'సమయం మించిపోతోంది' అంటూ ఇరాన్‌కు అమెరికా హెచ్చరిక, యుద్ధ విమానాలు, నౌకల మోహరింపు

ఇరాన్, అమెరికా, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు

ఫొటో సోర్స్, Handout via Reuters

ఫొటో క్యాప్షన్, అమెరికా నౌకా దళానికి యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నేతృత్వం వహిస్తుంది (ఫైల్ ఫోటో)
    • రచయిత, జరోస్లవ్ లుకివ్, కేతరిన్ ఆర్మ్‌స్ట్రాంగ్

గల్ఫ్ ప్రాంతంలో అమెరికా తన బలగాలను మోహరిస్తున్న వేళ, అణు ఒప్పందంపై చర్చలకు "సమయం మించిపోతోంది" అంటూ ఇరాన్‌ను హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్.

శక్తివంతమైన, చురుకైన ‘భారీస్థాయి నౌకాదళం’ తన లక్ష్యాన్ని సాధించేందుకు ఇరాన్ వైపు వేగంగా కదులుతోందని ట్రంప్ అన్నారు.

దీనికి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పందించారు.

ఇరాన్ సాయుధ బలగాలు ‘ట్రిగ్గర్ మీద వేలుపెట్టి’ సిద్ధంగా ఉన్నాయని, ఎటునుంచి దాడి జరిగినా ‘వేగంగా, దీటుగా బదులిస్తాం’ అని అన్నారు.

తమ అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుతమైనదని, అణ్వాయుధాల తయారీ కోసం ప్రయత్నిస్తోందంటూ అమెరికా, దాని మిత్రదేశాలు చేస్తున్న ఆరోపణలను ఇరాన్ పలుమార్లు తిరస్కరించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈనెల ప్రారంభంలో, ఇరాన్‌‌లో సాగిన నిరసనల మీద కఠినమైన అణచివేత సమయంలో తాము జోక్యం చేసుకుంటామని, నిరసనకారులకు సాయం చేస్తామని అమెరికా హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ హెచ్చరిక వెలువడింది.

ఇరాన్‌ కరెన్సీ విలువ భారీగా పడిపోవడంతో మొదలైన నిరసనలు, ఆ తర్వాత దేశంలోని మత నాయకత్వాన్ని సవాలు చేసే స్థాయిలో సాగాయి.

ఆ సమయంలో "సాయం వస్తోంది" అని చెప్పిన డోనల్డ్ ట్రంప్.. ఆ తర్వాత మాట మార్చారు. నిరసనకారుల ఉరిశిక్షలను నిలిపివేసినట్లు విశ్వసనీయవర్గాల నుంచి సమాచారం వచ్చినట్లు చెప్పారు.

అమెరికాలోని హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ (హెచ్‌ఆర్‌ఏఎన్ఏ) ప్రకారం, ఆందోళనలు ప్రారంభమైన డిసెంబర్ చివరి నాటి నుంచి ఇప్పటివరకూ 6,301 మందికి పైగా మరణించినట్లు నిర్ధరించారు. వారిలో 5,925 మంది నిరసనకారులు ఉన్నారు.

ఇంటర్నెట్ సేవలు నిలిపివేసినప్పటికీ, దాదాపు మూడు వారాల తర్వాత 17000 మరణాలు సంభవించినట్లు రిపోర్టులు వచ్చాయని, వాటిని కూడా పరిశీలిస్తున్నట్లు హెచ్ఆర్ఏఎన్ఏ తెలిపింది.

మొత్తం మరణాలు 25000లకు పైగా ఉండే అవకాశం ఉందని నార్వే కేంద్రంగా పనిచేస్తున్న మరో సంస్థ ఇరాన్ హ్యూమన్ రైట్స్ (ఐహెచ్‌ఆర్) హెచ్చరిస్తోంది.

ఇరాన్, అమెరికా, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు

ఫొటో సోర్స్, REUTERS/Kevin Lamarque

ఇరాన్‌పై ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రధానంగా ఆ దేశ అణు కార్యక్రమాన్ని ఉద్దేశించి చేసినట్లుగా కనిపిస్తున్నాయి.

