ఆంధ్రప్రదేశ్: ‘డిప్లమసీ’ రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తుందా.. టీడీపీ హయాంలో సదస్సులతో ఒరిగిందేంటి? - అభిప్రాయం

ఫొటో సోర్స్, AndhraPradeshCM/twitter
- రచయిత, డి.పాపారావు
- హోదా, విశ్లేషకులు, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో విజయవాడలో ఆగస్టు 9న 'డిప్లమాటిక్ అవుట్ రీచ్' కార్యక్రమం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనికి హాజరయ్యారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు గత ఐదేళ్లలో ఏపీలో మూడు, నాలుగు దఫాలు భారత పారిశ్రామిక వర్గాల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో సదస్సులు జరిగాయి.
ఈ సదస్సులకు, ప్రస్తుతం జరిగిన 'డిప్లమాటిక్ అవుట్ రీచ్'కు తేడా ఉంది. గతంలోని సదస్సులు సీఐఐ, రాష్ట్ర ప్రభుత్వం చొరవతో జరిగాయి. డిప్లమాటిక్ ఔట్‌రీచ్‌ను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించాయి. ఇది పూర్తిస్థాయి ప్రభుత్వ కార్యక్రమం. 35 దేశాల రాయబారులు, హైకమిషనర్లు ఇందులో పాల్గొన్నారు. సీఐఐ సదస్సుల్లా ప్రైవేటు పెట్టుబడిదారులు, పరిశ్రమల ప్రతినిధుల సమావేశం కాదిది.
'డిప్లమాటిక్ అవుట్ రీచ్' సందర్భంగా కొరియా రాయబారి ఏపీలో పోస్కో సంస్థ ఉక్కు పరిశ్రమ పెట్టే అవకాశాలున్నాయని చెప్పారు. ఇప్పటికే అనంతపురంలో పరిశ్రమ నెలకొల్పిన కియా సంస్థ, దానికి అనుంబంధంగా విడి భాగాల తయారీ వంటి కర్మాగారాలు ఏర్పాటు చేయొచ్చని తెలిపారు. దీనికి ఉక్కు పరిశ్రమ కడప దగ్గర్లో ఏర్పాటు చేస్తే బాగుంటుందని జగన్ సూచించారు.

ఫొటో సోర్స్, AndhraPradeshCM/twitter
విద్యత్ వాహనాల రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ సంస్థలకు ఆసక్తి ఉందని బ్రిటన్ డిప్యుటీ హైకమిషనర్ వెల్లడించారు. ఇప్పటికే ఏపీలో వివిధ రంగాల్లో తాము రూ.20 వేల కోట్లు పెట్టుబడులు పెట్టామని, థర్మల్, సౌర, విమానయాన రంగాల్లో మరిన్ని పెట్టొచ్చని సింగపూర్ హైకమిషనర్ తెలిపారు. ఎల్ఈడీ బల్బుల పరిశ్రమల ఏర్పాటు, పరిశోధనల విషయంలో పోలెండ్ తమ ఆసక్తిని తెలియజేసింది.
ఏపీతో తమ దేశంలో ఓ రాష్ట్రానికి భాగస్వామ్యం కుదుర్చుకుని.. నైపుణ్యాభివృద్ధి, పరిశోధన అంశాల్లో పనిచేస్తామని బల్గేరియా తెలిపింది. పోర్టులు, లాజిస్టిక్స్, తీర ప్రాంతాల అభివృద్ధిపై డెన్మార్క్.. బొగ్గు ఎగుమతి, బియ్యం, వెల్లుల్లి, చక్కెర దిగుమతిపై ఇండోనేసియా.. వ్యవసాయం, ఎరువులు, వస్త్రపరిశ్రమల రంగాలపై తుర్కమెనిస్థాన్ ఆసక్తి ఉన్నట్లు తెలిపాయి.
అయితే, ‘లేదు, కాదు అని సమాధానం ఇచ్చేవాడు దౌత్యవేత్తే కాదు’ అని ఓ నానుడి ఉంది. అందుకే, ఇప్పుడు ఈ దౌత్యవేత్తలు చెప్పినవన్నీ జరిగిపోతాయని భావించడం మూర్ఖత్వమే అవుతుంది.

