గర్భాశయ మార్పిడి ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన మహిళ: దేశంలో ఇదే తొలిసారి

గర్భాశయ మార్పిడి, రాధ

ఫొటో సోర్స్, BBC/ Galaxy Hospital, Pune

ఫొటో క్యాప్షన్, రాధ మొదటి చిత్రం
    • రచయిత, సరోజ్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

''నా కన్నీళ్లు చాలాసేపు ఆగలేదు. వాటి వెనుక ఐదుగురు పిల్లలను పోగొట్టుకున్న బాధ ఉంది. నాకెంత సంతోషంగా ఉందో మీరు ఊహించలేరు. అది అర్థం కావాలంటే మీరు నా బాధను అనుభవించాలి.''

పుణెలోని గెలాక్సీ ఆసుపత్రిలో ఉంటున్న మీనాక్షి మాటలివి.

17 నెలలుగా గెలాక్సీలో చికిత్స పొందుతున్న మీనాక్షి వలాండ్ అక్టోబర్ 18న సిజేరియన్ అనంతరం ఒక పాపకు జన్మనిచ్చారు. పుట్టిన కొద్ది సేపటికే ఆ పాప దేశవ్యాప్తంగా సెలిబ్రిటీ అయిపోయింది.

దీనికి కారణం ఆ పాప కేవలం భారతదేశంలోనే కాకుండా, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోనే మొట్టమొదటిసారి గర్భాశయ మార్పిడి ద్వారా జన్మించింది.

ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ అప్లైడ్ రీసెర్చ్‌లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, ప్రపంచంలోని 15 శాతం మంది మహిళలు వివిధ కారణాల వల్ల తల్లులయ్యే అవకాశం ఉండదు. వాటిలో 3-5 శాతం మందికి గర్భాశయ కారణాలే ఉంటాయి.

రాధ, డాక్టర్ శైలేష్ పుంటాంబేకర్

ఫొటో సోర్స్, BBC/ Galaxy Hospital, Pune

ఫొటో క్యాప్షన్, రాధతో డాక్టర్ శైలేష్ పుంటాంబేకర్

గుజరాత్‌లోని భరూచ్ ప్రాంతానికి చెందిన మీనాక్షి భారతదేశంలో గర్భాశయ మార్పిడి చేయించుకున్న మొదటి మహిళ.

''నా వయసు కేవలం 28. ఈ వయసులోనే నాకు మూడు అబార్షన్లు అయ్యాయి. ఇద్దరు పిల్లలు కడుపులోనే మరణించారు. డాక్టర్లు ఇక నాకు పిల్లలు పుట్టరని తేల్చేశారు. కానీ నాకు పిల్లలు కావాలి. అది సరోగసీ ద్వారా కాదు. నాకు పిల్లలను దత్తత తీసుకోవాలని కూడా లేదు'' అన్నారామె.

కానీ 17 నెలల క్రితం ఆమె గెలాక్సీ ఆసుపత్రిలో డాక్టర్ శైలేష్ పుంటాంబేకర్‌ను సంప్రదించాక ఆమెలో కొత్త ఆశలు చిగురించాయి.

''దేవుడంటూ ఉంటే అది డాక్టర్ రూపంలోనే ఉంటాడు. అందుకే మా పాపకు పేరు పెట్టాలని ఆయననే కోరాం'' అని మీనాక్షి అన్నారు.

మీనాక్షి గుజరాత్ నుంచి వచ్చారు. శ్రీకృష్ణుణ్ని ఆరాధించే ఆ రాష్ట్రానికి చెందిన పాపకు డాక్టర్ శైలేష్ 'రాధ' అని నామకరణం చేశారు.

మీనాక్షి, డాక్టర్ శైలేష్ పుంటాంబేకర్ టీమ్

ఫొటో సోర్స్, BBC/ Galaxy hospital. Pune

ఫొటో క్యాప్షన్, మీనాక్షితో డాక్టర్ శైలేష్ పుంటాంబేకర్ టీమ్

రాధ ఆరోగ్యం ఎలా ఉంది?

మీనాక్షి గర్భాశయంలో రాధ 32 వారాలు ఉంది. పుట్టినపుడు ఆ పాప బరువు 1 కిలో 450 గ్రాములు.

మీనాక్షికి మొదట అక్టోబర్ 21న సిజేరియన్ చేయాలని భావించారు. అయితే 17 రాత్రే ఆమెకు తీవ్రమైన నొప్పులు వచ్చాయి. దీంతో 18న సిజేరియన్ చేయాల్సి వచ్చింది.

రాధ 2 కిలోల బరువు వచ్చేంత వరకు ఆసుపత్రిలోనే ఉండాలి.

ప్రస్తుతం రాధ, మీనాక్షి ఆరోగ్యం బాగా ఉంది. మీనాక్షి మామూలు ఆహారమే తీసుకుంటున్నారు.

గర్భాశయ మార్పిడి

ఫొటో సోర్స్, Thinkstock

సిజేరియన్ ఎందుకు?

మీనాక్షికి అమర్చిన గర్భాశయం ఆమె తల్లిదని డాక్టర్ శైలేష్ వెల్లడించారు. ఆమె తల్లి వయసు 48 ఏళ్లు. ఆ వయసులో గర్భాశయానికి పిండాన్ని మోసే శక్తి ఉండదు. మీనాక్షి తల్లి 20 ఏళ్ల క్రితం గర్భం దాల్చారు.

