‘‘అరుణాచల్ భారత్‌లో భాగం కాదంటూ చైనా అధికారులు నన్ను ఇబ్బంది పెట్టారు’’

చైనా, భారత్, అరుణాచల్ ప్రదేశ్, విదేశాంగ విధానం. చైనా భారత్ బోర్డర్

ఫొటో సోర్స్, ANI

ఇండియన్ పాస్‌పోర్ట్ కారణంగా చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు తనను షాంఘై పుడాంగ్ విమానాశ్రయంలో గంటలపాటు వేధించారని అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ప్రేమా థోంగ్‌డోక్ ఆరోపించారు.

ఈ పాస్‌పోర్ట్ చెల్లదని తనతో చెప్పారని ఆమె పేర్కొన్నారు.

దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు ఆమె ఒక లేఖ రాశారు. ఇలాంటిది మరెవరికీ జరగకూడదని అందులో ఆమె పేర్కొన్నారు.

భారతీయ పౌరురాలికి ఇలా జరగడం ఎంతమాత్రం ఆమోదయోగ్యంకాదని అరుణాచల్‌ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ అన్నారు. దీనిని అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా ఆయన అభివర్ణించారు.

ఈ ఘటన జరిగిన అదే రోజున (నవంబర్ 21) భారత ప్రభుత్వం బీజింగ్‌తో పాటు దిల్లీలోని చైనా వర్గాలకు తన నిరసనను తెలియజేసినట్లు బీబీసీకి సమాచారం ఉంది. షాంఘైలోని ఇండియన్ కాన్సులేట్ కూడా ఈ విషయంపై స్పందించి, ప్రేమాకు పూర్తి మద్దతు తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అరుణాచల్‌ప్రదేశ్ ముమ్మాటికీ భారత భూభాగమని, అక్కడి ప్రజలకు భారత పాస్‌పోర్డ్ పొందేందుకు, ప్రయాణాలు చేసేందుకు పూర్తి హక్కు ఉందని చైనాకు భారత్ స్పష్టం చేసినట్లు సోర్సెస్ తెలిపాయి.

చైనీస్ అధికారుల చర్యలను పౌర విమానయానానికి సంబంధించిన షికాగో, మాంట్రియల్ ఒప్పందాల ఉల్లంఘనగా భారత్ అభివర్ణించింది.

దీనిపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ, ‘‘భారత్ చట్టవిరుద్ధంగా అరుణాచల్‌ప్రదేశ్‌ ప్రాంతాన్ని తనది అని చెప్పుకుంటోంది. దీనిని చైనా ఎన్నడూ గుర్తించలేదు" అని అన్నారు.

అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఏమన్నారు?

పుడాంగ్ విమానాశ్రయంలో అరుణచల్‌ప్రదేశ్‌కు చెందిన ప్రేమాతో చైనా అధికారులు వ్యవహరించిన తీరు ఆమోదయోగ్యంగా లేదంటూ అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ తన సోషల్ మీడియా అకౌంట్‌లో విమర్శించారు.

అరుణాచల్ ప్రదేశ్

"ఇలాంటి ప్రవర్తన అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన. మన పౌరుల గౌరవానికి భంగం" అని ఆయన రాశారు.

ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటుందని భావిస్తున్నట్లు ఆయన రాశారు.

ప్రేమా థోంగ్‌డోక్ ఏం చెప్పారు?

గత 14 ఏళ్లుగా బ్రిటన్‌లో నివసిస్తున్నాననీ, తాను భారత పౌరురాలినని ప్రేమా వాంగియోమ్ థోంగ్‌డోక్ చెప్పారు.

"నేను సెలవుల కోసం లండన్ నుంచి జపాన్ వెళ్తున్నా. ట్రాన్సిట్‌ కోసం షాంఘైలో ఆగాల్సి వచ్చింది’’ అంటూ జరిగిన ఘటనను ఆమె ఏఎన్ఐ వార్తా సంస్థకు వివరించారు.

