కరోనావైరస్: లాక్‌డౌన్‌లో హైద‌రాబాదీలు ఎక్కువ‌గా ఆర్డ‌ర్ చేసిన ఫార్మసీ వస్తువు – ఐ-పిల్: ప్రెస్ రివ్యూ

ఐపిల్

ఫొటో సోర్స్, Getty Images

కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు అమల్లో ఉన్న లాక్‌డౌన్ ప‌రిస్థితుల్లో.. జనం గ‌త నెలలో తమ యాప్ ద్వారా ఫార్మ‌సీకి సంబంధించి ఏ వ‌స్తువుల‌ను ఎక్కువ‌గా ఆర్డ‌ర్ చేశార‌న్న విష‌యాన్ని ‘డుంజో’ అనే డెలివరీ యాప్ వెల్లడించినట్లు ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. హైదరాబాద్ క‌న్నా ముంబయి, చెన్నై న‌గ‌రాల్లో బాగా పాపుల‌ర్‌ అయిన ‘డుంజో’లో.. చెన్నై, జైపూర్‌ వాసులు హ్యాండ్‌వాష్‌ను ఎక్కువ‌గా ఆర్డ‌ర్ చేశారు. త‌ద్వారా క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టేందుకు శుభ్ర‌తే ప్ర‌ధాన అవ‌స‌రమ‌ని గుర్తించిన‌ట్లున్నారు.

బెంగ‌ళూరు, పుణె న‌గ‌రాల్లో ప్రెగ్నెన్సీ కిట్ల‌ను అధికంగా డెలివ‌రీ చేశారు. అన్నింటిక‌న్నా భిన్నంగా ముంబయి వాసులు ఆర్డ‌ర్ చేసిన‌వాటిలో కండోమ్స్ మొద‌టి స్థానంలో ఉన్నాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఇక హైద‌రాబాద్ వాసులు ఐ-పిల్‌ అనే గ‌ర్భ‌నిరోధ‌క మాత్ర‌ల‌ను విచ్చ‌ల‌విడిగా వాడేశారు. విన‌డానికి విచిత్రంగా ఉన్నా ఇదే నిజ‌మ‌ని డుంజో చెప్పుకొచ్చింది.

డబ్బు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డబ్బు

ఉద్యోగులు, ఖాతాదారులకు ప్రభుత్వ రంగ బ్యాంకుల ‘కోవిడ్ అత్యవసర రుణ సాయం’

కరోనావైరస్‌తో కష్టకాలంలో ఉన్న ఉద్యోగులు, డ్వాక్రా, పింఛనుదారులు, పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రభుత్వరంగ బ్యాంకులు ముందుకొచ్చాయని.. మూడు నెలల పాటు తిరిగి చెల్లించనవసరం లేకుండా తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నాయని ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. కేంద్రం, రిజర్వు బ్యాంకు ఆదేశాల మేరకు దాదాపు అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు.. నెలనెలా జీతం తీసుకునే ఉద్యోగులు, స్వయం సహాయక బృందాల సభ్యులు, పింఛనుదారులు, పరిశ్రమలకు కోవిడ్‌ అత్యవసర రుణ సాయం (సీఈఎల్‌సీ) పేరుతో ఈ రుణాలు ఇస్తున్నాయి.

ఈ రుణాలపై వడ్డీ రేటు కూడా తక్కువే. సాధారణంగా గతంలో వ్యక్తిగత రుణాలకు 12-14 శాతం వడ్డీ వసూలు చేసేవారు. ఇప్పుడు 8 శాతం వడ్డీకే రుణాలు ఇస్తున్నారు. ఇది అత్యవసర రుణం కాబట్టి తక్కువ వడ్డీ రేటుకే ఇస్తున్నామని బ్యాంకులు చెప్తున్నాయి.

