యూజీసీ: విద్యాసంస్థల్లో 'వివక్ష'ను అరికట్టడానికి తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రాఘవేంద్రరావు
- హోదా, బీబీసీ ప్రతినిధి
దేశంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో 'వివక్ష'ను నివారించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) 2026 జనవరి 13న కొత్త నిబంధనలను జారీ చేసింది.
అయితే, ఈ నిబంధనలు అస్పష్టంగా ఉన్నాయని, దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడుతూ వీటిపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
2012 నియమాలు సాధారణంగా 'వివక్ష' గురించి మాట్లాడగా, సవరించిన 2026 నియమాలతో అది 'కుల ఆధారిత వివక్ష'గా మారింది.
కొత్త నిబంధనల ప్రకారం, 'కుల ఆధారిత వివక్ష' అంటే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతుల వారిపై కులం లేదా తెగ ఆధారంగా వివక్ష చూపడం.
అంతేకాదు, 2025 ముసాయిదాలో పొందుపర్చిన 'తప్పుడు ఫిర్యాదులకు శిక్ష'ను కొత్త నిబంధనల నుంచి తొలగించినట్లు కొన్ని రిపోర్టులు తెలిపాయి.
యూజీసీ ప్రకారం, ఉన్నత విద్యాసంస్థలలో చదువుతున్న, పనిచేస్తున్న వారందరూ వారి కులం, మతం, లింగం, వైకల్యం లేదా సామాజిక-ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా సమాన అవకాశాలను పొందగలరని నిర్ధరించడం కొత్త నిబంధనల లక్ష్యం.

యూజీసీ నిబంధనలు విడుదలైన తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు, చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే, క్యాంపస్‌లో కుల ఆధారిత వివక్షను నివారించడానికే యూజీసీ కొత్త మార్గదర్శకాలను రూపొందించామని, వాటిని దుర్వినియోగం చేయనివ్వబోమని కేంద్రం అంటోంది.
వివక్ష పేరుతో చట్టం దుర్వినియోగం కాకుండా చూసుకోవడం యూజీసీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఈ అంశం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉందని, రాజ్యాంగ పరిధిలోనే అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
ఈ అంశంపై వివాదం వెనుక ఉన్న కారణాన్ని అర్థం చేసుకునే ముందు, కొత్త నిబంధనలను పరిశీలిద్దాం.

ఫొటో సోర్స్, ANI
కొత్త నిబంధనలలో ఏముంది?
కొత్త నిబంధనల ప్రకారం, ప్రతి విశ్వవిద్యాలయం, కళాశాల 'ఈక్వల్ ఆపర్చునిటీస్ సెంటర్’’ (ఈఓసీ)ని ఏర్పాటు చేయాలి. ఈ కేంద్రం వెనుకబడిన వర్గాల ప్రయోజనాలను పర్యవేక్షిస్తుంది. విద్యా, సామాజిక, ఆర్థిక విషయాలపై విద్యార్థులు, సిబ్బందికి కౌన్సెలింగ్ అందిస్తుంది.
క్యాంపస్‌లో వైవిధ్యం, సమ్మిళితత్వాన్ని ప్రోత్సహిస్తుంది. అవసరమైతే జిల్లా, రాష్ట్ర న్యాయ సేవల సంస్థల మద్దతుతో చట్టపరమైన సహాయం అందిస్తుంది.
ఈ కేంద్రం కింద, ఇనిస్టిట్యూట్ హెడ్ అధ్యక్షతలో ఒక ఈక్విటీ కమిటీ'ని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలో సీనియర్ అధ్యాపకులు, పౌర సమాజ సభ్యులు, విద్యార్థులు ఉంటారు. ఈ కమిటీ వివక్షకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలిస్తుంది.
కొత్త నిబంధనల ప్రకారం, ప్రతిసంస్థ 24 గంటలపాటు అందుబాటులో ఉండే 'సమతా హెల్ప్‌లైన్'ను నిర్వహించాలి. ఒక విద్యార్థి, అధ్యాపకులు లేదా ఉద్యోగి ఎవరైనా వివక్షకు గురైతే, హెల్ప్‌లైన్, ఆన్‌లైన్ పోర్టల్ లేదా ఈక్వల్ ఆపర్చునిటీస్ సెంటర్‌కి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. కావాలంటే ఫిర్యాదుదారుడి గుర్తింపును గోప్యంగా ఉంచుతారు.

