అభిప్రాయం: మోదీ సర్కారుపై అక్బర్ రాజీనామా ప్రభావమెంత?

ఎమ్.జె.అక్బర్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఏ యం ఖాన్ యజ్దానీ (డానీ)
    • హోదా, బీబీసీ కోసం

గత ఏడాది #MeToo ఉద్యమం మొదలయినపుడు ప్రముఖ మహిళా జర్నలిస్టు ప్రియా రమణి తాను గతంలో లైంగిక వేధింపులకు గురయినట్టు ఒక కథనాన్ని ప్రచురించారు. అయితే, ఆ నిందితునిపేరును అందులో ప్రస్తావించలేదు. మీటూ లేదా 'నేను సహితం' ఉద్యమం ఉధృతం అయ్యాక ఈ నెల 8న ఆ నిందితుడు సుప్రసిధ్ధ సంపాదకుడు, కేంద్ర సహాయ మంత్రి ఎంజే అక్బర్ అని వారు బయట పెట్టారు.

ప్రియా రమణి సాహసంతో ఉత్తేజాన్ని పొందిన మరో డజను మంది మహిళా జర్నలిస్టులు కూడా అక్బర్‌కు వ్యతిరేకంగా గళం విప్పారు. వీరిలో కొందరు బాధితులయితే మరికొందరు సాక్షులుగా తమను తాము పేర్కొన్నారు.

ప్రియా రమణి ఆరోపణలు చేయడం... ఆ తర్వాత పది రోజుల్లోపే మంత్రి పదవికి అక్బర్ రాజీనామా చేయడం చకచకా సాగిపోయాయి. అసలు ప్రియా రమణి ఆరోపణలు చేసిన రోజే మంత్రి పదవికి అక్బర్ రాజీనామా చేయక తప్పదని మీడియా, పౌరసమాజ ప్రముఖులు నేర విచారణ జరిపి తీర్పు కూడా చెప్పేశారు. ఆ తీర్పు వారం రోజుల్లోనే అమలు కూడా అయిపోయింది. మీడియా, పౌరసమాజం చురుకుదనం ఒక్కోసారి అలా ఉంటుంది. మన న్యాయవ్యవస్థ, మన శాసన నిర్మాణ వ్యవస్థలు ఇంత చురుగ్గా పనిచేసిన సందర్భాలు చాలా చాలా తక్కువ.

మీటూ

పరస్పర అంగీకారంతో స్త్రీ పురుషులు వివాహేతర లైంగిక సంబంధం ఏర్పరుచుకున్నా నేరం కాదని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. అయితే, అధికారాన్నో, మరోదాన్నో అడ్డు పెట్టుకుని లైంగిక వేధింపులకు పాల్పడడం శిక్షించదగ్గ నేరం. ఉద్దేశాన్ని వ్యక్తం చేయడం వేరు. తిరస్కరించాక వెంటబడి వేధించడం, అధికార దర్పాన్ని ప్రదర్శించడం, ఏదైనా ఆశచూపి లొంగదీసుకోవాలని ప్రయత్నించడం నేరం.

తప్పు ఎవరు చేసినా శిక్షించాల్సిందే. తప్పుచేసిన వారినందరినీ శిక్షిస్తున్నారా? ఆరోపణలు వచ్చిన వారందరూ నైతిక బాధ్యత వహించి రాజీనామాలు చేస్తున్నారా? అనేవి కూడా పరిశీలించ దగిన అంశాలు. ప్రతి సమాజంలోనూ నేరం ఒకటే అయినా దోషులు అందరూ ఒకటికాదు. కొందరు దోషులకు శిక్షలు పడతాయి. కొందరు దోషులకు 'సాత్ ఖూన్ మాఫ్' వరం వుంటుంది.

ఇంప్యూనిటీ! తప్పు చేసి పట్టుబడడానికీ, తప్పించుకోవడానికీ సామాజిక కోణం ఏదైనా వుందా? అన్నది అస్తిత్వయుగంలో ప్రాణప్రదమైన అంశం.

#మీటూ బీబీసీ కార్టూన్

కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఏర్పడ్డాక అనేక మంది మంత్రులపై ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుత జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ మానవ వనరుల మంత్రిగా ఉన్నప్పుడూ గుట్టల కొద్దీ ఆరోపణలు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నడూ ఆ అంశాల మీద స్పందించలేదు. ఎవరినీ రాజీనామా చేయాలని అడగలేదు. పెద్దనోట్ల రద్దు సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కు చెందిన సహకార బ్యాంకుల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపణలు వినిపించాయి. అప్పుడూ ప్రధాని స్పందించలేదు.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Sean Gallup/Getty Images

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక అమిత్ షా కుమారుని కంపెనీ లాభాలు వెయ్యి రెట్లు పెరిగాయని ఆరోపణలు వచ్చాయి. అప్పుడూ ప్రధాని స్పందించలేదు. ఇప్పటి రైల్వే మంత్రి పియూష్ వేద్ ప్రకాష్ గోయల్ ఓ నాలుగు నెలలు ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో డాలర్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేసిన తరువాతే రూపాయి మారకపు విలువ పడిపోయిందని కొందరు స్టాక్ మార్కెట్ నిపుణులు అంటున్నా ప్రధాని స్పందించలేదు. దేశ రక్షణకు సంబంధించిన రఫెల్ యుద్ధ విమానాల డీల్‌లో భారీ కుంభకోణానికి పాల్పడ్డారని సాక్షాత్తు ప్రధాన మంత్రి మీద ఆరోపణలు వచ్చాయి. అప్పుడూ వారు స్పందించలేదు.

