ఆ కుటుంబాన్నే కాదు, వారి సమాధులను కూడా వదలని ఇజ్రాయెల్ వైమానిక దాడులు

ఇజ్రాయెల్, లెబనాన్, హమాస్, హిజ్బుల్లా వైమానిక దాడులు
ఫొటో క్యాప్షన్, రిహబ్ ఫౌర్ ప్రస్తుతం బేరూత్‌లోని తాత్కాలిక నివాసంలో ఉంటున్నారు
    • రచయిత, జోయెల్ గుంటెర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

(గమనిక: ఈ కథనంలో మిమ్మల్ని కలిచివేసే అంశాలున్నాయి)

రిహాబ్ ఫౌర్ తన ఇల్లు వదిలి మరో ఇంటికి వెళ్లారు. ఆ ఇల్లు కూడా వదిలి మరో ఇంటికి వెళ్లారు. మూడోసారి కూడా. ఆ తర్వాత నాలుగోసారి. ఇజ్రాయెల్ బాంబులతో దాడి చేస్తున్నప్పుడు మొదటిసారి ఇంటిని వదిలేసి వెళ్లిన ఏడాది తర్వాత, నాలుగోసారి కూడా ఇంటిని వదిలి వెళ్లాల్సి వచ్చింది. చివరికి, లెబనాన్‌లో ఏ ప్రాంతం కూడా సురక్షితం కాదనే నిర్ణయానికి వచ్చారు ఆమె.

2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్ మీద హమాస్ దాడి చేసిన తర్వాత ఆమె ప్రయాణం మొదలైంది. హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధానికి దిగింది. అది లెబనీస్ పొలిటికల్, మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లాను ప్రేరేపించింది. హిజ్బుల్లా ఇజ్రాయెల్ మీదకు రాకెట్లు ప్రయోగించడంతో దక్షిణ లెబనాన్ మీద ఇజ్రాయెల్ ఎదురుదాడులు మొదలుపెట్టింది.

ఇజ్రాయెల్ వేసిన బాంబులు రిహాబ్ ఉంటున్న గ్రామానికి సమీపంలో పడ్డాయి. రిహాబ్ భర్త సయీద్ మున్సిపల్ వాటర్ కంపెనీలో పని చేస్తారు. వాళ్లకు ఇద్దరు పిల్లలు ఎనిమిదేళ్ల టియా, ఆరేళ్ల నయా ఉన్నారు. ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఈ కుటుంబం బేరూత్ శివార్లలోని దహేహ్‌లో ఉంటున్న రిహాబ్ తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది.

నయా, టియాకు స్నేహితులు, బొమ్మలు లాంటివి లేకపోవడం తప్ప దహేహ్‌లో కొంతకాలం వారి జీవితం సాధారణంగానే ఉంది.

వాళ్లకు స్కూలుకు వెళ్లే అవకాశం కూడా లేకుండా పోయింది. అయితే ఆన్‌లైన్ క్లాసుల ద్వారా దాన్ని భర్తీ చేసుకున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇజ్రాయెల్, లెబనాన్, హమాస్, హిజ్బుల్లా వైమానిక దాడులు
ఫొటో క్యాప్షన్, బేరూత్‌లోని వాటర్ఎడ్జ్ దగ్గర తన కుమార్తెలు నయా, టియా కూర్చుని ఉన్న ఫొటోను రిహాబ్ చూపించారు.

2024 ఆగస్టులో రిహాబ్ వారిని బేరూత్‌లోని ఒక కొత్తస్కూలులో చేర్పించి, కొత్త యూనిఫామ్ కొన్నప్పుడు ఆ చిన్నారులిద్దరూ చాలా ఆనందించారు.

అయితే, వాళ్లు స్కూలుకు వెళ్లడానికి ముందే ఇజ్రాయెల్ వైమానిక దాడుల్ని బేరూత్ సహా దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు విస్తరించింది. అందులో ప్రస్తుతం రిహాబ్ కుటుంబం ఉంటున్న దహేహ్ కూడా ఉంది.

