డీ-ఓటర్: అస్సాంలో ఓటింగ్‌కు దూరమైన ఈ లక్ష మంది ఎవరు?

- రచయిత, ఉమాంగ్ పొద్దార్
- హోదా, బీబీసీ న్యూస్
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వేడుకగా పిలుస్తున్న భారత్ సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు వంద కోట్ల మంది పాలుపంచుకోబోతున్నారు.
అయితే, అస్సాంలో ఈ ఓటింగ్‌లో పాలుపంచుకోలేని ఒక ప్రత్యేక వర్గముంది. వీరిని డీ-ఓటర్స్ లేదా ‘డౌట్‌ఫుల్ ఓటర్స్’గా పిలుస్తున్నారు. అస్సాం ప్రభుత్వ గణాంకాల ప్రకారం, వీరి సంఖ్య దాదాపు లక్ష వరకు ఉంటుంది.
ప్రస్తుతం వీరి పౌరసత్వంపై వివాదాలు వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయి. అస్సాంలోని పౌరసత్వం చుట్టూ ముసుకురుకున్న వివాదాల్లో డీ-ఓటర్స్ సమస్య కూడా ఒకటి.
అసలు ఈ డీ-ఓటర్స్ సమస్య ఏమిటో తెలుసుకునేందుకు అస్సాంలోని సిల్‌చర్, కరీమ్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గాల్లో బీబీసీ పర్యటించింది. బంగ్లాదేశ్ సరిహద్దులో ఉండే ఈ రెండు ప్రాంతాల్లోనూ పౌరసత్వం అనేది ప్రధాన రాజకీయ సమస్య.
డీ-ఓటర్లు ఎన్నికల్లో ఓటు వేయడానికి వీల్లేదు. అంతేకాదు ఒక వ్యక్తిని డీ-ఓటరుగా ప్రకటించే విధానమే నిరంకుశమైనది, ఈ వివాదం పరిష్కారం అయ్యేందుకు చాలా ఏళ్ల సమయం పడుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఓటింగ్ మాత్రమే కాదు, ప్రభుత్వ పథకాలు పొందడం కూడా డీ-ఓటర్లకు కష్టమే.

సమస్య ఎలా మొదలైంది?
బంగ్లాదేశ్‌తో పొడవైన సరిహద్దు కలిగిన అస్సాం చరిత్రను పరిశీలిస్తే, కొన్ని దశల్లో ప్రజలు ఇక్కడకు వలస వచ్చినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా బంగ్లా ప్రాంతంలో యుద్ధం, అణచివేత నుంచి తప్పించుకునేందుకు చాలా మంది అస్సాంకు తరలి వచ్చారు.
సరైన ప్రతాలు లేకుండా ఇలా భారత్‌లోకి వచ్చిన వారిని గుర్తించి, వెనక్కి పంపించేయాలని 1979 నుంచి ఆరేళ్లపాటు కొన్ని అస్సాం సంస్థలు నిరసనలు చేపట్టాయి.
ఈ సమస్యను పరిష్కరించేందుకు 1971 మార్చి 24కు ముందుగా (బంగ్లాదేశ్ విమోచన యుద్ధానికి ముందుగా) భారత్‌కు వచ్చినవారిని మాత్రమే భారత పౌరులుగా గుర్తించాలని నిర్ణయించారు. ఆ తేదీ తర్వాత వచ్చినవారంతా విదేశీయులే అవుతారని తేల్చారు.
ఆ తర్వాత 1997లో విదేశీయులను జల్లెడ పట్టేందుకు ఎన్నికల కమిషన్ ఒక సర్వే చేపట్టింది. దీనిలో పౌరసత్వంపై అనుమానాలున్న వారిని గుర్తించింది. ప్రాథమిక పరిశీలన అనంతరం వీరి కేసులను ఫారెనర్స్ ట్రైబ్యునల్ (విదేశీయుల కేసులను విచారించే ట్రైబ్యునల్)కు పంపించారు. భారతీయులు ఎవరు, అక్రమ వలసదారులు ఎవరు తేల్చేందుకే ఈ ట్రైబ్యునల్స్ ఏర్పాటుచేశారు.
