శ్రీదేవికి ముందు నుంచే ప్రమాదం పొంచి ఉందా?

ఫొటో సోర్స్, AFP
శ్రీదేవి ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లినా, ఆమె మరణం మాత్రం ఎన్నో ప్రశ్నలను మిగిల్చింది.
చనిపోయినప్పుడు శ్రీదేవి వయసు 54. ఆరోగ్యంపైన ఎక్కువ శ్రద్ధ పెట్టే సినీతారలు సాధారణంగా అది చనిపోయే వయసు కాదు.
ఆ వయసులో మహిళలకు హృద్రోగాలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని చాలామంది భావిస్తారు.
అలాంటి భావన ఉన్న చాలామందికి శ్రీదేవి మరణం ఓ పెద్ద పాఠమని వైద్యులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
శ్రీదేవి మృతికి శ్రద్ధాంజలి ఘటించే సమయంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐడీఏ) సభ్యులు మాట్లాడుతూ, మహిళల్లో కార్డియాక్ మరణాలపై అవగాహనా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఆ కార్యక్రమాన్ని శ్రీదేవికే అంకితమివ్వాలని పిలుపునిచ్చారు.
‘మహిళల్లో మెనోపాజ్‌కు ముందు హృద్రోగాలు రాకూడదు’ అని ఐడీఏ వైద్యుడు కేకే అగర్వాల్ అంటారు. ఆ దశలో వాళ్లలో గుండె ఆరోగ్యాన్ని కాపాడే హార్మోన్లు విడుదలవుతాయి.
కానీ కొన్నాళ్లుగా మహిళల్లో ‘ప్రీ మెనోపాజ్’ దశలో కూడా హార్ట్ ఎటాక్ లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి.
‘ప్రతి పది హార్ట్ ఎటాక్‌లలో మూడు మహిళల్లోనే సంభవిస్తున్నాయి. నిజానికి ఇలా జరక్కూడదు’ అని డాక్టర్ అగర్వాల్ అంటారు.
పురుషులతో పోలిస్తే మహిళల్లో సంభవించే హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్ లాంటి సమస్యలు మరింత తీవ్రంగా ఉంటాయి.
హార్ట్ ఎటాక్ వచ్చిన సమయంలో మహిళలకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారుతుంది.
సాధారణంగా మహిళల్లో హార్ట్ ఎటాక్‌లు చాలా సైలెంట్‌గా వస్తాయి. శ్రీదేవి విషయంలో అలానే జరిగినట్టు కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, iStock
మహిళల్లో గుండె సమస్యలను గుర్తించడం, వాటికి చికిత్స మొదలుపెట్టడం చాలా కేసుల్లో ఆలస్యమవుతుందని అగర్వాల్ చెబుతారు. మహిళలు చిన్నచిన్న నొప్పుల్ని తేలిగ్గా తీసుకోవడం, ఆలస్యంగా వైద్యుల్ని సంప్రదించడమే దానికి కారణమని అంటారు. మహిళలతో పోలిస్తే మగవాళ్లే త్వరగా ఆస్పత్రికి వెళ్తారన్నది ఆయన అభిప్రాయం.
ఎక్కువ మంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ గురించే తరచూ భయపడుతుంటారు. కానీ గణాంకాలు మాత్రం వేరే విషయం చెబుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోలిస్తే హార్ట్ ఎటాక్‌తో మరణించే మహిళల సంఖ్యే ఎక్కువగా ఉంటుందని అగర్వాల్ వివరిస్తారు.
అందుకే దేశంలోని మహిళలకు గుండె సమస్యలపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అంటారు.