బేరూత్ శివార్లలో తలదాచుకున్న హిజ్బుల్లా సీనియర్ కమాండర్లను ఇజ్రాయెల్ చంపేస్తున్న సమయం. హిజ్బుల్లా నేతలు బంకర్లలో దాక్కుని ఉండవచ్చనే అనుమానంతో బంకర్లను కూడా ధ్వంసం చేసేందుకు ఇజ్రాయెల్ పెద్ద పెద్ద బాంబుల్ని ప్రయోగించింది. ఒక పెద్ద భవనాన్ని క్షణంలో నేలమట్టం చెయ్యగల బాంబులవి. కొన్నిసార్లు ఇజ్రాయెల్ ప్రయోగించిన డజన్ల కొద్దీ బాంబుల వల్ల నగరంలో అనేక బ్లాకులు శిథిలాల దిబ్బలుగా మారాయి.

దీంతో రిహాబ్ కుటుంబం అన్నింటినీ సర్దుకుని దహేహ్‌లో తల్లిదండ్రుల ఇంటిని వదిలిపెట్టింది. బేరూత్‌ పక్కన ఉన్న నాహ్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడకు మారారు. నాహ్‌ మీద కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయడంతో పక్కనే ఉన్న బాబౌర్‌లో ఉంటున్న రిహాబ్ అత్తమామల ఇంటికి వెళ్లారు. వాళ్లు అక్కడ ఒకే ఇంట్లో 17 మందితో కలిసి ఉన్నారు.

ప్రస్తుతం టియాకు తొమ్మిదేళ్లు, నయాకు ఏడేళ్లు. పగలు రాత్రి తేడా లేకుండా వాళ్లిద్దరికీ తమ బంధుమిత్రులతో కలిసి ఉండటం ఆనందం కలిగించే అంశం. అది ఏ స్థాయిలో ఉందంటే సమీపంలో రిహాబ్ తండ్రి ఆ నలుగురి కోసం ఒక అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు. అయినప్పటికీ ఆ పిల్లలిద్దరూ అందులోకి వెళ్లేందుకు ఇష్టపడలేదు.

ఇజ్రాయెల్, లెబనాన్, హమాస్, హిజ్బుల్లా వైమానిక దాడులు
ఫొటో క్యాప్షన్, బేరూత్‌లోని ప్రాంతంలో నిలిపి ఉంచిన కారు మీద హసన్ నస్రల్లాను ప్రస్తుతిస్తూ సందేశం రాసి ఉంది.

“అందరం కలిసి ఉందామని నయా మమ్మల్ని ప్రాధేయపడింది” అని రిహాబ్ గుర్తు చేసుకున్నారు. “ఆ కొత్త ఇంట్లో ఒక్కరోజు మాత్రమే ఉందాం. తర్వాత వెంటనే అందరి వద్దకు తిరిగివద్దాం” అని చెప్పాను.

కొత్త ఇంటికి వస్తే నీకు నచ్చింది తినవచ్చంటూ నయాను ఆమె నచ్చ చెప్పారు. అలా కొత్త ఫ్లాట్‌కు వెళ్లే దారిలో ఒక షాప్ దగ్గర ఆగి తందూరీ చికెన్ మరి కొన్ని స్వీట్లు కొనుక్కున్నారు. అప్పుడు రాత్రి ఏడున్నర అవుతోంది. వీధుల్లో ఇంకా జనం తిరుగుతూనే ఉన్నారు. రిహాబ్ కుటుంబం సెంట్రల్ బేరూత్‌లోని ఒక భవనం పైకి చేరుకుంది.

2006లో ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య యుద్ధం జరిగినప్పుడు.. ఇజ్రాయెల్ బాంబు దాడులు దక్షిణ లెబనాన్‌లోని దహేహ్‌లో కొన్ని ప్రాంతాలు, నిర్ణీత మౌలిక వసతులే లక్ష్యంగా జరిగాయి.

