మనీ లాండరింగ్ కేసులో కార్తి చిదంబరంపై ఆరోపణలేంటి?

ఫొటో సోర్స్, KARTI P CHIDAMBARAM FACEBOOK
మనీ లాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం కుమారుడు కార్తి చిదంబరంను సీబీఐ బుధవారం అరెస్ట్ చేసింది.
లండన్ నుంచి చెన్నైకి చేరుకున్న కార్తిని అధికారులు ఎయిర్‌పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు.
కొద్ది రోజుల కిందట ఆయన చార్టర్డ్ అకౌంటెంట్ ఎస్. భాస్కర్‌ను అరెస్ట్ చేశారన్నది తెలిసిందే.
కార్తి చిదంబరంపై ఉన్న ఆరోపణలేంటి?
ఐఎన్ఎక్స్ మీడియాకు ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎఫ్ఐపీబీ) క్లియరెన్స్ ఇవ్వడంలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిరుడు మే నెలలో ఓ కేసు నమోదు చేసింది.
గత సంవత్సరం ఈడీ దాఖలు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్‌ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్)లో ఆయన పేరుంది. ఈసీఐర్ అనేది ఎఫ్ఐఆర్‌తో సమానమైందే.
మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల కింద ఈసీఐఆర్ దాఖలు చేశారు.

ఫొటో సోర్స్, TWITTER @KARTIPC
"ఈ కేసులో జరిగినట్టు భావిస్తున్న అక్రమాలపై, ముడుపుల చెల్లింపుల వ్యవహారంపై మేం దర్యాప్తు చేస్తాం" అని ఈడీ గత సంవత్సరం కేసు నమోదు తర్వాత ప్రకటించింది.
కార్తి చిదంబరంపై ఉన్న ఈ ఆరోపణలపై ఈడీ, సీబీఐ అప్పటి నుంచి దర్యాప్తు చేపట్టాయి.
2007లో కేంద్రంలో పి. చిదంబరం మంత్రిగా ఉన్న సమయంలో, ఐఎన్ఎక్స్ మీడియా హౌస్‌కు రూ. 300 కోట్లకు పైగా విదేశీ పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వచ్చాయని కథనం.
ఐఎన్ఎక్స్ మీడియాకు అందిన ఈ విదేశీ పెట్టుబడి మొత్తం దానికి ఉన్న చట్టపరమైన పరిమితికన్నా అధికం. ఈ కంపెనీకి ఇంత మొత్తంలో విదేశీ పెట్టుబడులు రావడం చట్టవిరుద్ధం.
ఈ లావాదేవీలో కార్తి చిదంబరానికి ముడుపులు ముట్టాయన్న ఆరోపణలున్నాయి.

ఫొటో సోర్స్, RAVEENDRAN/AFP/GETTY IMAGES
ఐఎన్ఎక్స్ మీడియా యజమానులైన పీటర్ ముకర్జీ, ఆయన భార్య ఇంద్రాణీ ముకర్జీలు ప్రస్తుతం తమ కూతురి హత్య కేసులో జైళ్లో ఉన్నారు.
ఐఎన్ఎక్స్ మీడియా అక్రమ చెల్లింపులు చేసిందన్న ఆరోపణలపై కార్తి చిదంబరం తదితరులపై సీబీఐ విడిగా మరో కేసు నమోదు చేసింది.
గత సంవత్సరం సీబీఐ, ఈడీ అధికారులు నాలుగు నగరాల్లో ఉన్న కార్తి చిదంబరం కార్యాలయాలపై, నివాసాలపై దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో కార్తి చిదంబరానికి చెందిన అనేక ఆస్తులను జప్తు చేసుకున్నారు.
తన ఆస్తుల స్వాధీనాన్ని వ్యతిరేకిస్తూ కార్తి సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ప్రస్తుతం ఆయన పిటిషన్ విచారణలో ఉంది.
అట్లాగే, ఏఎస్‌సీపీఎల్ అనే మరో కంపెనీ కూడా రూ. 26 లక్షల ముడుపులు స్వీకరించిందన్న ఆరోపణలో కూడా కార్తిని ఈడీ ప్రశ్నించింది. ఈ కంపెనీతో ఆయనకు సంబంధాలున్నాయని అనుమానిస్తున్నారు.
2006లో ఎయిర్‌సెల్-మాక్సిస్‌కి రూ. 3,500 కోట్ల విదేశీ పెట్టుబడికి ఆమోదం లభించిన వెంటనే ఈ చెల్లింపు జరిగినట్టు ఆరోపణ.
ఆ సమయంలో పి. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నారు.
ఆర్థిక మంత్రిగా ఆయనకు ఇంత మేరకు ఎఫ్‌డీఐకి ఆమోదం తెలిపే అధికారం ఉంది గానీ, దానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తప్పనిసరి. అయితే కమిటీ ఆమోదం లేకుండానే ఆయనీ ఎఫ్‌డీఐకి అనుమతి ఇచ్చారని ఆరోపణ.
అయితే, తనపై, తన కుమారుడిపై చేసిన ఆరోపణలన్నింటినీ మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం తోసిపుచ్చారు. ఈ చర్యలన్నీ తప్పులతడకలనీ, హాస్యాస్పదమైనవనీ అంటూ, ఇదంతా రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగమని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








