బెలారస్ ఉద్యమం: ఒక దేశాధినేతను పదవి నుంచి దించటానికి ఎంత మంది జనం కావాలి?

పోలీసుల ముందు నిలబద్ద యువతి

ఫొటో సోర్స్, Reuters

1980లలో పోలండ్‌లో జరిగిన సాలిడారిటీ ఉద్యమం, దీర్ఘకాలంగా సౌత్ ఆఫ్రికాలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం, సెర్బియా దేశాధ్యక్షుడు స్లోబోడాన్ మిలోసెవిక్‌ను పదవినుంచి తొలగించడం, ట్యునీషియా అధ్యక్షుడు జైన్ అల్-అబిడిన్ బెన్ అలీను వ్యతిరేకిస్తూ వచ్చిన జాస్మిన్ విప్లవం, అరబ్ స్ప్రింగ్ పేరుతో సాగిన ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు...

ఇవన్నీ కూడా రాజకీయంగా గణనీయమైన మార్పులను తీసుకువచ్చిన ప్రజా ఉద్యమాలు.

ప్రస్తుతం బెలారస్‌లో జరుగుతున్న ఉద్యమం కూడా ఇదే కోవకు చెందినది. ఆగస్ట్‌లో జరిగిన వివాదాస్పద ఎన్నికల తరువాత అలెగ్జాండర్ లుకషెంకో దేశాధ్యక్షుడిగా ఎన్నికయినట్లు ప్రకటించడంతో వేలాదిమంది తమ నిరసనలు తెలియజేస్తూ రోడ్లపైకొచ్చారు. అధికారులు, నిరసనలు తెలియజేస్తున్నవారిపట్ల అమానుషంగా ప్రవర్తించారు. అనేకమందిని నిర్బంధించారు. అరస్ట్ చేసినవారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారనే వార్తలు కూడా వినిపించాయి. ఇది తప్ప చాలావరకూ ఈ ఉద్యమం శాంతియుతంగానే సాగుతోంది.

ఎరికా చెనోవెత్

ఫొటో సోర్స్, Kris Snibbe / Harvard Gazette

కనుక ఇది విజయవంతమయ్యే అవకాశాలున్నాయా?

దీనికి జవాబు తెలుసుకోవాలంటే కొంత చరిత్రను పరిశీలించవలసి ఉంటుంది. హార్వర్డ్‌కు చెందిన పొలిటికల్ సైంటిస్ట్ ఎరికా చెనోవెత్ అదే చేసారు.

ప్రొఫెసర్ చెనోవెత్ ముఖ్యంగా నియంతృత్వ పాలనలలో వచ్చిన ఉద్యమాలపై దృష్టి పెట్టారు. నియంతలను అధికారంనుంచీ తొలగించడం దాదపు అసాధ్యం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ అధికారులను పదవినుంచీ దింపడానికి ఎన్నికలుంటాయి. రాజకీయ నాయకుల విధానాలు నచ్చకపోతే వారికి ఓటు వెయ్యకుండా ఉండే అవకాశాలుంటాయి. ప్రజలకు మేలు చేసే విధానాలతో ముందుకు వచ్చిన రాజకీయ నాయకులను గెలిపించి పదవులు కట్టబెట్టొచ్చు. కాని నియంతృత్వ ప్రభుత్వంలో ఇవేవీ సాధ్యం కావు. అయితే, ప్రజాస్వామ్యం, నియంతృత్వం...వీటికి నిర్వచనాలు ఇవ్వడం అంత సులువు కాదు. చాల చోట్ల పూర్తి ప్రజాస్వామ్యం, పూర్తి నియంతృత్వం ఉండకపోవచ్చు. రాజకీయ వర్ణపటంలో, పాటించే విధానాలలో స్థాయీభేదాలు ఉండొచ్చు.

అలాగే, ఏది హింసాత్మకమైన నిరసన, ఏది శాంతియుత నిరసన అనేది స్పష్టపరచడం కూడా కష్టమే!

ఆస్తులను ధ్వంసం చేస్తే హింసాత్మకం అనొచ్చా? అయితే, భౌతిక దాడికి పాల్పడకుండా వివక్షాపూరితమైన మాటలతో నిరసనలు తెలియజేస్తే అది హింసాత్మకం అవదా? ఆత్మాహుతికి పాల్పడడం, నిరాహార దీక్షలు...ఇవన్నీ ఏమిటి? వీటిని హింసాత్మక నిరసనలు అనొచ్చా?