అయితే, ఈసారి హిజ్బుల్లా సీనియర్ కమాండర్లు లెబనాన్‌లోని అనేక ప్రాంతాల్లో దాక్కుని ఉండటంతో ఇజ్రాయెల్ అన్ని ప్రాంతాల్లోనూ దాడులు చేసింది.

దీంతో సెంట్రల్ బేరూత్ సహా గతంలో సురక్షితం అని భావించిన ప్రాంతాలపై కూడా ఈసారి వైమానిక దాడులు జరిగాయి.

ఇజ్రాయెల్, లెబనాన్, హమాస్, హిజ్బుల్లా వైమానిక దాడులు
ఫొటో క్యాప్షన్, రిహాబ్ మంచం పక్కన ఉన్న టేబుల్ మీద తన భర్త సయీద్, ఇద్దరు పిల్లలు ఉన్న ఫోటో

కొత్త అపార్ట్‌మెంట్‌లో బట్టలు, సామాన్లను దించుతున్నప్పుడు టియా, నయా ముఖాల్లో ఆనందం లేదు. వీలైనంత త్వరగా వాళ్లు తిరిగి తమ బంధువులు, స్నేహితుల వద్దకు వెళ్లాలని భావిస్తున్నారు.

రిహాబ్ అత్త మామల ఇల్లు మాదిరిగా కాకుండా ఈ కొత్త అపార్ట్‌మెంట్‌లో నీటి సదుపాయం, కరెంట్ కోసం జనరేటర్ ఉన్నాయి. ఆ ఇల్లు విశాలంగా ఉండటం చూసి పిల్లలిద్దరూ ఆనందించారు. దీంతో రిహాబ్, సయీద్ కాస్త రిలాక్స్ అయ్యారు. అక్కడ వాళ్లను ఇబ్బంది పెట్టిన అంశం ఏదైనా ఉందంటే అది ఇజ్రాయెల్ డ్రోన్ తిరుగుతున్న శబ్దం మాత్రమే. అయితే బేరూత్‌లో ఆ శబ్దం సహజంగా మారింది.

రిహాబ్ ఆహారం, స్వీట్లను టేబుల్ మీద పెట్టారు. “మేం కింద కూర్చుని మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ తింటున్నాం. అంతే, అదే నాకు గుర్తున్న చివరి క్షణం” అని రిహాబ్ చెప్పారు.

ఇజ్రాయెల్, లెబనాన్, హమాస్, హిజ్బుల్లా వైమానిక దాడులు
ఫొటో క్యాప్షన్, రిహాబ్ కుటుంబం సహా 19 మందిని చంపేసిన బాంబు దాడి జరిగిన తర్వాతి రోజు ఉదయం ఆ ప్రాంతం శిథిలాల గుట్టగా కనిపించింది

అది అమెరికా తయారు చేసిన జేడామ్ బాంబు. 2024 అక్టోబర్ 10న సాయంత్రం 8 గంటల సమయంలో ఆ భవనంపై పడింది. ఆ బాంబు పేలుడుకు మూడు అంతస్తులు ధ్వంసం అయ్యాయి. పక్కనున్న భవనాలు, కార్లు దెబ్బ తిన్నాయి. ఈ దాడిలో 22 మంది చనిపోయారు. అందులో పురుషులు, మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఈ యుద్దం మొదలైన తర్వాత సెంట్రల్ బేరూత్ మీద జరిగిన అత్యంత తీవ్ర విధ్వంసకరమైన దాడి ఇది.

దాడి జరిగిన సమయంలో భవనం నిండా ప్రజలున్నారు. దాడికి ముందు ఇజ్రాయెల్ సైన్యం ఎలాంటి హెచ్చరిక జారీ చేయలేదు. హిజ్బుల్లా సమన్వయ బృందం నాయకుడు వఫిక్ సఫా లక్ష్యంగా దాడి చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అయితే చనిపోయిన వారిలో వఫిక్ లేరు. ఆయన తప్పించుకున్నారా? లేదా ఆయనసలు అక్కడ లేరా? దాడికి ముందు ప్రజలను ఎందుకు హెచ్చరించలేదు? అన్న ప్రశ్నలపై మాట్లాడేందుకు ఇజ్రాయెల్ సైన్యం నిరాకరించింది.

