మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాం’’ అని పుణే రూరల్ పోలీస్ సూపరింటెండెంట్ సువేజ్ హక్ బీబీసీకి చెప్పారు.

రెండు గంటల్లో పరిస్థితి అదుపులోకి వచ్చింది. స్మారక ప్రాంతంలో ద్విశతాబ్ది ఉత్సవాలు రాత్రి పొద్దుపోయే వరకూ కొనసాగాయి. ఇక్కడ జరుగుతున్న హింస సమాచారం, వదంతులు వ్యాప్తికాకుండా నియంత్రించటానికి పోలీసులు ఈ ప్రాంతంలో ఇంటర్నెట్ నెట్‌వర్క్‌లను కొన్ని గంటల పాటు నిలిపివేశారు.

కోరెగాం భీమాలో విధ్వంసం దృశ్యం

ఫొటో సోర్స్, Mayuresh Konnur

ఈ ఘర్షణల్లో రాహుల్ ఫతాంగలే అనే వ్యక్తి చనిపోయినట్లు చెప్తున్నారు. ఆయన మరణం మీద సీఐడీ దర్యాప్తు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మృతుడి కుటుంబానికి రూ. 10 లక్షలు పరిహారం ప్రకటించింది. ఈ మొత్తం ఘటనపై జ్యూడీషియల్ విచారణకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆదేశించారు.

సోమవారం నాడు హింసకు దారితీసిన కారణాలపై విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ’’ఛత్రపతి శంభాజి మహరాజ్ స్మారకం వద్ద ఒక వివాదం జరుగుతోంది. శంభాజి మహరాజ్‌ను ఉరితీసిన తర్వాత ఆయన భౌతికకాయాన్ని అంత్యక్రియల నిమిత్తం స్వీకరించిన గోవింద్ గైక్వాడ్ స్మారకం విషయానికి సంబంధించిన వివాదమది. గైక్వాడ్ స్మారక చిహ్నాన్ని ధ్వంసంచేశారు. అందులో మిలింద్ ఎక్బోతె, శంభాజి భీడేల ప్రమేయం ఉంది. ఈ అంశంపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. మొత్తం 49 మంది నిందితుల్లో 9 మందిని అరెస్ట్ చేశారు. జనవరి 1వ తేదీ ముందు వారంలో ఆ ఘటన జరిగింది. కాబట్టి.. ఈ వివాదం కోరెగాం భీమాలో హింసకు దారితీసిందా అనే కోణంలో దర్యాప్తు చేయాలి’’ అని ‘భా రి పా బహుజన్ మహాసంఘ్’ అధ్యక్షుడు, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ మునుమడు ప్రకాశ్ అంబేడ్కర్ ముంబైలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డిమాండ్ చేశారు.

దళిత ప్రతినిధి గైక్వాడ్ స్మారకార్థం వాధు గ్రామంలో ఒక షెడ్డు, సమాచార బోర్డును ఏర్పాటు చేయటంతో అక్కడ ఉద్రిక్తత తలెత్తింది. చారిత్రకంగా ఛత్రపతి శంభాజీ, గోవింద్ గైక్వాడ్‌లను కలిపి చూపటాన్ని స్థానికులు కొందరు వ్యతిరేకిస్తున్నారు.

ముంబైలో బుధవారం బంద్‌లో రాస్తా రోకో చేస్తున్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్తలు

ఫొటో సోర్స్, Getty Images

‘‘వివాదం స్మారకం గురించి కాదు. కానీ కొందరు ఏర్పాటుచేసిన సమాచార బోర్డు మీద వివాదం రేగింది. దానిమీద స్థానికులు అసంతృప్తిగా ఉన్నారు. ఆ బోర్డును తొలగించారు. ఉద్రిక్తతను తగ్గించటానికి పోలీసులు శాంతి సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అందరూ దానికి ఒప్పుకున్నారు. కానీ కొన్ని ఇతర సంస్థలు రంగంలోకి దిగటంతో అపార్థాలు తలెత్తాయి. దీంతో కేసులు నమోదయ్యాయి’’ అని వాధు స్థానిక మండలి సభ్యుడు రమాకాంత్ షివ్లే పేర్కొన్నారు.

ఈ చారిత్రక ఉదంతానికి ఇతర కోణాలు కూడా ఉన్నాయి. ‘‘ఛత్రపతి శంభాజీ మహరాజ్, గోవింద్ గోపాల్‌లకు సంబంధించిన చరిత్ర కొత్తది కాదు. చారిత్రక రికార్డుల్లో కూడా వారి ప్రస్తావన ఉంది. ఆ ప్రాంతంలో ఆయన స్మారక చిహ్నం కూడా ఎన్నో ఏళ్లుగా ఉంది. దానికి అభ్యంతరం చెప్తున్న వారు సమాజాన్ని ముఠాలుగా చీల్చాలని అనుకుంటున్నారు’’ అని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) నాయకుడు డాక్టర్ సిద్ధార్థ్ ధేండే ఆరోపించారు.

కోరెగాం భీమాలో స్మారక ప్రాంతం

ఫొటో సోర్స్, Mayuresh Konnur

జనవరి 1వ తేదీ ఉత్సవాలకు ముందుగా ఈ ఉద్రిక్తతలను సద్గుమణిగేలా చేయటానికి పోలీసులు కూడా ప్రయత్నించారు. ’’ఈ ఉత్సవానికి రెండు, మూడు రోజుల ముందు ఒక స్మారక చిహ్నం విషయమై వివాదం తలెత్తింది. అయితే పోలీసులు సరైన సమయంలో జోక్యం చేసుకున్నారు. మేం అన్ని వర్గాల వారినీ ఒక చోటకు తీసుకువచ్చి, ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించాం. కానీ జనవరి 1వ తేదీన హింస సృష్టించటానికి ఎవరైనా ఆ వివాదాన్ని ఉపయోగించుకున్నట్లయితే మేం చర్యలు చేపడతాం’’ అని పుణె రూరల్ ఎస్‌పీ సువేజ్ హక్ పేర్కొన్నారు.

జనవరి 1 నాటి హింస మీద న్యాయవిచారణ జరపాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆదేశించారు.

మంగళవారం సాయంత్రం ‘సమస్త్ హిందూ అఘాడీ’కి చెందిన మిలింద్ ఏక్బోతే, ‘శివ్ ప్రతిష్ఠాన్’కు చెందిన శంభాజీ భీడేలపై పుణెలోని పింప్రీ పోలీస్ స్టేషన్‌లో వేధింపులు, అల్లర్లకు పాల్పడటం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)