ఫొటో సోర్స్, ANI
ఈక్విటీ కమిటీలు
క్యాంపస్‌లలో వివక్షను పర్యవేక్షించడానికి, నిరోధించడానికి ఉన్నత విద్యాసంస్థలు 'ఈక్విటీ గ్రూపులు' లేదా 'ఈక్విటీ స్క్వాడ్‌లు' ఏర్పాటు చేయాలని యూజీసీ ఆదేశించింది.
దీంతో పాటు, ప్రతి విభాగం, హాస్టల్, లైబ్రరీ, ఇతర యూనిట్లలో 'ఈక్విటీ అంబాసిడర్'ని నియమించాలి. వారు ఈక్విటీకి సంబంధించిన కార్యకలాపాలను అమలు చేయడం, ఉల్లంఘనలను రిపోర్టు చేసే బాధ్యత వహిస్తారు. వివక్షకు సంబంధించిన ఏదైనా సమాచారం అందిన 24 గంటల్లోపు 'ఈక్విటీ కమిటీ' సమావేశమవుతుంది.
దర్యాప్తు నివేదికను 15 పని దినాలలోపు ఇన్‌స్టిట్యూట్ హెడ్‌కు పంపిస్తారు. ఇన్‌స్టిట్యూట్ హెడ్ దీనిపై ఏడు పని దినాలలోపు చర్య తీసుకోవలసి ఉంటుంది. కేసు క్రిమినల్ నేరంగా పరిగణిస్తే, పోలీసులకు వెంటనే తెలియజేస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
అమలు చేయకపోతే చర్యలు
కొత్త నిబంధనల ప్రకారం, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఎలాంటి వివక్షకు పాల్పడబోమని అడ్మిషన్ సమయంలోనే లిఖితపూర్వక డిక్లరేషన్ ఇవ్వాలి. అలాగే, హాస్టళ్లు, తరగతులు, మెంటార్ గ్రూపుల కేటాయింపు పూర్తిగా పారదర్శకంగా, ఎటువంటి వివక్ష లేకుండా జరగాలి.
సమానత్వాన్ని ప్రోత్సహించడానికి క్యాంపస్‌లో అవగాహన ప్రచారాలు, వర్క్‌షాప్‌లు, వివిధ కార్యక్రమాలు నిర్వహించాలి. అవసరమైనప్పుడు విద్యార్థులకు సహాయం చేయడానికి ప్రొఫెషనల్ కౌన్సెలర్లు కూడా అందుబాటులో ఉండాలి.
కొత్త నిబంధనల ప్రకారం, ఏదైనా ఉన్నత విద్యాసంస్థ ఈ నియమాలను పాటించకపోతే, యూజీసీ స్కీంలో పాల్గొనకుండా దానిపై నిషేధం విధిస్తారు.
అంతేకాదు, ఆ సంస్థ డిగ్రీ ప్రోగ్రామ్స్ నిర్వహించకుండా నిషేధించవచ్చు. ఓపెన్, దూరవిద్య, ఆన్‌లైన్ ప్రోగ్రామ్స్ కోల్పోవచ్చు. ఆ సంస్థను యూజీసీ నుంచి కూడా తొలగించవచ్చు. కేసు తీవ్రతను బట్టి మరింత కఠినమైన జరిమానాలు విధించవచ్చని యూజీసీ పేర్కొంది.

ఫొటో సోర్స్, Sakib Ali/Hindustan Times via Getty Images
వివాదం ఎందుకు?
ఈ కొత్త నోటిఫికేషన్ 'జనరల్ కేటగిరీ' వారికి వ్యతిరేకంగా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు.
కొత్త నిబంధనల ప్రకారం, సమానత్వ కమిటీలలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, మహిళలు, వికలాంగుల ప్రాతినిధ్యం తప్పనిసరి కానీ, జనరల్ కేటగిరీ ప్రాతినిధ్యం తప్పనిసరి కాదు.
దీనిద్వారా జనరల్ కేటగిరీ విద్యార్థులపై తప్పుడు ఆరోపణలు చేసే అవకాశముందని, ఆ కేటగిరీకి ఇది సమస్యగా మారవచ్చని నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తున్న వారు అభిప్రాయపడుతున్నారు.
క్యాంపస్‌లోని సున్నితమైన ప్రాంతాలను పర్యవేక్షించడానికి ఈక్విటీ స్క్వాడ్‌లకు విస్తృత అధికారం కూడా ఇచ్చారు. ఈక్విటీ గ్రూపు లేదా ఈక్విటీ స్క్వాడ్ వంటి వ్యవస్థలు క్యాంపస్‌ను నిఘా కేంద్రంగా మారుస్తాయనేది ఒక ప్రధాన ఆందోళన.