రిహాబ్ బేరూత్‌లోని జహ్రా ఆసుపత్రిలో కళ్లు తెరిచారు. కదిలే పరిస్థితి లేదు. ఆమె వెన్నెముకకు, చేతికి గాయాలయ్యాయి. ఆమెకు కనీసం రెండు ఆపరేషన్లు అవసరం. ఆమె తరచుగా స్పృహ కోల్పోతున్నారు. ఆమెకు గుర్తున్నదల్లా పిల్లలతో నవ్వుతూ భోజనం చేయడం, ఆ తర్వాత ఆసుపత్రిలో కళ్లు తెరవడం. మధ్యలో ఏం జరిగిందో ఆమెకు ఏమాత్రం గుర్తులేదు.

ఇజ్రాయెల్, లెబనాన్, హమాస్, హిజ్బుల్లా వైమానిక దాడులు
ఫొటో క్యాప్షన్, బేరూత్‌లోని తమ ఫ్లాట్‌లో రిహాబ్ తండ్రి ముహియుద్ధీన్, తల్లి బసిమా

ఆ రాత్రి ఆమె అక్కడ ఉండగానే, ఆమె కుటుంబం బేరూత్‌లోని ఆసుపత్రులన్నీ వెదుకుతోంది. అర్ధరాత్రికి వాళ్లకు సయీద్, టియా చనిపోయినట్లు తెలిసింది. చనిపోయిన వారిలో ఇద్దరు బాలికలు ఉండటం, ఇద్దరి వయసు ఒకటే కావడం, ఇద్దర్నీ ఒకే ఆసుపత్రికి తీసుకురావడంతో చనిపోయిన పాప నయాయేనని తెలుసుకునేందుకు డీఎన్‌ఏ పరీక్షలు చేయాల్సి వచ్చింది. ఆ పిల్లలిద్దరికీ అయిన గాయాలు ఎలా ఉన్నాయంటే వారిని గుర్తు పట్టడం వారి రక్త సంబంధీకులకు కూడా కష్టంగా మారింది.

ఈ విషయాలేమీ రిహాబ్‌కు చెప్పవద్దని డాక్టర్లు ఆమె కుటుంబ సభ్యులకు చెప్పారు. ఎందుకంటే ఆమెకు చేయాల్సిన సర్జరీ చాలా క్లిష్టమైనదని, ఈ విషయాలన్నీ చెప్పడం వల్ల ఆమె పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందని డాక్టర్లు భావించారు.

రెండు వారాలు గడిచాయి. ఆమెకు ఆపరేషన్లు జరిగాయి. ఆమె నెమ్మదిగా కోలుకుంటున్నారు. సయీద్‌తో పాటు పిల్లలిద్దరూ వేరే ఆసుపత్రిలో ఉన్నారని రిహాబ్ తల్లి బసిమా కుమార్తెతో చెప్పారు.

అయితే రిహాబ్ ఏదో జరిగిందని అనుమానించారు. తనకు వెంటనే భర్త, పిల్లల ఫోటోలు, వీడియోలు చూపించాలని, వీడియో కాల్‌లో మాట్లాడించాలని ఒత్తిడి చేయడం ప్రారంభించారు. “ఆ బాధ ఆమె గుండెకు తెలిసింది” అని బసిమా చెప్పారు.

దాడి జరిగిన 11 రోజుల తర్వాత చనిపోయింది టియాయేనని డీఎన్ఏ టెస్ట్‌లో తేలింది. రిహాబ్‌కు సర్జరీ జరిగిన 15 రోజుల తర్వాత తన భర్తతో పాటు పిల్లలిద్దరూ చనిపోయారని ఆసుపత్రిలోని మానసిక వైద్యులు ఆమెతో చెప్పారు.

