కరోనావైరస్: ఒంటరిగా గర్భస్రావం చేసుకోవాల్సి రావడంతో గుండె బద్దలైంది

కెమెస్లీ, జేమ్స్

ఫొటో సోర్స్, Emma Kemsley

ఫొటో క్యాప్షన్, కెమెస్లీ, జేమ్స్
    • రచయిత, చార్లీ జోన్స్
    • హోదా, బీబీసీ న్యూస్

కోవిడ్-19 నిబంధనల నడుమ ఓ మహిళ ఒంటరిగా గర్భస్రావం చేయించుకోవాల్సి వచ్చింది. చాలా భయమేసిందని, అదొక భయానక అనుభూతి అని ఆమె వివరించారు.

కడుపులో పాపాయి బతికే అవకాశంలేదని ఇంగ్లండ్‌లోని సాఫ్రన్ వాల్డెన్‌కు చెందిన 33ఏళ్ల ఎమ్మా కెమెస్లీకు స్కానింగ్‌లో తెలిసింది.

ఇటు స్కానింగ్‌కు గానీ, గర్భ విచ్ఛిత్తి సమయంలోగానీ భర్త జేమ్స్ పక్కనే ఉండేందుకు సిబ్బంది అనుమతించలేదు. దీంతో తమ గుండె బద్దలైనట్లు అనిపించిందని వారు తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా ఆసుపత్రుల్లో ఇలాంటి నిబంధనలు మారాలని ద రాయల్ కాలేజీ ఆఫ్ అబ్‌స్టెట్రిసియన్స్, అండ్ గైనకాలజిస్ట్ (ఆర్‌సీవోజీ) ఆశాభావం వ్యక్తంచేసింది.

నెమ్మదిగా చాలా దేశాల్లో కరోనావైరస్ నిబంధనలను సడలిస్తున్నారు. ప్రసూతి వార్డుల్లోకి జీవిత భాగస్వాములనూ అనుమతిస్తున్నారు. అయితే గర్భస్రావాల విషయంలో ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతున్నాయి.

కెమెస్లీ, జేమ్స్

ఫొటో సోర్స్, Emma Kemsley

''ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చేందుకు ఆరు దఫాలుగా ప్రయత్నించాను. అయితే ఇటీవలే ఐవీఎఫ్ విజయవంతం కావడంతో చాలా సంతోషపడ్డాను''అని మిస్ కెమెస్లీ తెలిపారు. కడుపులో పాపాయికి 12 వారాల వయసున్నప్పుడు స్కానింగ్‌లో తను ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిసిందని ఆమె చెప్పారు.

అయితే, కడుపులో బిడ్డకు 18వారాల సమయంలో మే నెలలో కేంబ్రిండ్జ్‌లోని ఏడెన్‌బ్రూక్ ఆసుపత్రిలో ఆమె స్కానింగ్ చేయించుకున్నారు. దీంతో పాపాయి ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె సరిగా రూపుదిద్దుకోవడంలేదని తెలిసింది.

కడుపులోని బిడ్డ బయటకు వస్తే బతికి అవకాశం చాలా తక్కువని ఆమెకు సోనోగ్రాఫర్ తెలిపారు. గర్భస్రావం చేసే క్లినిక్ నంబరు కూడా ఇచ్చారు. త్వరగా గర్భ విచ్ఛిత్తి చేసుకోవాలని ఆమెకు సూచించారు.

''ఆ విషయాన్ని చెప్పి ఆసుపత్రి యాజమాన్యం చేతులు దులిపేసుకుంది. అంతా ఆసుపత్రి పరిభాషలో మాట్లాడారు. ఈ పని నువ్వే చూసుకోవాలి అన్నట్లు చెప్పారు''అంటూ ఒక మ్యాగజైన్ ఎడిటర్‌గా పనిచేస్తున్న ఆమె చెప్పారు.

''నేను ఒక్కదాన్నే అయిపోయాయి. నా భర్తను కారు పార్కింగ్‌ దగ్గరే ఆపేశారు. ఆయనకు ఫోన్ ద్వారా విషయాన్ని చెప్పాల్సి వచ్చింది.''

ఆమెకు ఎండోమెట్రియోసిస్ వ్యాధి కూడా ఉంది. దీంతో పరిస్థితి మరింత సంక్లిష్టమైంది. ఏడెన్‌బ్రూక్ ఆసుపత్రికి విషయం చెప్పడంతో వారే శస్త్రచికిత్స నిపుణులు అందుబాటులో ఉండే ఆసుపత్రిని వెతకడంలో సాయం చేశారు.

కెమెస్లీ, జేమ్స్

ఫొటో సోర్స్, Emma Kemsley

''అప్పటికే, నేను 20 వారాల గర్భవతిని. చాలా భయమేసింది. ఒక్కదాన్నే అయిపోయాను. నాకు సాయం చేయాలని జేమ్స్ చాలా ప్రయత్నించారు. కానీ మళ్లీ ఆయన్ను కార్ పార్కింగ్‌లోనే ఆపేశారు. ఇది ఆయన పాపాయి కూడా. ఆయన నాతోపాటు ఉండాల్సింది''

37ఏళ్ల జేమ్స్ వ్యక్తిత్వ వికాస నిపుణుడు. ఇలాంటి అనుభవాల నుంచి మగవారు కోలుకోవడంలో ఆయన సాయం చేస్తుంటారు.

''తమ బిడ్డను కోల్పోతున్నారనే వార్తను ఎవరూ ఫోన్‌లో వినే పరిస్థితి రాకూడదు. నా భార్య పక్కనే నేను ఉండాల్సింది. ప్రతి అడుగులోనూ తనకు సాయం చేయాల్సింది''అని ఆయన వ్యాఖ్యానించారు.

అన్ని అంశాలనూ పరిగణలోకి తీసుకొని సున్నితత్వంతో కరోనావైరస్ ఆంక్షలు అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఏడెన్‌బ్రూక్‌లోని ప్రసూతి విభాగం అధిపతి అమందా రౌలే తెలిపారు.

''మేం నిర్దేశించిన ప్రమాణాల కంటే తక్కువ స్థాయి సేవలు అందించాల్సి వచ్చుంటే.. నేను క్షమాపణలు చెబుతున్నా''

ప్రసూతి వార్డుల్లోకి భాగస్వాముల్ని అనుమతించాలని బ్రిటన్‌లోని అన్ని ఆసుపత్రులకు ఎన్‌హెచ్‌ఎస్ సూచించింది. ఆంక్షలను ఎత్తివేయాలంటూ ఆన్‌లైన్‌లో ప్రచారం జరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే, గర్భస్రావాల విషయంలో చాలా చోట్ల ఆంక్షలు కొనసాగుతున్నాయి.

''అది మహిళలకు చాలా క్లిష్టమైన సమయం, వారి జీవిత భాగస్వాములకు కూడా''అని ఆర్‌సీవోజీ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు.

''బిడ్డ ఎదుగుదలలో లోపాలతో గర్భస్రావం చేసుకోవడం చాలా కష్టమైన పని. ముఖ్యంగా అప్పుడే మహిళలు ఒంటరిగా ఉండాల్సి వస్తే.. పరిస్తితి మరింత దారుణంగా ఉంటుంది''

''మహిళలకు, వారి జీవిత భాగస్వాములకు ఇలాంటి క్లిష్టమైన సమయాల్లో ఆసుపత్రులు సాయం చేయాలి''

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)