అరుణాచల్ ప్రదేశ్

"నన్ను క్యూలైన్‌లోకి అనుమతించలేదు. ఆ తర్వాత, చాలామంది అధికారులు అక్కడికి వచ్చారు. కనీసం 10 మందితో మాట్లాడా. ఒక అధికారి నన్ను విమానాశ్రయంలో మరోచోటుకి తీసుకెళ్లారు. ఆయన నన్ను చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్ సిబ్బంది దగ్గరకు తీసుకెళ్లారు. వాళ్లు నన్ను ఇమ్మిగ్రేషన్ డెస్క్‌ వద్దకు తీసుకెళ్లారు. వాళ్లు వారి భాషలో మాట్లాడుకుంటున్నారు" అని ప్రేమా చెప్పారు.

"ఎవరూ నాకు సూటిగా సమాధానం చెప్పడంలేదు. ఆ రోజు అక్కడ సెలవు దినం కావడంతో లండన్‌లోని చైనా రాయబార కార్యాలయాన్ని సంప్రదించలేకపోయాను. గంటల పాటు నా కుటుంబ సభ్యులతోనూ మాట్లాడలేకపోయాను. ఏమీ తినలేదు, అక్కడి నుంచి పక్కకు వెళ్లేందుకు కూడా అనుమతించలేదు. లండన్ నుంచి 12 గంటలు ప్రయాణం చేసి వచ్చాను, కనీసం విశ్రాంతి తీసుకోవడానికి కూడా చోటు లేదు" అన్నారామె.

"నాకు చట్టపరంగా హక్కులున్నాయి, నేను లాయర్‌తో మాట్లాడాలని చెప్పాను. ఆ తర్వాత, ల్యాండ్‌లైన్ నంబర్ నుంచి ఒక స్నేహితుడితో మాట్లాడా. ఆయన సూచన మేరకు షాంఘై, బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయాలకు ఫోన్ చేశా. గంటలోనే, భారత అధికారులు విమానాశ్రయానికి వచ్చారు. నాకోసం ఆహారం తెప్పించారు. వారితో అన్ని విషయాలు చెప్పాను.అక్కడి నుంచి బయటపడేందుకు వారు సాయం చేశారు" అని ప్రేమా తెలిపారు.

తాను షాంఘైలో కొన్ని గంటలు వేచివుండి, ఆ తర్వాత జపాన్ వెళ్లాల్సి ఉందని ఆమె చెప్పారు.

"గతంలో కూడా నేను షాంఘై ట్రాన్సిట్ ద్వారా ఎలాంటి సమస్యలు లేకుండా వెళ్లిపోయా. ఎప్పుడూ ఇలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు" అని ఆమె చెప్పారు.

"నేను 18 గంటలు ప్రయాణించాల్సి వచ్చింది, కానీ అక్కడి నుంచి బయటపడినందుకు సంతోషంగా ఉంది. నా దగ్గర అవసరమైన అన్ని పత్రాలూ ఉన్నాయి. కానీ వాళ్లు నా పాస్‌పోర్టు చెల్లదన్నారు. నేను ఇప్పటి వరకూ 58 దేశాలు తిరిగా, ఇండియన్ పాస్‌పోర్టుతోనే వెళ్లా. ఇది వ్యాలిడ్ డాక్యుమెంట్, కానీ చైనాలో పరిస్థితి అలా లేదు" అని ప్రేమా అంటున్నారు.

చైనా, భారత్, అరుణాచల్ ప్రదేశ్, విదేశాంగ విధానం. చైనా భారత్ బోర్డర్

ఫొటో సోర్స్, fmprc.gov.cn

ఫొటో క్యాప్షన్, ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని చైనా తెలిపింది.

చైనా ఏమంటోంది?

మీడియా సమావేశంలో ఒక జర్నలిస్ట్ దీని గురించి చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్‌ను ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు చైనా ప్రతినిధి సమాధానమిస్తూ, "ఝాంగ్నాన్ చైనాలో ఒక భాగం. భారత్ చట్టవిరుద్ధంగా 'అరుణాచల్ ప్రదేశ్' అని పిలుస్తున్న ప్రాంతాన్ని చైనా ఎన్నడూ గుర్తించలేదు" అని అన్నారు.

మావో నింగ్ ఇంకా మాట్లాడుతూ, "మీరు అడుగుతున్న ఘటనకు సంబంధించి మాకున్న సమాచారం ప్రకారం, చైనా అధికారులు చట్టాలు, నిబంధనలకు అనుగుణంగానే విచారణ జరిపారు. న్యాయబద్దంగా, చట్టాలు దుర్వినియోగం కాకుండా వ్యవహరించారు. ఎవరి చట్టబద్దమైన హక్కులకూ భంగం కలగలేదు. వారిపై బలవంతంగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. 'నిర్బంధం, లేదా వేధింపులు' వంటివి జరగలేదు" అని అన్నారు.