ఇజ్రాయెల్, లెబనాన్, హమాస్, హిజ్బుల్లా వైమానిక దాడులు
ఫొటో క్యాప్షన్, రిహాబ్ వెన్నెముకలో ఆరు, మణికట్టు వద్ద మూడు ఇనుప స్క్రూలు బిగించారు.

ఆరు వారాల తర్వాత, రిహాబ్ బేరూత్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో ఒక ప్లాస్టిక్ కుర్చీలో కూర్చుని ఉన్నారు. ఆమె కళ్లు నిస్తేజంగా, ముఖం నిర్జీవంగా మారాయి. ఆమె గాయాలకు జరిగిన సర్జరీల నుంచి ఇంకా కోలుకుంటున్నారు. ఆమె వెన్నెముకలో 8, చేతిలో మూడు ఇనుప స్క్రూలు అమర్చారు.

చాలా సేపు ఆమె కింద పడుకునే ఉంటున్నారు. కూర్చోవడానికే ఇబ్బంది పడుతున్నారు. నాలుగు అడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నారు. అలా ప్రయత్నించినప్పుడల్లా విపరీతమైన నొప్పిని భరించాల్సి వస్తోంది.

నయా చనిపోవడానికి నాలుగు రోజుల ముందే ఆమె ఎనిమిదో పుట్టిన రోజు జరిగింది. రిహాబ్ రోజంతా “నిద్రపోవడం లేదా ఏడవడంలోనే” గడిచిపోతోంది.

ఇజ్రాయెల్, లెబనాన్, హమాస్, హిజ్బుల్లా వైమానిక దాడులు
ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ దాడిలో చనిపోయే నాటికి నయాకు ఏడేళ్లు, టియాకు తొమ్మిదేళ్లు

ఆమె తన కుటుంబం గురించి మాట్లాడారు.

“నయా నాకు చాలా దగ్గరగా ఉండేది. నేను ఎక్కడికి వెళ్లినా నా వెనుకే వచ్చేది. టియాకు వాళ్ల తాత, అమ్మమ్మ అంటే ఇష్టం. నేను ఆమెను వాళ్ల దగ్గర వదిలి వచ్చినా వారితో సంతోషంగా ఉండేది. పిల్లలిద్దరికీ డ్రాయింగ్ అంటే ఇష్టం. బొమ్మలతో ఆడుకోవడం ఇష్టం. వాళ్లు స్కూలుకు వెళ్లలేకపోయారు. వాళ్లిద్దరూ టీచర్లు, పిల్లలతో కలిసి గంటల కొద్దీ ఆడుకునేవారు’’ అని ఆమె గుర్తుచేసుకున్నారు.

వాళ్లిద్దరికీ టిక్‌టాక్ వీడియోలు చూడటం ఇష్టం. వాళ్లిద్దరూ చిన్నవాళ్లు కావడంతో వారి వీడియోలు టిక్‌టాక్‌లో పోస్ట్ చెయ్యకూడదని రిహాబ్, సయీద్ నిర్ణయించుకున్నారు. అయితే రిహాబ్ వాళ్లు డాన్స్ చేస్తున్నప్పుడు, ఆడుకుంటున్నప్పుపడు వీడియోలు చిత్రీకరించేవారు. వారి సంతోషం కోసం ఆ వీడియోలను టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేసేవారు.

సయీద్, రిహాబ్ వివాహం 2013లో జరిగింది. రిహాబ్ బేరూత్‌లోనే పెరిగారు. అయితే ఆమె కుటుంబం వేసవి కాలంలో మేస్ ఎల్ జబాల్ గ్రామానికి వెళ్లేది. వేసవిలో ఆ గ్రామంలో చల్లగా ఉండటంతో పాటు అంతా గ్రామీణ వాతావరణం ఉండేది. అక్కడే ఆమె స్నేహితుల ద్వారా సయీద్‌ను కలిశారు.