ఇన్ని ప్రశ్నలు, సందేహాల మధ్య కూడా స్పష్టంగా శాంతియుతమైనవిగా తెలిసేవి, హింసాత్మకమైనవిగా కనిపించేవి కొన్ని నిరసనలు ఉంటాయి.

హత్యలకు పాల్పడడం..నిస్సందేహంగా హింసాత్మకం. శాంతియుత ప్రదర్శనలు, పోస్టర్లు అంటించడం, పిటీషన్లు వెయ్యడం, సమ్మెలు, బహిష్కరణలు, వాక్ అవుట్ చెయ్యడంలాంటివన్నీ కచ్చితంగా అహింసాత్మకమైన నిరసనలే.

ఒక ప్రసిద్ధ వర్గీకరణ ప్రకారం, 198 రకాల శాంతియుత పోరాటాలున్నాయని తెలుస్తోంది.

వీటన్నిటినీ పరిగణిస్తూ, 1900ల నుంచీ 2006 వరకూ జరిగిన అన్ని పోరాటాలలో అధ్యయనానికి కావాలసినంత డాటా ఉన్న వాటిని సునిశితంగా పరిశీలించాక, ఎరికా చెనోవెత్, మరియా స్టెఫాన్...శాంతియుత ఉద్యమాలు విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువ అనే నిర్ణయానికొచ్చారు.

"ఎందుకు?" అనేది తరువాత వచ్చే ప్రశ్న.

హింస, ఉద్యమ పోరాటానికున్న మద్దతును తగ్గిస్తుంది అంటున్నారు. శాంతియుత నిరసనల్లో పాల్గొనడానికి ఎక్కువమంది ఉత్సాహం చూపిస్తారు. ఎందుకంటే ఇందులో ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా తక్కువ. శాంతియుతంగా పోరాడాలంటే శారీరక దృఢత్వం అవసరం లేదు. ప్రత్యేక శిక్షణ అక్కర్లేదు. దీనికోసం ముందుగా సిద్ధం చేసుకోవాల్సినదేమీ ఉండదు. ఈ కారణాల వల్ల శాంతియుత పోరాటాల్లో ఎక్కువమంది ముఖ్యంగా స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, అంగవైకల్యం ఉన్నవారు కూడా పాల్గొనగలుగుతారు.

పోలీసు దళం

ఫొటో సోర్స్, Reuters

అయితే, ఇదంతా అంత ముఖ్యమా?

ఒక ఉదాహరణ పరిశీలిద్దాం. స్లోబోడాన్ మిలోసెవిక్‌కు వ్యతిరేకంగా జరిగిన బుల్‌డోజర్ విప్లవాన్ని తీసుకుంటే...ఎందుకు నిరసనకారులపై తుపాకీలెత్తలేదు అని సైనికులను ప్రశ్నించినప్పుడు, వారిలో మాకు తెలిసినవాళ్లు కొంతమంది ఉన్నారనే సమాధానం ఇచ్చారు. తమ సన్నిహితులు, స్నేహితులు ఉన్న గుంపుపై తుపాకీ ఎక్కుపెట్టడానికి వారి మనసు అంగీకరించలేదు. నిరసనకారుల సంఖ్య ఎంత పెద్దది ఉంటే అంత ఎక్కువగా ఆ గుంపులో సైనికులకు, పొలీసధికారులకు తెలిసినవాళ్లుండే అవకాశాలు ఉంటాయి.

ఎరికా చెనోవెత్ తమ పరిశోధనల ద్వారా...నిరసనకారుల సంఖ్య ఎంత ఉంటే ఆ ఉద్యమం నిస్సందేహంగా విజయవంతమవుతుందో తెలిపే ఒక సంఖ్యను సూచించారు.

జనాభాలో 3.5% మంది ఉద్యమంలో పాల్గొంటే విజయానికి తిరుగులేదు అని అంటున్నారు. ఇది చిన్న సంఖ్యలా కనిపిస్తోంది కానీ కాదు.