కేసులు విచారణలో ఉండేవారి పేర్ల ముందు డీ (డౌట్‌ఫుల్) అనే అక్షరాన్ని చేర్చారు. వీరు ఓటింగ్‌లో పాలుపంచుకోకుండా ఆంక్షలు కూడా విధించారు.
అయితే, వీరు మొత్తంగా ఎంతమంది ఉన్నారనే విషయంపై ఒక స్పష్టతలేదు. 1997లో 3.13 లక్షల మంది డీ-ఓటర్లుగా ఎన్నికల కమిషన్ గుర్తించింది. అయితే, 2024 ఫిబ్రవరినాటి అస్సాం ప్రభుత్వ లెక్కల ప్రకారం, ఓటరు జాబితాలో ఇప్పటికీ దాదాపు 97,000 మంది డీ-ఓటర్ల పేర్లు ఉన్నాయి.

‘‘మేం హిందువులం, ఎక్కడికి పోవాలి?’’
64 ఏళ్ల మణీంద్ర దాస్ సిల్‌చర్‌లో జీవిస్తున్నారు. ఆయన కుటుంబం బంగ్లేదేశ్ నుంచి ఇక్కడకు వలస వచ్చింది. 1997లో ఆయన్ను డీ-ఓటర్‌గా ప్రకటించారు. అయితే, తనకు నోటీసులు మాత్రం 16 ఏళ్ల తర్వాత, అంటే 2013లో అందాయని ఆయన చెప్పారు.
‘‘మా నాన్న భారత్‌కు ఎప్పుడు వచ్చారో నాకు తెలియదు. నేను అప్పుడు చాలా చిన్నోడిని’’ అని బీబీసీతో ఆయన చెప్పారు. అయితే, తను పెద్దయ్యాక ఒక రోజు తన తండ్రి తనకు శరణార్థి కార్డు (రిఫ్యూజీ కార్డ్) ఇచ్చారని వివరించారు.
భారత ప్రభుత్వం ఈ కార్డు జారీచేస్తుంది. 1964కు ముందు నుంచి భారత్‌లో ఉండే వారికి దీన్ని ఇస్తుంటారు.
అసలు మణీంద్ర విచారణకు హాజరుకాకముందే ఏకపక్షంగా ట్రైబ్యునల్ తీర్పునిచ్చింది. దీంతో రెండేళ్లపాటు నిర్బంధ కేంద్రం (డిటెన్షన్ సెంటర్)లో ఆయన గడపాల్సి వచ్చింది. ‘‘ఒక రోజు నా దగ్గరకు డాక్యుమెంట్లు పట్టుకురావాలని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత నన్ను వారి వ్యాన్‌లోకి ఎక్కించుకున్నారు. నన్ను ఒక జైలు దగ్గరకు తీసుకెళ్లారు. బలవంతంగా లోపలకు తోసేశారు’’ అని ఆయన తెలిపారు.
ఆ కేసు వల్ల తమ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని, సాయం కోరుతూ చాలా మంది తలుపులు తట్టాల్సి వచ్చిందని 22 ఏళ్ల మణీంద్ర కుమారుడు చెప్పారు.
ఆర్థిక పరిస్థితి దిగజారడంతో తను కాలేజీ కూడా మానేయాల్సి వచ్చిందని ఆయన వివరించారు.
‘‘మేం భారత్‌లో జీవిస్తున్న హిందువులం. మాకు భారత్ పౌరసత్వం ఇవ్వకపోతే, ఎక్కడికి పోవాలి? పాకిస్తాన్‌కా?’’ అని ఆయన ప్రశ్నించారు.

‘‘నేను బీజేపీకి మద్దతు ఇస్తాను’’
మణీంద్ర దాస్ ఇంటి పక్కనే హరిచరణ్ దాస్ జీవిస్తున్నారు.