గర్భాశయ మార్పిడి సందర్భంగా కేవలం ఒక్క గర్భాశయాన్ని మాత్రమే మార్చారు. దాంతో పాటు దానికి సంబంధించిన నాళాలను కాదు. ఇలాంటి గర్భాలలో నొప్పులు ఉండవు.

అదీ కాకుండా మీనాక్షికి 'ఆషర్‌మ్యాన్ సిండ్రోమ్' అనే ప్రత్యేకమైన జబ్బు ఉంది. అందువల్ల పాప ఎక్కువ కాలం గర్భాశయంలో ఉండలేకపోయింది. పలుమార్లు అబార్షన్‌లు కావడం వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది.

ఇన్ని కారణాల వల్ల డాక్టర్లకు సిజేరియన్ మినహా వేరే ప్రత్యామ్నాయం లేకపోయింది.

డాక్టర్ శైలేష్‌తో ఆయన టీం సభ్యులు

ఫొటో సోర్స్, BBC/ Galaxy hospital, Pune

ఫొటో క్యాప్షన్, డాక్టర్ శైలేష్‌తో ఆయన టీం సభ్యులు

గర్భాశయ మార్పిడి - గణాంకాలు ఏం చెబుతున్నాయి?

ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ మార్పిడి చాలా అరుదు. మొత్తం ప్రపంచంలోనే ఇప్పటివరకు కేవలం 26 మంది మహిళలకు గర్భాశయ మార్పిడి జరిగితే వాటిలో కేవలం 14 మాత్రం విజయవంతమయ్యాయి.

అయితే మరికొన్ని మీడియా వార్తల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి మార్పిళ్లు 42 జరగగా, వారిలో కేవలం 8 మంది మహిళలు మాత్రం పిల్లలకు జన్మనిచ్చారు.

ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో గర్భాశయ మార్పిడి ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన మొదటి మహిళ మీనాక్షే.

డాక్టర్ శైలేష్ చెప్పిన వివరాలను బట్టి, గర్భాశయాన్ని ఇచ్చే మహిళ స్వీకరించేవారికి తల్లి కానీ చెల్లి కానీ అత్త కానీ అయి ఉండాలి.

దేశంలో ఇప్పటివరకు ఇలాంటి గర్భాశయ మార్పిడి సఫలం కానందున దీనిపై ఇప్పటివరకు ఎలాంటి చట్టమూ చేయలేదు.

గర్భాశయ మార్పిడి

ఫొటో సోర్స్, Getty Images

10-12 గంటల ఆపరేషన్

ఒకసారి దాత దొరికాక, లేప్రోస్కోపీ ద్వారా గర్భాశయాన్ని తొలగిస్తారు. గర్భాశయ మార్పిడిని 'లివింగ్ ట్రాన్స్‌ప్లాంట్'గా వ్యవహరిస్తారు. ఇందుకోసం కేవలం ప్రాణాలతో ఉన్న మహిళ గర్భాశయాన్నే తీసుకుంటారు. ఈ మొత్తం ఆపరేషన్‌కు 10 నుంచి 12 గంటలు తీసుకుంటుంది.

ఒకసారి గర్భాశయ మార్పిడి జరిగాక, సుమారు ఏడాది తర్వాత అది గర్భధారణకు సిద్ధమవుతుంది.

అయితే గర్భాశయ మార్పిడి తర్వాత అది గర్భాన్ని నిరాకరించే ప్రమాదం కూడా ఉంటుంది. అంటే ఒకోసారి శరీరం బయటి అవయవాన్ని అంగీకరించదు. అందువల్ల కనీసం ఒక ఏడాదైనా దాన్ని పర్యవేక్షించాలి.

ఒకసారి ఇదంతా పూర్తయ్యాక.. తండ్రి వీర్యాన్ని, తల్లి అండాన్ని ఉపయోగించి లేబరేటరీలో పిండాన్ని తయారు చేసి దానిని గర్భాశయంలో ప్రవేశపెడతారు.

మీనాక్షికి కూడా ఇదే రకంగా పిండాన్ని తయారు చేసి ఆమె గర్భాశయంలో ప్రవేశపెట్టారు.

గర్భాశయ మార్పిడి

ఫొటో సోర్స్, Getty Images

అయితే ఇది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని డాక్టర్ శైలేష్ అంటారు. అందువల్లే ఈ మొత్తం ప్రక్రియలో ఆయన కానీ, మీనాక్షి కుటుంబం కానీ ఎలాంటి రిస్కూ తీసుకోలేదు.

''మీనాక్షికి చాలా ఇమ్యూనోసప్రెస్సెంట్ మందులు ఇచ్చాం. గర్భధారణ సందర్భంగా మధుమేహం లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. వాటిని అరికట్టడం చాలా అవసరం. దానికి తోడు, రక్తపోటు కూడా పెరిగే, తగ్గే అవకాశం ఉంది. అందువల్ల నిరంతరం పేషెంట్‌ను పరీక్షిస్తూ ఉండాలి'' అని వివరించారు.

ప్రస్తుతం మీనాక్షి, బుల్లి సెలెబ్రిటీ రాధ గెలాక్సీ ఆసుపత్రిలో క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)