న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసిన రిహాబ్ మాస్టర్స్ చదవడం మొదలు పెట్టారు. అయితే పెళ్లై టియా పుట్టిన తర్వాత ఆమె చదువు మధ్యలో ఆపేశారు.

ఇప్పుడు కుటుంబాన్ని కోల్పోవడంతో మరోసారి చదవడం మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. “నేను నా మిగిలిన రోజుల్ని గడిపేసేందుకు ఏదో ఒకటి చేయాలి” అని చెప్పారు.

ఇజ్రాయెల్, లెబనాన్, హమాస్, హిజ్బుల్లా వైమానిక దాడులు
ఫొటో క్యాప్షన్, సయీద్, నయా, టియాల మృతదేహాలను పూడ్చిపెట్టిన ప్రదేశం ఇది. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఈ ప్రాంతం బాాగా దెబ్బతింది

బాంబు దాడిలో చనిపోయిన రోజే సయీద్, టియా మృతదేహాలను దహేహ్‌లో తాత్కాలిక శవపేటికల్లో పెట్టి రిహాబ్ తండ్రి, మేనమామలు పూడ్చి పెట్టారు. రెండు వారాల తర్వాత వాళ్లే, అక్కడ నయా మృతదేహాన్ని కూడా పూడ్చి పెట్టారు.

ఆ సమాధుల మీద ఇద్దరు పిల్లలకు గుర్తుగా రిహాబ్ మేనమామ రెండు కృత్రిమ చెర్రీ పూలను ఉంచారు. వారి పక్కనే పూడ్చిపెట్టిన మరో వ్యక్తి కోసం మరెవరో పుష్పగుచ్చం ఉంచారు.

తర్వాత ఆ సమాధులకు పక్కనే ఉన్న భవనంపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడి చేసింది. పేలుడు తాకిడికి సమాధులు బద్దలయ్యాయి. వాటిపై ఉన్న బండలు విరిగిపోయాయి. అక్కడ భూమి కదిలిపోయింది.

అదే సమయంలో దహేహ్‌లో రిహాబ్ కుటుంబం ఉంటున్న ఇంటిపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో రిహాబ్ దాచుకోవాలనుకున్న తన కుమార్తెల స్కూలు కొత్త యూనిఫామ్‌లతో పాటు అనేక వస్తువులు ధ్వంసం అయ్యాయి.

ఇదంతా జరిగిన తర్వాత రోజుల వ్యవధిలో అంతా ముగిసింది. కాల్పుల విరమణ ప్రకటించడంతో దక్షిణ లెబనాన్‌లో అనేక మంది తమ సొంత ఊళ్లకు తిరిగి వచ్చారు.

రిహాబ్, సయీద్ గ్రామం ఇజ్రాయెల్ సైన్యం భారీగా బాంబు దాడులు చేసింది. వారి సొంతిల్లు పూర్తిగా ధ్వంసమైందని ఆమె మేనమామ చెప్పారు. కాల్పుల విరమణ తర్వాత కూడా రిహాబ్ సొంత గ్రామానికి రాలేదు. ఎందుకంటే ఆమె వెన్నెముకకు పట్టీ వేసుకుని ఉన్నారు. ఆమె ప్రయాణించాలంటే ఇంకా చాలా కాలం పట్టవచ్చు.

కాల్పుల విరమణతో లెబనాన్‌ అంతటా ఉత్సాహపూరిత వాతావరణం ఏర్పడింది. వాఫిక్ సఫాకు సంబంధించి కొత్త చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. అతనిని హతమార్చేందుకు ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో సయీద్, టియా, నయాతో పాటు 19 మంది ఇతరులు చనిపోయారు. ఆ దాడి జరిగిన తర్వాత సఫా ఎక్కడా బహిరంగంగా కనిపించలేదు. అయితే అతను బతికే ఉన్నాడని, బాగానే ఉన్నాడని భావిస్తున్నారు.

(జోఅన్నా మౌజబ్ అందించిన అదనపు సమాచారంతో..)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)