తను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బూత్ లెవల్ కమిటీ సభ్యుడినని, జీవితాంతం బీజేపీకి మద్దతు తెలుపుతూనే ఉంటానని ఆయన చెప్పారు.
‘‘ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని చాలా మందికి నేను చెప్పాను. కానీ, నేను ఓటు వేయలేకపోయాను. ఈ విషయంలో నేను చాలా బాధపడ్డాను’’ అని ఆయన అన్నారు.
‘‘ఒక రోజు మా ఇంటికి పోలీసులు వచ్చారు. నీది కూడా డీ-ఓటర్ కేసేనని అన్నారు. అసలు డీ-ఓటర్ అంటే ఏమిటో కూడా అప్పటికి నాకు తెలియదు’’ అని ఆయన చెప్పారు.
ఒక గదిలో జీవించే ఆయన కుటుంబం దగ్గర ఒక పెట్టె నిండా పత్రాలు ఉన్నాయి. ట్రైబ్యునల్ ఇచ్చిన నోటీసును మాకు చూపిస్తారా? అని అడిగినప్పుడు, మొత్తం పత్రాలను అర గంటపాటు ఆయన జల్లెడ పట్టారు. కానీ, ఆ నోటీసులు ఆయనకు దొరకలేదు. అయితే, ఒక ఓటరు జాబితా పత్రాన్ని మాకు ఆయన చూపించారు. దీనిలో ఆయన పేరు పక్కనే డీ-ఓటర్ అని రాసివుంది.

‘‘నేను ఓటు వేయలేకపోయాను’’
ఇక్కడ చాలా మందిది ఇదే కథ. హరిచరణ్ ఇంటికి 200 మీటర్ల దూరంలో 47 ఏళ్ల లక్ష్మీ దాస్ జీవిస్తున్నారు.
‘‘మా నాన్న భారత్‌కు ఎప్పుడు వచ్చారో నాకు గుర్తులేదు. ప్రస్తుతం నా తల్లిదండ్రులు ఇద్దరూ మరణించారు’’ అని లక్ష్మి చెప్పారు. ‘‘నా పేరు పక్కన కూడా డీ-ఓటర్ అని రాశారు. దీంతో నేను కూడా ఓటు వేయలేకపోయాను’’ అని ఆమె వివరించారు.
అయితే, ఆమె మాకు చూపించిన పత్రాల్లో 1950లనాటి ఒక సర్టిఫికేట్ కూడా ఉంది. దీనిలో ఆమె తండ్రి భారత్ పౌరుడని రాసివుంది.
‘‘నేను ఎప్పుడూ ఓటు వేయలేదు’’
ఈ సమస్య కేవలం హిందువులకే పరిమితం కాదు.
సిల్‌చర్ శివార్లలో ముస్లింలు ఎక్కువగా జీవించే ఓ గ్రామంలో మేం జహనారా బేగమ్‌ను కలిశాం. తను ఇక్కడే జన్మించానని ఆమె మాతో చెప్పారు.
అయినప్పటికీ తన జీవితంలో ఒక్కసారి కూడా తను ఓటు వేయలేదని ఆమె అన్నారు.
దీనికి కారణం ఆమెను కూడా విదేశీయురాలిగా ప్రకటించడమే. బెయిల్ తెచ్చుకోవడంతో నిర్బంధ కేంద్రానికి లేదా జైలుకు వెళ్లకుండా ఆమె ఇంటిలోనే జీవిస్తున్నారు. తన పత్రాలను ఎప్పుడూ తన దగ్గరే ఉంచుకుంటానని ఆమె మాతో చెప్పారు.

‘‘అంతా గందరగోళం’’
డీ-ఓటర్లను గుర్తించే ప్రక్రియలు గందరగోళం, ఆందోళనల నడుమే పూర్తయ్యాయి. మేం కలిసి వారిలో చాలా మంది దగ్గర వారి కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు లేవు. కొంతమందికైతే అసలు తమ కేసులను ఏ న్యాయవాదులు వాదిస్తున్నారో కూడా తెలియదు.
