ఎముకలు కొరికే చలిలో అస్సాం మిసింగ్ తెగ మహిళలు ఎందుకు ధర్నా చేస్తున్నారు

మిసింగ్ తెగ ప్రజల ధర్నా

ఫొటో సోర్స్, DILIP SHARMA

ఫొటో క్యాప్షన్, మిసింగ్ తెగ ప్రజల ధర్నా
    • రచయిత, దిలీప్ కుమార్ శర్మ
    • హోదా, బీబీసీ కోసం, తిన్‌సుకియా నుంచి

"మాతోపాటూ ఇక్కడ ధర్నాలో కూర్చున్న 55 ఏళ్ల రేవతీ పావ్ మొదట చనిపోయారు.

చలి తీవ్రంగా ఉండడంతో జబ్బు పడ్డారు. ఇక్కడ ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వం నుంచి ఎలాంటి సౌకర్యం అందలేదు.

ఆమెను చూడ్డానికి డాక్టర్లు ఎవరూ రాలేదు. తర్వాత కుస్మితా మోరాంగ్ చికిత్స తీసుకుంటూ చనిపోయారు ఆమె గర్భవతి"

"ఈరోజు ఉదయం ఇంద్రా మీలీ ముక్కు నుంచి రక్తం కారడం మొదలైంది. ఆమె ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంది.

నాకు 82 ఏళ్లు. ఈ చలిలో ప్లాస్టిక్ టెంట్‌లో ఉంటున్నాను. మేం ఇక్కడ 21 రోజుల నుంచీ ఉంటున్నాం. మాకు ఇంత అన్యాయం ఎందుకు జరుగుతోంది".

అస్సాం తిన్‌సుకియా పట్టణంలో జిల్లా పరిషత్ కార్యాలయం వెనుక బోర్గురీలో ధర్నాలో కూచున్న మిసింగ్ తెగకు చెందిన దమయంతి లగాసూ ఇదంతా చెబుతుంటే, ఆ బాధంతా ఆమె ముఖంలో కనిపిస్తోంది.

మి

ఫొటో సోర్స్, DILIP SHARMA

ఫొటో క్యాప్షన్, దమయంతి లగాసూ

డిసెంబర్ 21 నుంచి తిన్‌సుకియా బోర్గురీ ప్రాంతంలోని ఒక మైదానంలో లాయికా, దోధియా గ్రామాలకు చెందిన 1480 కుటుంబాలు ధర్నాలో కూర్చున్నాయి. మిసింగ్ తెగకు చెందిన ఈ రెండు అటవీ గ్రామాలు గత 70 ఏళ్లుగా బ్రహ్మపుత్రా నది దక్షిణ తీరంలో ఉన్న డిబ్రూ-సైఖోవా నేషనల్ పార్క్ ప్రధాన క్షేత్రంలో ఉన్నాయి.

కానీ, అది నేషనల్ పార్క్ కావడంతో అక్కడ ప్రజలకు లభించే మౌలిక సదుపాయాలకు సంబంధించిన అన్ని ప్రభుత్వ పథకాలను నిలిపివేశారు.

దీంతో లాయికా, దోధియా గ్రామాల ప్రజలు గత కొన్నేళ్లుగా తమకు శాశ్వత పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరనసలకు దిగారు.

ప్రభుత్వం ఎక్కడైనా వేరే భూముల్లో తమకు శాశ్వత నివాసం కల్పించేవరకూ ధర్నా విరమించబోమని వారు చెబుతున్నారు.

ఇప్పటికే, ఎముకలు కొరికే ఈ చలిలో ఈ ధర్నాలో కూచున్న ఇద్దరు మహిళలు చనిపోయారు. మరోవైపు చాలా మంది వరుసగా అనారోగ్యానికి గురవుతున్నారు. దమయంతి తన వ్యతిరేకతను, బాధను మిసింగ్ తెగ పాడుకునే ఒక పాట ద్వారా చెప్పగానే, ఆమె పక్కనే ఉన్న మహిళలంతా కన్నీళ్లు పెట్టారు.

ఆ పాటకు అర్థం అడిగినప్పుడు "కొండలు, నదులు, విశాల పర్వతాలు, చెట్లు, మొక్కలు కూడా మనిషి జీవితంలో వచ్చిన ఈ కష్టం చూసి ఏడుస్తూ ఉంటాయి. మాకు ఏ నీడా లేదు. ఈ శిబిరంలో ఉన్న మాకు తర్వాత ఏం జరుగుతుందో తెలీదు.

మేం బతికుంటామో లేదో కూడా తెలీదు. మమ్మల్ని ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో. ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నీళ్లకు, అవి ఎక్కడ సముద్రంలో కలుస్తాయో వాటికి తెలీదు.