ప్రేమా వాదనలను చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి తోసిపుచ్చారు. ఆమె విశ్రాంతి తీసుకునేందుకు సౌకర్యాలు కల్పించారని, ఆహారం కూడా అందించారని ఆమె చెప్పారు.

చైనా, భారత్, అరుణాచల్ ప్రదేశ్, విదేశాంగ విధానం. చైనా భారత్ బోర్డర్

ఫొటో సోర్స్, MAXIM SHEMETOV/POOL/AFP via Getty Images

అరుణాచల్ ప్రదేశ్ గురించి చైనా వాదనేంటి?

అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌గా చైనా చెప్పుకుంటోంది. సరిహద్దు వివాదానికి సంబంధించి భారత్, చైనాలు అనేక సమావేశాలు నిర్వహించినా, సమస్య పరిష్కారం కాలేదు.

రెండు దేశాల మధ్య 3,500 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. సరిహద్దు వివాదమే 1962లో యుద్ధానికి కారణమైంది. సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాల గురించి వివాదాలు ఇంకా కొనసాగుతున్నాయి. అప్పుడప్పుడు అవి ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి.

అరుణాచల్‌ప్రదేశ్ పై భారతదేశ సార్వభౌమాధికారానికి అంతర్జాతీయ గుర్తింపు ఉంది. ఇంటర్నేషనల్ మ్యాప్‌లు అరుణాచల్‌ ప్రదేశ్‌ను భారత దేశంలో భాగంగా గుర్తిస్తాయి.

అయితే చైనా మాత్రం టిబెట్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్‌ను కూడా తనదిగా పేర్కొంటూ దానిని దక్షిణ టిబెట్ అని పిలుస్తోంది.

అరుణాచల్‌ ప్రదేశ్ ఉత్తర ప్రాంతమైన తవాంగ్‌ తమదేనని చైనా మొదట వాదించింది. ఇక్కడ భారత దేశంలోని అతిపెద్ద బౌద్ధ దేవాలయం ఉంది.

అసలు వివాదం ఏంటి?

మెక్‌మోహన్ రేఖను భారత చైనాల మధ్య అంతర్జాతీయ సరిహద్దుగా పరిగణిస్తారు. కానీ, చైనా దానిని తిరస్కరిస్తోంది. టిబెట్‌లో ఎక్కువ భాగం భారత దేశపు నియంత్రణలో ఉందని చైనా వాదిస్తోంది.

చైనా అభ్యంతరాలను భారత దేశం నిరంతరం తిరస్కరిస్తూనే ఉంది. అరుణాచల్ ప్రదేశ్‌లో 90,000 చదరపు కిలోమీటర్ల భూమి తనదని చెబుతోంది చైనా.

అయితే పశ్చిమాన అక్సాయ్ చిన్‌లో ఎక్కువ భాగాన్ని చైనా ఆక్రమించిందని భారత్ అంటోంది.

1950ల చివరలో టిబెట్‌ను ఆక్రమించిన తర్వాత, లద్దాఖ్‌తో అనుసంధానమై ఉన్న అక్సాయ్ చిన్‌లోని దాదాపు 38,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా తన ఆధీనంలోకి తీసుకుంది. చైనా ఇక్కడ నేషనల్ హైవే 219 నిర్మించింది. దీనిని దాని తూర్పు ప్రావిన్స్ జిన్జియాంగ్‌కు అనుసంధానించింది. భారత్ వీటిని చట్టవిరుద్ధమైన నిర్మాణాలుగా పరిగణిస్తోంది.

చైనా, భారత్, అరుణాచల్ ప్రదేశ్, విదేశాంగ విధానం. చైనా భారత్ బోర్డర్

ఫొటో సోర్స్, ARUN SANKAR/AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ జిల్లాలో భారత సైనికుల స్మారక చిహ్నం. 2023 నాటి ఫోటో.

అరుణాచల్ ప్రదేశ్ చరిత్ర..

