తెలంగాణ: తల రాఘవాపూర్‌లో, మొండెం కుకునూర్‌లో.. తెరాస నాయకుడి హత్య - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
తలను మొండెం నుంచి వేరుచేసి తెరాస నాయకుడు, వ్యాపారిని దారుణంగా హత్య చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందని ఈనాడు ఓ కథనం ప్రచురించింది.
‘‘తెరాస ఎస్టీ సెల్ తెల్లాపూర్ మున్సిపల్ ఉపాధ్యక్షుడు కడావత్ రాజునాయక్ వెలిమెల తండాలో ఉంటున్నారు.
ఈ నెల 24న ఆయన అదృశ్యం అయినట్లు 25న బీడీఎల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రాజునాయక్ అనుచరవర్గం , తమ్ము డు గోపాల్‌పై కన్నేసి విచారించగా హత్యోదంతం వెలుగులోకి వచ్చింది.
ఇంద్రకరణ్ గ్రామ సమీపంలో గోపాల్, అదే గ్రామానికి చెందిన రాంసింగ్ అనే వ్యక్తితో కలిసి హత్య చేసినట్లు విచారణలో తేల్చా రు.
వెలిమెల తండాలో రూ.10 కోట్లు విలువైన 33 గుంటల భూమి విషయంలో రాజునాయక్‌కు, రాంసింగ్‌కు గొడవలున్నాయి.
రాంసింగ్, రాజునాయక్ తమ్ముడు గోపాల్ ఇద్దరూ స్నేహితులు. ఈ నెల 24న ఇంద్రకరణ్, క్యాసారం పరిసర ప్రాంతాల వరకు రాజునాయక్‌తో కలిసి తమ్ముడు గోపాల్, రాంసింగ్ కారులో ప్రయాణించారు. ఈ వివరాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి.
అదే సమయంలో ఫోన్ ట్రాకింగ్ ఇక్కడిదాకా పనిచేసి ఆ తర్వాత ఆగిపోయింది. అదేరోజు రాంసింగ్, గోపాల్ సహా వీరి అనుచరులు 8 మంది రాజునాయక్‌తో కలిసి మద్యం తాగి మత్తులో రాజునాయక్‌ను హత్య చేసి తల, మొండెం వేరు చేశారు.
న్యాల్కల్ మండలం రాఘవాపూర్ గ్రామ శివారు మంజీరా బ్యాక్ వాటర్లో మొండాన్ని పడవేశారు. తల భాగాన్ని రాయికోడ్ మండలం కుకునూర్ గ్రామంలో పడేశారు. ఈ కేసులో 8 మందిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు’’అని కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు, కాలేజీలు
తెలంగాణలో దాదాపు మూడు వారాల విరామం తర్వాత విద్యా సంస్థలు మళ్లీ ప్రారంభం కాబోతున్నాయని సాక్షి ఓ కథనం ప్రచురించింది.
‘‘అన్ని విద్యా సంస్థలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి యథావిధిగా పని చేస్తాయని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల రీ ఓపెనింగ్‌కు అనుమతినిస్తూ ప్రభుత్వ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యా సంస్థల్లో కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి సబిత స్పష్టం చేశారు.
ఈ దిశగా పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరోనా మూడో వేవ్ పెరుగుతుండటంతో షెడ్యూల్ కన్నా ముందే జనవరి 8 నుంచి 17 వరకు విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
కేసులు ఎక్కువవడంతో సెలవులను ఈ నెల 30 వరకు పొడిగించింది. దీనిపై విద్యావేత్తల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది.
కోవిడ్ తీవ్రత అంతగా లేనప్పుడు.. షాపింగ్ మాల్స్, ఇతర వ్యాపార కార్యకలాపాలు యథావిధిగా జరుగుతున్న ప్పుడు విద్యా సంస్థలను మూసేయడం సరికాదన్న వాదన తెరమీదకొచ్చింది. దీంతో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది’’అని సాక్షి ఓ కథనం ప్రచురించింది.

తిరుపతిలో రూ.50లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
వాహనంతోపాటు రూ.50లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను తిరుపతిలో అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.
‘‘తిరుపతి డివిజన్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్‌ఆర్‌వో) దొరస్వామి మీడియాకు శనివారం వివరాలు తెలిపారు.