సరిగ్గా మా జీవితం కూడా అలాగే మారింది. నేను ఆ మాటలే నా పాటలా పాడుతున్నా" అన్నారు దమయంతి.

మిసింగ్ తెగ ప్రజల ధర్నా

ఫొటో సోర్స్, DILIP SHARMA/BBC

మహిళల కీలక పాత్ర

భారత్‌లో గత కొన్ని నెలలుగా షహీన్ బాగ్ నుంచి రైతుల నిరసనల వరకూ మహిళలు అన్నింటా ముందు నిలుస్తున్నారు.

అలాగే మిసింగ్ తెగ మహిళలు కూడా తమ తెగువ చూపిస్తున్నారు.

ధర్నా జరిగే చోట కవరేజీ కోసం వచ్చే మీడియాతో ఎక్కువగా మహిళలే మాట్లాడుతున్నారు.

40 ఏళ్ల రాధికా చక్రా ప్లాస్టిక్ తమ గుడారం చూపిస్తూ "మేం ఇంత చలిలో ఈ ప్లాస్టిక్ గుడారంలో ఉంటున్నాం. ఈ నేలమీదే పడుకుంటాం. రాత్రి చలి పెరిగితే చలిమంట వేసుకుని రాత్రంతా మేలుకునే ఉంటాం.

పగలు ఎండతో గుడారం వేడెక్కుతుంది. మాకు మా పిల్లల గురించే దిగులు. ఇక్కడున్న వారందరూ వరుసగా జబ్బు పడుతున్నారు" అన్నారు.

బోర్గురీలో ధర్నా జరిగే ప్రాంతానికి దగ్గరలో నిరసనకారులు సుమారు 1500 మంది ఉండడానికి ఒక తాత్కాలిక ప్లాస్టిక్ గుడారం వేశారు.

దానిలో నేలపై పడుకోడానికి ప్లాస్టిక్ కవర్లు పరిచారు. గుడారాల బయట ఆర్పిన పొయ్యి, కడగని పాత్రలు, చెత్త అంతా చూస్తుంటే.. ఆ ప్రాంతం ఒక శరణార్థుల శిబిరంలా కనిపిస్తోంది.

ఈ గుడారంలోని మహిళలు చిన్న చిన్న గ్రూపులుగా తమ పిల్లలతో, వృద్ధులతో ఉంటున్నారు.

ఇక్కడ మరుగుదొడ్డి లాంటి ఏర్పాట్లు, కరెంట్ లాంటివి లేవు. తాగునీళ్ల కోసం కొన్ని హాండ్ పంపులు వేశారు.

కానీ ఇక్కడ ధర్నా చేస్తున్న వారందరూ తమకు ఎంత కష్టం వచ్చినా, ప్రభుత్వం నుంచి శాశ్వత పునరావాసం పొందేవరకూ తిరిగి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు.

మిసింగ్ తెగ ప్రజల ధర్నా

ఫొటో సోర్స్, DILIP SHARMA

ఫొటో క్యాప్షన్, మీనూ పాటిర్

వృద్ధుల గురించి ఆందోళన

చబువాలోని ఒక కాలేజీలో బీఏ చదువుతున్న మీనూ పాటిర్ ఇంత చలిలో తమ పెద్దవాళ్ల గురించే కంగారుగా ఉందన్నారు.

మాకు ఉండడానికి ఒక శాశ్వత స్థలం కోసమే ఇక్కడ మా అమ్మనాన్న, కుటుంబంలోని పెద్దవాళ్లతో ధర్నా చేస్తున్నాం.

నేను ఒక విద్యార్థిని. ఇప్పుడు నేను మా క్లాసులో ఉండాలి. కానీ ధర్నాలో ఉన్నాను. నేను ఎన్సీసీ క్యాడెట్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నా. పోలీస్ కావాలనేది నా కల. కానీ, ప్రస్తుతం నా మనసంతా ఈ ఒక విషయమే ఉంది. ప్రభుత్వం మా కష్టాలు అర్థం చేసుకోవాలి. మాకు శాశ్వతంగా నివాస స్థలం ఇవ్వాలి" అన్నారు.

ధర్నాలో కూచున్న వాళ్లకు 'తాకమ్ మిసింగ్ పోరిన్ కెబాంగ్'(మిసింగ్ విద్యార్థి సంఘం) నేత ప్రసన్నా నారాహ్ ధైర్యం చెబుతున్నారు.

"1950లో భూకంపం వచ్చినపుడు మా భూములన్నీ బ్రహ్మపుత్రలోకి కలిసిపోయాయి. మాకు అప్పుడు ప్రభుత్వం ఫారెస్ట్ శాఖ సాయంతో లాయికా, దోధియా గ్రామాల్లో ఆశ్రయం కల్పించింది.