ఫొటో సోర్స్, IPR_AP/twitter
తొలుత ఉమ్మడి రాష్ట్రంలో, ఆ తర్వాత విభజన జరిగాక 3, 4 దఫాలుగా ఏపీలో పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఐఐ సదస్సులు జరిగాయి. వీటిలో రూ.లక్షల కోట్ల పెట్టుబడులకు వేలాది ఎంవోయూలు (అవగాహన ఒప్పందాలు) కుదిరాయి.
ఇవి సంస్థల ప్రతినిధి బృందాలు, ప్రైవేటు పెట్టుబడిదారులు రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలు. వారు పెట్టుబడుల గురించి చెప్పిన మాటలు కోటలు దాటినా, చేతలు గడప దాటలేదు.
ఉదాహరణకు ఏపీలో 2016లో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సుల్లో రూ.4.68 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 331 ఎంవోయూలు కుదిరాయి. వీటి ద్వారా 9.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆశించారు.
2017లో సుమారు రూ.10.5 లక్షల కోట్ల విలువైన 664 ఒప్పందాలు, 2018లో రూ.4.39 లక్షల కోట్ల విలువైన 734 ఒప్పందాలు జరిగాయి.
ఈ లెక్కన ఈపాటికే ఏపీకి రూ.లక్షల కోట్ల పెట్టుబడులు తరలాలి. లక్షలాది ఉద్యోగాలు రావాలి. కానీ, వాస్తవ పరిస్థితి అలా లేదు.
ఏపీ ఇప్పటికే పారిశ్రామికంగా వెనుకబడిన రాష్ట్రంగా ఉంది. రకరకాల కారణాలతో నిరుద్యోగ సమస్య గతంలో కంటే అధికమైంది. ఈ నేపథ్యంలోనే కాపు రిజర్వేషన్ల వంటి అంశాలు తెరపైకి వచ్చాయి.

ఫొటో సోర్స్, ncbn/twitter
గత సీఐఐ భాగస్వామ్య సదస్సులకు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబే కేంద్ర బిందువుగా ఉన్నారు. ఆయన చెప్పిన మాటల ప్రకారం ఆ సదస్సుల్లో కుదిరిన ఎంవోయూల్లోని పెట్టుబడుల హామీల్లో 59% మాత్రమే వాస్తవంగా అమల్లోకి వచ్చాయి. 2018 సదస్సులో జరిగిన ఎంవోయూల్లోని పెట్టుబడుల హామీల్లో 90% మేర ఆచరణ రూపం దాలుస్తాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
చంద్రబాబు అధికారం చేపట్టాక ఏపీకి సంబంధించి కొన్ని ప్రణాళికలు రూపొందించారు. వాటి ప్రకారం 2022 నాటికి స్థూల ఉత్పత్తిలో, తలసరి ఆదాయంలో దేశంలోనే తొలి మూడు స్థానాల్లో ఉండాలి. 2029 నాటికి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా మారాలి.
కానీ, నేటి పరిస్థితిని గమనిస్తే ఈ లక్ష్యాలను చేరడానికి రాష్ట్రం సుదూరంలో ఉందని చెప్పకతప్పదు. అయితే, 2018 ఫిబ్రవరి నాటికి రూ.14.89 లక్షల కోట్ల పెట్టుబడులను తెచ్చే 1,817 ప్రాజెక్టులను రాష్ట్రం ఆకర్షించిందని, వీటి ద్వారా 33.2 లక్షల మందికి ఉపాధి కల్పన జరిగిందని కాగితాలు సూచిస్తున్నాయి.
చంద్రబాబు మక్కువ చూపే ఐటీ రంగంలోనూ రాష్ట్రంలో ఉపాధి కల్పన బలహీనంగానే ఉంది. ఐదేళ్లలో రూ.15వేల కోట్ల పెట్టుబడులతో లక్ష ఐటీ ఉపాధి అవకాశాలను సృష్టిస్తామని 2014లో చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ, 2019 జులై నాటి అంచనాల ప్రకారం రాష్ట్ర విభజన నుంచి 2019 వరకూ ఏపీలో వచ్చిన ఐటీ ఉద్యోగాలు 30,428 మాత్రమే. పైగా వీటిలో మెరుగైన వేతనాలుండే ఉన్నత స్థాయి ఉద్యోగాలు కేవలం 2000 మాత్రమే.