ఆరోపణలపై వివిధ కేంద్ర ప్రభుత్వాల తీరుతెన్నుల్ని తెలుసుకోవడానికి చరిత్ర పుటల్లో మరీ వెనక్కి వెళ్ళాల్సిన పనికూడా లేదు. మొన్నటి వరకు కేంద్రంలో అధికారంలోవున్న సోనియాగాంధీ - మన్మోహన్ సింగ్ ప్రభుత్వం స్పందించాల్సినంతగా స్పందించలేదేమోగానీ చాలా సందర్భాల్లో ఎంతో కొంత స్పందించింది.

అప్పట్లో ప్రధాన ప్రతిపక్ష నేతల ఆరోపణలకు స్పందించి శివరాజ్ పాటిల్, ఏఆర్ అంతులే, ఏ రాజా తదితరుల్ని మంత్రివర్గం నుండి తప్పించారు. అలాంటి స్పందనను మనం మోదీ ప్రభుత్వంలో ఆశించలేం.

ఇవన్నీ ఆర్థిక నేరారోపణలు కనుక మోదీ తాత్సారం చేశారు, అక్బర్ కేసు నైతిక తప్పిదం కనుక వెంటనే స్పందించారని వాదించేవారు కూడా లేకపోలేదు. నిజానికి అనైతిక అంశాలపై కూడా వివిధ రాష్ట్రాల్లో బీజేపీ నేతల మీద వచ్చిన ఆరోపణలకు లెక్కలేదు.

నిందితులకు మద్దతుగా ర్యాలీ

ఫొటో సోర్స్, IMAGE COLLECTIVE MOHIT KANDHARI / BBC

ఫొటో క్యాప్షన్, కఠువా హత్య కేసులో నిందితులకు మద్దతుగా కొందరు ప్రదర్శనలు చేశారు

జమ్మూలోని కఠువాలో ఎనిమిదేళ్ళ పాప మీద వారం రోజులు అత్యాచారం జరిపి హత్య చేసిన కిరాతకుల మీద ప్రధాని స్పందించారా? కఠువా దోషులకు మద్దతుగా బీజేపీ శాసన సభ్యులు ప్రదర్శనలు చేసినపుడు ఆ పార్టీ నైతికత ఎక్కడికి పోయింది? ఉన్నావ్ ఆత్యాచారం కేసులో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎలా వ్యవహరించారు? బాధితురాలి తండ్రి హత్యకు గురయ్యారు. నిందితుడైన బీజేపీ ఎమ్మెల్యే ఇంటి ముందు బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసుకుంది.

దిల్లీ -హరియాణా రైల్లో జునైద్‍ అనే బాలుడ్ని గోగ్రవాదులు క్రూరంగా చంపినప్పుడు మోదీ మౌనం వహించారు. వారు ఇలాంటి అంశాల మీద నేరుగా స్పందించరు. వేడి తగ్గిపోయాక ఎక్కడో ఏదో సభలో అన్యాపదేశంగా "మన ఆడపిల్లలకు తప్పక న్యాయం జరుగుతుంది" అంటారు. అది కథువా, ఉన్నావ్ గురించి వారు ప్రస్తావించారు అనుకోవాలి. ఎవరిమీదా గట్టి చర్యలు ఉండవు. ఉన్నా వెంటనే బెయిల్ వచ్చేస్తుంది. నిందితులకు పదోన్నతులు కూడా ఇస్తారు. కఠువాలో అత్యాచారం కేసులో నిందితులకు మద్దతుగా సాగిన ప్రదర్శలో పాల్గొన్న శాసన సభ్యుడు రాజీవ్ జస్రోతియాను నెల తిరగకుండానే మంత్రిని చేశారు. ఇదేం నైతికత?

రాఫేల్

ఫొటో సోర్స్, AFP

మౌనం వహించడంలో మన ప్రధానుల్లో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. మన్మోహన్ సింగ్ వంద మాటలు అనాల్సిన చోట ఒక్క మాట మాట్లాడేవారు. పీవీ నరసింహారావుది ఇంకో శైలి. వారు పెదవి విప్పకుండానే వంద విషయాలు కమ్యూనికేట్ చేసేసేవారు. నరేంద్ర మోదీ శైలి వేరు. వారు వారి ప్రచారానికి సంబంధించిన విషయాలను అతిశయోక్తులతో సుదీర్ఘంగా మాట్లాడుతారు. వారికి ఇబ్బంది కలిగించే అంశాలపై ఎన్నడూ పెదవి విప్పరు. రఫేల్ డీల్‌లో స్వయంగా వారి మీదనే ఆరోపణలు వస్తున్నా వారు మాత్రం మౌనం వీడడం లేదు. రాఫెల్ డీల్ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి రిలయన్స్‌కు వెళ్ళిపోయింది. ప్రధానికి హిందూస్తాన్ నచ్చినట్టు లేదు రిలయన్స్ నచ్చింది అని ఆరోపించినా వారు స్పందించే స్థితిలో లేరు.

అక్బర్ తప్పుకోవాల్సిందే. అది అంతటితో ఆగకూడదు అధికారాన్ని అడ్డుపెట్టుకుని మహిళలను అణగదొక్కాలనుకునే ప్రతిఒక్కరినీ శిక్షించాలి. కొందరిని మాత్రమే శిక్షించి కొందరిని కాపాడితే ఈ ప్రభుత్వాలు వేసే రాజకీయ శిక్షలకూ, ఇచ్చే పదోన్నతులకూ ప్రాతిపదికపై బలమైన ప్రశ్నలు కచ్చితంగా తలెత్తుతాయి. ఇందులో కూడా మతమూ, కులమూ, బలమూ ఇతరత్రా అంశాలు ముందుకొస్తాయి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)