ఆ ప్రాంతం డిబ్రూ ఫారెస్ట్ రిజర్వ్‌లోకి వస్తుంది. అందుకే వాటిని అటవీ గ్రామాలుగా ప్రకటించారు.

తర్వాత 1986లో దానిని వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించారు. 1999లో భారత ప్రభుత్వం దీనిని జాతీయ ఉద్యానవనంగా మార్చింది" అన్నారు.

ప్రసన్నా నారాహ్

ఫొటో సోర్స్, DILIP SHARMA/BBC

ఫొటో క్యాప్షన్, ప్రసన్నా నారాహ్

"రిజర్వ్ ఫారెస్ట్ అయ్యే ముందు వరకూ ప్రభుత్వం ఈ రెండు గ్రామాల ప్రజలకు వారి ప్రాథమిక హక్కుల కింద అన్ని సౌకర్యాలూ కల్పించింది.

కానీ 1999లో డిబ్రూ, సైఖోవా పేరుతో రెండు రిజర్వ్ ఫారెస్టులు, మరికొన్ని ప్రాంతాలను కలిపి నేషనల్ పార్క్‌గా చేశారు.

ఆ తర్వాత నుంచి స్కూల్, ఆరోగ్య కేంద్రాలు, విద్యుత్, నీళ్లు లాంటి అన్ని సౌకర్యాలను ప్రభుత్వం ఆపేసింది. కానీ ఎన్నికల సమయంలో అన్ని పార్టీలవారూ ఓట్లు అడగడానికి కచ్చితంగా వస్తారు.

చట్టపరంగా నేషనల్ పార్క్ లోపల గ్రామాలు ఉండకూడదు కాబట్టి, మేం 1986 నుంచే శాశ్వత పునరావాసం కోసం డిమాండ్ చేస్తున్నాం" అని చెప్పారు.

అస్సాంలో మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.

రాష్ట్ర రాజకీయాలపై పట్టున్న నిపుణులు మిసింగ్ తెగవారు శాశ్వత పునరావాసం కోసం ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నారని చెబుతున్నారు.

ఎందుకంటే, ఈ రెండు గ్రామాలు చబువా అసెంబ్లీ స్థానంలోని ముఖ్యమంత్రి పూర్వీకుల గ్రామం బిందాకాటా గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తాయి.

"అస్సాంలో మిసింగ్ తెగ జనాభా దాదాపు 14 లక్షలు ఉంది. ముఖ్యమంత్రి సోనోవాల్ సొంత నియోజకవర్గం మాజులీలో దాదాపు 45 వేల మంది మిసింగ్ ఓటర్లు ఉన్నారు.

అక్కడ 15 ఏళ్ల తర్వాత ఒక కాంగ్రెస్ అభ్యర్థిని గత ఎన్నికల్లో సోనోవాల్ ఓడించారు" అని డిబ్రూగఢ్‌లోని జర్నలిస్టు అవిక్ చక్రవర్తి చెప్పారు.

వంట పనుల్లో మహిళలు

ఫొటో సోర్స్, DILIP SHARMA

ఫొటో క్యాప్షన్, వంట పనుల్లో మహిళలు

"కాంగ్రెస్ కూడా మిసింగ్ సమాజం వారిని తమ ప్రభుత్వంలో మంత్రిగా చేసింది. ప్రస్తుత సోనోవాల్ ప్రభుత్వంలో కూడా వారు మంత్రిగా ఉన్నారు.

ఇటీవల కాంగ్రెస్ పార్టీ నేత దేవబ్రత్ సైకియా ధర్నా ప్రాంతంలో ప్రజలను కలిశారు. అంటే దీనిపై రాజకీయం జరుగుతోంది.

కానీ లాయికా, దోధియా గ్రామ ప్రజల ఈ సమస్య చాలా పాతది. ఇప్పటివరకూ ఏ ప్రభుత్వమూ వీరికి ఎలాంటి శాశ్వత పరిష్కారం చూపించలేదు.

దీనికి పరిష్కారం దొరికితే నేషనల్ పార్కులో వన్యప్రాణులు మరింత సురక్షితంగా ఉంటాయి" అన్నారు.

తిన్‌సుకియా జిల్లా పర్యావరణ పరిరక్షణ కోసం గత రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న నిరంతా గొహాయీ అస్సాంలో డిబ్రూ -సైఖోవా నేషనల్ పార్క్ ప్రాధాన్యం గురించి చెప్పారు.