"న్యాయబద్దమైన, నిష్పాక్షిక ఒప్పందంపై సంప్రదింపులు జరిపేందుకు ఇరాన్ చర్చలకు రావాలి - అణ్వాయుధాలకు తావులేదు" అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో రాశారు.

వెనెజ్వెలాకు పంపిన దానికంటే భారీ స్థాయిలో నౌకాదళాలను గల్ఫ్ ప్రాంతంలో మోహరించినట్లు ట్రంప్ చెప్పారు.

ఈ దళాలు అవసరమైతే విధ్వంసం సృష్టించైనా మిషన్‌ను పూర్తిచేసేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాయని అన్నారు.

గత జూన్‌లో, ఇజ్రాయెల్‌తో 12 రోజులపాటు జరిగిన యుద్ధ సమయంలో ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా జరిపిన దాడులను గుర్తుచేస్తూ, "ఈసారి మరింత దారుణంగా ఉంటుంది, అక్కడిదాకా తెచ్చుకోవద్దు" అని హెచ్చరించారు.

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో బుధవారం ఫారిన్ రిలేషన్స్ కమిటీతో మాట్లాడుతూ, "ఇరాన్ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనంత బలహీనంగా ఉంది" అని అన్నారు.

"దేశ ఆర్థిక వ్యవస్థ కూలిపోతోందన్న నిరసనకారుల ప్రధాన ఆందోళనకు సమాధానం ఇచ్చే పరిస్థితి కూడా లేదు" అన్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ, "ఆ ప్రాంతంలోని మన బలగాలకు ఇరాన్ నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకే ఈ మోహరింపు" అని ఆయన చెప్పారు.

ట్రంప్ హెచ్చరికకు అరాఘ్చీ స్పందిస్తూ, "శాంతియుతమైన అణు సాంకేతికతను కలిగి ఉండే హక్కును గౌరవిస్తూ.. ఇరుపక్షాలు సమాన స్థాయిలో, బలవంతం, బెదిరింపులు, భయపెట్టాలనుకోవడం వంటి చేష్టలు లేని.. పరస్పర ప్రయోజనకరమైన, న్యాయబద్దమైన, నిష్పాక్షిక అణుఒప్పందాన్ని ఇరాన్ ఎప్పుడూ స్వాగతిస్తుంది. అణ్వాయుధాలకు తావులేదని హామీనిస్తుంది" అన్నారు.

"మా భద్రతాపరమైన అంశాల్లో అలాంటి ఆయుధాలకు చోటులేదు. వాటిని సమకూర్చుకోవాలన్న ప్రయత్నాలు కూడా చేయలేదు" అని ఆయన అన్నారు.

ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీదాబాది మాట్లాడుతూ, ప్రస్తుతం అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడం లేదన్నారు. అయితే, సందేశాలను ఇచ్చిపుచ్చుకున్నట్లు చెప్పారు.

ఇరాన్, అమెరికా

ఫొటో సోర్స్, Maxar Techn

ఫొటో క్యాప్షన్, 2024 డిసెంబర్‌లో తీసిన శాటిలైట్ ఫోటోలో ఐఆర్ఐఎస్ షాహిద్ బఘేరీ

బీబీసీ వెరిఫై బృందం.. ఓపెన్ సోర్స్ సాధనాలను ఉపయోగించి గల్ఫ్ ప్రాంతంలో అమెరికా బలగాల మోహరింపును గుర్తించగలిగింది. జోర్డాన్‌లోని మువఫక్ ఎయిర్ ఫోర్స్ బేస్‌కు కనీసం 15 ఫైటర్ జెట్లు చేరినట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తోంది.

జోర్డాన్, ఖతార్, హిందూ మహాసముద్రంలోని డిగో గార్సియా బేస్‌లకు చేరుతున్న విమానాల సంఖ్య కూడా పెరిగింది.