ముందుగా అందిన సమాచారం మేరకు డీఎ్‌ఫవో ఆదేశాలతో డాగ్ స్క్వాడ్, సిబ్బందితో కలసి దొరస్వామి శ్రీకాళహస్తి నుంచి రేణిగుంట వైపు వచ్చే వాహనాలను శుక్రవారం సాయంత్రం తనిఖీ చేస్తున్నారు.
ఇంతలో ఓ కారు ఏర్పేడు నుంచి రేణిగుంటవైపు వేగంగా వస్తుండగా ఆపారు. కానీ ఆ వాహనం ఆగకుండా వెళ్లిపోవడంతో వెంబడించారు.
ఈ క్రమంలో కారు పంక్చరు కావడంతో అందులోనివారు వాహనాన్ని వదిలి పరారయ్యారు. డాగ్ స్క్వాడ్ సాయంతో వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా.. సీట్ల కింద కనిపించకుండా దాచి ఉంచిన 16 ఎర్రచందనం దుంగలను గుర్తించారు.
కారుతోపాటు వాటిని స్వాధీనం చేసుకున్నారు. దుంగల బరువు 502 కిలోలుండగా, దాదాపు రూ.50 లక్షలకుపైగా విలువ ఉంటుందని ఎఫ్‌ఆర్‌వో తెలిపారు’’అని కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సుశాంత్ మృతి కేసులో.. డ్రగ్ డీలర్ షాహిల్ అరెస్టు
బాలీవుడ్ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతితో లింకు ఉన్న డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డ్రగ్ డీలర్ షాహిల్ షాను అరెస్టు చేసిందని నమస్తే తెలంగాణ ఓ కథనం ప్రచురించింది.
‘‘షాహిల్ షా అలియాస్ ఫ్లాకోగా డ్రర్స్ అమ్మకాలు చేసేవాడు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోనే షాహిల్ కూడా ఉన్నాడు.
అయితే గత 8 నెలల నుంచి అతను పరారీలో ఉన్నాడు. 2021 ఏప్రిల్‌లో ఎన్సీజీ పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేసి వారి నుంచి మారిజువానా స్వాధీనం చేసుకున్నారు.
ఆ కేసుతోనూ షాహిల్‌కు లింకు ఉంది. ఈ రెండింటి కేసుల్ని పోలీసులు విచారించనున్నారు. సుశాంత్‌కు డ్రగ్ డీలర్ షాహిల్ మాదకద్రవ్యాలను అమ్మేవాడని ఎన్సీబీ జోనల్ డైరక్టర్ సమీర్ వాంఖడే గతంలో తెలిపారు.
షాహిల్ షాపై గత ఆర్నెళ్ల నుంచి అనుమానం ఉందని, ఏప్రిల్ 13వ తేదీన మాల్దాలోని అతని ఇంట్లో సోదాలు చేశామని, అయితేసుశాంత్ ఉన్న కాంప్లెక్స్‌లోనే షాహిల్ ఉండేవాడని తేలినట్లు సమీర్ చెప్పారు.
2020, ఏప్రిల్ 14వ తేదీన బాంద్రాలోని తన ఇంట్లో సుశాంత్ సింగ్ మృతిచెందిన విషయం తెలిసిందే’’అని ఆ కథనంలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘మా అక్కపై అత్యాచారం చేసి, మొహానికి నల్ల సిరా రాసి, మెడలో చెప్పులదండతో ఊరేగించారు’
- టీఆర్ఎస్ రూ. 301 కోట్లు, టీడీపీ రూ. 188 కోట్లు, వైసీపీ రూ. 143 కోట్లు
- పిల్లల ఆహారం విషయంలో తల్లులు చేసే నాలుగు తప్పులు
- వీధుల్లో అడుక్కుంటున్న డాక్టర్లు.. ఆకలేస్తోంది, ఆహారం లేదు.. 8 నెలలుగా జీతాలు అందట్లేదు..
- లాక్డౌన్లో యూట్యూబ్ చానల్‌తో లక్షల ఫాలోవర్లు .. 22 దేశాలు చుట్టేసిన యువకుడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