లాయికా, దోధియా గ్రామాల సమస్య 20 ఏళ్ల నాటిది, వీరి వల్ల పార్కుకు చాలా నష్టం జరిగింది. ఇక్కడ గ్రామీణులకు రిజిస్టర్డ్ ఫారెస్ట్ విలేజర్స్ గుర్తింపు ఇచ్చారు అన్నారు.

"1986లో ఈ ప్రాంతాన్ని వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించినప్పుడు ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్‌లో ఈ రెండు గ్రామాల ప్రజలకు అభయారణ్యం బయట పునరావాసం కల్పిస్తామని చెప్పారు.

1999లో ఇది నేషనల్ పార్క్ కాగానే, ఇక్కడ గ్రామాలకు లభించే అన్ని సౌకర్యాలూ నిలిపివేశారు.

ఫలితంగా ఇక్కడ జీవనోపధి కోసం మిగతా ఖర్చుల కోసం చెట్లను కొట్టడం, వన్యప్రాణులను చంపడం మొదలైంది.

అలాంటి వాటితో ఈ నేషనల్ పార్కుకు చాలా నష్టం జరుగుతుంది" అని గొహాయీ చెప్పారు.

"డిబ్రూ-సైఖోవా ప్రపంచంలోనే అతిపెద్ద పార్క్. 340 చదరపు కిలోమీటర్లలో వ్యాపించిన ఇది ఒక రివర్ ఐలండ్ నేషనల్ పార్క్.

బ్రహ్మపుత్రా నది దక్షిణ తీరంలో ఉన్న ఇది ప్రపంచంలోని 19 జీవవైవిధ్య హాట్ స్పాట్‌లలో ఒకటిగా నిలిచింది.

ప్రకృతి సౌందర్యం, వివిధ వన్యప్రాణులకు ఇది ప్రసిద్ధి చెందింది. పర్యాటకంగా దీనికి చాలా ప్రాధాన్యం ఉంది.

ఈ నేషనల్ పార్క్ జాతీయ సంపద. దీనిని కాపాడ్డానికి లాయికా-దోధియా ప్రజలను పునరావాసం కల్పించడం చాలా అవసరం" అన్నారు.

బినోద్ హజారికా

ఫొటో సోర్స్, DILIP SHARMA/BBC

ఫొటో క్యాప్షన్, బినోద్ హజారికా

నెలాఖరులోపు పరిష్కరిస్తాం-బీజేపీ

శాశ్వత పునరావాసం డిమాండ్ గురించి కొనసాగుతున్న నిరసనలపై, తమ ప్రభుత్వంపై వస్తున్న విమర్శలపై చబువా ప్రాంత బీజేపీ ఎమ్మెల్యే బినోద్ హజారికా సమాధానం ఇచ్చారు.

"ధర్నా చేస్తున్న వారి డిమాండ్‌లో అర్థముంది. ప్రభుత్వంపై వారికి కోపం ఉంటుంది. ఎందుకంటే 20 ఏళ్ల క్రితం ఆ ప్రాంతాన్ని నేషనల్ పార్కుగా ప్రకటించినప్పుడే, వారికి శాశ్వత పునరావాసం కల్పించి ఉండాలి.

అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మేం ప్రభుత్వం ఏర్పాటు చేసి నాలుగున్నరేళ్లే అయ్యింది. అందులో సీఏఏ వ్యతిరేకత, కోవిడ్ వల్ల దాదాపు ఏడాది పాటు ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోయాయి" అన్నారు.

మిసింగ్ తెగల డిమాండ్‌ను నెలాఖరులోపు పరిష్కరిస్తామని హజారికా చెప్పారు.

"నేను అస్సాం అసెంబ్లీలో లాయికా-దోధియా గ్రామాల సమస్యను ఎన్నోసార్లు లేవనెత్తాను. 15 రోజుల క్రితం ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్ నేతృత్వంలో సంబంధిత విభాగాల ఉన్నతాధికారులతో సమావేశం అయ్యాం.

ఈ నెలాఖరులోపు శాశ్వత పునరావాసం కింద వీరికి వేరే భూముల హక్కులు అందిస్తాం. ఇలాంటి వాటికి సాధారణంగా రెండు మూడేళ్లు పడుతుంది. కానీ మేం 15 రోజుల్లో చేయడానికి ప్రయత్నిస్తున్నాం.

లఖీంపూర్ ఆదాకోన ప్రాంతంలో 900 కుటుంబాల కోసం మా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ ఉన్న ఒక మోడల్ విలేజ్ ప్రణాళిక సిద్ధం చేసింది. మిగతా కుటుంబాలకు తిన్‌సుకియా జిల్లాలో పునరావాసం కల్పిస్తాం" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)