ఎస్‌బీఐ, యూనియన్‌ బ్యాంకు, ఇండియన్‌ బ్యాంకు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంకులు ఈ అత్యవసర రుణాలు అందిస్తున్నాయి. అయితే పాత ఖాతాదారులకే ఈ రుణాలు అందిస్తున్నాయి. ఉద్యోగులకు వారి జీతాన్ని బట్టి రూ. 5లక్షల వరకు, డ్వాక్రా సంఘాల సభ్యులకు రూ. 5,000 చొప్పున, పింఛనుదారులకు వారి పింఛనుకంటే 10 - 15 రెట్లు ఎక్కువ మొత్తాన్ని రుణంగా అందిస్తున్నాయి.

కోవిడ్‌ అత్యవసర రుణాలకు రిజర్వు బ్యాంకు ప్రకటించిన మూడు నెలల మారటోరియం కూడా వర్తిస్తుంది. అంటే రుణాల చెల్లింపు ఇబ్బంది అనుకుంటే మూడు నెలలపాటు చెల్లించాల్సిన అవసరం లేదు. రుణాల చెల్లింపును తేలిక చేసేందుకు రిజర్వుబ్యాంకు ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ క్రెడిట్‌ మేనేజర్‌ దుర్గాప్రసాద్‌ తెలిపారు.

చిన్నపరిశ్రమలకు కూడా..: ఎంఎస్ఎంఈలతో పాటు పెద్ద పరిశ్రమలన్నీ దాదాపు నెల రోజుల నుంచి లాక్‌డౌన్‌లోనే ఉన్నాయి. దీంతో ఉత్పత్తి, అమ్మకాలు ఆగిపోయాయి. అయితే అద్దె, కార్మికుల వేతనాలు, విద్యుత్‌ బిల్లులు లాంటి స్థిర ఖర్చులను చెల్లించక తప్పని పరిస్థితి. దీంతో ఈ పరిశ్రమలకు రుణ పరిమితిని పెంచారు. కొత్తగా ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేకుండా గతంలో ఉన్న పరిమితికి 10 శాతం పెంచి ఇస్తున్నాయి. గతంలో ఒక పరిశ్రమ రూ. 10 లక్షలు వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణం తీసుకుంటే.. దానిపై 10 శాతం అంటే ఒక లక్ష రూపాయలను ఇప్పుడు రుణంగా అందిస్తున్నాయి. ఎంఎస్‌ఎంఈ, పెద్ద పరిశ్రమలకు కూడా స్థిర ఖర్చుల చెల్లింపునకు ఈ రుణం ఉపయోగపడుతోంది.

మొబైల్ ఫోన్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మొబైల్ ఫోన్లు

‘లాక్‌డౌన్‌లో ఉచిత అపరిమిత కాల్స్, డేటా ఇవ్వండి’: సుప్రీంకోర్టులో పిటిషన్

దేశంలో లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారని, దీనిని తగ్గించేందుకు ప్రజలందరికీ ఉచితంగా అపరిమిత కాల్స్, డేటా సౌకర్యంతోపాటు డీటీహెచ్ సేవలు అందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైందని ‘నవ తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లో ఉంటున్న వారు, క్వారంటైన్‌లో ఉంటున్న వారు మానసిక ఒత్తిడికి గురికాకుండా చూసేలా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆరోగ్య మంత్రిత్వ శాఖను కూడా ఆదేశించాలని పిటిషన్‌దారు కోరారు.

లాక్‌డౌన్ అమల్లో ఉండే మే 3వ తేదీ వరకు అన్ని చానళ్లను అపరిమితంగా వీక్షించే సదుపాయం కల్పించేలా చూడాలని, ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం, టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్)లను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.

లాక్‌డౌన్ సమయంలో వీడియో స్ట్రీమింగ్ వెబ్‌సైట్లు కంటెంట్‌ను ఉచితంగా అందించేందుకు అనుగుణంగా చట్ట నిబంధనల ప్రకారం అధికారాలను వినియోగించుకునేలా సూచించాలంటూ మనోహర్ ప్రతాప్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)