జో బైడెన్: కుమారుడికి క్షమాభిక్ష.. అమెరికన్లు అర్థం చేసుకోగలరన్న అధ్యక్షుడు

తండ్రితో హంటర్ బైడెన్

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, సోఫియా ఫెర్రీరా శాంటోస్
    • హోదా, బీబీసీ న్యూస్

రెండు క్రిమినల్ నేరాలలో శిక్షను ఎదుర్కొంటున్న తన కుమారుడు హంటర్‌ బైడెన్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారికంగా క్షమాభిక్ష ప్రకటించారు.

తన కొడుకుని ఏకాకిని చేశారని, అన్యాయంగా ఈ కేసులు పెట్టారని అధ్యక్షుడు ఆ ప్రకటనలో చెప్పారు.

హంటర్ బైడెన్‌పై సెప్టెంబర్‌లో పన్ను ఎగవేత కింద కేసు నమోదైంది. అంతేకాక, అక్రమంగా డ్రగ్స్ వాడుతూ తుపాకీ కలిగి ఉన్న కేసులో కూడా ఆయన జూన్‌లో దోషిగా తేలారు.

ప్రస్తుతం అధ్యక్షుడిగా ఎన్నికైన డోనల్డ్ ట్రంప్ క్షమాభిక్షపై స్పందించారు. ‘‘హంటర్‌కు జో బైడెన్ పెట్టిన క్షమాభిక్షలో ఏళ్ల తరబడి జైల్లో ఉన్న బందీలు(జనవరి 6నాటి ఘటన నిందితులు) కూడా ఉన్నారా?!’’ అని ప్రశ్నించారు. 2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్ వద్ద నిరసన తెలిపిన తన మద్దతుదారులను ఉద్దేశిస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

గతంలో తన కొడుకు దోషిగా తేలిన సమయంలో,అతని క్షమాభిక్షలో జోక్యం చేసుకోనని చెప్పిన అధ్యక్షుడు ఇప్పుడు తన కొడుక్కి బేషరతు క్షమాభిక్ష ప్రకటించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇదే మొదటిసారి కాదు..

బైడెన్ తన కొడుక్కి క్షమాభిక్ష ప్రకటించరని కొన్ని నెలల కిందటే సెప్టెంబర్‌లో వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

కానీ, ఆదివారం సాయంత్రం అధ్యక్షుడు బైడెన్ ఒక ప్రకటన జారీ చేశారు. తనకు న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉన్నప్పటికీ, రాజకీయాలు ఈ ప్రక్రియను భ్రష్టు పట్టించడం వల్ల అన్యాయం జరిగిందని బైడెన్ అన్నారు.

‘‘నేను ఆఫీసులో అడుగుపెట్టిన తొలి రోజు నుంచే, న్యాయ వ్యవస్థ తీసుకునే నిర్ణయాల్లో జోక్యం చేసుకోనని చెప్పాను. నా కొడుకును అన్యాయంగా విచారించే సమయంలోనూ చూస్తూ ఉండిపోయానే తప్ప ఒక్క మాట మాట్లాడలేదు. నా మాటకు కట్టుబడి ఉన్నా’’ అని చెప్పారు.

తన నిర్ణయంతో చాలా సతమతమయ్యానని, ఈ వారం చివర్లో ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత, మరింత ఆలస్యం చేయడంలో ఎలాంటి అర్థం లేదని బైడెన్ అన్నారు.

‘‘ఒక తండ్రిగా, అధ్యక్షుడిగా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నానో అమెరికన్లు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా’’ అని చెప్పారు.

ఈ ప్రకటనపై హంటర్ బైడెన్ స్పందిస్తూ ‘‘తాను మాదకద్రవ్యాల బానిసగా ఉన్న చీకటి రోజులలో చేసిన తప్పులను బహిరంగపరిచి, తన కుటుంబం సిగ్గుపడేందుకు, అవమానించేందుకు వాడుకున్నారని’’చెప్పారు.

‘‘ఇవాళ నాకు ఇచ్చిన ఈ క్షమాభిక్షను నేను తేలిగ్గా తీసుకోను. అనారోగ్యంతో బాధ పడుతూ, ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సాయం చేసేందుకు నేను పునర్ నిర్మించుకున్న ఈ జీవితాన్ని అంకితం చేస్తాను’’ అని 54 ఏళ్ల హంటర్ చెప్పారు.

అమెరికా అధ్యక్షులు తమ కుటుంబ సభ్యులకు క్షమాభిక్ష ప్రకటించడం ఇదే తొలిసారి కాదు. బిల్ క్లింటన్ కూడా తన సవతి సోదరుడు రోజర్ క్లింటన్‌కు 1985 నాటి కొకైన్‌కు సంబంధించిన నేరంలో 2001లో క్షమాభిక్ష ప్రకటించారు. డోనల్డ్ ట్రంప్ కూడా 2020లో తన కూతురు ఇవాంక ట్రంప్ మావ చార్లెస్ కుష్నర్‌కు క్షమాభిక్ష ప్రకటించారు. తాజాగా ట్రంప్ తన కొత్త కేబినెట్‌లో కుష్నర్‌ను ఫ్రాన్స్‌కు రాయబారిగానూ ప్రకటించారు.

జో బైడెన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జో బైడెన్

అభియోగాలు ఏమిటంటే..

హంటర్ బైడెన్‌పై ఈ ఏడాది సెప్టెంబర్‌లో పన్ను ఎగవేతల మోసం కింద తొమ్మిది అభియోగాలు నమోదయ్యాయి. తుపాకీ కొనుగోలుకు సంబంధించి మూడు నేరాల్లో దోషిగా తేలారు.