డజన్ల కొద్దీ కార్గో విమానాలు, ఇంధనం నింపే ఎయిర్‌క్రాఫ్ట్‌లు మిడిల్ ఈస్ట్‌కు చేరుకున్నట్లు బీబీసీ గుర్తించింది. అలాగే, డ్రోన్లు, పీ-8 పోసైడాన్ గూఢచార విమానాలు ఇరాన్ గగనతలానికి సమీపంలో ఫ్లైట‌రాడార్24 ట్రాకింగ్ సైట్‌లో కనిపించాయి.

యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌక ఆధ్వర్యంలో, ట్రంప్ "ఆర్మాడా"గా పేర్కొన్న నౌకాదళం ఒకటి మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి చేరుకున్నట్లు అమెరికా రక్షణ శాఖ అధికారి ఒకరు బీబీసీ వెరిఫైకి ధ్రువీకరించారు.

ఒక ఆస్ప్రే విమానం గల్ఫ్ సముద్ర తీరప్రాంతం నుంచి బయలుదేరి ఒమన్‌లో ల్యాండ్ అయినట్లు సోమవారం ఫ్లైట్‌రాడార్‌24 ట్రాకర్‌లో కనిపించింది. అంటే, లింకన్ నౌక సమీపంలోనే కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఇది సూచిస్తోంది.

గత రెండువారాల్లో అమెరికా నౌకా దళాలను, వాయుసేనలను భారీగా ఈ ప్రాంతానికి తరలించినట్లు రిస్క్ అడ్వైజరీ సంస్థ సిబిల్లిన్ సంస్థలో ప్రిన్సిపల్ అనలిస్ట్ మేగన్ సట్‌క్లిఫ్ చెప్పారు.

శాటిలైట్ చిత్రాల ప్రకారం.. అమెరికాకు చెందిన కనీసం రెండు గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్స్, మరో మూడు యుద్ధ నౌకలు కొద్ది నెలలుగా బహ్రెయిన్ తీరంలో నిలిచివున్నాయి.

అదే సమయంలో, ఇరాన్ కూడా సన్నాహక చర్యలు చేపట్టింది. గతేడాది అందుబాటులోకి వచ్చిన డ్రోన్ వాహక నౌక ఐఆర్ఐఎస్ షాహిద్ బఘేరీని ఇరాన్ తీరంలో మోహరించినట్లు శాటిలైట్ చిత్రాలు చూపుతున్నాయి.

డోనల్డ్ ట్రంప్, అయతొల్లా అలీ ఖమేనీ

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచ శక్తులతో 2015లో కుదిరిన అణు ఒప్పందం ప్రకారం, ఇరాన్ 3.6 శాతం శుద్ధి స్థాయికి మించి యురేనియంను శుద్ధి చేసేందుకు అనుమతిలేదు. ఇది కమర్షియల్ న్యూక్లియర్ పవర్ స్టేషన్స్‌కు అవసరమైన ఇంధన స్థాయి. అలాగే, ఫోర్డో ప్లాంట్‌లో 15 ఏళ్ల పాటు ఎలాంటి శుద్ధి కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతి లేదు.

అయితే, అణుబాంబు తయారీకి దూరంగా ఉండే విషయంలో ఇరాన్ పెద్దగా చేసిందేమీ లేదంటూ ట్రంప్ తన మొదటి పదవీకాలంలో, 2018లో ఆ ఒప్పందాన్ని విరమించుకున్నారు. తిరిగి ఇరాన్‌పై ఆంక్షలు అమలు చేశారు. దీంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది.

దీనికి ప్రతిస్పందనగా, ఇరాన్ ఒప్పందంలో పేర్కొన్న పరిమితులను మరింతగా ఉల్లంఘించింది. ముఖ్యంగా యురేనియం శుద్ధికి సంబంధించి విషయాల్లో పరిమితులను పక్కనబెట్టింది. శుద్ధి చేసిన యురేనియం రియాక్టర్ ఇంధనానికి ఉపయోగపడుతుంది. దానినే అధిక శుద్ధి స్థాయికి తీసుకెళ్తే అణ్వాయుధాల తయారీకి కూడా ఉపయోగపడుతుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)