చాలా కేసుల్లో డీ-ఓటర్లను గుర్తించే ప్రక్రియ నిర్హేతుకంగా జరిగిందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కొన్ని కేసుల్లో డీ-ఓటర్ల కుటుంబ సభ్యులను భారత పౌరులుగా గుర్తించారు. కానీ, వారిని మాత్రం డీ-ఓటర్లుగా కొనసాగిస్తున్నారు.
డీ-ఓటర్ల సమస్య కేవలం ఓటింగ్‌కు మాత్రమే పరిమితం కాదు. ‘‘రేషన్ తీసుకోవడంతోపాటు ఆధార్ కార్డు పొందడంలోనూ వీరికి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి’’ అని విదేశీ ట్రైబ్యునల్ మాజీ సభ్యురాలు, న్యాయవాది శిశిర్ డే అన్నారు.
చాలా కేసుల్లో డీ-ఓటర్లుగా ప్రకటించిన వారు భారతీయ పౌరులేనని ట్రైబ్యునల్స్ గుర్తిస్తుంటాయి.
‘‘ఇక్కడ సమస్య ఏమిటంటే, దేన్ని ఆధారంగా చేసుకుని డీ-ఓటరుగా గుర్తించారో మనకు చెప్పరు’’ అని ఇలాంటి కేసులను వాదించే సిల్‌చర్‌కు చెందిన న్యాయవాది తాన్య లస్కర్ చెప్పారు. ‘‘మీ దగ్గర కొన్ని పత్రాలు లేవని మాత్రమే చెబుతారు’’ అని ఆమె వివరించారు.
అయితే, అసలు ఏ పత్రాలు లేవో కూడా వారికి చెప్పరని ఆమె తెలిపారు.
ఈ కేసులో ఒక్కో ట్రైబ్యునల్ ఒక్కోలా పనిచేస్తుంది. ‘‘మొత్తంగా హైకోర్టు పర్యవేక్షణలో ఇది జరుగుతుంది. ఇక్కడ ఒక జడ్జి ఒకలా చెబితే, మరొక జడ్జి మరోలా మార్పులు సూచిస్తుంటారు’’ అని శిశిర్ అన్నారు.
‘‘ఇక్కడ మనం ఏటా వరదలు ముంచెత్తే ప్రాంతాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ చాలా మంది నదీ పరివాహక ప్రాంతాల్లో జీవిస్తారు. పైగా వీరిలో చాలా మంది పేదవారే. ఇలాంటి పరిస్థితుల్లో పత్రాలను జాగ్రత్తగా దాచుకోవడం చాలా కష్టం’’ అని తాన్య లస్కర్ అన్నారు.
విచారణ జరిగేటప్పుడు ఇక్కడ చాలా మంది వేరే ప్రాంతాలకు వలస వెళ్తుంటారని, డాక్యుమెంట్లు భద్రతపరచుకోవడంపై వీరిలో ఎక్కువమంది దృష్టిపెట్టరని ఆమె చెప్పారు.

పౌరసత్వంతో
అస్సాంలో పౌరసత్వానికి సంబంధించిన అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. 2019లోఇక్కడ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్‌సీ)ను అప్‌డేట్ చేశారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఎప్పటినుంచో ఎన్ఆర్‌సీ కనిపిస్తోంది. అయితే, ఈ సారి మేనిఫెస్టోలో దాని పేరు లేదు.
అస్సాంలో నిర్వహించిన పౌరసత్వ ధ్రువీకరణలో దాదాపు మూడు కోట్ల మంది ప్రజలు 1971 ముందు నుంచీ తాము ఇక్కడే ఉంటున్నామని తమ నివాస ధ్రువీకరణ పత్రాలను అధికారులకు చూపించారు. అయితే, దాదాపు 19 లక్షల మంది సరైన పత్రాలను చూపించలేకపోయారు.
ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, కొందరు డీ-ఓటర్ల పేర్లు కూడా పౌరసత్వాన్ని నిరూపించుకున్న వ్యక్తుల జాబితాలో ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వంలోని భిన్న శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల ఇక్కడి ఓటరు జాబితాలోనూ కొందరు డీ-ఓటర్ల పేర్లు ఉన్నాయి. మణీంద్ర లాంటి వారిని విదేశీయులుగా ట్రైబ్యునల్ ప్రకటించినప్పటికీ, ఓటరు జాబితాలో పేరు ఉండటంతో ఆయన ఓటు వేయగలిగారు. వీటన్నింటినీ పరిశీలిస్తే, ఈ ప్రక్రియలు ఎంత గందరగోళంగా ఉన్నాయో తెలుస్తుంది.

బీజేపీ సమస్య
ఈ సమస్యను పరిష్కరిస్తామని ఎప్పటినుంచో బీజేపీ చెబుతూ వస్తోంది. 2014లో లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో మోదీ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే నిర్బంధ కేంద్రాల వ్యవస్థను పూర్తిగా రద్దు చేస్తామని ప్రకటించారు.
తాజా ఎన్నికల్లోనూ బీజేపీ ఈ విషయాన్ని ప్రస్తావించింది. తమకు అధికారం అప్పగిస్తే, ఆరు నెలల్లోనే డీ-ఓటరు సమస్యను తీరుస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. అయితే, ఆయన కేవలం హిందూ డీ-ఓటర్ల గురించి మాత్రమే ఈ వ్యాఖ్యలు చేశారు.
అసలు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారని సిల్‌చర్ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా పోటీచేస్తున్న పరిమల్ సుక్లబైద్యను బీబీసీ ప్రశ్నించింది.
‘‘ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమలులో ఉండటంతో ఈ విషయంపై నేను మాట్లాడలేను. అయితే, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)తో అస్సాంలో పౌరసత్వ సమస్యలన్నీ త్వరలోనే తీరిపోతాయి’’ అని ఆయన అన్నారు.
2019లో వివాదాస్పద సీఏఏను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆమోదించింది. బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్‌ల నుంచి వచ్చిన ముస్లింలు మినహా ఇతర మతస్థులను అక్రమ వలసదారులుగా గుర్తించబోమని, సరైన పత్రాలు లేనప్పటికీ వీరు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని దీనిలో పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి నుంచే ఇది అమలులోకి వచ్చింది.
అయితే, ఈ చట్టాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేశారు.
‘‘ఒకసారి పౌరసత్వం అంశం పరిష్కారమైతే, డీ-ఓటర్ సమస్య కూడా అదే తీరిపోతుంది. ఎందుకంటే ఈ రెండూ ఒకదానిపై మరికొటి ఆధారపడినవే’’ అని సుక్లబైద్య అన్నారు.
అయితే, ఆయన వాదనతో కొందరు విభేదిస్తున్నారు కూడా.
‘‘ఇది కేవలం ఎన్నికల జిమ్మిక్కు’’ అని తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సుష్మితా దేవ్ అన్నారు. ‘‘హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టి బీజేపీ ఓట్లు రాబట్టుకోవాలని ప్రయత్నిస్తోంది’’ అని ఆమె అన్నారు.
అసలు గత పదేళ్లలో బీజేపీ ఏం చేసింది? అని మణీంద్ర కొడుకు ప్రశ్నించారు. ‘‘రాజకీయ నాయకులు కేవలం ఓట్ల కోసమే మాటలు చెబుతారు. ప్రజల బాధను వారు అర్థం చేసుకోలేరు’’ అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
‘‘మోదీ ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఉండొచ్చు. కానీ, దానితో మాకు ఎలాంటి సాయమూ అందడం లేదు. నేను ఎప్పటినుంచో డీ-ఓటర్‌గానే కొనసాగుతున్నారు. ఆ చట్టంతో నాకు ఎలాంటి ప్రయోజనమూ దక్కలేదు’’ అని లక్ష్మీ దాస్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