దీంతో, ఆయనకు ఒక కేసులో 17 సంవత్సరాలు, మరో కేసులో 25 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ శిక్షలను డిసెంబర్ 12, 16 తేదీల్లో ఖరారు చేయాల్సి ఉంది.

కొడుకు ఎదుర్కొంటున్న న్యాయపరమైన సవాళ్లు, తండ్రి బైడెన్ అధ్యక్ష క్యాంపెయిన్‌కు అవాంతరంగా నిలిచాయి. బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవడంతో, జూలైలో ఈ క్యాంపెయిన్‌ ముగిసింది.

బైడెన్ బదులు డెమొక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్‌ ఎన్నికల్లో నిలబడ్డారు , నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో కమలా హారిస్‌ ఓడిపోయి, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డోనల్డ్ ట్రంప్ గెలుపొందారు.

బైడెన్ పదవీ కాలం వచ్చే ఏడాది జనవరిలో ముగియనుంది. జనవరి 20, 2025న ట్రంప్ పదవీ బాధ్యతలు తీసుకోనున్నారు.

పదవిని వీడే ముందు క్షమాభిక్ష ప్రసాదించడం అమెరికా అధ్యక్షులకు సర్వసాధారణం.

డోనల్డ్ ట్రంప్ తొలిసారి అధికారంలో ఉన్నప్పుడు, 100కి పైగా క్షమాభిక్షలు ప్రసాదించారు. వీటిల్లో చాలా వరకు తన పదవీ కాలం చివరి నెలల్లో తీసుకున్నవే.

హంటర్ బైడెన్

ఫొటో సోర్స్, Reuters

‘‘హంటర్ దురదృష్టవంతుడు’’

''హంటర్ బైడెన్‌ను జీవితాంతం దురదృష్టం వెంటాడుతూనే ఉంది'' అని పొలిటికో మ్యాగజైన్ జర్నలిస్ట్ బెన్ ష్రెకింగర్ కొంతకాలం కిందట చెప్పారు.

ఆయన "ది బైడెన్స్: ఇన్‌సైడ్ ది ఫస్ట్ ఫ్యామిలీస్' 50 ఇయర్స్ రైజ్ టు పవర్" అనే పుస్తకాన్ని రచించారు. హంటర్ తండ్రి జో బైడెన్ 1972లో డెలావేర్ నుండి సెనేటర్‌గా ఎన్నికయ్యారని బెన్ గుర్తు చేసుకున్నారు. అప్పుడు జో బైడెన్ వయసు 29 ఏళ్లు. ఆ నెలలోనే బైడెన్ కుటుంబానికి ఒక పెద్ద ప్రమాదం ఎదురైంది.

జో బైడెన్ భార్య, తన ముగ్గురు పిల్లలతో కలిసి క్రిస్మస్ ట్రీ తీసుకురావడానికి బయలుదేరారు. ''కారులో హంటర్ బైడెన్, ఆయన సోదరుడు బో బైడెన్, చెల్లెలు, తల్లి నీలియా ఉన్నారు. వీరి కారును ట్రక్కు ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో అతని తల్లి, సోదరి మరణించారు.హంటర్, అతని బోబైడెన్ ఆసుప్రతిలో చేరాల్సి వచ్చింది'' అని బెన్ వివరించారు.

జో బైడెన్ ఆసుపత్రి నుండే సెనేటర్‌గా ప్రమాణం చేశాడని బెన్ వివరించారు. అప్పుడు హంటర్ వయస్సు కేవలం 2 ఏళ్లు. అతను అప్పటి నుండి ప్రజల దృష్టిలో ఉన్నారు.

బైడెన్ కుటుంబం

ఫొటో సోర్స్, Getty Images

సోదరుడి మరణంతో..

హంటర్ చదువులో చాలా తెలివైన వాడని బెన్ చెప్పారు. కానీ, తల్లి మరణం తాలూకు షాక్ ఆయనను వెంటాడుతూనే ఉంది. మొదట మద్యానికి, ఆ తర్వాత డ్రగ్స్‌కు బానిసయ్యాడు.

అతని సోదరుడు బో బైడెన్ మొదట సైన్యంలో చేరారు. తరువాత తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చారు. డెలావేర్ అటార్నీ జనరల్ అయ్యారు.

హంటర్ సోదరుడు బో బైడెన్ బ్రెయిన్ 2015లో క్యాన్సర్‌తో మరణించారు. దీంతో ఆయన మరోసారి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

''మొదట హంటర్ భార్య అతని నుంచి విడిపోయింది. ఆ తర్వాత మరణించిన తన సోదరుడు బో బైడెన్ భార్య హేలీతో ఆయనకున్న అనుబంధం బైటికి వచ్చింది. దీని గురించి పత్రికల్లో కథనాలు వచ్చాయి.

తండ్రి జో బైడెన్ కూడా ఈ అనుబంధాన్ని అంగీకరించారు. కానీ, వారి మధ్య బంధం కూడా కొన్నాళ్లకు చెడిపోయింది. తన బిడ్డకు తండ్రి అంటూ హంటర్ బైడెన్ పై ఓ మహిళ అర్కన్సాస్‌లో కేసు కూడా వేసింది.

ఆ తర్వాత హంటర్ మెలిస్సా కోయెన్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. తాను వ్యసనాల నుంచి బైటపడటానికి మెలిస్సాయే కారణమని హంటర్ చెబుతుంటారు. వారిద్దరికీ ఒక కూతురు కూడా ఉంది'' అని బెన్ వెల్లడించారు.

హంటర్ బైడెన్ తన వ్యక్తిగత జీవితంలోని గందరగోళం వల్ల మాత్రమే వార్తల్లోకి ఎక్కలేదు. ఆయన వ్యాపార వ్యవహారాలు కూడా వివాదాస్పదమయ్యాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)