తప్పుడు ఫిర్యాదుకు శిక్ష విధించే నిబంధననూ తొలగించారని, దీంతో ఈ నియమాలను దుర్వినియోగం చేయవచ్చని ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై దేశంలోని చాలా ప్రాంతాల్లో నిరసనలు జరిగినట్లు రిపోర్టులు వచ్చాయి. కొన్ని గ్రూపులు ఫిబ్రవరి 1న దేశవ్యాప్త సమ్మెకు కూడా పిలుపునిచ్చాయి.
#ShameOnUGC వంటి హ్యాష్‌ట్యాగ్‌లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. తగినంత చర్చ లేకుండానే కొత్త నిబంధనలు అమలు చేశారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు, కొత్త నోటిఫికేషన్‌కు మద్దతు స్వరాలూ వినిపిస్తున్నాయి. ఈ నియమాలు 'సరైన దిశలో వేసిన ముందడుగు'గా కొంతమంది నిపుణులు చూస్తున్నారు. ఇటీవలి సంవత్సరాలలో క్యాంపస్ వివక్ష కేసులు పెరిగాయని వారు గుర్తుచేస్తున్నారు.
2012 నాటి పాత నిబంధనలు సరిగ్గా అమలు కాలేదని, అందుకే ఇప్పుడు బలమైన వ్యవస్థ అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు.
ఇదే సమయంలో, కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కొత్త నియమాలు కొందరికే రక్షణ ఇస్తాయని, వివిధ ప్రాంతాలు, తరగతుల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు నష్టపోతారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
షెడ్యూల్డ్ కులాలు/షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజలకు రక్షణ కల్పించడాన్ని వ్యతిరేకించడం లేదని, సమాజంలోని ఇతర వర్గాలకు లేదా మరో మాటలో చెప్పాలంటే 'జనరల్ కేటగిరీ' పట్ల వివక్ష చూపకూడదని పిటిషనర్లు తెలిపారు. ఈ కేటగిరీ వ్యక్తులు అన్యాయం, అవమానం, అమానవీయ ప్రవర్తన లేదా వారి గౌరవం, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను ఎదుర్కోకూడదని పిటిషనర్లు కోరారు.
గురువారం ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. వాదనలు విన్న కోర్టు.. యూజీసీ కొత్త నిబంధనలపై స్టే విధించిందని లైవ్ లా తెలిపింది.
ఈ నిబంధనలు ప్రాథమికంగా అస్పష్టంగా ఉన్నాయని, దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది.
నిబంధనలను తిరిగి రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం కోరింది. అప్పటివరకు, 2012లో నోటిఫై చేసిన యూజీసీ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది.
'కొత్త నియమాలను స్వాగతించాలి'
యూజీసీ కొత్త నియమాలపై సోషియాలజిస్ట్ సతీశ్ దేశ్‌పాండే 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' వార్తాపత్రికలో తన అభిప్రాయం తెలియజేశారు. యూజీసీ నియమాలను స్వాగతించాలని, అవి మార్పును సూచిస్తాయని ఆయన చెప్పారు.
"2012 నియమాలను 2026లో కొత్త రూపంలో ప్రవేశపెట్టడం ఒక పెద్ద మార్పును సూచిస్తుంది. ఎందుకంటే మునుపటి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడాన్ని గర్వించే అదే ప్రభుత్వం ఇప్పుడు ఆ నియమాన్ని పాటిస్తోంది" అని అన్నారు సతీష్ దేశ్‌పాండే.

ఫొటో సోర్స్, Getty Images
'బలహీనం చేశారు'
కొత్త నిబంధనలలో 'వివక్ష' నిర్వచనం బలహీనపడిందని పొలిటికల్ యాక్టివిస్ట్ యోగేంద్ర యాదవ్ అన్నారు.
"కుల వివక్షను ఆపడానికి చొరవ తీసుకున్నట్లు ప్రస్తుత ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఇదంతా సుప్రీంకోర్టు కేసు కారణంగా జరుగుతోంది" అని యోగేంద్ర యాదవ్ పీటీఐ వార్తాసంస్థతో చెప్పారు.
"ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఒత్తిడి ఉంది. మునుపటి నియమాలు సరైనవే కానీ, సరిపోవని సూచించింది. వీటిని మరింత కఠినతరం చేయాల్సి ఉందని, ఎలా చేయాలో కూడా కోర్టు స్పష్టంగా చెప్పింది. సుప్రీంకోర్టు కోరినవి ప్రస్తుత నియమాల్లో ఉన్నాయి. కానీ, కోర్టు అడగని వాటిని కూడా ప్రభుత్వం చేర్చింది. అంటే, వివక్ష నిర్వచనాన్ని ప్రభుత్వం బలహీనపరిచింది" అన్నారు.