బెలారస్ జనాభా 90 లక్షలకు కాస్త ఎక్కువ. అందులో 3.5% అంటే 3 లక్షల పై చిలుకు జనాభా. బెలారస్ రాజధానిలో గుమికూడిన నిరసనకారులు ఒక లక్షమంది ఉంటారని అంచనా. ఒకసారి 2 లక్షల దాకా గుమికూడారని స్థానిక మీడియా అంచనా వేసింది.

అయితే 3.5% అనే సూత్రం అన్ని సందర్భాల్లోనూ వర్తించాలన్న నియమమేమీ లేదు. కొన్నిసార్లు అంతకన్నా తక్కువమంది గుమికూడిన సందర్భాల్లో ఉద్యమ పోరాటాలు విజయవంతమైన సందర్భాలు ఉన్నాయి.

3.5% కన్నా ఎక్కువమందే చేరినప్పుడు ఉద్యమ పోరాటాలు విఫలమయిన సందర్భాలు కూడా ఒకటి రెండు ఉన్నాయి. 2011 లో బహ్రైన్‌లో వచ్చిన ప్రజా ఉద్యమమే ఇందుకు ఉదాహరణ అని ఎరికా చెనోవెత్ తెలిపారు.

చెనోవెత్ చేసిన పరిశోధనలో 2006 వరకు జరిగిన ఉద్యమాలనే తీసుకున్నారు. ఇటీవలే, తరువాతి కాలలో వచ్చిన ఉద్యమాలను కూడా కలుపుకున్నారు. తాజా అధ్యయనంలో కూడా దాదాపు అవే ఫలియాలు వచ్చాయి.

అయితే, తాజా పరిశోధనలో ఆమె రెండు ముఖ్యమైన అంశాలను గమనించారు.

ఒకటి...ప్రపంచవ్యాప్తంగా శాంతియుత పోరాటాలు పెరిగాయి. సాయుధ పోరాటాల సంఖ్య తగ్గింది. 2010-2019 మధ్యలో అత్యధిక శాంతియుత పోరాటాలు నమోదయ్యాయి.

రెండు...ఉద్యమాలు విజయవంతమయ్యే రేటు తగ్గింది. సాయుధ పోరాటాల్లో ఈ శాతం ఇంకా ఎక్కువ తగ్గింది. 10 హింసాత్మక పోరాటాల్లో 9 విఫలం అవుతున్నాయి. శాంతియుత పోరాటాల్లో ఇంతకుముందు రెంటిలో ఒకటి విజయవంతమయ్యేది. ఇప్పుడు మూడిట్లో ఒకటి విజయవంతమవుతోంది.

అయితే 2006 తరువాత కొన్ని నాటకీయ ఫలితాలు కూడా చోటు చేసుకున్నాయి. ఉదాహరణకు 2019లో సూడాన్ అధ్యక్షుడు ఒమర్ అల్-బషీర్ పదవీచ్యుతులవడం, అల్జీరియా అధ్యక్షుడు అబ్దెలజీజ్ బౌటెఫ్లికా రాజీనామా. వీటికి కారణాలు అన్వేషిస్తే సోషల్ మీడియా ప్రాబల్యం పెరగడం, డిజిటల్ విప్లవంలాంటివన్నీ ముందుకొస్తాయి.

కొన్ని దేశాల్లో నిరంకుశ వాద, మితవాద పార్టీలు ఇదే డిజిటల్ విప్లవాన్ని ఆయుధంగా చేసుకుని ప్రత్యర్థుల మీదకు ఎక్కుపెడుతున్నాయి అని ఎరికా అభిప్రాయపడ్డారు.

ప్రస్తుత బెలారస్ ఉద్యమంలో కూడా డిజిటల్ ప్రాబల్యాన్ని ఉపయోగించుకుని నిరసనకారుల ఫోన్ సంభాషణలు తనిఖీ చెయ్యడం, నిర్బంధంలో ఉంచినవారి కార్యకలాపాలను గమనించడంలాంటివన్నీ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో బెలారస్ ప్రస్తుత అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెనో పదవిలో కొనసాగుతారా? లేక అతన్ని పదవీచ్యుతుడిని చెయ్యడంలో నిరసనకారులు విజయం సాధిస్తారా? చరిత్రను పరిశీలిస్తే...ఇప్పుడప్పుడే వీటికి సమాధానాలు చెప్పలేమనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)