ఫొటో సోర్స్, iStock
ఆలస్యం ఎందుకు?
మహిళల్లో ఎలక్ట్రో కార్డియోగ్రామ్(ఈసీజీ) రిపోర్టులు చాలా సందర్భాల్లో సరిగ్గా రావు. ఈసీజీ సమయంలో మహిళలకు ఎలక్ట్రోడ్‌లను సరైన స్థానంలో పెట్టకపోవడం వల్లే ఇలా జరుగుతుంది.
అమెరికాలో జరుగుతున్న ‘ఫార్మింగ్ హమ్ స్టడీ’ కూడా మహిళల్లో హృద్రోగాలపై చాలాకాలంగా అధ్యయనం చేస్తోంది.
ఆ అధ్యయనం ప్రకారం:
- పురుషులతో పోలిస్తే మహిళలకు గుండె సమస్యల కారణంగా సంభవించే హఠాన్మరణాల ముప్పు తక్కువగా ఉంటుంది.
- మెనోపాజ్ తరవాత మహిళల్లో గుండె సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువవుతుంది.
- 40ఏళ్లు దాటిన తరవాత కరోనరీ గుండె సమస్య బాధితుల్లో ప్రతి ఇద్దరిలో ఒక పురుషుడు, ప్రతి ముగ్గురిలో ఒక స్త్రీ ఉంటారు.
అంటే, కరోనరీ గుండె సమస్యల వల్ల చనిపోయే మహిళల సంఖ్య, పురుషులతో పోలిస్తే సగమే ఉంటుంది.
శ్రీదేవి విషయంలో ఇది కూడా నిజం కావచ్చు. దుబాయ్‌కి చెందిన ‘ఖలీజ్ టైమ్స్’ పత్రికకు సంజయ్ కపూర్ చెప్పిన మాట ప్రకారం శ్రీదేవికి గతంలో ఎలాంటి గుండె సమస్యలూ లేవు.
శ్రీదేవి మరణం నుంచి పాఠాలు నేర్చుకొని ప్రతి మహిళా తమ గుండె ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాల్సిన సమయం ఇది.

ఫొటో సోర్స్, iStock
ఈ విషయంలో డాక్టర్ అగర్వాల్ కొన్ని చిట్కాలు చెబుతారు. అవేంటంటే..
6 నిమిషాల నడక పరీక్ష - మహిళలు ఆరు నిమిషాల్లో ఎలాంటి ఇబ్బందీ లేకుండా 500 మీటర్ల దూరం నడవగలిగతే, వాళ్లకు గుండెలో బ్లాకేజ్ ఏర్పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
40 ఏళ్లు దాటిన మహిళల్లో అలసట, ఆయాసం, గుండె భాగంలో నొప్పిలాంటి లక్షణాలు కనిపిస్తే, అవి అకారణంగా సంభవించాయని అనిపిస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయడానికి వీల్లేదు.
గతంలో తమ కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బులు తలెత్తి ఉంటే ఆ మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే.
శ్రీదేవి మరణం తరవాత వాళ్ల కుటుంబంలో కూడా గుండె సమస్య ఫ్యామిలీ హిస్టరీలో భాగమైనట్లే. అందుకే ఆమె పిల్లలు జాహ్నవి, ఖుషీ కూడా భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలన్నది డా.అగర్వాల్ మాట.
ఇవి కూడా చదవండి
- శ్రీదేవి: ‘జుదాయి’ తర్వాత పదిహేనేళ్లు సినిమాలకు దూరం
- శ్రీదేవి మరణం: ‘వసంత కోకిల’ వెళ్లిపోయింది..!
- శ్రీదేవి ఇకలేరు: నేనొక మంచి ఫ్రెండ్‌ని కోల్పోయా!
- స్లిమ్‌గా కనిపించే శ్రీదేవిని కార్డియాక్ అరెస్ట్ ఎలా కబళించింది?
- శ్రీదేవి ఇకలేరు: ‘జాబిలమ్మ శాశ్వతంగా నిద్రపోయింది’
- సినిమా అమ్మ.. ఇకపై కాదు కన్నీటి బొమ్మ
- 'అతిలోక సుందరి' నుంచి నేనెంతో నేర్చుకున్నా: చిరంజీవి
- 'కళ్లతో శ్రీదేవి పలికించిన హావభావాల్ని ఎలా మర్చిపోగలం'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