"సుప్రీంకోర్టు ఆదేశానికి అనుగుణంగా సంస్థాగత వ్యవస్థ బలోపేతమైంది కానీ, దాని సారాంశం బలహీనపడింది. అదే వాస్తవ పరిస్థితి" అన్నారు యోగేంద్ర యాదవ్.

ఫొటో సోర్స్, Getty Images
'అదొక్కటే సమస్య కాదు'
"దురుద్దేశంతో కూడిన ఫిర్యాదులు ఉండవు అనేది నిజం కాదు" కాబట్టి, కొత్త నిబంధనలను వ్యతిరేకించే వారి వాదనకు కొంత వరకు మద్దతు ఉందని ఎన్‌సీఈఆర్‌టీ మాజీ చైర్మన్, విద్యావేత్త జేఎస్ రాజ్‌పుత్ అన్నారు.
భోపాల్‌లోని ప్రాంతీయ విద్యాసంస్థకు 11 ఏళ్లు నాయకత్వం వహించానని, అలాంటి క్యాంపస్‌లో పరిస్థితులు కేవలం కులం గురించి మాత్రమే కాదని అంటున్నారు రాజ్‌పుత్.
"అది (కులం) ఒక అంశం, కానీ కొన్నిసార్లు చర్చ భాషపై, కొన్నిసార్లు ప్రాంతీయతపై ఉంటుంది. ఈ నియమాలలో దాని ప్రస్తావన లేదు" అన్నారు.
కొత్త నియమాల్లో సాంకేతిక అంశాలపై దృష్టి ఉందని, కానీ, సంస్కరణలకు సహాయక వాతావరణాన్ని ఎలా సృష్టించాలో చెప్పలేదని రాజ్‌పుత్ అంటున్నారు. ప్రొఫెసర్స్, ఇన్ స్టిట్యూట్ హెడ్స్ ప్రారంభం నుంచి ఎలా పాల్గొనాలి, లేదా ప్రతి విద్యాసంవత్సరం ప్రారంభంలో విద్యార్థులకు ఈ సమస్యల గురించి అవగాహన కల్పించడానికి, వారిని సిద్ధం చేసే విధానాల గురించి నిర్వచించలేదన్నారు.
"నియమాలను కఠినతరం చేయాలని కోర్టు ఆదేశించింది, కాబట్టి చేశారు. కానీ, ఉన్నత విద్యాసంస్థలో ఎవరైనా వేధింపులకు గురైతే, దానిపై శ్రద్ధ పెట్టాలి, పరిష్కరించడానికి సాధ్యమైనవి చేయాలి" అన్నారు రాజ్‌పుత్.
"సనాతన ధర్మం గురించి మాట్లాడినా, పెద్ద రాజకీయ నాయకులు మాట్లాడినా అది మీడియాలో వచ్చేస్తుంది. అలాంటివి ఇన్‌స్టిట్యూట్‌లో జరుగుతాయి, క్యాంపస్‌లలో జరుగుతాయి. అక్కడ ఎవరైనా సనాతన ధర్మం గురించి ఏదైనా మాట్లాడి భావోద్వేగాలను రెచ్చగొడితే, దానిని ఏ కేటగిరీలోకి తీసుకుంటారు?" అని ఆయన ప్రశ్నించారు.
ఈక్విటీ గ్రూప్స్ లేదా ఈక్విటీ స్క్వాడ్‌ల విషయంలో వ్యక్తమవుతున్న ఆందోళనలపై స్పందిస్తూ ఈ గ్రూపుల అవసరం లేదన్నారు రాజ్‌పుత్.
"విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య మరింత కమ్యునికేషన్ అవసరం. విద్యా వ్యవస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. పార్ట్-టైమ్ ఉపాధ్యాయుల వ్యవస్థకు ముగింపు పలకాలి. ఒక ఉపాధ్యాయుడు సంస్థతో లోతుగా అనుసంధానమై, పూర్తి సమయాన్ని, శక్తిని దానికి అంకితం చేసే వ్యక్తి అయి ఉండాలి. అలా జరిగితే, ఈ సమస్యలలో చాలావరకు వాటంతటవే పరిష్కారమవుతాయి" అని రాజ్‌పుత్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