ఫొటో సోర్స్, venkatmandala/twitter
గత ఐదేళ్లలో రూ.1,027 కోట్ల పెట్టుబడులతో 175 కొత్త ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయని ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోని ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు.
'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' ర్యాకింగ్స్‌లో ఏపీది దేశంలోనే మొదటి స్థానం అని పదేపదే టీడీపీ ప్రభుత్వం చెప్పుకునేది.
నిజానికి దేశంలోకి వచ్చే పెట్టుబడుల్లో సగటున 30 శాతం మేర మహారాష్ట్రకే పోతున్నాయి. ఆ రాష్ట్ర 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' ర్యాంక్ పదికి పైనే ఉండటం గమనార్హం. తొలి స్థానంలో ఉన్న ఏపీకి మాత్రం కేవలం 6.3 శాతం (2017లో రూ.4,509 కోట్లు) పెట్టుబడులే వస్తున్నాయి.
కాబట్టి టీడీపీ ప్రభుత్వం రూపొందించిన 2015-20 పారిశ్రామిక విధానం, దాని కార్యాచరణ ఏపీని పెద్దగా అభివృద్ధి చేయలేకపోయాయని చెప్పొచ్చు. లక్షలాది మంది నిరుద్యోగుల ఆకాంక్షలను అవి నెరవేర్చలేకపోయాయి.

ఫొటో సోర్స్, YSRCParty/twitter
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై పెద్ద బాధ్యతలే ఉన్నాయి. 'వాగ్దానాలు బారెడు, అమలు మూరెడు' అన్నట్లుగా సాగిన సీఐఐ సదస్సుల్లా కాకుండా, తాజా 'డిప్లమాటిక్ ఔట్‌రీచ్' ఏమేరకు సత్ఫలితాలనిస్తుందో చూడాలి.
గత ప్రభుత్వం పరిశ్రమలకు పలు రాయితీలు ఇచ్చినా, వాటికి ప్రతిగా రాష్ట్రానికి అందుతున్న ప్రయోజనాలు ఏంటన్నది సరిగ్గా బేరీజు వేసుకోలేకపోయిందని ప్రస్తుత ఐటీ మంత్రి చెబుతున్నారు. ''మనం ఉపాధి కొనుక్కుంటున్నాం. కల్పించడం లేదు'' అని ఆయన అంటున్నారు.
దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక మందగమన పరిస్థితుల్లో ఏపీలోని ఈ దురవస్థను వైఎస్సార్సీపీ ప్రభుత్వం మార్చగలదా? పారదర్శక పాలనతో భారీగా పెట్టుబడులను తెచ్చి, ఉపాధి అవకాశాలను కల్పిస్తామంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకోగలదా?
ఇవి కూడా చదవండి:
- ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఐదుగురు మహిళా గూఢచారులు
- అభివృద్ధి సూచీలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్ల కంటే జమ్ము కశ్మీరే నయమా?
- మలేషియా అడవుల్లో మాయమైన ఆ టీనేజ్ అమ్మాయి ఎక్కడ?
- బంగారం ధర భగ్గుమంటోంది... డిమాండ్ తగ్గనంటోంది
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటో బ్లాక్ అండ్ వైటా.. కలరా?
- 'ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం సరైనదే' - రాకేష్ సిన్హా
- అక్కడ గ్రహాంతర జీవులున్నాయా? అందుకే ఎవరూ రావద్దని అమెరికా హెచ్చరించిందా...
- ప్రధాని మోదీ చెప్పిన లద్దాఖ్‌లోని 'సోలో' మొక్క విశేషాలేంటి?
- ఉత్తర కొరియా: సైబర్ దాడులు చేసి 200 కోట్ల డాలర్లు కొట్టేసింది.. ఆయుధాల కోసం: ఐరాస రహస్య నివేదిక
- ఎన్ఎంసీ బిల్లుపై వైద్యులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