అరుణాచల్ ప్రదేశ్ ప్రాచీన చరిత్ర గురించి స్పష్టత చాలా తక్కువ. అస్సాంకు ఆనుకుని ఉన్న అరుణాచల్ ప్రదేశ్ అనేక పురాతన దేవాలయాలకు నిలయం. టిబెటన్, బర్మీస్, భూటానీ సంస్కృతులు ఈ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తాయి.

తవాంగ్‌లోని 16వ శతాబ్దపు బౌద్ధ దేవాలయం ఒక కీలకమైన నిర్మాణం. ఇది టిబెటన్ బౌద్ధులకు పవిత్ర స్థలం. పురాతన కాలంలో, భారత్, టిబెట్ పాలకులు టిబెట్, అరుణాచల్ ప్రదేశ్ మధ్య కచ్చితమైన సరిహద్దును నిర్వచించలేదని చెబుతారు.

అయితే, ఆధునిక కాలంలో జాతీయ రాజ్యాలు రావడంతో సరిహద్దుల గురించి చర్చ ప్రారంభమైంది. 1912 వరకు భారత్, టిబెట్‌ల మధ్య స్పష్టమైన సరిహద్దు లేదు. మొఘలులు లేదా బ్రిటిష్ వారు ఈ ప్రాంతాలను నియంత్రించలేదు. భారత్, టిబెట్ ప్రజలు కూడా సరిహద్దు మీద పెద్దగా ఆసక్తి చూపించలేదు. బ్రిటిష్ పాలకులూ దాని గురించి పట్టించుకోలేదు.

తవాంగ్‌లో ఒక బౌద్ధ దేవాలయం బయటపడిన తర్వాత సరిహద్దు రేఖ గురించి చర్చ మొదలైంది. 1914లో టిబెట్, చైనా, బ్రిటిష్ ఇండియా ప్రతినిధులు షిమ్లాలో సమావేశమయ్యారు. ఆ తర్వాత సరిహద్దు రేఖను నిర్ణయించారు.

1914లో టిబెట్ స్వతంత్ర దేశంగా మారింది. కానీ, చాలా బలహీనమైన దేశంగా ఉండేది. అప్పట్లో భారతదేశాన్ని పాలిస్తున్న బ్రిటిష్ పాలకులు తవాంగ్, దాని దక్షిణ ప్రాంతాలను భారత దేశంలో భాగంగా గుర్తించారు. టిబెటన్లు దీనిని అంగీకరించారు.

ఈ విషయంలో చైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయాన్ని అంగీకరించడానికి నిరాకరించింది.

1935 నుంచి ఈ మొత్తం ప్రాంతం భారతదేశ పటంలో చూపించడం మొదలైంది.

1950లో టిబెట్‌ను చైనా పూర్తిగా ఆక్రమించుకుంది. టిబెటన్ బౌద్ధులకు చాలా కీలకమైన తవాంగ్‌ను తన భూభాగంగానే చూపించాలని చైనా కోరుకుంది.

1962లో భారత్, చైనాల మధ్య యుద్ధం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని భౌగోళిక పరిస్థితి భారత దేశానికి బాగా అనుకూలంగా ఉంది, కాబట్టి 1962 యుద్ధంలో గెలిచినప్పటికీ చైనా తవాంగ్ నుంచి వైదొలిగింది. దీంతో భారత దేశం ఈ మొత్తం ప్రాంతంపై తన నియంత్రణను పటిష్ఠం చేసుకుంది.

ఇటీవలి సంవత్సరాలలో రెండింటి మధ్య సరిహద్దు వివాదాలు కూడా కనిపిస్తున్నాయి. 2020లో, తూర్పు లద్దాఖ్‌‌లోని గల్వాన్‌లో భారత, చైనా దళాలు ఘర్షణ పడ్డాయి. ఇరువైపులా డజన్ల కొద్దీ సైనికులు గాయపడ్డారు.

గత కొన్ని సంవత్సరాలుగా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో ఉన్న ఎల్ఏసీ దగ్గర చైనా నిర్మాణ పనులు చేపడుతోందని 2021లో భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

తాము కూడా సరిహద్దు వెంట అనేక నిర్మాణాలు చేపడుతున్నామని భారత ప్రభుత్వం ప్రకటించింది.

2022 డిసెంబర్‌లో అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌లో చైనా సైనికులతో ఘర్షణ జరిగినట్లు భారత్ వెల్లడించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)